అరవైఏళ్ళ వయస్సులో అవిటికాలితో, అనారోగ్యంతో వున్న మనిషి తనతో అరగంట పోరాడాడంటే రామదాసు సాధారణమైనవాడు. కాదనుకున్నాడు వివేక్ మనసులోనే.
* * * *
రెండు మూడు రోజుల్లోనే వేగంగా నడవటం, గాలికంటే వేగంగా పరిగెత్తడం డిఫెన్స్ స్ట్రోక్స్ నేర్పేశాడు రామదాసు.
రాత్రి పదకొండవుతూనే నాయుడి సహకారంతో ఇద్దరూ సెల్స్ లో నుంచి పదిహేనవ బ్యారక్ వెనకవున పండ్లతోటలోకి వెళ్ళి ట్రయినింగ్ లో మునిగిపోతున్నారు. అలా తెల్లవారుఝాము వరకూ అక్కడే వుంటున్నారు.
అడుక్కో ముడివేసిన తాడును పెద్ద చెట్టుకు వేలాడదీసి భుజబలముతో పైకి పోవటం, కిందకి జారిపోవటం బాగా ప్రాక్టీస్ చేయించాడు రామదాసు.
నాయుడి సహకారంతోటే ఒక డమ్మీ రివాల్వర్ ని, డమ్మీ మెషిన్ గన్ ని, డమ్మీ బుల్లెట్స్ ని తెప్పించాడు రామదాసు.
నాలుగో రోజునుంచి ఫైర్ ఆర్మ్స్ ఫైరింగ్ ప్రాక్టీస్ మొదలయిపోయింది.
రాత్రింబవళ్ళు ఇద్దరికీ అదే దృష్టి.
గుండెలనిండా పేరుకుపోయిన కసి, పగ, ప్రతీకారాలిస్తున్న ప్రోత్సాహంతో అనుకున్న టైమ్ కి ముందే నేర్చేసుకుంటున్నాడతను.
డైనమేట్ లా తయారవుతున్న అతన్ని చూసి ఆనందంతో పొంగి పోతున్నాడు రామదాసు.
క్రమంగా రోజులు గడిచిపోతున్నాయి.
* * * *
ఎఫ్.ఐ.ఆర్. లో అంత ప్రయోజనకరమైన ఇన్ ఫర్మేషనేం దొరకలేదు మనోజ్ఞకు.
వివేక్ మీద కేసుని ఎంతో పకడ్బందీగా రూపొందించారు. సూది మొన సందయినా దూరే వీలులేకుండా వుంది. ఎక్కడా వీక్ పాయింటే లేదు ప్రొసీడవ్వటానికి.
సుచిత్ర శవాన్ని పోస్టుమార్టం చేసిన డాక్టరు ఎవరయిందీ తెల్సుకుంటే ప్రయోజనం వుంటుందేమోననే ఆలోచన వచ్చింది. అయినా తిరిగి ఎఫ్.ఐ.ఆర్. చదవటం ప్రారంభించింది. డిసెంబర్ నెలలో 12వ తారీఖునాడు వివేక్, సుచిత్ర కలిసి గండిపేట వెళ్ళారు. అరగంటసేపు ఒడ్డున వున్న ఆ యిద్దరూ బోట్ ఎక్కారు. సుచిత్ర బోట్ నడుపుతుంటే వివేక్ మాట్లాడుతూ కూర్చున్నాడు.
ఆ బోట్ ఫ్లడ్ గేట్స్ కి ఆపోజిట్ డైరెక్షన్లో గంట ప్రయాణించింది.
సుచిత్ర మంచి అందగత్తె! ప్రతి అవయవంలో గొప్ప ఆకర్షణను నింపుకున్న ఆమె స్టన్నింగ్ బ్యూటీ!
ఆమె అందం వివేక్ ని బాగా ఆకర్షించింది. దాంతో ఆమెమీద విపరీతంగా మోహపడ్డాడు.
తనే కావాలని ప్రపోజ్ చేసి టాక్సీలో గండిపేట తీసుకెళ్ళాడు.... టాక్సీ డ్రైవరు ఒక సాక్షి! గండిపేటకు టాక్సీ మాట్లాడిందీ, డబ్బిచ్చిందీ వివేకే! టాక్సీలో వెళుతున్నప్పుడు వివేక్ పదేపదే సుచిత్ర అందాన్ని పొగిడి ఆమెను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడని డ్రయివరు చెప్పాడు.
చదవటం ఆపి తల విదిలించింది మనోజ్ఞ.
అందమైన ఆడవాళ్ళను చూసి టెంప్ట్ అయ్యే మనిషి కాదు వివేక్! ఆ విషయం తనకు బాగా తెలుసు. తనూ అందగత్తే....! బెంగుళూరులో చదువుకునేప్పుడు యిద్దరూ కలిసి ఎన్నో ఏకాంత సమయాల్ని ఒంటరి ప్రదేశంలో గడిపినా ఏ వికారానికీ, బలహీనతకీ లోనుకాలేదు వివేక్.
