Previous Page Next Page 
మాయ జలతారు పేజి 26


    ఆవిడ హృదయం పులకించింది. భర్తను చూచింది. అతని ముఖంలో ఆనందం తాండవిస్తూంది. తన నోములు ఫలించాయనుకుంది. భగవానుని దయగా భావించింది అంతలో సిగ్గు ఆవహించింది. తలవంచుకుంది.
    "పార్వతీ! చూడు, పాప కళ్ళు అచ్చం నీ కళ్ళే" అన్నాడు.
    తాను బిడ్డను చాలాసార్లు చూసింది కాని, అప్పటివరకూ ఈ విషయం గమనించలేదు తాను.
    "ముక్కు చూశారా?"
    మాట పూర్తికాకుండానే "నా ముక్కు కనిపించడంలా పొట్టిగా" అని, "పార్వతీ! చాలా కష్టపడ్డావా?" అడిగాడు.
    "బాధా! చచ్చిపోతాననుకున్నాను. మీరు పక్కన లేకుండా చనిపోవడం ఇష్టంలేక టెలిఫోన్ చేయించాను. మరిచాను, రజనీ రాలేదా?" అడిగింది.
    "అవును మరచిపోయాను, రజని నా వెంట వచ్చిందనే విషయం ప్లేన్ దిగ్గానే నిన్ను చూడాలనే ఉబలాటమే ననుకో" పార్వతి ముఖంలో ఒక ఎరుపు తెర పైకి లేచి వాలిపోయింది. "నేరుగా యిటే వచ్చేశాను. పిలిపించు రజనీని" అన్నాడు.
    నౌకరును పిలిచి రజనీకి కబురంపింది పార్వతి.
    తాము చూచివచ్చిన విశేషాలను గురించి పార్వతికి చెబుతుండగా నారాయణరావు గుమ్మంలో ప్రవేశించాడు. తూలి పడబోయి, దర్వాజా పట్టుకున్నాడు.
    "అల్లుడూ! గుడ్ నైట్ సారీ గుడ్ మార్నింగ్. ఎంతకాలమయిందో విస్కీ తాగి! పార్వతి వట్టి పిసినారి - ఇరవైనిమించి ఇవ్వడంలేదు. చాలా అప్పయింది. అదీ నువ్వే తీర్చాలి"
    పార్వతి గుండె జల్లుమంది. అప్పు ఎలా పుట్టిందో అర్థం కాలేదు రాజారావుకు.
    "చూడు, ఎంత తాగినా మత్తు రావడంలేదు. మార్ఫియా తీస్కుంటే తప్ప మత్తు ఎక్కడంలేదు" - దగ్గు పొర వచ్చింది. సుడిబడ్డాడు రాజారావు. అతణ్ణి పట్టుకొని తెచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు.
    దగ్గుపొర నుంచి తెమలుకొని "అలా అని మార్ఫియా తీసుకొని నిద్రపోతాననుకో, అందులో ఏం మజా ఉంటుంది?" త్రేన్చాడు సారావాసన గుప్పుమంది పార్వతీ, రాజారావు ముక్కులు మూసుకున్నారు.
    "ఆకల్లేకుంటే మందుందనుకో, దాంతో నాలుక రుచి తీరుతుందా? తాగుడులో మజా నీకేం తెలుసు పారూ! యోగం చేయలేనివాడల్లా తాగాలన్నాడు మహర్షి. అల్లుడూ, ఇవ్వాళ జల్సాగా ఉండాలోయ్ - ఇస్తావా ఏమన్నా? అప్పే చేయమంటావా? నీ యిష్టం" అని నవ్వేశాడు నారాయణరావు చేయి చాచి.
    నివ్వెరపోయాడు రాజారావు, అతని ముఖంలోని రక్తం యావత్తు దిగిపోయింది ఈ అప్పేమిటి? ఏం చూచి ఇస్తున్నాడు, ఎవడిస్తున్నాడు? రహస్యం ఎవడికయినా తెలిసిపోయిందా? అని ఆలోచిస్తూనే పర్సులోంచి పచ్చకాగితం తీసి ఇచ్చేశాడు. మామగారికి బై బై అని తలూపుతూ వెళ్ళిపోయాడు నారాయణరావు.
    ఇక పార్వతి బాధ చెప్పలేం తాను బిడ్డను కన్నది తండ్రి ఒక్కసారి ఇలా వచ్చి మనవవణ్ణి చూచిపోలేదు. ఇప్పుడు గదిలోకి వస్తే తన బిడ్డను చూస్తాడనీ, ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడనీ ఆశించింది. తండ్రి మాటలు విని వ్యవహారం తన చేయిదాటిపోతూందని గ్రహించింది. ఇటీవల తానా విషయాల్లో అట్టే శ్రద్ధ తీసుకోలేకపోతూంది. ఆమె కంటినుంచి రెండు భాష్పబిందువులు రాలాయి.
