జైలు పూలతోటలో పూసే పూలను ఏ రోజు కారోజు బయట అమ్ముతుంటారు.
ఆ రోజు ఎప్పటిలాగే ఖైదీలు కొందరు పూలతోటలో పనిచేస్తున్నారు. వారిలో వివేక్, రామదాసు కూడా వున్నారు.
రామదాసు ఫిజికల్లీ హేండీకేప్ట్ కనుక గార్డ్స్ అతను పని చేయకపోయినా అంతగా పట్టించుకోరు. పైగా బాగా డబ్బున్న ఖైదీ అనే విషయం ఎలాగూ తెలుసు.
అగ్రికల్చరల్ మినిస్టర్ జస్వంతరావు కుడిభుజమైన భవానీ మనుషులు ముగ్గురు ఆ రోజు ఉదయమే 7.30కి జైల్లోకి ప్రవేశించారు.
వాళ్ళపని, రామదాసు అనారోగ్యంతో చనిపోయేలోపు అతన్ని నయానో, భయానో మచ్చిక చేసుకొని-లేదా థర్డ్ డిగ్రీ ప్రయోగించయినా అతను యాభైలక్షల్ని ఎక్కడ బరీడ్ చేసిందీ తెలుసుకుని భవానీకి చెప్పాలి. భవాని ఆ విషయాన్ని జస్వంతరావుకి చెప్పాలి.
చెప్పేలోపే రామదాసు చనిపోతే ఆ యాభై లక్షలు శాశ్వతంగా సమాధయిపోతాయని, రామదాసు అనారోగ్యం గురించి తెలుసుకున్నరోజు నుంచే ఆందోళన చెందుతున్నాడు జస్వంతరావు.
రామదాసు శిష్యుడు కిట్టూ ఊహ నిజమైంది. ముగ్గురు గూండాలు తనకోసమే జైలుకొచ్చినట్లు రామదాసుకి ఉదయం ఎనిమిది గంటలకే తెలిసిపోయింది. అయినా అతనికో ధైర్యం వుంది. ఏం చేసినా తనను చంపరని. ఒకవేళ తనను చంపితే నిధి రహస్యం శాశ్వతంగా మరుగున పడిపోతుందని వారికి తెలుసని రామదాసుకీ తెలుసు.
వివేక్ తీవ్రంగా ఆలోచిస్తూనే పూలమొక్కల కుదుళ్ళను పైపైన కదిలించి, చేతిసంచిలో వున్న కంపోస్ట్ ఎరువుని కొద్దికొద్దిగా జల్లుతున్నాడు.
రామదాసు మడిగట్టు మీద కూర్చుని ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
అక్కడ ఐదారుగురికి మించి ఖైదీలు లేరు.
వాళ్ళ పర్యవేక్షణకు ఒకే ఒక్క గార్డ్ వున్నాడు.
సరిగ్గా తొమ్మిది గంటలకు భవానీ గూండాలు యధేచ్చగా జైలంతా వెతుక్కుంటూ పూలతోట దగ్గరకు వచ్చారు.
"మేం నీ కోసమే వచ్చాం....సొద అనవసరం. మమ్మల్ని మా బాస్ భవానీ పంపించారు. బ్యాంక్ లో దోచిన సొమ్ము యాభైలక్షలు ఎక్కడ దాచావ్? అది త్వరగా చెప్పేస్తే కామ్ గా వెళ్ళిపోతాం" ముగ్గురిలో ఒకరు అన్నారు.
రామదాసు చిరునవ్వు నవ్వాడు.
"లేదంటే మా ప్రయత్నం మేం చేయవలసి వుంటుంది" మరొకరు అన్నారు.
ముగ్గురు కొత్తవాళ్ళు రావటం, రామదాసుని బెదిరించటం, రామదాసు సమాధానం యివ్వకుండా నవ్వటం అంతా చూస్తూనే వున్నాడు వివేక్ ఉత్కంఠతో.
"మర్యాదగా చెప్పు! లేదంటే చచ్చిపోతావ్...." మూడో ఖైదీ అన్నాడు.
ఆ గొడవ చూసి వున్న ఒక గార్డ్ తనేమీ చూడనట్లు పక్కకెళ్ళిపోయాడు.
