లోకులు చాలా తెలివిగలవాళ్లు. "మీ చెల్లెలి కూతురు అంటున్నారు. మమ్మల్ని పద్మిని పెద్దమ్మ అని పిలవాలి కదా! ఆంటీ అంకుల్ అంటుందేమిటి?" అని ఏమాత్రం ముఖమాటం లేకుండా ముఖాన అడిగేశారు.
"మా పద్మిని చెపితే వినేరకం కాదులెండి! ఉత్త మొండిఘటం. తను పట్టిన కుందేలుకి మూడేకాళ్ళని వాదించదు. ఆరుకాళ్ళని రెండు తోకలని వాదిస్తుంది. పెద్దమ్మ దొడ్డమ్మ పెదనాన్న అంటే ఏమిటోగా వుంటుందిట. ఆంటీ అంకుల్ అని పిలుస్తానని కూర్చుంది. ఎలా పిలుస్తేనేం వుండాల్సింది ఆప్యాయత అనురాగం మా పద్మినిలో ఆరెండూ పుష్కలంగా వున్నాయి" అంటూ పార్వతమ్మ అడిగిన వాళ్ళకి చెపుతుంటే ఆశ్చర్యపోవటం పద్మిని ప్రియదర్శిని వంతయింది.
ఇప్పుడు పార్వతమ్మ శంకరరావు వుంటున్న ఇల్లు వాళ్ళ సొంతదేకాని సొంతగా దగ్గరవుండి కట్టించుకున్నది కాదు. రెండు సంవత్సరాలక్రితం కొని అప్పటినుంచి ఇక్కడ వుంటున్నారు. పూర్తిగతం ఎవరికీ తెలియదు, వాళ్ళు చెప్పింది నమ్మారు అంతవరకే!
పార్వతమ్మ అనురాగం చూస్తుంటే తరచు తల్లి గుర్తుకువస్తున్నది పద్మిని ప్రియదర్శినికి. దాంతో ఆలోచనలు మమ్మీ డాడీలమీదకి వెళ్ళేవి.
వర్కర్స్ వున్న పేటలో వున్నప్పుడు యెవరో వకరి ద్వారా తన క్షేమసమాచారాలు మమ్మీ డాడీకి తెలిసి వుండేది. అంతవరకు గ్యారంటీ! పైగా ప్రతిరోజు తన భవంతిముందే రోడ్లుకి అటుసైడు వేసిన టెంటులో రిలే నిరాహారదీక్ష సమ్మెలో పాల్గొంటూ వర్కర్స్ తో పాటు తనూ కూర్చునేది.
ఇప్పుడు తను అక్కడలేదు.
ఎవరితో చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రి రైలు యెక్కేసి నూట నాలుగు జ్వరంతో ప్రయాణించి చివరికి ఇక్కడికి చేరింది. క్షేమంగానే వుంది!
మమ్మీ డాడీలు తను కానరాక ఏమనుకుంటున్నారు? ఏదయినా ఘోరం జరిగింది అనుకుంటున్నారా? ఏ ఫ్రెండ్ ఇంట్లోనైనా దాగుందని పొరబడుతున్నారా? టి.వి లోను దినపత్రికలలోను తప్పిపోయిన వాళ్ళ గురించి వేస్తుంటారు!
"బాబూ! నీవు ఎక్కడవున్నా తిరిగిరా! మీ అమ్మ నీకోసం దిగులుతో మంచం పట్టింది. నీవు తిరిగివస్తే నిన్ను కొప్పడము. నీవు చెప్పినట్లే చేస్తాము...ఈ ఫోటోలోని బాబు ఆచూకీ చెప్పినవారికి తగిన బహుమతి ఇవ్వబడును" ఇట్లు...
ఇలాంటి పేపరు ప్రకటనలు పద్మిని కళ్ళముందు గిర్రున తిరిగాయి!
అలాంటి ఆలోచన రాగానే పాత పేపర్లు తిరగేసింది. శంకర్రావు పేపరు తెప్పిస్తాడు. ఇంట్లో టి.వి. పద్మిని వెతికే మాత్రం కనిపించలేదు. తన మమ్మీడాడీకి తనమీద ప్రేమ లేదా? ఛీ ఈమాట అనుకునేంత పాపం మరొకటిలేదు. మరి మరి?
ఇంకా యెలా ఆలోచించాలో పద్మినికి అర్ధం కాలేదు.
పద్మిని అన్ని పేపర్లు సర్ది పెడుతుండగ శంకర్రావు పలకరించాడు. "ఏంటమ్మా! పాత పేపర్లన్నీ తిరగేస్తున్నావ్?" అని...
పద్మిని ఉలికిపాటుని కప్పి పుచ్చుకుంటూ "ఏం లేదంకుల్! తోచక ఊరికే తిరిగేశాను. ప్రతిరోజూ ఒకే న్యూస్. న్యూస్ పేపరు ఎవరు కనిపెట్టారోగాని దీన్ని న్యూస్ పేపర్ అనేకన్నా న్యూసెన్స్ పేపరు అంటే సరిపోతుంది" అంటూ జోకేసినట్లు నవ్వేసింది.
