Previous Page Next Page 
నా జీవితం నీ కౌగిలిలో పేజి 26


    "మీరు చెప్పినట్లుగా వెళ్ళి చూశానమ్మా! ఏం రోగం లేదు. ఏదో నలతగా వుందంతే."

 

    ప్రక్కనే పరధ్యానంగా నిలబడున్న భుజంగరావు-

 

    ఆంజనేయులు గదిలోకెళ్ళిన అమ్మాయెవరని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

 

    "ఏవండీ! మీరు కూడా తయారవండి. ఇద్దరం వెళ్ళి కల్సికట్టుగా వాళ్ళని చూసొద్దాం. అమ్మాయి ఆనందిస్తుంది" తను వంటగదిలో కెళుతూ అంది భువనేశ్వరి.

 

    "ఆంటీగారు అమ్మాయిని చూడడానికి వచ్చేలోపే ఇక్కడ నుంచి ఉడాయిస్తే మంచిది... లేకపోతే... యిక్కడున్న మేరీని చూసేస్తుంది... మన అసలు రంగు బైటపడిపోతుంది" బాత్ రూం వేపెళుతున్న ఆంజనేయులికి సలహా యిచ్చాడు ఆనందం.

 

    "మేరీగారూ! ఇఫ్ యూ డోంట్ మైండ్... మీరు ముందు వెళ్ళి రోడ్డు మీద నిల్చోండి. నేను... మా ఆంటీగారికి చెప్పొచ్చేస్తాను..." అని అన్నాడు.

 

    మేరీ వెళ్ళిపోగానే...

 

    ఆంజనేయులు గబుక్కున బిల్డింగ్ వేపు పరుగెత్తాడు.

 

    "ఆంటీ... ఆంటీగారూ"

 

    "ఏం బాబూ?" కిచెన్ లోంచి వచ్చిందావిడ.

 

    "ఆంటీ... నేనూ, తరణి బైటకెళుతున్నాం. మా ఆఫీసులో అందరికీ పరిచయం చెయ్యాలి కదా!"

 

    "ఇప్పటివరకూ పడుకుందిగదా, లేవలేదన్నావ్?" ఏదో అనబోయింది భువనేశ్వరి.

 

    "పడుకుంటే పడుకోవాలనే ఉంటుందని నేనే లేపి స్నానం చేయించాను" కోతలు కోశాడు ఆంజనేయులు.

 

    "అలాంటి విషయాలు పెద్దవాళ్ళతో చెప్తారటయ్యా? ఇద్దరూ బైటకి బయలుదేరారంటావ్. ఏదీ అమ్మాయ్...?" అంటూ హాల్లోకొచ్చింది భువనేశ్వరి.

 

    దాని కోసమే ఎదురు చూస్తున్న ఆంజనేయులు...

 

    "ఆంటీ! అదిగో... ఆ గేటు దగ్గర... పువ్వుల పువ్వుల చీర... అదే" గబగబా పరుగెత్తి వెళ్ళిపోయాడు ఆంజనేయులు.

 

    "పిల్లని తెచ్చి చూపించాలంటే సిగ్గుపడుతున్నాడు కదండీ." నవ్వుతూ అంది భర్తతో భువనేశ్వరి.

 

    ఆయన మొహం తాటిటెంకలా పెట్టుకుని చూశాడు భార్య వేపు.

 

    లవ్ ఎఫైర్స్ గాని, పెళ్ళీ పెటాకులు గానీ లేవన్నాడు తనతో. కానీ యీ అమ్మాయెవరు? రోడ్డున పోయే ప్రతీ అమ్మాయీ రూమ్ కి రాదు కదూ! రూమ్ కొచ్చిందంటే... ఏదో కథ నడుస్తున్నమాటేగా?

 

    ఎవరో అమ్మాయితో ఈ ఆంజనేయులుగాడు కధ నడిపితే, తన కూతురు వ్యవహారంలో తనని ముంచేస్తాడన్న మాట...

 

    అంచేత వీడిని, ఆ అమ్మాయిని విడగొట్టాలి. తప్పదు... ఇంతకూ ఆ అమ్మాయెవరో కనుక్కోవడం ఎలాగ?

 

    తనకు డిటెక్టివ్ పని చెయ్యడం సరదాయే కానీ తను రోడ్డు మీద కెళ్తే మళ్ళీ వెనక్కి తిరిగి రాలేడు.

 

    అంచేత దీనికోసం ఎవర్నయినా డిటెక్టివ్ పనికి వినియోగించాలి.

 

    అందుకు ఎవడు సమర్ధుడు?