"మీలాంటి బచ్చాల్ని ఎందర్ని చూసుంటాను....? నా ప్రాణం తీసినా నేను చెప్పను. మీ యిష్టమొచ్చింది చేసుకోండి" అన్నాడు రామదాసు కావాలనే.
* * * *
రామదాసు తలచుకుంటే నాయుడు సహాయంతో రక్షణ ఏర్పాట్లు చేసుకోగలడు.
కావాలనే చేసుకోలేదు.
వాళ్ళు తననెలాగూ చంపరు.
వాళ్ళని రెచ్చగొట్టి తన మీదకు వచ్చేలా చేసుకుంటే వాళ్ళు తనని గాయపర్చటం ఖాయం. అది చూసన్నా వివేక్ రెచ్చిపోతాడేమో చూడాలనే అలా ప్రవర్తించాడు రామదాసు.
వాళ్ళలో మొదటివాడికి కోపం వచ్చింది. అంతే! ఆ మరుక్షణం వాడు రామదాసుమీద ఎటాక్ చేస్తూ రామదాసు కడుపులో గుద్దాడు. ఎంత కాలు లేనివాడైనా ఆ దెబ్బని కాచుకోలేనివాడేం కాదు రామదాసు. కానీ కావాలనే అడ్డుకోలేదు. పైగా బాధని నటిస్తూ "అమ్మా" అని అన్నాడు.
వివేక్ అలర్ట్ అయిపోయాడు.
రెండోవాడు ఆవేశంగా వచ్చి రామదాసుని తన్నాడు. ఆ దెబ్బకు రామదాసు ఎగిరి అవతలపడ్డాడు.
వివేక్ చేస్తున్న పనాపి, లేచి నిలబడి పిడికిళ్ళు బిగించాడు.
కిందపడున్న రామదాసుని మూడో ఖైదీ ఎగిరితన్నాడు. దాంతో రామదాసు కొంతదూరం దొర్లుకుంటూ వెళ్ళిపోయాడు.
అప్పటికే రామదాసు ఖైదీ డ్రస్ చినిగిపోయి, నోటి వెంట రక్తం వస్తోంది.
ఆ అన్యాయాన్ని ప్రతిఘటించాలనుకున్నాడు అతను. అంతే మరేమాత్రం ఆలస్యం చేయలేదు.
మొదటి ఖైదీ తిరిగి ఎటాక్ కి సిద్ధమవుతుండగా జరిగిందా సంఘటన.
"బాస్టర్డ్స్" అంటూ వివేక్ తనకే తెలీని శక్తితో గాల్లోకి డైవ్ చేసి ఎగిరి వాళ్ళమీద పడ్డాడు.
జరిగిందేమిటో తెలుసుకునేలోపు పిచ్చి బలంతో ఉన్మాదిలా వాళ్ళ ముగ్గుర్నీ చితకబాదేశాడు వివేక్.
దాంతో నేలకరిచిన ఆ ఖైదీలే కాదు, రామదాసు కూడా అచేతనుడయిపోయాడు.
వివేక్ లో నిజంగా అంత బలముందా?! నేలకరిచిన వాళ్ళను లేపి లేపి కొడుతుంటే వాళ్ళు భీతావహులై కేకలు పెట్టసాగారు. ఆ కేకల్ని విన్న గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి....
"ఏయ్....ఏంటది....నీ గురించి జైలర్ కి కంప్లయింట్ చేస్తాను. వాళ్ళను వదిలేయ్" అంటూ అరిచాడు.
వివేక్ వాళ్ళను కొట్టడమాపి గార్డువైపు తీక్షణంగా చూస్తూ....
"కంప్లయింట్ చేస్తావా? చెయ్ చూస్తాను- వీళ్ళు రామదాసుని కొడుతుంటే చూస్తూ వూరుకున్నావని నేనూ కంప్లయింట్ చేస్తాను" అంటూ హుంకరించాడు వివేక్.
చాల రోజుల్నుంచి అతన్ని చూస్తున్న ఆ గార్డు, అతనిలో వచ్చిన మార్పును గమనించి నిర్ఘాంతపోయాడు.
అప్పటికే ఆ ముగ్గురు ఖైదీలు ప్రాణభీతితో అక్కడ నుంచి పరిగెత్తుకుపోయారు.
వివేక్ వడివడిగా రామదాసుని లేపి, నోటివెంట నుంచి వస్తున్న రక్తాన్ని తుడిచి....
