Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 26


    "ఓ పని చేద్దామే వందనా! తిరిగి తిరిగి ఇప్పటికే చాలా ఆలసిపోయాం. 'పార్క్ లో ఇంక వుండకూడదు...వెళ్ళిపొమ్మని' చెప్పడం కూడా జరిగింది. ఇంక నడిచే ప్రసక్తి లేదు కాబట్టి బస్సందితే బస్సు లేకపోతే ఆటోలు చేసుకొని హోటల్ కి వెళదాం. రేపు ఉదయం వచ్చి సాయంత్రందాకా ఈ పార్క్ లోనే తిరిగి పార్క్ మొత్తం చూసి మళ్ళీ రాత్రికి మన గూటికి చేరదాం. అవతల చీకటి పడుతున్నది. ఇంకా మనం లేచి బయల్దేరటం మంచిది" రాణి అంది.


    నలుగురు లేచి రెండడుగులు వేశారో లేదో..."రక్షించండి...రక్షించండి" అన్న ఒక స్త్రీ కంఠం వినిపించింది.


    "రక్షించండి" అన్న మాట కాస్త దగ్గరగానే విన వచ్చింది. ఆ స్త్రీ ఎటువంటి ఆపదలో ఉందో తెలియదు...చుట్టుపక్కల వీరు తప్ప మరో మనిషి లేరు. "వెళ్ళి అదేమిటో చూడాలా! కాళ్ళకి బుద్ధి చెప్పాలా" క్షణకాలం ఆలోచించి...ధైర్యం చిక్కబట్టుకుని అరుపు వినిపించినవైపు వేగంగా కదిలారు.


    నాలుగైదు పెద్ద చెట్లు దాటంగానే వాళ్ళకో దృశ్యం కనబడింది. అక్కడో స్త్రీ వుంది. ఆమె పమిట పట్టుకు లాగుతున్నాడు. వాడు బలంగా, గుండులా ఉన్నాడు. అయినా వీళ్ళని చూసేసరికి ఎవరో తరుముతున్నట్టే ఆమెని వదిలేసి కాళ్ళకి బుద్ధి చెప్పాడు.


    "వాడెవడో మన్నిచూసి పారిపోతున్నాడే! పరిగెత్తికెళ్ళి పట్టుకుందామా" సుందర సుకుమారి అడిగింది.


    ఆమె పరుగున వీళ్ళ దగ్గరకి వచ్చింది. "మీరు వాడి వెనక వెళ్ళకండి, పొడిచి చంపినా చంపుతాడు" వణుకుతున్న స్వరంతో చెప్పింది ఆమె." వాడి దగ్గర జానెడు పొడవున్న కత్తి కూడా వున్నట్టు చెప్పింది.


    "కత్తా! నా కాళ్ళు ఒణుకుతున్నాయ్. ఏం చేద్దామే వందనా భయం భయంగా అడిగింది ప్రమద.


    "వాడి దగ్గర కత్తి వుంటే నిన్ను పొడవలేదుకదా" సుందర సుకుమారి అడిగింది.


    "ఒక్కక్షణం మీరంతా ఆగండే. నన్ను మాట్లాడనివ్వండి" అని చెప్పి ఆమె వైపు చూస్తూ "చూడమ్మా! మీరెవరు? వాడెవరు? మీ కట్టు బొట్టు చూస్తుంటే మా ఆంధ్రుల ఆడపడుచులా వున్నారు. విషయమేమిటి?" వందనాదేవి అడిగింది.


    "అంతా వివరంగా చెబుతానమ్మా! ముందు ఇక్కడ్నించి బైటికెళదాం. ఆ రౌడీ వెధవ మరో నలుగుర్నేసుకొని మళ్ళీ వచ్చినా వస్తాడు. తెల్లారిలేచి ఎవరి మొహం చూశానో! నా ఖర్మ కాలింది ఏ మూలో కాస్త అదృష్టం వుండబట్టి సమయానికి మీరు వచ్చారు. లేకపోతే ఆ రౌడీ చేతిలో...' అంటూ పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంది ఆమె.


