Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 26


    "వదినగారు" గీత తల్లి గాభరాగా లేచింది. "ఏదో చిన్నపిల్ల తెలియక అంది. ఆ మాటలు పట్టించుకుంటున్నారా-"సర్ది చెప్పబోయింది. "హు-చిన్నపిల్లలు మాట్లాడవలసిన తీరు యిది గాదండి వదినగారూ. సరోజకి డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం వుంది. గతిలేక మా యింట్లో వుండడం లేదండి. ఆ విషయం మీ అమ్మాయికి అర్ధమయ్యేట్టు చెప్పి యికముందన్నా యిలాంటివి జరగకుండా చూడండి." ఆవిడ గంభీరంగా అంది.
    "సరోజా! రా అమ్మా వెడదాం. నాయనా కృష్ణా, మమ్మల్ని దిగబెట్టగలవా-కావాలంటే మళ్ళీ వద్దువు గానిలే" అంటూ కారు దగ్గిరకి వెళ్ళిందావిడ. సరోజ అనుసరించింది.
    రంగారావుగారు గాభరాగా "అదేమిటమ్మా-" ఏదో చెప్పబోయారు. సరస్వతమ్మ మరి మాటలకి తావీయకుండా కారెక్కింది-కృష్ణమోహన్ ఏమనాలో తెలియక ఒక్క క్షణం తచ్చాడి కారెక్కాడు. కారు కదిలింది.
    