తనే అప్పుడప్పుడు అడ్వాన్స్ అయి అతని పెదవుల మీద, నుదుటి మీద, కనురెప్పలమీద, చేతులమీద ముద్దుపెట్టుకున్నప్పుడు కూడా సిగ్గుపడి వెనకడుగు వేసేవాడేగానీ చొరవ తీసుకునేవాడు కాదు.
అలాంటి వివేక్ -సుచిత్రని ట్రాప్ చేసి గండిపేటకు తీసుకెళ్ళాడా? నో.... నెవ్వర్....!
ఇట్ వజ్ ఏ ఫ్రేమ్డస్ కేస్....ఎస్....ఫ్రేమస్ కేస్! అందుకే దానికనుగుణంగానే ఎఫ్.ఐ.ఆర్. తయారయింది.
ఆగ్రహావేశాలతో పళ్ళు పటపటాకొరుకుతూ తిరిగి చదవటం ప్రారంభించింది మనోజ్ఞ.
బోట్ గండిపేట చెరువు ఆ చివరకు వెళ్ళింది.
ఒడ్డింకా వెయ్యి అడుగుల దూరంలో వుండగా వివేక్ సడెన్ గా లేచి ఆమె చేతిలోని తెడ్డు తీసుకొని నీళ్ళలోకి విసిరాడు.
ఆమెకు ఈతరాదని వివేక్ కి తెలుసు.
పడవ ముందుకీ వెనక్కీ వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే....గండిపేట చెరువు, చెరువులో నీళ్ళు నిల్వవుంటాయేగానీ ఒకవైపు నుంచి మరోవైపు ప్రవహించవు.
ఆమె భయంతో బిక్కచచ్చిపోయింది.
అదే అదనుగా నీటి అలలపై కదలాడుతున్న పడవలోనే వివేక్ రాక్షసంగా ఆమెపై బలాత్కారం చేశాడు.
ఆమె కేకలు పెట్టింది.
పడవ చెరువుకి ఆ చివర వుండటం మూలంగా పిక్నిక్ కి వచ్చే యాత్రికులకు ఆమె కేకలు వినిపించే అవకాశం లేకపోయింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త జితేంద్రనాథ్ కొడుకయిన చంద్రనాథ్ కి వారానికొకసారి గండిపేట చెరువులో బోట్ లో విహరించటం హాబీ! ఆరోజు అదే సమయంలో చంద్రనాథ్ బోట్ లో విహరిస్తున్నాడు. అదృష్టవశాత్తు ఆమె పెట్టిన కేకలు చంద్రనాథ్ కి వినిపించగా అతను వడివడిగా తన బోట్ ని ఆ బోట్ కేసి వేగంగా పోనిచ్చాడు.
అప్పటికే రేస్ చేసిన వివేక్ ఆమెని గొంతు పిసికి చంపేసి, పదునయిన కత్తితో ఆమె ముఖాన్ని చెక్కేశాడు.
చంద్రనాథ్ బోట్ దగ్గరవుతుండటంతో వివేక్ తేరుకొని చెరువులోకి దూకేసి పారిపోయాడు.
చెరువుకి ఆ ఒడ్డున వున్న కె. కేశవమూర్తి అనే నలభై ఏళ్ళ వ్యక్తి సైట్ సీయింగ్ కి వచ్చి, ఆ ప్రాంతంలోనే వుండటంతో అతనా దృశ్యాన్ని ప్రత్యక్షంగా తన దగ్గరున్న బైనాక్యులర్స్ తో చూడటం జరిగింది.
కె. కేశవమూర్తి ఈ కేసులో ప్రధాన సాక్షి! సుచిత్రని రేప్ చేసి, హత్యచేసి, ముఖం చెక్కేసి పారిపోతున్న వివేక్ ని గుర్తుతెలీని కొందరు దుండగులు అతని మెడలో వుండే గొలుసు, చేతి వేళ్ళకున్న ఉంగరాల కోసం కాపుకాసి, దెబ్బతీసి అవి అతన్నుంచి దొంగిలించారు. అందువలనే మాకు (పోలీసులు) వివేక్ దెబ్బలుతిని, గాయపడి అపస్మారకస్థితిలో దొరికాడు. అతన్ని అరెస్ట్ చేశాం.
రెండవ సాక్షి చంద్రనాథ్!
చదవటం ఆపి కళ్ళవెంట ఉబికిన కన్నీళ్ళని కొనగోటితో తుడుచుకుంది మనోజ్ఞ.
కేసు చాలా పకడ్బందీగా వుంది.
