" మి కెందుకు, ధర్మరాజుగాలి గాలి మా మిదకు మళ్లేటట్టు చూడండి. మిగతా పని నే కానిస్తాను" అన్నాడు అబ్బులు.
జయచిత్ర వారు పిలుస్తున్నారనే అర్ధం వచ్చేటట్లు అబ్బులి వైపు చేయి చూపించింది.
ధర్మారాజు అబ్బులివైపు చూశాడు.
అబ్బులు పలకరింపుగా ఓ నవ్వు నవ్వి " భోజనం అయిందా?" అన్నాడు.
ధర్మరాజు పుట్టెడు చెముడు.
ఎదుటివారు చెప్పింది వినబడటం కలలో మాట. ఆయన చూడబోతే వాగుడుపిట్ట సోదరుడు.
అందుకే తనే ప్రశ్నడిగి తనే చెప్పుకుని వినపడ్డట్లు నటిస్తాడు.
ఇప్పుడు వున్నట్లుండి అబ్బులు " భోజనం అయిందా!" అంటే_
ఆయనకి ఆ మాట అర్ధం కాలేదు. అర్ధం కానప్పుడు ఓ పని చేస్తుంటాడు. అవునూ కాదూ తెలీని విధంగా తల వూపి తప్పించుకుంటాడు.
ఆ విధంగానే అబ్బులడిగిందానికి తలాడించి ఉఉరాకున్నాడు.
' హారి పిడుగా' అన్నాడు అబ్బులు.
మళ్ళీ తలాడించాడు ధర్మరాజు.
" నా తలనొప్పి పోగొట్టలేరు" అంది జయచిత్ర.
" నాకూ వచ్చిందిరోయ్" అన్నాడు వ్యాకర్ణ.
అబ్బులు తలాడించి చిరునవ్వు నవ్వాడు. " మా గురించి మి అభిప్రాయం ఏమిటి ధర్మరాజుగారూ !" అన్నాడు.
కిర్చీలోంచి కాస్త ముందుకి వంగి ధర్మరాజు వైపు భూతద్దాల్లోంచి తిక్షణంగా చూసి.
అబ్బులు ముఖ కవళికలను బట్టి ఏదో పెద్ద ప్రశ్న అడిగాడని దానికి తల ఆడిస్తే చాలదని జావాబు చెప్పాల్సి వుంటుందని ధర్మరాజు గ్రహించాడు.
ప్రశ్న తెలిస్తేగా జావాబు చెప్పటానికి! జిడ్డు ధర్మరాజుగారిది బ్రిలియంట్ బుర్ర కాబట్టి " నిజమేనోయ్" అన్నాడు.
" మి గురించి ఆయనగారి అభిప్రాయం అది. విన్నారుగా!" అంది జయచిత్ర.
" దారినపడ్డ సంభాషణ సాగాదీస్తా చూడండి" అన్నాడు అబ్బులు.
" అలా అన్నావ్ బాగుంది" అన్నాడు ధర్మరాజు.
" రేప్పొద్దున కూరలు తేవాలండీ!"
" చాలా బాగుంది."
" కూరలు తేవాలంటే బాగుంటుందంటూరేమిటండీ?"
" నా అభిప్రాయం నే చెప్పనబ్బాయ్."
" ఈయనగారికి మిరెలా యిల్లు అద్దెకివ్వ గలిగారండీ జయచిత్రగారూ! మొదట ఈయనొచ్చాడా ఈయన భార్య వచ్చిందాండి?" ముఖం ధర్మరాజు వైపు పెట్టి జయచిత్రను అడిగాడు అబ్బులు.
" ఈయన వేస్తే యిల్లెలా యిస్తామండి. భాగం ఖాళీ లేదంటే ఉందా అని యక్షప్రశ్న వేసి చంపుతాడాయె. వుందీ అంటే ఖాళీ భాగాలు లేవు అని వెళ్ళిపోతాడు. ఇలాంటి వన్నీ ఆవిడగారే చూసుకుంటుంది" అంది జయచిత్ర.
అబ్బులడిగిందానికి ధర్మరాజు " నీ అబిప్రాయంతో ఏకీభావిస్తున్నానబ్బాయ్!" అన్నాడు.
" నా పిండాకూడు" అన్నాడు అబ్బులు.
" సంతోషం" అన్నాడు ధర్మరాజు.
గతుక్కుమన్నాడు అబ్బులు.
వ్యాకర్ణ, జయచిత్ర జాయింట్ గా నవ్వారు.
అబ్బులు చిరుకోపం తెచ్చుకుని నవ్వండి నవ్వండి" అన్నాడు.