అందరి దృష్టి దీక్ష పెదవుల మీదనే వుంది. దీక్ష పెదవి కదిపితే విషయం బైటికి వస్తుంది. వర్షం కురిసిన కురవక పోయినా మబ్బు విడిపోతుంది.
అప్పుడు సమయం ఆరు అయిదు నిమిషాలు.
దీక్ష పెదవులు నెమ్మదిగా కదిలాయి.
- 13 -
"సభకు నమస్కారం."
అరవిచ్చిన పెదవులతో అమృత స్వరంతో దీక్ష పలికింది.
"పెద్దలకు సోదరీమణులకి నమస్కారం" మృదు మధురంగా మరోసారి పలికింది.
కళ్ళార్పకుండా అందరూ దీక్షని చూస్తున్నారు.
ఈదపా దీక్ష కంఠస్వరం ఆ హాలులో ప్రతిధ్వనిస్తూ కంగున మోగింది.
"మీరంతా నాకు ఎంత సహకరించారో నాకు తెలుసు. ఇదేమిటో తెలియక మీరంతా ఎలా గాభరా చెందింది నాకు తెలుసు. మీ చల్లని మనసు నాకు తెలుసు కాబట్టే నేనీ పని చేపట్టాను. రాతలు విచిత్రంగా వున్నాయి. దానికో పెద్ద కారణం వుంది.
'బంగారు పళ్ళానికయినా గోడచేర్పు కావాలి తల్లీ!' అనేది మా అమ్మమ్మ.
ఇది నిజం. నేర్చుకున్న విద్యకయినా అంతే చేరువ ఆధారం లాంటివి కావాలి. ఏదైనా అంతే, అప్పుడే రాణిస్తుంది.
నేనో పని చేపట్టాను. అది మీ ముందు ప్రదర్శించటానికి మీ అందరిని ఇక్కడికి ఆహ్వానించాను. నా చేతలని రాతలని అపార్ధం చేసుకోక దొడ్డ మనసుతో నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చారు. చాలా సంతోషం.
ఇది పొగడ్త కాదు. ఇంటింటికి పాంప్లెట్లు పంచటానికి నేను తిరుగుతుంటే బలవర్ధనమ్మగారు "ఎన్ని ఇళ్ళకని నీవు తిరుగుతావు అమ్మాయీ! ఇలా ఓ పదికాయితాలు నా కివ్వు నాలుగిళ్ళలో నేను యిస్తాన"ని తీసుకున్నారు. అరుంధతిగారయితే ఓ రోజు వద్దు వద్దంటున్నా వినక కాఫీ యిచ్చింది. రామలక్ష్మమ్మగారు అయితే ప్రతిరోజూ చల్లని మంచినీళ్ళు యిచ్చేవారు సేదతీరేలాగా. ఇలా.... ఎందరో దయతో సానుభూతితో నాకు సహకరిస్తూ నాకు వెయ్యేనుగుల బలాన్ని ప్రసాదిస్తూ నాకు నూతన శక్తి నిచ్చారు...."
దీక్ష చెప్పుకు పోతున్నది. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన తలకాయల్ని, పెద్ద నోటి వాళ్ళని గుర్తుంచుకుని వాళ్ళ పేర్లు స్పీచ్ మధ్యలో చెప్పేసరికి వాళ్ళ ముఖాలు వికసించటమే కాదు, అప్పటికప్పుడే వాళ్ళ హృదయాలు బారెడంత విశాలం అయ్యాయి. తమ ఉదార బుద్ధి ప్రదర్శిస్తూ అవసరమైతే ఏదో చేయాలి అనుకున్నారు.
చిన్నపాటి స్పీచ్ పూర్తిచేసిన దీక్ష "ఇప్పుడు మీకో వాస్తవ గాధ చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. అనగనగా ఓ అమ్మాయి కథ యిది. నిజమైన కథ." అంటూ ఒక్కక్షణం ఆగింది.
"అనగనగా ఓ అమ్మాయి దీక్ష కాదు కదా!" అనుకున్నారు ఎవరికి వారే.
దీక్ష కథ మొదలు పెట్టింది.
"అనగనగా ఓ అమ్మాయి! విధిరాత అనుకోండి లేక ఆ అమ్మాయి దురదృష్టం కానీండి. అమ్మాయి తండ్రి పసితనంలో మరణించాడు. తల్లి అమ్మాయిని తీసుకుని పుట్టిల్లు చేరింది. చదువు సంధ్య లేని ఆ తల్లి, తనకంటూ నయా పైసా లేని ఆ తల్లి, అయిదోతనానికి దూరమైన ఆ తల్లి, పిడికెడు మెతుకులకోసం కానీండి, కన్నబిడ్డ కోసం కానీండి, తన పుట్టింట్లోనే వంటమనిషి అయింది. దాసీది అయింది. నడుం విరిగేలా చాకిరీ చేస్తున్నా మాటలు, అవమానాలు.
కారణం!
ఆమెకి డబ్బు లేదు. చదువు లేదు. ఒకరిమీద ఆధారపడంది జీవించలేదు. తనకే దిక్కు లేకపోతే తనకో బిడ్డ. ఇదీ ఆమె పరిస్థితి. ఆ తల్లి కథ అలావుంటే ఆమె బిడ్డ కథ అంతకన్నా అధ్వాన్నంగా తయారయింది.
ఆడ ముం.... నీకు చదువు లేకపోయినా ఫరవాలేదులే. మగాళ్ళతో ఆ ఆటలేమిటి! కాలు నిలవదా! చేయి వూరుకోదా! కంచం తింటావ్. ఎద్దులాగా ఎదుగుతున్నావ్! నీ ముఖానికి రిబ్బెనలు లేకపోతే చచ్చిపోవులే! ఏమిటా మొండి సమాధానాలు? నీవు ఆడదానివి కావు, సిగ్గు అనేది నీ ముఖాన చూడలేదు నేను.