Previous Page Next Page 
శరతల్పం పేజి 26

 

                                      13

    శ్రీమత్తిరుమల వెంకట వరద రామానుజాచార్య భాగవతార్ బండి రామ క్రిష్టయ్య ఇంటి ముందు ఆగింది. రామక్రిష్టయ్య ఉరికి వచ్చి బండి మించి దిగడానికి అయ్యవారికి ముక్కాలి పీట వేశాడు. అచార్యలవారు భారంగా దిగి రామక్రిష్టయ్య ఇంటి వసారాలో వాలు కుర్చీ మీద కూర్చున్నారు. రామక్రిష్టయ్య కూతురు ఎంకమ్మ అచార్యలవారిని చూడాలనే ఆదుర్దాతో విసనకర్ర తెచ్చి ఆచార్యలకు అందించింది. అచార్యులకు ఎంకమ్మ, ఎంకమ్మకు ఆచార్యులవారూ విచిత్రంగా కనిపించారు. ఎంకమ్మ కిసుక్కున నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. ఆచార్యులు విసనకర్రతో విసురుకోసాగారు.
    భాగవతార్ ది పచ్చని పసిడిచాయ. చిన్న బొజ్జ. నిండయిన విగ్రహం. అందంగా ఉంటారు. వారి వంటి నిండా ఊర్ద్వపుండ్రాలే. వారు పరమ వైష్టవులు - వారి బండికి , ఎద్దులకు కూడా ఊర్ధ్వపుండ్రాలుంటాయి. అయన మంచి పండితుడు. రామాయణం, అనర్గళంగా హరికధ చెప్పగల దిట్ట. అందుకే పిలిపించాడు రామక్రిష్టయ్య - ఊళ్ళో హరికధ చెప్పడానికి. నారాయణస్వామిని బహిష్కరించిం తరవాత ఊళ్ళో కాలక్షేపం లేకుండా అయింది. ఊళ్ళో జనం చందాలు పోగుచేసి రామక్రిష్ణయ్య కిచ్చారు.   యధాశక్తి సేవ చేయడం అయన లక్షణం. అందుకోసమే తన ఇంట్లో విడిది ఏర్పాటు చేశారు. దొడ్లో ఉన్న రెండు గదులూ శుబ్రం చేయించి ఆచార్యులకు ఇచ్చాడు - అక్కడికి బావి దగ్గర ఉంటుందని . సామాగ్రి అందించదానికి ఎంకమ్మను నియమించారు. - అయ్యవారి మెడలోని తులసిదండలు చూచి , ఎంకమ్మ ఆచార్యులను వదలడం లేదు - ఆచార్యుల దగ్గర వశీకరణం ఉందని చెప్పుకుంటారు !
    "అయ్యవారూ ! యన్నింఛి వచ్చిన్రు?" తిరునారాధనకు పూలు అందిస్తూ అడిగింది ఎంకమ్మ.
    "గోలుకొండ పట్నం నుంచి" పూలందుకోబోయి ఎంకమ్మ చేయి తాకి జవాబిచారు.
    'అయ్యగారూ! నన్ను తాకిన్రుగద మైలపడ్డరా!"
    "ఎంకమ్మా! నిన్ను తాకితే మైలేమిటి? శ్రీరంగనాయకుడు కలలో కనపడి ఫలాని ఎంకమ్మ ఫలాని ఊళ్ళో ఉన్నది వెళ్ళు. ఆమెను తరింపచేయి అని చెప్పితినే ఇక్కడికి వస్తిమి." అని రెండు చేతులు పట్టి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు ఆచార్యులవారు - తిరువారాధనకు!
    "ఇప్పుడోదులుండి , పగటిపూట మా అమ్మయ్య చూస్తరు."
    "అయితే రాత్రి కోస్తవా ఎంకమ్మ?"
    "హరికధ అయినెక్క . నేనేడికి పోత? కూతేయ్యండి. ఊరికోస్త ఇగ పూజ చేసుకోరి" అని వెళ్ళిపోయింది ఎంకమ్మ.
    రామానుజాచార్యుల వారి పూజ సాగలేదు కాని రామక్రిష్టయ్య కుటుంబానికి తీర్ధ ప్రసాదాలిచ్చారు.
    "అయ్యగారూ! హరికత మాపటికి మొదలు పెడతారా! పందిరి గిట్ట ఎయించి అన్ని తయారు చేయించిన" అన్నాడు రామక్రిష్ణయ్య.
    "ఇవ్వాళ ప్రయాణపు బడలిక ఉన్నది. రేపు రాత్రి నుంచి ప్రారంభింతాం" అన్నారు ఆచార్యులవారు!
    "అట్లనేలేరి" అని వెళ్ళిపోయాడు రామక్రిష్టయ్య.
    ఆచార్యులవారికి ఓ చిన్న బలహీనత ఉంది - సారాయి తాగందే హరికధ చెప్పలేరు. రహస్యంగా సారాయి తాగే ఏర్పాటు జరుగుతే గాని హరికధకు ఉపక్రమించలేరు. అందుకే ఓ రోజు వాయిదా.
    ఆచార్యులు భోజనం చేసి విశ్రమిస్తే ఎంకమ్మ వారి కాళ్ళు వత్తసాగింది. ఆమెతో మాట్లాడుతూనే ఊరి వ్యవహారాలన్నీ తెలుసుకున్నాడు - ముఖ్యంగా నారాయణస్వామి వ్యవహారం . ఎక్కణ్ణించొ నారాయణస్వామి దూరపు చుట్టమని వెలికి తీశాడు. ఆ సాయంకాలం నారాయణస్వామి ఇంటికి వెళ్ళారు. పరిచయాలు, క్షేమ వార్తలు అయిం తరువాత కొంత సేపు చర్చ జరిగింది. ఆచార్యులవారు నారాయణస్వామి విషయంలో సానుభూతి వ్యక్తపరిచి, శాస్త్రానికి బాసటగా లౌకిక జ్ఞానం ఉండాలన్నారు. నారాయణస్వామి అందుకు బదులు చెప్పలేదు.
