Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 26


    "ఉండు చెపుతాను. తొందరపడకు ఊ...మా పదిహేను రోజుల హనీమూన్ ముగిసింది. ఆయనను ఎదిరించితే ఆయనలో రాక్షసత్వం మరీ ఎక్కువవు తున్నదని గమనించి మిగతా రోజులు ఆయనేమన్నా ఊరుకుని, ఆయనకి కావల్సి నపుడు వళ్ళు అప్పగించాను. ఆయనని కాదనకపోతే, ఎదిరించకపోతే పశుత్వం అంత ఉండేది కాదు.
    ఆయనకి బెదిరి లొంగానని "ఏం బుద్ది వచ్చిందా. ముందే ఈ బుద్ధి వుంటే ఎంత బాగుండేది" అన్నారు ఒక రోజు తాగిన మత్తులో లేనపుడు.
    దేనికీ మాట్లాడేదాన్ని కాను నేను.
    ఊరికి వెళ్ళేముందు మా ఇంటికి వెళ్ళి సామానులు తెచ్చుకోవాలి. నా బట్టలు  అవీ అన్నీ ఉండి పోయాయి" అన్నాను.
    "అన్నీ పంప మంటాను. నీ వాళ్ళు ఇచ్చే ఫర్నిచర్ కి మొహం వాచిలేను. ఇంట్లో అన్నీ ఉన్నాయి. అయినా ముందు మనం వెళుతున్నది మా ఇంటికి."
    "నేను ముందు మా ఇంటికి వెళ్ళాలి" - పట్టుదలగా అన్నాను.
    "వీలులేదు." కటువుగా అన్నారు తీక్షణంగా చూస్తూ -
    ఇంకేం అంటాను? వాళ్ళింటికీ వెళ్ళాం. గృహప్రవేశం అంటూ అత్తగారు హడావిడి చెయ్యబోతే ఈయన అవేం అక్కరలేదన్నారు.
    ఆవిడ నిట్టూర్చి "వీడు ఎప్పుడు ఇంతే! ఏ ముద్దూ ముచ్చటా లేదు" అన్నారు బాధగా.
    మా అత్తగారు, మామగారు చాలా మంచివాళ్ళ లాగే కన్పించారు. ఎంతో అభిమానం ఆదరణ చూపారు. కన్న కూతురిలా ఇది తినమ్మా అది తినమ్మా! అదేమిటి కొత్త పెళ్ళికూతురిని నవనవలాడుతూ వుందాలి. ఇలా వుండి పోయావేమిటి? ఆ భోజనాలు అవి పడలేదా - ఏమిటి నీ మొహం అలావుంది? ఆప్యాయంగా దగ్గిర కూర్చోపెట్టుకుని కొసరి కొసరి వడ్డించేవారు ఆమె.
    ఆమె చూపే అభిమానం చూశాక నా హృదయంలో గూడు కట్టుకున్న దుఃఖం అంతా ఆమెతో వెళ్ళబోసుకోవాలనిపించింది. కాని, మీ కొడుకిలా అని ఆమెతో ఎలా చెప్పను? ఇంట్లో మా ఇద్దరి వరస చూసి. కొత్త దంపతుల్లా సంతోషంగా వుండకపోవడం చూసి ఆవిడకే అనుమానం వచ్చినట్లుంది.
    ఓ సారి ఇద్దరం భోంచేస్తున్నప్పుడు "ఏమ్మా అలా వున్నావు. మీ ఇంటిమీద బెంగా" అన్నారు.
    అంత ఆప్యాయతకి తట్టుకోలేనట్టుగా నాగొంతులో దుఃఖం అడ్డుపడింది. కాదన్నట్టు చప్పున తల ఆడించాను. నా కళ్ళల్లో అప్పుడే నీరు తిరిగింది.
    "ఏమిటమ్మా ఏం జరిగింది?" ఆరాటంగా అనుమానంగా చూస్తూ అడిగారు ఆవిడ.
    నేనేమి చెప్పలేక పోయాను. బొట బొట కన్నీరు కారింది.
    ఆవిడ చకితురాలై ... "విజయా - ఏమయింది? ప్రకాష్ ... వాడేమన్నా అన్నాడా ... వాడు సరిగా లేడా నీతో ..." అడగలేక అడిగినట్లు అడిగారు.
    అవునన్నట్టు తల ఆడించడం మినహా ఏం చెప్పలేక పోయాను.
