"పోదామా?" అని లేచారు స్వామి ----నాంచారమ్మ వారిని అనుసరించింది.
పిచ్చమ్మ లాంతరు అందుకుంది. గురవయ్య దంపతులు లాంతరుతో ముందు నడుస్తుంటే స్వామి దంపతులు కొద్ది దూరంగా వారిని అనుసరించి నడుస్తున్నారు. కధా స్థలం రాగానే బయటనే నిలబడిపోయారు గురవయ్య దంపతులు. వారికి లోనికి ప్రవేశం లేదు. స్వామి దంపతులు లోనికి సాగిపోయారు.
గద్దె మీద పెట్రోమాక్స్ లు వెలుగుతున్నాయి. హరిదాసు అప్పుడే ప్రార్ధన ప్రారంభించారు. ఆ అరుగు మీద కొద్దిమంది పెద్ద మనుషులు కూర్చున్నారు. స్వామి గద్దె మీద కూర్చున్నారు. నాంచారమ్మ ఆడవాళ్ళలో కూర్చుంది. మిగతా జనం అరుగు ముందు చాపల మీద - పందిళ్ళ కింద కూర్చున్నారు.
రామక్రిష్టయ్య నారాయనస్వామిని చూచి అడిగాడు -----"గురవడు కూడా వచ్చినాడుండి " వెటకారంగా.
"గురవయ్య, పిచ్చమ్మ వచ్చిన్రు."
"కధ ఇని బాపనయిన అయితడా గురవడు! వాండ్లు బాగుపడరున్రి - మీ పిచ్చిగాని ."
"బాగుపరచటం గాని, చెడగొట్టడం గాని మన చేతులో లేదు రామక్రిష్టయ్య ! అంతా భగవదిచ్చ."
ఇంతలో చిరతల చప్పుడు ఎక్కువైంది. హరిదాసు కధ ప్రారంభించాడు.
"తపస్సాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమ్
నారదం పరిపప్రచ్చ వాల్మికి ర్ముని పుంగవమ్.
సకల శాస్త్ర పారంగతుడును , బ్రహ్మ నిష్టాగరిష్టుడును అయిన నారద మహామునిం జూచి వాల్మీకి ఇట్లని అడిగెను.
కధ అనర్గళంగా సాగుతుంది. శ్రోతలు మంత్రముగ్ధులై వింటున్నారు. నాటికి కధ ఆగింది. మంగళహారతి వచ్చింది.
అది గురవయ్య దాకా పోలేదు.
నారాయణస్వామి హరిదాసును మెచ్చుకున్నారు. శ్లోకాలు బాగా చదివాడన్నారు. రామానుజాచార్యుల వారు అది విని పొంగిపోయారు. గ్రామస్తులకు కూడా అచార్యలవారి విషయంలో గౌరవం పెరిగింది. ఇంటికెళ్తూ గురవయ్యను నడిగారు నారాయణస్వామి "గురవయ్య కధేట్లున్నది?" అని.
"పిట్టకతలు శాన బాగ చెప్పిండుండి " అన్నాడు. అతని పలుకలో ఏదో అనందం కనిపించింది.
పిచ్చమ్మ చాల సంతోషంగా ఉంది - కధను గురించి కాదు- గురవయ్య ఆరోజు త్రాగనందుకు. తనతో పాటు హాయిగా సాగుతున్నందుకు. "రేపు కూడా వస్తవా?" నారాయణస్వామి.
"వస్తమండి -కత ఎందాక పోతాదో ఇనాలే."\
"మంచిది రేపు కూడా ఇదే సమయానికి రాండి" అని లాంతరు అందుకొని ఇంట్లోకి వెళ్ళిపోయారు నారాయణస్వామి.
"గురవయ్య మారిండండి" నాంచారమ్మ స్వరంలో ఏదో సంతృప్తి గోచరించింది.
"పిచ్చిదానా! అంతా భాగవత్సంకల్పం" అన్న నారాయణస్వామి ధ్వనిలోనూ సంతృప్తి గోచరించింది.
అక్కడ హరిదాసు ఇల్లు చేరుకొని విశ్రమించగానే ఎంకమ్మ వచ్చింది ---- "శాన మంచిగ చెప్పినవుండి కత" అని మంచం మీద కూచున్నది. "కాళ్ళు పిసకనా?" అని తన తోడ మీద అయ్యవారి కాళ్ళు పెట్టుకొని పిసకసాగింది.
లాంతరు వెలుగుతుంది. ఎంకమ్మ రంభలా కనిపించింది వారిదాసుకు. "ఎంకమ్మా! నీ మొఖాన కుంకుమ, నెత్తిన పూలు వుంటే ఎట్లుంటవో" అంటూ ఆమెను మీదికి లాక్కున్నాడు.
"బొట్టు, పూలు పెట్టుకోవద్దంటరు గద మా అయ్యా అమ్మ!" ముద్దుగా అడిగింది ఎంకమ్మ హరిదాసు కౌగిట్లో.
"ఇక్కడ అందరు అట్లనే అంటరు పట్నం పొతే పెట్టుకోవచ్చు."
"మల్ల నన్ను పట్నం తీస్కపోతవా?"
"ఎందుకు తీసుకుపోను. తీస్కపోత"
లాంతరు అర్పేశాడు హరిదాసు.