శంకర్రావు నవ్వాడు! అయితే అది పైకి మాత్రమే పద్మిని ప్రియదర్శిని పేపర్లు వూరికే తిరిగెయ్యలేదని... ఏదో ముఖ్యమైన సమాచారం కోసం పేపరంతా వెతికిందని ఆయనకి అనుమానం రానేవచ్చింది.
శంకర్రావు మంచి మనసుగల తెలివిగలవాడు. పద్మిని మంచిపిల్ల అని గ్రహించాడు. కాని పద్మిని చెప్పిన కథ మాత్రం నమ్మలేదు. "నీవు చెప్పింది నేను నమ్మలేదు" అని పైకి చెప్పలేదు ఆఖరికి ఆ విషయం భార్యతోనూ అనలేదు. భార్య మనసు నొప్పించే పనులు ఆయన ఏమీ చేయడు.
యిదే మంచి సమయం అనుకున్న పద్మిని ఆయనతో కబుర్లు వేసుకుని కూర్చుంది.
"అంకుల్! తల్లిదండ్రులకి పిల్లలమీద ప్రేమ ఎక్కువా! పిల్లలకి తల్లిదండ్రులమీద ప్రేమ ఎక్కువా!"
పద్మిని ప్రియదర్శిని చాలా పెద్ద ప్రశ్న వేశాననుకుంటు అడిగింది.
అప్పుడు పార్వతమ్మ కూడా చాప మీద పడుకుని అక్కడే వుంది.
"ఈ ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టం. శంకర్రావు మాట తప్పించటానికి అన్నాడు.
"ఎందుకు కష్టం?" పద్మిని అడిగింది.
"ఈనాటి యువతీయువకులే రేపటి తల్లులు తండ్రులు కాబట్టి" శంకర్రావు అన్నాడు.
"పో అంకుల్! మీరు సరీగ సమాధానం చెప్పటం లేదు" ముద్దు ముద్దుగ గొణిగింది పద్మిని.
"ప్రశ్న చాలా పెద్దది. ఎవరినడిగినా ఒకటే చెవుతారు. తల్లి ప్రేమని మించిన ప్రేమ ఈ ప్రపంచంలో మరొకటి వుండదని ఈ మాటకి తిరుగులేదు. పిల్లలకోసం త్యాగంచేసిన తల్లులు వున్నట్లే తల్లిదండ్రులకోసం త్యాగం చేసిన పిల్లలు వున్నారు ప్రేమకు త్యాగానికి ప్రతీక కన్నతల్లి సరేనా?"
"పిల్లలని తల్లి ప్రేమించినంతగా తన తండ్రి ప్రేమించడా అంకుల్!"
"ఎందుకు ప్రేమించడు ప్రేమిస్తాడు."
"మరి పిల్లలమీద ప్రేమ అనే విషయానికి వస్తే తల్లి పేరు ఎత్తుతారుగాని తండ్రి పేరు ఎందుకు ఎత్తరు?"
"భర్త చనిపోయిన స్త్రీ పిల్లలని పెంచి పెద్ద చేయటానికి ఎన్ని విధాల కష్టపడుతుంది. నానా చాకిరి చేస్తుంది, కోరికలని చంపుకుంటుంది. కాని భార్య మరణిస్తే ఆ భర్త పిల్లలకోసం పెళ్ళాడుతానంటూ రెండో పెళ్ళికి తయారవుతాడు. కొత్త పెళ్ళి కొడుకవుతాడు. తల్లి మరణించిన పిల్లల తండ్రిని పినతండ్రితో పోలుస్తారు అందుకే. తల్లి ప్రేమ గంగిగోవుపాలు అంత నిర్మలమైనది. అయితే తండ్రి ప్రేమ పాల ప్యాకెట్ లాంటిది."
శంకర్రావు చెప్పటం ముగించాడో లేదో ఫక్కున నవ్వింది పద్మిని. "మీ మాటల తమాషాగా వుంటాయి అంకుల్!" అంది.
శంకర్రావు నవ్వి వూరుకున్నాడు.
"విన్నావా ఆంటీ అంకుల్ మాటలు!" పద్మిని అడిగింది.
"ఊ__" కొట్టి వూరుకుంది పార్వతమ్మ.
"ఆంటీ! తల్లి తండ్రిని అన్యాయం చేసి పోయే పిల్లలు వున్నారంటావా!" ఏదో నోటికొచ్చింది అడిగింది పద్మిని.
"పద్మినీ!" అన్నారు శంకర్రావు వారిస్తున్నట్లుగా.
"కాసేపు మీరిద్దరూ మాటలు ఆపుతారా నాకు చచ్చేంత తలనొప్పిగా వుంది" పార్వతమ్మ అరిచినట్లే అంది.
చటుక్కున పక్కనే వున్న వారపత్రికని తీసుకుని పత్రిక తెరిచి దానిలో ముఖం దాచుకున్నాడు శంకర్రావు.
పార్వతమ్మకి కోపంరావటం అన్నది యిక్కడికి వచ్చిం తరువాత పద్మిని చూడలేదు. ఆమెకి అంతకోపం రావటం అలా అరవటంచూసి పద్మిని తెల్లబోయింది. అది నిజం తలనెప్పికాదని తన మాటలతో మనసు నొచ్చుకుని అలా కోపం ప్రదర్శించిందని పద్మిని అంతవరకు గ్రహించింది.