    నారాయణరావు వెళ్ళిపోతూంటే రాజారావు భార్యవైపు చూచాడు సార్థకంగా ఆవిడ కూడా తనకేమీ తెలీదన్నట్లు చూచింది. ఆ దశలో ప్రవేశించింది రజని. రజని గదిలో ప్రవేశించగానే రాజారావుతో తనను మరచిపోయినందులకు నిష్ఠూరంగా మాట్లాడాలనుకుంది. కాని, పరిస్థితి చూచి ఏమీ మాట్లాడలేకపోయింది, తన నీరసానికి తనలో తానే నిందించుకుంది. తన అధికారం ఏదో జారిపోతున్నట్లు భావించింది.
    రాజారావు ఆవిణ్ణి చూచాడు. "రా రజనీ! చూడు పాపను పార్వతి ఎలాంటి బిడ్డను కన్నదో చూడు!" అన్నాడు పేలవంగా.
    రజని ఊయల దగ్గరికి వెళ్ళింది. బిడ్డను చూచింది. ఎత్తుకుంది ముద్దుపెట్టుకుంది. తొట్టెలో పడుకోపెట్టి గుడ్డకప్పింది. బిడ్డ ఏడ్చాడు. నర్సు తీసుకొని పాలు పట్టించింది. పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది రజని.
    "వొళ్ళెలా ఉంది?" అడిగింది రజని.
    "భగవంతుని దయవల్ల బాగానే ఉంది. మరిచేపోయావే, పిలిచేదాకా రానేలేదు"
    "ఏదో బట్టలు మార్చుకొని " తడబడింది రజని.
    "కోపం వచ్చి ఉంటుంది" అన్నాడు రాజారావు.
    "నాకెందుకు కోపం? ఏదో కాస్త ఆలస్యం! అయినా మేమెందుకు" అని మాట మింగేసింది.
    రాజారావుకు రజని ప్రవర్తన వింతగా కనిపించింది. ఆవిడ మనసులోని మాటేమిటో గ్రహించాలని ప్రయత్నించాడు. ముఖంలో అట్టే మార్పేమీ కనిపించలేదు కాని, ప్రసన్నంగా ఉండే ముఖంలో చికాకు కనిపించింది. బాగా ఆలోచించగా బహుశః పార్వతంటే ఈర్ష్య ఏమో అనుకున్నాడు. అందులో అట్టే అర్థం ఉన్నట్లు కనిపించలేదు. నర్సు పాలు తాగించి పాపను పడుకోబెట్టడం కనిపించింది. పాప అంటే ఈర్ష్య కాదు కదా? అనుకున్నాడు. అతని ఆలోచన అక్కడ టపీమని ఆగిపోయింది. ఇక ముందుకు కదల్లేదు. రజని కళ్ళల్లోకి చూచాడు. వాటిల్లో ఈర్ష్య ఎక్కడా కనిపించలేదు కాని, చూపులు తాను అనుకున్నంత ప్రసన్నంగా లేవు. తానలా చూస్తే చిరునవ్వు నవ్వేయాల్సింది రజని - కనీసం కళ్ళతో అలా జరగలేదు! అతని చూపుల వాడికి తట్టుకోలేకనా అన్నట్లు తలవంచుకుంది.
    రాజారావుకు ఏమీ తోచలేదు. సిగరెట్టు కోసం జేబులు తడుముకున్నాడు. అగ్గిపెట్టె ఉంది కాని, సిగరెట్టు పెట్టె ఖాళీగా ఉంది. ఖాళీ పెట్టె నేలక్కొట్టాడు "వస్తా" అని లేచి చరచరా వెళ్ళిపోయాడు. ఇద్దరూ వింతగా చూచారు రాజారావును. అతని ముఖం కనిపించలేదు. వారికి అతని నడకలో ఏదో చిరాకు గోచరించింది వారికి. రజనీ, పార్వతీ ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. ఆ చూపుల్లో ప్రశ్నలున్నాయి కాని, జవాబు లేదు. ఏం మాట్లాడాలో ఇద్దరికీ అర్థం కాలేదు. ఇద్దరి మనసుల్లో ఏదో కలత కల్లోలం చెలరేగింది. అప్పుడే వికసించిన గులాబి తోటమీద అగ్గివాన కురిసినట్లనిపించింది పార్వతికి. తాను నాటి, పెంచి పోషించుకున్న గులాబి తోటలోంచి తననెవరో గెంటివేస్తున్నట్లూ, పూలన్నింటినీ నలిపి కుప్పలు పోస్తున్నట్లు అనిపించింది రజనీకి. ఇద్దరి మనసుల్లో ముళ్ళపొదలు మొలచాయి.