తెల్లవారి కూడా పిచ్చమ్మను వెంటపెట్టుకొని వచ్చాడు గురవయ్య నారాయణ స్వామి ఇంటికి. నిన్నటి వలనే గురవయ్య దంపతులు శుచిగా, శుభ్రంగా ఉన్నారు - గురవయ్య చెవి సందున పువూ పెట్టుకున్నాడు.
గురవయ్య తాగలేదు.
హరిదాసుకు తెచ్చి పెడ్తూనే ఉన్నాడు. హరిదాసు తాగుతున్నాడు.
గురవయ్య సక్రమంగా హరికధకు వస్తున్నాడు. అతనికి కధలో ఆసక్తి ఏర్పడుతుంది. అతని జీవితంలో అమాంతంగా మార్పు వచ్చింది. ఉదయం లేచి స్నానం చేయందే కూలికి పోవడం లేదు. పని కూడా పూర్వం కంటే శ్రద్దగా చేస్తున్నాడు. విరామ సమయంలో అక్కడ కూడిన వారికి తనకు తెలిసినంతవరకు రామకధ చెపుతున్నాడు. సాయంకాలాల్లో సార దుకాణానికి - హరిదాసు కోసమే కాని, తాగడానికి వెళ్ళడం లేదు. సాయంకాలం మళ్ళీ స్నానం , ఉతికిన బట్టలు కట్టుకోవడం, హరికధకు వెళ్ళడం సారాయి బదులు అలవాటయిపోయినాయి.
పిచ్చమ్మ గురవయ్యను అనుసరించి రోజు కధకు పోతుంది. కానీ ఆమెకు కధలో ఆసక్తి లేదు. ఆమెకు అర్ధం అయింది లేదు. ఆమె ఆసక్తి గురవయ్య విషయంలో , గురవయ్య తాగడం లేదు - అది ఆమెకు సంతోషం. గురవయ్య బాదడం లేదు - అది ఆమెకు సంతోషం. గురవయ్య ఆమెను వెంట తెస్తున్నాడు - అది ఆమెకు సంతోషం. గురవయ్య వెంట జంటగా నడిచి వస్తున్నది - అది ఆమెకు గర్వం.
పిచ్చమ్మ రోజూ నాంచారమ్మ ఇంటికి వస్తుంది గురవయ్యతో - అయినా నాంచారమ్మతో ఆమె పరిచయం అంతంత మాత్రమే. పిచ్చమ్మ నాంచారమ్మ ఇంటిని రోజూ చూస్తుంది. అందువల్ల ఆమె నేర్చుకుంది. తన ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. అలకడం, ముగ్గులు పెట్టడం ఆమెకు అలవాటయినాయి. ఆమె ఇంటిని ఎప్పుడూ అద్దంలా ఉంచుతుంది. స్నానం లేకుండా వంటపనికి పూనుకోవడం లేదు. పిచ్చమ్మ ఇల్లు గూడేనికి ఆదర్శం అయింది. గురవయ్యకు గూడెంలో గౌరవం ఏర్పడింది.
రామక్రిష్టయ్య కూడా గురవయ్యను చూచి లోలోన ఆశ్చర్యపడుతున్నాడు.
నారాయణస్వామి - నాంచారమ్మ ఏంతో సంతోషిస్తున్నారు ----గురవయ్య పాత గురవయ్య కాకుండా ఉండాలని ప్రతిరోజూ భగవంతుని ప్రార్ధిస్తున్నారు .
"అయ్యగారూ! రాముడు కూడా అన్యాయం చేస్తడా?" ఒకనాడు కధ నుంచి తిరిగి వస్తూ దారిలో అడిగాడు గురవయ్య.
"ఏమిటి గురవయ్య అట్లాంటవు?"
"ఎరకలేక అడుగుతున్న. ఎరక చెప్పాలే మీరు."
"అడుగు"
"రాములోరు వాలి నెందుకు చంపిండుండి?" వాలి ఏం కీడు చెసిండని చంపిండుండి?"
నిశితమైన గురవయ్య పరిశీలనకు ఆశ్చర్యపడ్డారు నారాయణస్వామి.
"గురవయ్యా! రాముడు ధర్మ సంస్థాపనం కోసం అవతరించిండు గద! ధర్మానికి కీడు చేస్తే రామునికి కీడు చేసినట్లు కాదా?"
అప్పటికి ఇల్లు వచ్చేసింది. నారాయణస్వామి బల్ల పీటమీద కూర్చుంటే గురవయ్య లాంతరు పట్టుకొని కింద కూర్చున్నాడు. నాంచారమ్మ లోనికి వెళ్లి పడుకుంది. పిచ్చమ్మ ఇంటికి వెళ్ళిపోయింది.
"వాలి చేసిన అధర్మం ఎందుండి?"
"అదేమిటి గురవయ్యా అట్లంటవు? తమ్ముని భార్యను అపహరించే . రాజ్యం అపహరించే."
"సుగ్రేవుడు మాత్రం తక్కువేం తిన్నడు'? అన్న బతికుండంగనే రాజ్యం కట్టుకునే. అన్న కాబట్టి తమ్ముణ్ణి శిక్షించిండు - రాజ్యం నుంచి ఎల్లగొట్టిండు. అన్నదమ్ముల పంచాయితీ రాముని కెందుకుండి?" పరిశీలన నిశితంగా ఉంది. అసలు నారాయణస్వామికే సంశయాలు ప్రారంభం అయినాయి.