    "నిజమే...ఇక్కడుండటం ప్రమాదానికి దారితియ్యొచ్చు పదండి" అని వందన చెప్పడంతో ఆమెతో కల్సి అందరూ పార్క్ బయటికొచ్చారు.


    పార్క్ నించి బయటికి రాంగానే తలో కూల్ డ్రింకు తాగారు. ఆమెకి కూడా ఇప్పించారు. "అసలేం జరిగిందో చెప్పమ్మా!" అని అప్పుడడిగింది వందన.


    "నా పేరు మహాలక్ష్మి. నన్ను అందరు 'లక్ష్మి! లక్ష్మి!' అని పిలుస్తుంటారు. నేను మా ఆయన యాత్రలకని బయల్దేరి అన్ని ఊళ్ళు చూసుకుంటూ ఇదిగో ఈ బెంగుళూరు వచ్చి ఆగాం. వారు, నేనూ మధ్యాహ్నం ఒక బస్సు ఎక్కాం. ఒకచోట నేను బస్సు దిగాను వారింకా బస్సు దిగనేలేదు. ఈ లోపల బస్సు ఎక్కేవాళ్ళు...దిగేవాళ్ళు కొందరు అడ్డు వచ్చారు...వారు బస్సు దిగనేలేదు...బస్సు బయల్దేరి వెళ్ళిపోయింది...


    ఆమె చెప్పింది సరీగా అర్థంకాలేదు వందనకి. "అదేమిటి?" అంది.


    "ఏం చెప్పమంటారు? బస్సు ఎక్కితేచాలు వారికి నిద్ర ముంచుకు వస్తుంది. అయిదో స్టాపులో మనం దిగాలి...బస్సు ఆగినప్పుడల్లా నువ్వు లెక్కబెడుతుండు...అయిదో స్టాప్ రాంగానే నన్ను నిద్రలేపు అని చెప్పి గుర్రు పెడుతూ పడుకొన్నారు. లెక్కబెడుతుంటే అయిదో స్టాపు వచ్చింది. "లేవండి" అని వారిని కుదిపి మరీ చెప్పాను. వారు దిగుతారుకదాని నేను గబగబా దిగాను. మనుషులు అడ్డం వున్నారు కాబట్టి ఇంకా వారు దిగలేదు" అని అనుకుంటూ వున్నానో లేదో బస్సు తుర్రుమంది.


    "ఆపై మీరేం చేశారు? అరిచారా?" సుందర సుకుమారి అడిగింది.


    "సరీగ్గా ఆపనే చేశాను. నాకు ఏ భాషలు వచ్చిచావవు. అంతలో నా చుట్టూ మూగి ఇంగ్లీషులో ఒకడు...హిందీలో ఒకడు...కన్నడంలో పదిమంది...ఏమిటేమిటో గందరగోళంగా అడిగారు.


    "మాది అనకాపల్లి అని...నేను, ఆయనా బస్సు ఎక్కడం మొదలు...నేను బస్సు దిగేవరకు తెలుగులో వివరంగా చెప్పాను సమయానికి...


    "ఊ...సమయానికి ఏమైంది?" ఆతృతగాఅడిగింది ప్రమద.


    "ఒక తెలుగువాడు వచ్చాడు...ఇందాక మిమ్మల్ని చూసి పారిపోయాడే...వాడన్నమాట. వాడు నాతో తెలుగులో మాట్లాడుతూ "నేను యాత్రలకని వచ్చాను...తెలుగువాడిని...మీరెక్కిన బస్సు ఈ పార్కు చుట్టూ తిరిగి అటు వస్తుంది. చుట్టూ తిరిగి రావడానికి పావుగంట పైనే పడుతుంది. పార్క్ లోంచి అడ్డదారిన అటు వెళితే ఆ బస్సును పట్టుకోవడం తేలిక. కావాలంటే దారి చూపిస్తాను రండి" అన్నాడు.


    అప్పుడు నాకే ఆలోచనా రాలేదు ఎర్రిమొహాన్ని. ఆ గాభరాలో వాడి మాటలు నమ్మాను." చెప్పింది లక్ష్మి పేరుగల ఆమె.

 Previous Page Next Page