    "స్వామీ! దేవరవారితో దాసునికి ఒక చిన్నకార్యం ఉన్నది. తమ సయం లేనిదే నా కధ సాగదు" ఆచార్యులు.
    "సాయించండి. దాసునికి చేతనైతే తప్పక నెరవేరుస్త."
    "దాసునికి ఒక దురఖ్యానం ఉన్నది. కాస్తంత పానం లేందే కధ సాగదు."
    నారాయణస్వామి తల కొట్టేసినట్లయింది. వారి ముఖంలోంచి రక్తం పూర్తిగా దిగిపోయింది, నిరుత్తరులైనారు.
    "దాసుణ్ణి మన్నించాలే. ఎవరైనా మనిషిని అప్పగిస్తే నా తంటాలు నేను పడ్త" అని కాళ్ళు పట్టుకొని వదలలేదు ఆచార్లు.
    నారాయణస్వామి వంటికి చమట పట్టింది. వైష్ణవుడు కాళ్ళు పట్టుకున్నాడు -- పని చాల నీచం అయింది. అర్ధం కాక తికమకపడ్డారు. తుదకు తను కాళ్ళు వదిలించుకొని అన్నారు --
    "మీరు పెద్దలు. పండితులు. ఇంటికి వచ్చి అర్ధించినారు. చేయలేను కాదని అనలేను. గురువయ్య అని ఉన్నడు. అతన్ని మీకు అప్పగిస్త. మీ ఇష్టం . ఏమన్న చేసుకోండి. దాసుణ్ణి మాత్రం దూరంగ ఉంచండి."
    'చాలు. అంతకంటేనా!" అని సెలవు తీసుకున్నారు అచార్లు.
    ఆ రాత్రి నారాయణస్వామికి నిద్రపట్టలేదు. వారికి పరితాపం ఎక్కువయింది. ఎలాంటి నీచపు పని చేయిస్తున్నావు స్వామీ' అని కుమిలి పోయారు.
    తెల్లవారి అచార్లు వచ్చాడు. గురవయ్యను పిలిచి వారికి పరిచయం చేశారు నారాయణస్వామి. గురవయ్యను దూరంగా తీసికెళ్ళి ఏదో గుసగుస చెప్పాడు అచార్లు. తరవాత అచార్లు వెళ్ళిపోయాడు. తలవంచుకొని నిలుచున్న గురవయ్యను పిలిచారు స్వామి.
    గురవయ్య గుండె దడదడ లాడింది. స్వామి వైపు సాగి అడుగు ముందుకు వచ్చి నుంచున్నాడు కుంచించుకుని - ఏదో నేరం చేసిన వానివలె.
    "ఇవాళ్టి నుంచి హరికధ ఉన్నది. వినటానికి వస్తావా?"
    "నేనానుండి.....నేను."
    "అవును నువ్వే. పిచ్చమ్మను కూడా తీసుకొని రా - కధ బాగా చెప్పుతరట హరిదాసుగారు."
    "మంచిదుండి .....అట్లనేనుండి."
    "అట్లనే నుండి అంటే కాదు తప్పక రావాలే. నీకోసం మేము కాచుకొని ఉంటం, మీరోస్తేనే మేం బయల్దేరేది."
    "మంచిది వస్తాముండి"
    "శుచిగా శుభ్రంగా రావాలే."
    "వస్తాముండి వస్తం." ఉత్సాహంగా అని సాగిపోయాడు గురవయ్య. స్వామికి ఎందుకో చాలా సంతోషం కలిగింది.
    ఆ రాత్రి నాంచారమ్మ , నారాయణస్వామి త్వరగా భోజనాలు ముగించుకొని ఇంటికి తాళం వేసి, లాంతరుతో బల్ల పీట మీద కూర్చున్నారు.
    "ఇంకెందుకు కుచోటం - బయల్దేరక " నాంచారమ్మ అన్నది.
    "కాసేపు కూర్చో. గురవయ్య వస్తనన్నడు."
    "గురవయ్యే మోస్తడండి. ఎక్కడ్నో తాగి పడుంటడు. కధ మొదలు పెడతారేమో మనం పోదాం పాండి."
    "కాస్త కూర్చో చుతాం- పిచ్చిదానా గురవయ్య సంగతి తేలవాదే - మాటంటే తప్పుడు - ఎరికేనా?"
    "సరేలెండి" అని కూచున్నది నాంచారమ్మ - ఆమెకు మాత్రం గురవయ్య వస్తాడని నమ్మకం కలుగలేదు.
    "దండం పెడ్త- కాల్మొక్త" గురవయ్య పిచ్చమ్మ సహితంగా లోనికి వచ్చాడు. స్వామి దంపతులు వారిని చూచి ఆశ్చర్యపోయారు. గురవయ్య పొద్దుటి గురవయ్య కాడు. శుభ్రంగా ఉన్నాడు. స్నానం చేసి మంచి బట్టలు వేసుకున్నాడు. నొసట కుంకుమ మెరుస్తుంది. తాగిన జాడ ఎక్కడ కనిపించలేదు! పిచ్చమ్మ కూడా శుచిగా వచ్చింది. పూర్తిగా తడి ఆరని వెంట్రుకలు వదులు ముడి వేసుకుంది. ఉతికిన చీర కట్టుకుంది. నొసట కుంకుమ దిద్దుకుంది.

 Previous Page Next Page