Previous Page Next Page 
జన్మభూమి పేజి 26

    "ఆ... మధ్య మధ్య మారుస్తాం. అప్పుడప్పుడు చేపల రంగు మారితే నీళ్ళు బాగాలేవనీ, యేదన్నా తెగులు సోకుతుందని అనిపించినప్పుడు ఆ నీళ్ళు తోడి కొత్త నీరు నింపుతాం."
    "ఏదన్నా జబ్బులు వస్తే"
    "ముందు నీళ్ళల్లో స్ప్రే చేస్తాం. దానాలో శ్రద్ధ తీసుకుంటాం...చేపలు చిన్నపిల్లలుగా వున్నప్పుడు నీళ్ళల్లో వదులుతాం. అవి కాస్త పెద్దవయ్యేవరకు కేవలం నూకలే వేస్తాం. తరువాత తవుడు, కోడి పెంట, నూకలు అన్నీ కలిపి పెడతాం."
    "పక్క చెరువులో చాలా నీళ్ళున్నాయి- మీ దానిలో చాలా తక్కువ నీళ్ళున్నాయి"
    "చేపలు పట్టాలని నిర్ణయించుకున్నాక వరుసగా మూడు రోజులలో చెరువుకి నీరు తోడి తగ్గిస్తాం వల వేయడానికి వీలుగా" వివరించారు చౌదరి.
    "ఏమాత్రం లోతుంటాయి ఈ చెరువులు"
    "ఆరు ఏడు అడుగులు తవ్వుతాం. గట్లంట యింకా ఎక్కువ లోతుంటుంది. మధ్యలో లోతు కాస్త తగ్గుతుంది."
    "ఇవన్నీ మీరు ఎలా తెల్సుకున్నారు?"    
    "ఏముంది మొదట్లో ఫిషనరీ డిపార్టుమెంటువారు ఎలా చెరువులు తవ్వాలి, ఏ టైములో హేచరీస్ నుంచి పిల్లలని చెరువులో వదలాలి, దానా ఏం వెయ్యాలి, ఎలా వేయాలి, చేప పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది అది చెప్పారు. యిప్పుడందరికీ ఎక్స్ పీరియన్స్ వచ్చేసింది."
    కొబ్బరిబోండాలు కొట్టి గాజుగ్లాసులలో పోసి తెచ్చాడు పాలేరు. "అబ్బ ఎంత తియ్యగా ఉన్నాయి" రాజేశ్వరి చల్లటి, తీయటి నీళ్ళు తాగుతూ మీకు తోటలు కూడా ఉన్నాయా, యేమిటి అది మామిడి తోటలా వుంది" అంటూ వెళ్ళి "అమ్మో, అప్పుడే మామిడి కాయలు దిగాయే" అంది చిన్నపిల్లలా సంబరంగా చూస్తూ.
    "నాలుగు కాయలు తెంపి అమ్మగారికియ్యరా. పచ్చడి బద్దలు పెట్టుకుంటారు" చౌదరిగారు పురమాయించారు.
    "థాంక్స్ చౌదరిగారూ! మీలాంటి వారంతా మంచి బిజినెస్ చేస్తూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ జిల్లాలలో ఆర్ధిక పురోభివృద్ధి సాధిస్తున్నారు. అంతా బాగుంది. మీరంతా యింత ఉన్నవారు అయి వుండి వూరి అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోలేదన్నదే నాకు కాస్త బాధగా వుంది."
    "ఆ పనులన్నీ మేంచేస్తే మరి మీలాంటి వారి గొప్పతనం ఏముందండి- అందరూ అన్నీ చేయలేరు డాక్టరుగారూ- దానికి మీలాంటి గొప్పవారే కావాలి" చమత్కారంగా అంటూ తప్పించుకున్నాడు.
    కారులో వస్తుంటే "మీరూ కొనకూడదూ చేపల చెరువు" రాజేశ్వరి అంది.
    "మనం డబ్బు చేసుకోవడానికి రాలేదు యిక్కడికి. చేసుకున్న డబ్బు ఖర్చు పెట్టడానికి వచ్చాం - యింకా ఎందుకు డబ్బు సంపాదించాలన్న యావ. అదలావుంచి డబ్బుకోసం పంట పొలాలన్నీ చేపల చెరువులుగా మార్చేస్తే రేపు తిండి గింజలు పండించేవారెవరు? ఇప్పటికే ఆహారధాన్యాల కొరత మనదేశంలో.
    "నిజమే మామయ్యా- అంతా వేలంవెర్రిగా ఈ చుట్టుపక్కల వూరినిండా పొలాలన్నీ చేపల చెరువులుగా మార్చేస్తే నీవన్న ఆలోచనే వచ్చి కాస్త భయమేసింది నాకు" అని అంతలోనే నవ్వి "నా దగ్గిర పెట్టుబడికి డబ్బు లేదు కనక నోరు మూసుకు కూర్చున్నాను. లేకపోతే నేనూ చేసేవాడినేమో" అన్నాడు. అంతా నవ్వారు.
                                                           *    *    *
    హైదరాబాదు నుంచి వస్తూనే శ్రీనివాస్ తండ్రి మీద ఎగిరాడు. "ఏమిటి నాన్నా కొంప మునిగినట్టు ఫోన్ చేసి రప్పించావు. ఈ వూర్లో నేనుండను. అది నీకు తెలిసీ మళ్ళీ ఇక్కడ వుద్యోగం చేద్దువుగాని రా" అంటావేమిటి. ఇంతకీ యిక్కడేం వుంది నాకోసం ఉద్యోగం. మీ జమా ఖర్చులు, పద్దులు రాయడమూ ఓ ఉద్యోగం అంటే, మీ మామయ్యకేదో పల్లెటూరి పిచ్చిపట్టుకుంటే అది నీకు పాకినట్లుంది" చిరాకుపడ్తూ ఎగిరాడు.