    ఇద్దరూ చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. పార్వతి కూర్చున్నదల్లా దిండు సర్దుకొని మేను వాల్చింది. రజని లేచినుంచుంది. నాలుగడుగులు ముందుకు వేసి వెనక్కు తిరిగింది. ఊయల దగ్గరికి వెళ్ళింది. పాప నిద్రపోతున్నాడు. నిద్రలోనే చిరునవ్వు నవ్వుతున్నాడు. లిప్తపాటు పసిపాప నవ్వులో లీనం అయిపోయింది. ఎంత అందంగా ఉన్నాడు పాప అనుకుంది. ఆవిడ ముఖం వికసించింది. పార్వతి పాప బుగ్గ అందుకొని ముద్దు పెట్టుకుంది. మళ్ళీ పార్వతితో చెప్పి వెళ్ళిపోసాగింది. "వస్తుండు" అనే పార్వతి మాటలు ఆవిడకు వినిపించనేలేదు.
    రజని గదిలోకి వెళ్ళి కూర్చుంది. కళ్ళు మూసుకొని తల కుర్చీ పైకివాల్చి ఆలోచించసాగింది. ఆవిడకు ఇదివరకే ఉన్న వ్యధలు రెండు. ఒకటి తానెవరు అనే విషయమై తపన. రెండవది రాజారావు దూరమైపోతున్నాడనే బాధ. ఇప్పుడు మరొకటి నెత్తిన పడింది. పార్వతి పాప వెన్నెల్లాంటి నవ్వు ఆవిడకు తాత్కాలికంగా ఆనందం కలిగించినా రాజారావు తన నుంచి దూరం అవుతున్నది పాప వల్లనే అని గ్రహించింది. రాజారావు తనను ప్రేమించడం కాదు - పూజిస్తున్నాడు. తనవల్ల అతనికి శారీరకమైన ఆనందం ఏమీ లభించడంలేదు.
    రాజారావు అంటే తనకూ అభిమానమే కాని, రాజారావు తనను కౌగిలిలోకి తీసుకుంటే ఏవో ఇనుప చేతులు తనను బంధిస్తున్నట్లనిపిస్తుంది. ఎవరో తననూ తన మనసునూ దొంగిలిస్తున్నట్లు అనిపిస్తుంది. దూరంగా ఉన్నప్పుడు రాజారావు తనవాడే అనిపిస్తుంది కాని, తనను తాకితే ఎవరో పరపురుషుడు తాకినట్లనిపిస్తుంది. అది తాను కావాలని అనుకుంటున్నది కాదు - స్వతస్సిద్ధంగా వచ్చేస్తూంది. ఎందుకు వస్తుందో తనకే తెలీదు. రాజారావుకు తనవల్ల ఏం సుఖం ఉంది? రాజారావు తనను మరచిపోతే? తనను వెళ్ళగొట్తే? ఆ ఊహ సైతం భరించలేకపోయింది. గుండెలో వేల బాకులు గుచ్చుకున్నట్లనిపించింది. కుర్చీమీదినుంచి లేచి మంచం మీద పడుకుంది. మౌనంగా ఏడ్చింది. కన్నీరు ధారలుగా ప్రవహించింది. శరీరం ఇదివరకే అలసిపోయింది. ఇప్పుడు మనసూ అలసిపోయింది! నిద్రపట్టింది.

                            * * * *

    రాజారావు పార్వతి గదిలోంచి చరచరా నడిచి తన గదిలోకి ప్రవేశించాడు. డ్రా లాగి చూస్తే సిగరెట్ పెట్టెలు లేవు. ఇదివరకైతే సిగరెట్లు ఉన్నదీ లేనిదీ చూచి తెప్పించి ఉంచేది పార్వతి కాని, ఇన్ని రోజుల్నుంచి రాజారావు లేడు. పైగా, పార్వతి మామూలు మనిషి కదాయెను. అసలే చిరాగ్గా ఉన్న మనిషికి సిగరెట్లు లేకపోవడం మరీ చిరాకు వేసింది! కేకలు వేసి పనివాళ్ళందరినీ పిల్చాడు. అంతా హడావుడిగా గదిలోకి ప్రవేశించారు. "సిగరెట్లు ఎందుకు లేవు?" అని అరచాడు. ఎందుకు లేవని అరిస్తే వాళ్ళేం చేయగలరు? తెమ్మంటే తేగలరుగాని. ఎవడూ సిగరెట్టు తెచ్చిపెడ్తాననడు. అంతా మొద్దుల్లా నుంచున్నారు. తాను లేకపోవడం వల్లనే ఇలా అయిపోయిందనుకున్నాడు!

 Previous Page Next Page