Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 26


    వీడేం టైగర్ కృష్ణాజీనా? డబ్బుకి లొంగకపోవడానికి?


    పైసాలోనే పరమాత్మ వుంది. వీడికి నాలుగు పైసలు పారేస్తే వీడే కుక్కలాగా తోక వూపుకుంటూ తను చెప్పినట్లు చేస్తాడు.


    జేబులో చెయ్యి పెట్టాడు రాజా.


    పర్సు లేదు.


    ఏమయ్యింది?


    వెంటనే అతనికి తట్టింది.


    తనని కట్టేసే టైంలోనే తన తండ్రి తన పర్సు కొట్టేసి వుంటాడు.


    టిక్కెట్ కలెక్టర్ రాజా ముందే నిలబడ్డాడు.


    "టిక్కెట్?"


    "పోయింది" అన్నాడు రాజా తేలిగ్గా.


    టిక్కెట్ కలెక్టర్ తాగి వున్నాడు.


    నమ్మడం కష్టమే గానీ నిజం అదే!


    ఈ మధ్యే జరిగింది ఒక సంఘటన!


    తప్పతాగి వున్న ఒక టీ.సీ. టిక్కెట్ లేదన్న నెపం మీద ఒక స్త్రీనీ, పిల్లల్నీ కదులుతున్న రైల్లో నుంచి కిందికి తోసేశాడు.


    దారుణం జరిగిపోయింది.


    అలాంటి గతి తనకు పడుతుందేమోననిపించింది రాజాకి. ఇతను తోసేస్తే తను కింద పడడం కంటే తను దూకెయ్యడమే మంచిది.


    అలా అనిపించగానే, రేసు కుక్కలాగా లేచి, తలతో ఒక్కసారి టిక్కెట్ కలెక్టర్ కడుపులో పొడిచి, అడ్డంగా వున్న వాళ్ళని ఒడుపుగా తప్పించుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళిపోయి, ఆగి కొద్ది క్షణాలపాటు రైలు వేగాన్ని గమనించి, తర్వాత లాఘవంగా రైలు పరిగెడుతున్న వేపే దూకేశాడు.


    తాగి వున్న టిక్కెట్ కలెక్టర్ దెబ్బకి కిందపడి, మళ్ళీ లేవకుండా అట్లాగే మత్తుగా పడి వుండిపోయాడు.


    రైలు ట్రాక్ పక్కన వున్న కంకర రాళ్ళమీద పడిపోయి అలాగే వుండిపోయాడు రాజా. కొద్దిక్షణాల తర్వాత రైలు అతన్ని దాటేసి వెళ్ళిపోయింది.


    నెమ్మదిగా లేచి నిలుచున్నాడు రాజా.


    ఒళ్ళంతా నొప్పులుగా వుంది.


    చుట్టూతా చూశాడు.


    అప్పుడే చీకటి విరుగుతోంది. పల్చటి వెలుగు వ్యాపిస్తోంది.


    మోచేతి దగ్గర చల్లగా అనిపించింది.


    తడిమి చూసుకున్నాడు.


    జీన్సు మోకాళ్ళ దగ్గర చిరిగింది. అక్కడంతా రక్తం.


    తల పంకించి కుంటుతూ ముందుకు నడిచాడు రాజా.


    అలా నాలుగైదు కిలోమీటర్లు నడిచేసరికి దాదాపుగా తెల్లారిపోయింది. అక్కడక్కడ మనుషులు కనబడుతున్నారు.


    దగ్గర్లోనే ఏదో ఊరు ఉందని గ్రహించాడతను.


    అక్కడే కనబడింది చిన్న వాగు.


    అక్కడ ఆగి, బట్టలు విప్పి వాగులోకి దూకాడు రాజా.


    అలా అరగంట ఈదాక శరీరం పూర్తిగా స్వాధీనంలోకి వచ్చినట్లనిపించింది.

    
    ఈదగానే ఆకలి మొదలవుతోంది రాజాకి.


    ఒకవేళ ఊళ్ళోకి వెళ్ళినా జేబులో పైసా లేదు.


    పరగడుపునే ఎవరి జేబన్నా తడమాలి తను.


    అడుక్కు తినటం ఇష్టంలేదు తనకు!


    ఒళ్ళు ఆరాక బట్టలేసుకుని మళ్ళీ నడక మొదలెట్టాడతను.


    నలభై నిమిషాల తర్వాత ఊళ్ళోకి వచ్చాడు.


    అప్పుడు కనబడ్డాడు ఆయన....


    చూడడానికి అంతా ఆనందరావు మాస్టారిలాగే ఉన్నాడు. దాదాపు అదే వయసుంటుంది. ముతక ఖద్దరు పంచె, షర్టూ, ఉత్తరీయం, పొట్టిగా కత్తిరించబడిన వెంట్రుకలు పూర్తిగా తెల్లబడిపోయి వెండిలా మెరుస్తున్నాయి. మనిషి బక్కపలచగా  వుండటం వల్ల చకచక నడుస్తున్నాడు... కాళ్ళకి హవాయి చెప్పులు వున్నాయి.


    అతన్ని చూడగానే తిక్క కోపం వచ్చింది రాజాకి.


    ఆనందరావు మీద కలిగిన కసి అంతా ఈయన మీద తీర్చుకోవాలనిపించింది.


    చటుక్కున ఆయన పక్కన చేరిపోయాడు రాజా.


    పొరపాటున తగిలినట్లు ఆయనకి తగిలాడు.


    ఉహుఁ! లాభం లేదు.


    ఈయన దగ్గర పర్సేమీ లేదు.


    విడిగా నోట్లు కూడా ఉన్నట్లు లేవు.


    దానితో ఆయన మీద అకారణంగా కలిగిన కోపం పదింతలు పెరిగింది రాజాకి.


    "వీడికి టోకరా వెయ్యకుండా వదలకూడదు" అనుకుంటూ ఆయన వెనకే నడిచాడు రాజా. కోపంలో ఆకలి కూడా తెలియడం లేదు అతనికి.


    ఊరికి ఈ చివర నడక మొదలుపెట్టినవాడు, ఊరికి ఆ చివరిదాకా నడుస్తూనే వున్నాడు అయన. అక్కడొక చిన్న యింటి ముందు ఆగాడు.


    చిన్న పెంకుటిల్లు అది.


    అందులో సగం పడిపోయి ఉంది.


    మిగిలి ఉన్న భాగంలో ఆయన ఉంటున్నట్లున్నాడు.

 Previous Page Next Page