 

    తటాలున భుజంగరావుకి పక్కింటి కేసుల్లేని లాయర్ జిగురు మూర్తి జ్ఞాపకానికొచ్చాడు.

 

    వాడు తనకో కేసిమ్మని కాళ్ళరిగేలా తిరిగాడు. ఇప్పుడు దొరికింది సరయిన కేసు.

 

    "ఒరే అప్పల్రావుడూ" అని కేకేశాడు.

 

    అప్పల్రావుడంటే ఇంట్లో పనివాడు. వాడు కొంచెం దూరంలోనే నిలబడి అంతా గమనిస్తున్నాడు.

 

    "వెళ్ళి అర్జంటుగా పక్కింటి లాయర్ని తీసుకురా" అని కేకేశాడు.

 

    "అమ్మగారితో విడాకులు తీసుకుంటారండయ్యా?" అనుమానంగా అడిగాడు వాడు.

 

    "ముందు తీసుకురారా బడుద్దాయ్..." అంతెత్తు ఎగిరాడు భుజంగరావు.

 

    పరుగు పరుగున అక్కడ నుంచి పరుగెత్తాడు అప్పల్రావుడు.


                            *    *    *    *


    "అసలేవిటండీ ఇదంతా?" దారిలో అడిగింది మేరీ.

 

    "అసలేవిటో ఎప్పుడయినా చెప్తాగానీ, ముందు నాకో విషయం చెప్పండి ముందు. ఉదయాన్నే మా యింటికి రాగల కారణంబేమి? ఇంటడ్రసెలా దొరికిందో చెప్పండి?"

 

    "మనసుంటే మార్గం వుండదా?"


    
    "మార్గం ఉంటే కనుక్కొని వచ్చేయ్యడమేనా?" అని చిరాకుపడబోతుండగా.

 

    "ఆవిడ మీదెందుకురా కోపం?" అన్నాడు ఆనందం.

 

    "అలా గడ్డి పెట్టండి మీ ఫ్రెండుకి" నవ్వుతూ అంది మేరీ.

 

    క్రాస్ రోడ్స్ లోని హోటల్లో టిఫిన్ చేశాక-

 

    "మళ్ళీ మనం ఉద్యోగం వేటలో పడుతున్నాం. సాయంత్రం ఐదు గంటలకి మీ ఆఫీసు దగ్గరుంటాను" అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆనందం.

 

    మేరీకి వారి సంభాషణ అర్ధంకాక పిచ్చిదానిలా చూసింది.


                                                      *    *    *    *


    అసిస్టెంటు సుబ్రమణ్యం రెండు ఫైల్స్ వెనక పట్టుకొని రాగా లాయర్ జిగురుమూర్తి గేటు లోపలకు అడుగుపెట్టాడు.

 

    వరండాలో కూర్చుని కాళ్ళూపుకుంటున్న భుజంగరావుని చూసి విష్ చేసి-

 

    "ఎన్నాళ్ళకు మా మీద దయకలిగింది. కబురు పెట్టార్ట! కేసేమిటో చెప్పండి. విడాకులా... మనోవర్తా, ఇంటి గోడా, పోలీస్ కేసా, లేక..." అని ఆగి-

 

    "ప్రస్తుతానికి వాటికి సంబంధించిన ఫైల్సే తెచ్చాను. వాటిలో ఏదో ఒక కేసు ఖరారు చేసి చెప్పేస్తే గనక... ఆ కోడ్ లు నేను కంఠస్థం చేసుకుంటాను."

 

    అలా గడగడా వాగిన లాయర్ వేపు సీరియస్ గా చూసి-

 

    "చూడండి మిస్టర్ జిగురుమూర్తీ! నీకు నీలా టైమ్ వేస్ట్ చేయడం యిష్టం వుండదు. అవునా?"

 

    "అవునండీ"  

 

    "అందుకే డైరెక్టుగా పాయింట్లో కొచ్చేస్తున్నాను. విను... నీకు నేనప్పగించేది ఓ డిటెక్టివ్ కేసు... టేకప్ చెయ్యగలవా?"

 

    "నేను పేరుకే లాయర్ని! కానీ తమకు తెలుసో తెలీదో గానీ... నాకన్ని విద్యలూ తెలుసు. టెన్నిస్ ఆడమంటారా? ఆడేస్తాను. లాంగ్ జంప్ చెయ్యమంటారా? చేసేస్తాను. అలాగే డిటెక్టివ్ పని. అస్సలు డిటెక్టివ్ లంటే ఎవరో కాదు... తమకు తెలిసే వుంటుంది..." అని ఆగాడు లాయర్.

 Previous Page Next Page