తనకు తెలిసినంతవరకు వివేక్ కి ఈతరాదు. ఈతకొట్టుకుంటూ ఒడ్డుకి ఎలా వెళ్ళాడు?
చంద్రనాథ్ సరీగ్గా ఆ సమయంలోనే అక్కడెందుకున్నాడు? అంత పెద్ద కోటీశ్వరుడి కొడుకు ఎవరూ లేకుండా ఒక్కడే బోట్ షికారుకి వెళ్ళాడా....?
ఖచ్చితంగా చంద్రనాథే రేప్ చేసుండాలి.
కె. కేశవమూర్తి ఆ విషయాన్ని దాచి, వివేక్ చేసినట్లు సాక్ష్యం చెప్పడంతో అతను యిరుక్కుపోయుంటాడు. ఏది ఏమైనా కేసు అంత త్వరగా ఎలా ఫైనల్ జడ్జిమెంట్ కొచ్చింది?
ఠక్కున లేచి ఫోన్ దగ్గరకు నడిచి హరికుమార్ కి ఫోన్ చేసింది. అతను లైన్ లోకి రాగానే అదే విషయాన్ని అడిగింది.
"ఓ....ఐయామ్ సారీ! నువ్వు కోర్టు ప్రొసీడింగ్స్ అడిగిన విషయాన్నే మర్చిపోయాను. ఏం జరిగిందో తెలీదుగానీ, కోర్టులో వివేక్ కన్ ఫెస్ అయ్యాడు. తప్పు చేశానని నిందితుడే ఒప్పుకున్నాక, సాక్ష్యాలు బలముగా వున్నాక కేసు వాయిదాలెందుకు పడుతుంది? చేయని నేరాన్ని చేసినట్లు అతను ఎందుకొప్పుకున్నాడు....? అతని డిఫెన్స్ లాయరు ఎలా ఒప్పుకోనిచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు మనోజ్ఞా...." ఫోన్ కి ఆ వైపునుంచి అన్నాడు హరికుమార్.
"తన వాళ్ళను చంపుతామని ప్రత్యర్ధులు బెదిరించడం మూలంగానన్నా ఒప్పుకుని వుండాలి. లేదా నేరాన్ని ఒప్పుకుని కోర్టుని వేడుకుంటే శిక్ష తగ్గుతుందని చెప్ప డిఫెన్స్ లాయరు ఆదిరెడ్డి అతని అమాయకత్వాన్ని వాడుకొనయినా వుండాలి. ఇంతకుమించి సమాధానాలేముంటాయి...." షార్ప్ గా రియాక్ట్ అవుతూ అంది మనోజ్ఞ.
ఫోన్ కి ఆ వైపున ఉన్న హరికుమార్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.
"ఫెంటాస్టిక్ మనోజ్ఞా! యూ ఆర్ రైట్! ఆ రెండింటిలో ఏదో ఒకటి అయివుండాలి. అంతకుమించి నిర్దోషికి నేరాన్ని తనమీద వేసుకునేందుకు వేరే కారణాలే లేవు. ఉండవు...." అడ్మైరింగ్ గా అన్నాడు హరికుమార్.
అలా అనుకుంటే వివేక్ బంధువులంతా ఏక్సిడెంట్ లో ఎందుకుపోతారు? వివేక్ ఆ నేరాన్ని తనమీద వేసుకున్నాక, ప్రత్యర్ధులకు వాళ్ళను చంపవలసిన అవసరం ఏముంది?" ప్రశ్నించింది ఆమె.
"అఫ్ కోర్స్! అయితే ఏమంటావ్?"
"ఆదిరెడ్డి మాయచేసి, భయపెట్టి, ఉరిశిక్ష పడుతుందని వివేక్ ని బెదిరించి వుంటాడు. మీరే చెప్పారు.... మీకు గుర్తుందో లేదో....తీర్పు యిచ్చేరోజున అతను ఎంతో ఆశాభావంతో వున్నాడని, ఉరిశిక్ష వేశాక....'నో....ఇదన్యాయం.....నేనీ నేరం చేయలేదు. నాతో ఒప్పించారని ఎలుగెత్తి అరిచాడని చెప్పారు...."
"ఏసేస్...."
"అంటే ఏమిటర్ధం? నేరాన్ని నీ మీద వేసుకోకపోతే మరీ ప్రమాదము, అటు ప్రత్యర్ధులు మీ వాళ్ళని చంపుతారు. ఇటు బలమైన సాక్ష్యాధారాలుండటంతో కోర్టు ఉరిశిక్షే వేస్తుంది. కనుక నీ వాళ్ళ క్షేమంకోసం- నీ శిక్ష తగ్గటం కోసం, నువ్వీ నేరాన్ని ఒప్పుకొని క్షమాభిక్ష వేడుకో అని ఆదిరెడ్డి వివేక్ ని ఒప్పించి వుండాలి.