Previous Page Next Page 
అహల్య పేజి 26


    అహల్య ఇంద్ర సఖి చేతులు పట్టుకుంది. ఆప్యాయంగా హత్తింది 'అంతకంటేనా సఖీ! బ్రహ్మ మానసపుత్రినైనా బ్రహ్మర్షి సముల ధర్మపత్నినైనా వెనుకా ముందూ ఎవరూ తోబుట్టువులు లేనిదాన్ని కదా నేను!


    మానవలోకంలో తల్లీ తండ్రీ అమ్మ వదినా అక్కా బావా అన్నా తమ్ముడూ అక్క చెల్లీ అని ఆత్మీయత వొడ్డు లొరిసి ప్రవహించే బంధాలున్నాయమ్మా! అవేమీ నాకు దక్కలేదు కదా! అన్నగారున్నారంటే ఆయన త్రిలోక సంచారులు! ఇప్పుడిక్కడుంటారు. మరొకప్పుడు మరో లోకంలో ఉంటారు. లోక కళ్యాణార్ధం త్రిలోకాలూ తిరుగుతూ ఉంటారు కదా! ఆ లోటు తీరేదెలా అని అనుకుంటుండే దానిని. నా తలపోతలు వెతలుగానే నిలిచిపోతాయేమోనని నాకు బాధగా ఉండేది. కానీ ఆ దేవుడే దయతలచి నాకు నిన్ను పంపించాడు. నువ్వు నాకు దైవమిచ్చిన సోదరివి!'


    గుండె నిండా వరదలా పెల్లుబికిన ప్రేమ నిండిన వాక్యాలుగా వెలువడిన అహల్య ఆంతర్యం గమనించి ఇంద్రసఖి ఆశ్చర్యపోయింది. ప్రేమ అనే మాట ఈ పృథ్విలో ఎంత బలంగా ఉంటుందో తెలుసుకుని నివ్వెరపోయింది. తమ లోకంలో ఎంత వెదికినా కనిపించని ఆ ప్రేమ ఈ భూలోకంలో అడుగడుగునా ప్రత్యక్షం కావడం చూసి అబ్బురపాటు చెందింది.


    'అహల్యా!'


    ఇంద్రసఖి మనసారా పిలిచింది. గుండెనిండా ప్రేమ నిండిన తృప్తితో పిలిచింది.


    'సఖీ!'


    'ఇది ఇంద్రుడిచ్చిన వరం కాదు. ఆ లోకంలో ఆడుతూ పాడుతూ ఉన్నవారికి వారు అపురూపమైన ఆభరణాలూ అవీ ఇస్తూంటారులే! అలాంటిది కాదిది. సృష్టికర్త అనుగ్రహం ఇది. నాపై పూర్తి కటాక్షంతో ఇచ్చిన వరం!'


    'ఏమిటిది సఖీ!' అహల్య నవ్వుతూ అడిగింది.


    'నీ చెలిమి' అంది ఇంద్రసఖి.


    అంతలో 'అమ్మ! అమ్మా!' అంటూ వచ్చిందో బాలిక. ఎవరమ్మా యీ చిన్నారి? అడిగింది.


    'నా కూతురు సఖీ!' వచ్చిన చిన్నారిని ఎత్తుకుని ముద్దాడుతూ అంది.


    'నీ కూతురా?' ఆశ్చర్యపోయిందామె 'ఏమి విచిత్రం! నిన్నలా సృష్టి చేశాడు బ్రహ్మ! ఇలా గౌతములకిచ్చి పెళ్ళి చేశాడు. ఇంద్రలోకం అంతా నీ గురించి చెప్పుకుంటూంటే చప్పున నేను నీ గురించి వచ్చాను. అంతలో ఇంత కూతురా? నమ్మను! నమ్మలేను! యీ పాపాయి ఆశ్రమంలో మరో ముని తనయా? లేక గౌతములవారికి ఇంతకు ముందే సంతాన ప్రాప్తి కలిగిందా! పెంచిన ప్రేమతో పాపాయి నిన్నలా హత్తుకుపోతున్నదా?'


    'అవన్నీ నీ ఊహలు సఖీ! ఈ చిన్నారి నేను కన్నపిల్లే! గౌతముల వారికి అంతకు ముందు పెళ్ళి కాలేదు. సంతానమూ లేదు. ఇది నా గర్భవాసాన జన్మించిన బంగారు కొండ! అంజన దీని పేరు' కూతుర్ని మళ్ళీ ముద్దాడుతూ అంది అహల్య.