    "వరేయ్, నోరు మూసుకుని కాస్త నేచెప్పింది విను. ఏడాదిగా హైదరాబాదు వెళ్ళి ఏం సాధించావురా. చెల్లెలి ఇంట్లో కూర్చున్నావు. ఏం ఉద్యోగం వచ్చింది నీకు. యిక్కడయితే వున్న వూరు, మామయ్య మొత్తం మనీ మేటర్స్ అంతా నీవు చూసేట్టు జీతం యిచ్చి పెట్టుకుంటానన్నాడు. ఎనిమిది వందలో, వెయ్యో యిస్తాడు. సిటీలో నీకు ఉద్యోగం వచ్చినా వేలకి వేలు రావు. రూము అద్దెకే నీ జీతం సగం అవుతుంది. యింకేం తింటావు. అదే ఉన్న వూరయితే..."
    "అక్కడుంటే అవకాశాలు ఎక్కువ - ఇక్కడుండి యిలా లెక్కలు పద్దులు రాసుకుంటూనే బతుకంతా గడపమనా నీ ఉద్దేశం" ఉక్రోషంగా అన్నాడు.
    "ఏం గడిపితే వచ్చిన నష్టం. ముందు మామయ్య దగ్గిర నమ్మకంగా వుండు. నేనూ పెద్దవాడినవుతున్నాను. నా తర్వాత పొలాలు చూసుకో. మామయ్య చేపట్టే పనులన్నింటికీ చేదోడు వాదోడుగా వుండు. యింటిపట్టున ఉండి తిను. ఆయన ఇచ్చే జీతం దాచుకో. నాకేం అక్కరలేదు. ఇంతకంటే తమరు తమ బి.కాం. డిగ్రీతో ఎంత పెద్ద పదవులలంకరిస్తారో..."   
    "బ్యాంక్ పరీక్ష రాశాను. వస్తుంది..." నమ్మకంగా అన్నాడు.
    "వచ్చినప్పుడు సరే. అప్పటివరకు ఉండు. నీకు మంచి ఉద్యోగం వస్తే నీ భవిష్యత్తు పాడుచేసుకోమని ఎవరూ అనరు" తండ్రి అలా అన్నాక ఇంకా అనడానికి ఏమీ కనపడక అప్పటికి వూరుకున్నాడు శ్రీనివాస్.
    "వరేయ్ వాసూ, ఇప్పుడు మన వూరు మారిపోయిందిరా. బాబాయిగారు వచ్చి ఎన్ని మంచిపనులు తలపెడ్తున్నారో తెలుసా. ఆయన విదేశాలనుంచి అన్నీ వదులుకుని ఈ గ్రామంలో ఉండడానికి సిద్ధపడి వుంటున్నప్పుడు ఇక్కడ పుట్టి పెరిగిన మనం ఈ వెధవపల్లెల్లో వుండడం అనడం ఏమిటి. పట్టణాలు వెళ్ళి బావుకున్నదేమున్నది. ఎనిమిది నెలలుగా అక్కడ కూర్చున్నావు. ఏం సాధించావురా. హాయిగా ఇంటిపట్టున ఉండు. బాబాయిగారికి చేదోడువాదోడుగా వుండు. నాన్నగారితోపాటు పొలం చూసుకో..." సుగుణ కూడా కొడుక్కి నచ్చచెప్పింది. బస్ దిగి వస్తుంటే వూరంతా చక్కటి రోడ్లు చూసి ఆశ్చర్యపోయాడు.
    డాక్టరు బాబు వచ్చ ఈ రోడ్లన్నీ వేయించారు. అందరం కల్సి వేశాం. వూర్లో వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యపోయాడు. గత ఇరవై మూడేళ్ళుగా పెరిగిన వూరు మూడు నాలుగు నెలల్లో మారిపోయిందంటే అబ్బురమని అన్పించింది. ఇప్పుడు తల్లిదండ్రి అందరూ చెప్తుంటే సరే బ్యాంక్ ఉద్యోగము వస్తే చూసుకోవచ్చు. అంతవరకు వుందాం అన్న నిశ్చయానికి వచ్చాడు.
    సాయంత్రం కొడుకుని వెంటపెట్టుకుని కేశవరావు దగ్గరికి తీసుకువచ్చాడు రంగా. "మామయ్యా మా శ్రీనివాస్ వూర్నించి వచ్చాడు ఇదిగో వీడే మామయ్య. అసలు నీవు చూడలేదులే ఎప్పుడూ... నమస్కారం చెయ్యి అన్నాడు రంగా.
    "ఓ శ్రీనివాస్ అంటే వాసు అంటారుగా మీరంతా. ఊ... స్మార్ట్ గై... రా యిలా కూర్చో. నేన్నీకు ఏమవుతాను చెప్మా. మీ నాన్నకి మామయ్య అంటే నీకు తాత అన్నమాట" అంటూ నవ్వి భుజం తట్టారు. తాత అనకు మరీ ఏమిటోలా వుంటుంది నాకు ఇంత పెద్ద మనవడంటే. అంకుల్ అను... యూనివర్శల్ అంకుల్-"
    "అంటే పాపం తాతా అన్పించుకోకుండా అంకుల్ పదవిలో వుందామని గాబోలు. మరేం ఫరవాలేదు తాతయ్యా అను" రాజేశ్వరి హాస్యంగా అంది.

 Previous Page Next Page