                                     *    *    *

    "సరోజా....చీకట్లో ఏం చేస్తున్నావు?" మేడమీద వంటరిగా కూర్చున్న సరోజని పలకరించుతూ లైటు వేశాడు కృష్ణమోహన్. సరోజ గాభరాగా కొంగుతో కళ్ళు తుడుచుకుని లేని నవ్వు తెచ్చుకుని "ఏంలేదు-ఏం లేదు. వూరికే కూర్చున్నాను" అంది. కృష్ణమోహన్ సూటిగా ఆమె వంక చూశాడు.
    "ఏడుస్తున్నావా సరోజా-" బాధగా అన్నాడు..."సరోజా! గీత మాటలకి నీవు బాధపడ్తున్నావని నాకు తెలుసు - కాని ఏం చెయ్యను నేను - నేనేం చెయ్యడానికీ అశక్తుడిని సరోజా - మధ్యాహ్నంనించి నేను పడ్తున్న బాధ నీ కర్ధంకాదు. అమ్మకూడా అక్కడి కెందుకు వెళ్ళాం అని చాలా విచారిస్తూంది. సరోజా - రేపు గీతకి గట్టిగా చెప్తాను - నీ విషయంలో మరోసారి యిలా మాట్లాడితే వూరుకోనని, నీ కీ యింట్లో వున్న స్థానమేమిటో తెలియచెప్తాను ఖచ్చితంగా - యింక వూరుకోను" ఆవేశంగా అన్నాడు.
    "వద్దు - వద్దు అనవసరంగా నా మూలంగా మీ యిద్దరూ గొడవ పడకండి దయచేసి. ఆవిడ అన్నదాన్లో తప్పేంలేదు. ఆవిడ స్థానంలో నేనూ ఉంటే నేను అలాగే మాట్లాడేదాన్నేమో - నామీద మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు నాకే అర్ధంకానిది ఆవిడకి ఎలా అర్ధం అవుతుంది. కృష్ణమోహన్ గారూ - దేనికన్నా ఓ హద్దు వుండాలి. మీ రిద్దరూ నాపై చూపుతున్న అభిమానానికి హద్దన్నది వుండాలని ఆమె తెలియచెప్పింది. అందులో తప్పేం వుంది - దయచేసి యింక ఇలా నన్ను మీ దయతో ఉక్కిరి బిక్కిరి చెయ్యకండి - నన్నేదన్నా హాస్టలులో చేర్పించండి కృష్ణమోహన్ గారూ - అమ్మ ... ఆవిడ కొన్నాళ్ళు బాధపడ్తారు - తరువాత సర్దుకుంటారు - యిలా యీ బంధం యింకా పెరగనిస్తే రేపు మీ వివాహం అయ్యాక అయినా ఇల్లు వదలాల్సినదాన్ని - నా మీద ఆవిడ యింకా మమకారం పెంచుకోడం ఎవరికీ మంచిది గాదు - దయచేసి నన్ను వెళ్ళనీయండి.... నన్ను యిలా ఇబ్బంది పెట్టకండీ యింక..."
    "సరోజా ... యిక్కడుండడం నీకంత ఇబ్బందిగా వుందా..." విచలితుడై అన్నాడు - అంతలోనే "అవునులే - ఆత్మాభిమానం నిలవనిచోట పట్టుపరుపులైనా ముళ్ళ పాన్పులాగే వుంటుంది నీలాంటి అభిమానవతికి - సరోజా...నా పెళ్ళి నిన్ను మానించి దూరం చేసేట్లయితే ఆ పెళ్ళి చేసుకోవాలనే కోరిక చచ్చిపోతుంది నాలో" వ్యధగా అన్నాడు.
    "కృష్ణమోహన్ గారూ" సరోజ ఆశ్చర్యంగా చూసింది "అవును సరోజా, నీవు లేని యీ యిల్లు ఎలా వుంటుందో, ఏమవుతుందో ఊహించలేకపోతున్నాను ... సరోజా, నిన్నిక్కడ ఎలా శాశ్వతంగా వుంచుకోగలనో అర్ధంగావడంలేదు" నిట్టూర్చి అన్నాడు బాధగా.
    అతనేం మాట్లాడుతున్నాడో అతనికే తెలియనట్లు మాట్లాడుతున్న కృష్ణమోహన్ ధోరణి ఆరోజు చాలా వింతగా అన్పించింది సరోజకి. గీత యింట్లో జరిగిందానికి అతనెంత బాధపడ్తున్నాడో అతని మొహమే తెలియ చెపుతూంది. అతని మనసులో ఏదో వ్యధ అనుభవిస్తున్నట్టు అతని కళ్ళే చెపుతున్నాయి. అలా బాధపడ్తున్న అతన్ని చూస్తుంటే సరోజ మనసు గిలగిలలాడింది. అతన్ని దగ్గిరకి తీసుకుని ఓదార్చాలనిపించిన కోరికని బలవంతంగా అదుపులో పెట్టుకుని "మీ రెవరు, నే నెవరు అని నా కోసం బాధపడ్తున్నారు మీరు, నాలుగు రోజుల బంధం మనది అన్నది మరిచిపోకండి కృష్ణమోహన్ గారు-" మృదువుగా అంది-"మరి రెండు నెలల్లో యిక్కడనుంచి వెళ్ళిపోయే దానికోసం మీరు బాధపడకండి..."
    "అదే సరోజ నాకూ అర్ధంగానిది. ఎక్కడనించో వచ్చిన నీ మీద నా కెందు కీ అభిమానం అన్నదే నాకూ అర్ధంగావడంలేదు. నిన్ను దూరం చేసికోడానికి నా కెందు కింత బాధ. నీవెవరు అని మనసుకి ఎంత నచ్చచెప్పుకుందామన్నా మనసు మాట వినడంలేదు సరోజ. మన ఈ అనుబంధం ఏనాటిదో అయి వుండాలి.." ఆవేశంగా అన్నాడు.
    ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని..."సరోజ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు" అన్నాడు సరోజ గుండె ఒక్క క్షణం లయతప్పింది. అతనడగబోయేది తనకి తెల్సిందే అన్నట్టు ఊపిరి బిగపట్టి దడదడ లాడుతున్న గుండెతో ఎదురుచూసింది.
    "సరోజా, గీతని గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆమెని వివాహమాడాలన్న నా నిర్ణయం సరి అయిందే నంటావా?" సరోజవంక చూస్తూ అడిగాడు ఆ ప్రశ్నతో సరోజకి హఠాత్తుగా ఏదో కోల్పోయినట్లు నిరాశ ఆవరించింది. తన వెర్రి మొర్రి ఆలోచనలకి, ఆశలకి తనని తనే అసహ్యించుకుంది గీత! గీత! తన బావని తననించి వేరు చేస్తున్న గీత! ఆమె గురించి తను అభిప్రాయం చెప్పాలి! కసిగా నవ్వుకుంది.

 Previous Page Next Page