    ఆమె అనుమానంగా చూస్తూ "ఏం అన్నాడు? ఏం చేశాడు?" నల్లబడ్డ మొహంతో అన్నారామె.
    "ఆయన త్రాగి నన్ను ... నన్ను ... అమానుషంగా" చెప్పలేక కళ్ళు తుడుచుకున్నాను.
    ఆవిడ తెల్లపోతూ - "వాడు తా గు తా డా" అన్నారు.
    "ఒక్క తాగుడేకాదు. అన్నీ ఉన్నాయి....తాగి, రాక్షసుడిలా ప్రవర్తిస్తారు. ఎదురు తిరిగితే నన్ను కొడ్తారు. ఆయనిలాంటి వారని మాకు చెప్పకుండా దాచి ఈ వివాహం చేయడం మీకు న్యాయమా? ఏనాడు దెబ్బ అంటే ఎరగకుండా ముద్దుగా పెరిగాను, ఈనాడు నన్నిలా ఆయన..." ఏడుస్తూ అన్నాను ఉక్రోషంగా.
    ఆవిడ కలవరపడ్తూ "నిజంగానా విజయా! తాగుతున్నాడా? నిన్ను కొడ్తున్నాడా! అయ్యో పట్టుమని పది రోజులేనా అవకుండా కొత్తపెళ్ళికూతుర్ని కొట్టడమా. వుండు....వాడిని అడుగుతాను" ఆవిడ ఆవేశంగా అన్నారు.
    "వాడిలా తాగుతాడనే మాకు తెలియదమ్మా. ఇంక ఇలా ప్రవర్తిస్తాడని మాకు మాత్రం ఎలా తెలుస్తుందమ్మా..." ఆవిడ దోషిలా సంజాయిషీ ఇస్తున్నట్టున్నారు.
    "వారి కీ పెళ్ళి ఇష్టంలేదా? ఇష్టంలేని పెళ్ళి ఎందుకు చేసుకున్నారు?" ఆవేశంగా అడిగాను.
    "ఇష్టపడకపోతే ఎందుకు చేస్తామమ్మా మేమూ - అంత చిన్న పిల్లాడా మెడలువంచి చేయడానికి? చాలా రోజులు పెళ్ళి చేసుకోను చేసుకోను అన్నాడు. ముందు సుశీల అనే అమ్మాయిని చేసుకుంటానన్నాడు. కాని ఆ అమ్మాయి ఎందుకో ఇష్టపడలేదు. తరువాత చాలా రోజులు పెళ్ళిమాట ఎత్తితే చేసుకోను అనేవాడు. ఆఖరికి నీ సంబంధం వచ్చాక వాళ్ళ నాన్నగారు గట్టిగా అడిగితే సరే అన్నాడు"
    ఆవిడ మాటలు వినగానే ఏదో క్లూ దొరికినట్లయింది. "ఎవరా అమ్మాయి? ఎందుకు చేసుకోనంది?" కుతూహలంగా అడిగాను.
    ఆయన ప్రవర్తనకి, స్త్రీలపట్ల ఆయనకున్న ద్వేషానికి ఏదో కారణం వుండచ్చన్న నా అనుమానానికి చిన్న ఆధారం దొరికినట్లు అన్పించింది. ఆ అమ్మాయి తిరస్కారం యీయనలో స్త్రీలమీద ప్రతీకార వాంఛగా మారిందా?...
    "ఆ అమ్మాయి దీ వూరే. అట్టేలేనివాళ్ళు. అయితేనేం పిల్లే అపురూప సౌందర్యవతి. వీడికి కాలేజీలో జూనియరట. ఆ అమ్మాయిని ప్రేమించాడో ఏమిటో, మేం వాడి చదువయ్యాక ఉద్యోగం దొరకగానే పెళ్ళి చేసుకోమంటే ఫలాన అమ్మాయిని చేసుకుంటాను. అడగండి అన్నాడు. మగపిల్లవాళ్ళం మేం ఎలా అడుగుతాం అనుకున్నాం. మధ్య వర్తి ద్వారా వాకబుచేశాం. కుటుంబం, సాంప్రదాయం మంచిదే, లేనింటిదయితేనేం మాకున్నది చాలదా అని వాడు యిష్టపడుతున్నాడని మధ్యవర్తి ద్వారా మేమే కబురు చేశాం - తల్లిదండ్రులు చాలా సంబరపడి ఇష్టపడ్డారు. కాని ఆ అమ్మాయి ససేమిరా చేసుకోనందిట ... మేం ఆశ్చర్యపడ్డాం-

 Previous Page Next Page