    'నమ్మను. నమ్మలేను! నమ్మనుగాక నమ్మను. నిన్ను చూస్తే నిన్ననో మొన్ననో పెళ్లయిన దానిలా ఉన్నావు! నీవు బిడ్డ తల్లివి అంటే నేను నమ్మను!' అంది విభ్రాంతితో ఇంద్రసఖి.


    'తొలి సంతానం లక్ష్మీదేవిలా అవతరించిందని నేను మేమంతా ఆనందపడుతున్నాం. మా భూలోకంలో మొదట ఆడపిల్ల జన్మిస్తే లక్ష్మీ కటాక్షంగా భావిస్తాం సఖీ! అయినా నేను కన్నబిడ్డనెత్తుకుని ఇది నా బిడ్డే అంటున్నా నమ్మనంటున్నావ్! ఏమిటీ కారణం?'


    అహల్య మాటలు విని అబ్బుర చెందింది. క్షణంసేపు దిగ్భ్రాంతిలో ఉంది.


    'నిజమా! నిజమా! నిజమే చెపుతున్నావా? అయినా నాతో అబద్ధం ఆడవలసిన అవసరం ఏమున్నదిలే! అహల్యా! నిన్నూ నీ సోయగాన్నీ చూస్తే నీవు మాతృత్వం పొందిన మహిళలా లేవు. ఇంకా పోలివోని యవ్వనంలో కన్యలా ఉన్నావు. నిజం నీవింకా కన్యవే!'


    పకపక నవ్వింది అహల్య.


    'అవును నేను కన్యనే! అది మా తండ్రి నాకిచ్చిన వరం!'


    'అయినా ఇదెలా సంభవం? కొన్ని పొద్దులే గడిచాయి. అంతలో యింత... అహల్యా! సద్యోగర్భ ప్రసవమా అంజన?' సందేహిస్తూ అడిగింది ఇంద్రసఖి.


    'కాదమ్మా ! ఈ లోకంలోని అందరు స్త్రీల లాగే నవమాసాలూ నిండుగా మోసి కన్నాను. బ్రహ్మలోకంలో సృష్టింపబడ్డా, మానవ లోకంలో కదా నా మనుగడ! అన్నీ మనుషులలాగే జరిగిపోతాయి.'


    'అయినా ఇదెలా జరిగిందో....'


    'నీవు ఇంకా భ్రమ నుంచి తేరుకోలేదమ్మా! ఇక్కడ ఆరు నెలలు ఒక ఆయనం! ఉత్తరం- దక్షిణం అని. అవి రెండూ గడిస్తే ఒక హాయనం. అంటే ఒక సంవత్సరం. అలా మాకు ఒక సంవత్సరం గడిచిపోతే మీకు ఒక పగలు. రెండేళ్ళు అయితే ఒక దినం. అలా లెక్కించుకో. అక్కడెన్ని దినాలు గడిచాయో దానికి రెట్టింపు సంవత్సరాలు గడిచిపోయాయి. నీకు లెక్క తెలీకపోతే చెప్తా విను! ఆరేళ్ళు గడిచాయి...'


    అది విని అనుకుంది ఇంద్రసఖి 'మూన్నాళ్ళు... అవును. మూన్నాళ్ళు' అవును. తనలో తను అనుకుంది 'అవునమ్మా! లోకాంతర యానం వల్ల వచ్చిన తిప్ప ఇది! మరి నే వెళ్ళిరానా? మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి మీ లోకంలో ఎన్నేళ్ళు గడిచిపోతాయో! ఇంకెందరు సంతానం పుట్టుకొస్తారో నీకు?' అంది ఇంద్రసఖి.


    'ఇలా వెళ్ళి అలా వచ్చేస్తూ ఉండు! నీకేం నీవు ఇంద్రసఖివి! నీది మనోజపం! మారుత తుల్య వేగం కదా!' అంది అహల్య.


    ఇక మాటలు రెట్టించ లేదు ఇంద్రసఖి. ఇంద్రుడికి అహల్య సంతానవతి అని చెప్పి, అతని మనసు మార్చాలనే తొందర్లో సెలవు తీసుకుంటూ వెళ్ళిపోయింది. గగనానికెగసే ఆమెనే చూస్తోంది అహల్య.

 Previous Page Next Page