పుట్టలోని కవి రాజ విలాసం
కవిత్వం ఎలా వుండాలి?
కప్పగవలె కప్పురములు కుప్పలుగా పోసినట్లు--- కుంకుమ క్రియ విరి పొట్లము విప్పిన గతి - కవిత్వం సభలలో ఘమ్మనాలి---
అలా చెప్పిందెవరు?
రఘునాధ నాయకుడు
విజయనగరం వారి సామంతులుగా తంజావూరు కట్టుకున్నందుకు తగినట్టుగా--- వాళ్ళలాగే సాహితీ సమరాంగణాల్లో సార్వభౌమత్వం నెరిపారు నాయక రాజులు.
రఘునాధ నాయకుడంటే సామాన్యుడు కాదు. మాన్యుల్లో మాన్యుడు ప్రతి పద్యం చమత్కారం వుండేట్టుగా చెప్పగలిగిన చేమకూర వెంకటకవి అంతటివాడు. "నేరుతనని మాటాడగ వారిజభపు అంతవాని వశమే" తంజావూర్ రఘునాధ నాయకుడు గారెదుటను" అని కుందవరపు కవి చౌడప్పా పొగిడిన కవిరాజు --- రాజకవి రఘునాధ భూపాలుడు.
అతడు మహారాజభోగి --- దానంలో భోజరాజు అందుకే ఆనతి ఇచ్చినా ఆది శిలాక్షరం అన్నాడు చేమకూర. ఆ ఘటనా చాతుర్య ఘనోర్జిత కార్యనిర్వహాణుడయిన రఘునాధుడ్ని గురించి చెబుతూ.
మాటల నేర్పులా? సరసమార్గములో కొలువుండు రీతులా! పాటలు గంధులా?
కళలభాగ్యములా! బహుధాన లీలలా! నాటకశాలలా! యొకటనన్ వలదెన్నిట చూడనన్నిటన్ మేటియు కీర్తిలోలుడు జుమీ రఘునాధ నృపాలుడు అన్నాడు చేమకూర... మాటలను విరవడంలో తనకు తానేసాటి మేటి అయిన చేమకూర "మాటలు నేర్పులా" అని పొగిడాడంటే కేవలం రాజని పొగిడివుండడు ప్రతిపద చమత్కారం చూసే అలా అని ఉంటాడు.
అంతేకాదు. ఆయన పిలిపించి "కృతి చెప్పిమాకింపొనర్చు" అన్నప్పుడు నిజంగా చేమకూర కొంచెం భయపడే ఉంటాడు. ఎందుకంటే తారస పుష్టిమై ప్రతి పదంబున జాతియు వార్తయున్ చమత్కారము అర్ధం గౌరవముగల్గ అనేక కృతుల్ ప్రసన్న గంభీరగతి రచించి మహి మించిస వాడికి ఆ రఘునాధ భూపరసి కాగ్రణికి "చెవిసోక చెప్పగ శక్తులెవరయ్యా" అనుకున్నాడు.
అలాటి రఘునాధుడు - అటు రణరంగంలో కూడా తలలూచే విధంగా చెప్పాడు-అందుకే తనకై తానే కవిత్వానికి సంబంధించి నిర్వచించాడు. ఇలా "పలుకగవలె నవరసములు వొలుకగా -- మాటికి రస పరిపాటికి మేటికవులు మెచ్చి మేలు మేలనగా" చెప్పాలన్నాడు - చెప్పాడు.
ఏదో ఓసారి పొగడ్డం కాదు.
రస పరిపాటికి - మాటి మాటికి - మేటి కవులు మెచ్చుకోవాలట - సభల్లో - విద్వత్సభల్లో మేటి మేటి కవులు మెచ్చేలా రామాయణం చెప్తానన్నాడు.
రాముడి కధ రాశాక - ఆ రాముడి కధ రాసిన వాడికధ కూడా రాయ దగ్గదే అనిపించింది రాజకవికి. దేవతల గురించి పురాణాలు ఉపపురాణాలు ప్రబందాలు కావ్యాలు నాటకాలు ఎన్నో ఎన్నెన్నో వెలిశాయి. కానీ ఒక "కవి" గురించి "కావ్యం" మాత్రం ఆనాటి నుంచి ఈనాటి దాకా "వాల్మీకి చరిత్రము" ఒక్కటేనేమో!
ఈ వాల్మీకి కధలో కావలసినంత నాటకీయత వుంది. అందుకే "వాల్మీకి చరిత్ర" రాసి ఉంటాడు. రఘునాధ నృపాలుడు, రస సింధువైన కవిత చెప్పాడు.
ఇతని ఆస్థానం కళామతల్లికి విస్తృత విహార భూమిగా వుండింది. మంత్రి గోవింద దీక్షితుడు గ్రంధకర్త. ఆయన కొడుకు యజ్ఞ నారాయణ దీక్షితుడు రఘునాధుని శిష్యుడు ఎన్నో శాస్త్రాలు రచించిన మేటి కృష్ణాధ్వరి ఆస్థాన కవి రాజుగారి ప్రియురాలు మధురాంబ రాజుగారి భార్యకూడా కవయిత్రే - ఆమె రామ భద్రాంబ అష్ట భాషా కవయిత్రి - రఘునాధాభ్యుదయం అనే చారిత్రిక గ్రంధం - తన భర్త జీవిత చరిత్ర రాసిన విదూషీమణి---
వీళ్ళేకాదు-
రాజుగారి కుమారుడు విజయ రాఘవ నాయకుడు కూడా కవి - పండితుడు-అతని ఆస్థానంలోనే రంగాజమ్మ ఉండింది. తండ్రికి తగ్గ తనయుడు విజయ రాఘవుడు.
ఈ కవులు కవయిత్రులు ఒకెత్తు--
చేమకూర వెంకట కవి ఒక్కడూ ఒక్కెత్తు.
విజయవిలాసంతో "నభూతో నభ విష్యతి" అనేలా కీర్తి పొందిన కవీంద్రుడు-బూతు కవిగా పేరు తెచ్చుకున్న కవి చౌడప్ప కూడా రఘునాధుని ఆశ్రితుడే. పదకర్త క్షేత్రయ్య కూడా తంజావూరుని సందర్శించి రాజదర్శనం సన్మానం పొందిన వాడే!
---*---