"ఇక నేనాలోచించుకునేదేంలేదు....నేనన్నిటికీ సిద్ధమే. నా శత్రువుల్నీ, మీ శత్రువునీ చంపేవరకు నిద్రపోను. కమాన్....స్టార్ట్ ది ట్రయినింగ్ - అదెంత కష్టమైనదయినా భరిస్తాను. ఆరంభించండి" అన్నాడు పేలడానికి సిద్ధంగా వున్న డైనమేట్ లా.
రామదాసు కళ్ళలో మెరుపు.
లేచి ఒళ్ళు దులుపుకుని ఒకసారి ఒళ్ళు విరుచుకుని నలువైపులకూ చూసి, మడిగట్టు మీద కూర్చున్నాడు.
"నేనొకవేళ మన పగా, ప్రతీకారాల్ని తీర్చుకునేందుకు బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు మీ మీద ఎటాక్ చేస్తే?" వివేక్ ఆందోళన వెలిబుచ్చుతూ అన్నాడు.
రామదాసు ఆనందోద్వేగంతో వివేక్ కేసి చూశాడు. "శెభాష్.... నువ్వు ఇంకొకర్ని ముగ్గురు రౌడీలనుంచయినా కాపాడగలవన్న నమ్మకాన్ని ప్రోదిచేసుకున్నావ్. నా మీద నీకున్న ఆదరాభిమానాల్ని కూడా ఆ మాటల ద్వారా వ్యక్తం చేశావ్. థాంక్యూ....థాంక్యూ వెరీమచ్....దాని గురించి నువ్వేం ఆందోళన చెందకు. ఈ అవిటికాలితో సయితం నేను తలచుకుంటే ఆ ముగ్గుర్నీ మట్టికరిపించగలను. నీ శక్తి నీకు తెలీడానికే నేను మిన్నకుండిపోయాను.
నాకు యాభయ్ సంవత్సరాల రౌడీగిరి అనుభవముంది. ఈ శరీరం ఉక్కు. ఎన్నో ఆటుపోటులకు తట్టుకుని నిలిచింది. నా శరీరం నన్ను మోసం చేయదు.
అయినా ఈ రోజే వాళ్ళను నాయుడి దృష్టికి తీసుకెళతాను. మిగతాది నాయుడు చూసుకుంటాడు. రేపీపాటికి వాళ్ళ శరీరాల్ని హోనం చేసి వదిలేస్తాడు నాయుడు.
నా గురించి వర్రీ అవకు. మన ఆపరేషన్ మీద నీ దృష్టిని కేంద్రికరించు.
నీ ఉరెప్పుడు ధృవీకరించబడుతుందో....మృత్యువు కేన్సర్ రూపములో నన్నెప్పుడు కబళిస్తుందో తెలీదు గనుక మనకు అట్టే టైంలేదు.... కమాన్ మూవ్...."
అంటూ ఉద్వేగంతో లేచి నుంచున్నాడు.
వివేక్ సర్వశక్తుల్ని కూడదీసుకుని నాడీమండలాన్ని తన అదుపులోకి తీసుకుని ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా అకస్మాత్తుగా రామదాసు వివేక్ మీద ఎటాక్ చేశాడు.
చేస్తూనే "కాసుకో" అన్నాడు పెద్దగా. ఆ అనూహ్యమైన పరిణామాన్ని వూహించని వివేక్ క్షణాల్లో తేరుకుని, అదీ ట్రయినింగ్ లో ఒక భాగమే అని అనుకుని తనూ ప్రిపేరయిపోయాడు.
క్షణాల్లోనే ఆ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరాటం ఆరంభమయిపోయింది.
అరగంట పోరాటం తర్వాత ఇద్దరూ అలసిపోయి కింద కూలబడిపోయి, ఒకరికేసి ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.
"మీ అంచనాల మేరకు ఎన్ని రోజుల్లో సిద్ధం కాగలను?" అడిగాడు వివేక్ నుదుటి మీద పట్టిన చెమటను తుడుచుకుంటూ.
"అది నీ ఏకాగ్రత మీద, పట్టుదల మీద ఆధారపడుంటుంది. వారములో సిద్ధం కావొచ్చు. లేదా నెల పట్టవచ్చు" ఆయాసాన్ని అణుచుకుంటూ అన్నాడు రామదాసు.