ఆ జాలి మనుషుల్లో దాదాపు ముప్ఫయ్ అయిదువేల సంవత్సరాల క్రితం "మతం" అనే భావం రూపు దిద్దుకోవటం మొదలెట్టిందని చెబుతారు.
ఆ మత విశ్వాసానికి గుర్తులే సగం నరుక్కున వేళ్ళు.
వేళ్ళు అలా నరుక్కుంటే వేటలో విజయం కలుగుతుందని నమ్మే వాళ్ళు వారు.
అటువంటి నరవానరాలని పోలిన మనుషులు అక్కడక్కడ బతికే ఉండవచ్చునని కొందరి నమ్మకము.
దీన్నిబట్టి ఆలోచిస్తే, ఇందాక సింగ్ చూసిన ఆకారం అలాంటి ఆదిమానవుడిదే అయి ఉండవచ్చా?
కానీ, గుహ మొదట్లో కనబడ్డ ఆ రెండు అస్థిపంజరాలు మరీ పురాతనమైనవి కావు.
అవి ఎవరివై ఉంటాయి?
ఉన్నట్లుండి, చాలామంది స్త్రీలు సామూహికంగా రోదిస్తున్నట్లు వినబడింది సాగర్ కి.
ఉల్లిక్కిపడ్డాడు సింగ్.
నిశ్చలంగా నిలబడి వున్నాడు సాగర్. చాలామంది స్త్రీలు కాదు. ఒకే స్త్రీ కంఠం గుండెలు అలిసిపోయేలా కుమిలి కుమిలి ఏడుస్తోంది.
ఆ ఏడుపు గుహల్లో ప్రతిధ్వనించి ఎంతో మంది రోదిస్తున్నట్లు భ్రమ కలిగిస్తోంది.
"ఎవరది?" అన్నాడు పెద్దగా.
"హఠాత్తుగా ఏడుపు ఆగిపోయింది.
తర్వాత, సందేహంగా వినబడింది ఒక గొంతు "సాగర్?"
"అవును. సాగర్ నే. మీరు......మైగాడ్! నువ్వా అనూహ్యా?"
దుఃఖం, సంతోషం కలిసిన గొంతుతో వెర్రికేక పెట్టింది అనూహ్యా. "అనూహ్యనే సాగర్! నీ అనూహ్యనే. ఈ గుహల్లో దారి తెలియకుండా తప్పిపోయాను సాగర్! నేనెక్కడ ఉన్నానో నాకే తెలియదు ప్లీజ్! ప్లీజ్ సేవ్ మీ."
ఆమె మాట్లాడిన ప్రతిమాటనీ వేల గొంతులతో ప్రతిధ్వనిస్తున్నాయి గుహలు.
"అనూహ్యా ! నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు. కదలకు! ఒకట్లు లెక్కపెడుతూ ప్రతిసారీ వంద పూర్తికాగానే నన్ను పిలుస్తూ ఉండు. నీ గొంతుని బట్టి నేను నీ దగ్గరకు వస్తాను. నువ్వు అక్కడి నుంచి కదిలావంటే ఇంక ఇద్దరం ఒకళ్ళని ఒకళ్ళు కలుసుకోవడం అసంభవం!"
అలా అంటుండగానే, అతని దృష్టి అప్రయత్నంగా ఆ రెండు అస్థిపంజరాల మీద పడింది.
జరిగినదేమిటో ఇప్పుడు అర్ధమయింది అతనికి.
నిన్నంతా తాము తల దాచుకున్న గుహలు ఇక్కడిదాకా వ్యాపించి ఉన్నాయన్నమాట.
వాటిలో దారితప్పి దిక్కు తోచకుండా తిరుగుతోంది అనూహ్యా.
అలాగే చాలా సంవత్సారాల క్రితం ఎవరో ఒక పురుషుడూ, ఒక స్త్రీ బహుశా భార్యా భార్తలై ఉండవచ్చు. వచ్చి ఆ గుహల్లో ప్రవేశించి ఉంటారు. అనూహ్యలాగే దారి తప్పి ఉంటారు. రోజుల తరబడి ఇక్కడిక్కడే అగమ్యంగా తిరిగి ఉంటారు. వాళ్ళతో కూడా ఇద్దరు పిల్లలు ఉండి ఉండాలి.
అప్పుడు అనుకోని సంఘటన ఏదో జరిగి తల్లిదండ్రులు ఇద్దరూ ఈ ప్రదేశానికి వచ్చాక మరణించి ఉంటారు.
ఇక్కడనుంచి తోడేళ్ళ దిగి వచ్చి వాళ్ళని రక్షించి, సాకి ఉంటాయి.
ఆ పిల్లలే స్వరూపకి కనబడిన అమ్మాయీ, అబ్బాయీ అయి ఉండాలి.
స్వరూపకి ఆ తోడేళ్ళ పిల్లలు తారసపడి ఉండకపోయినా, తాము ఈ బోరియలో నుంచి జారి కిందకు పడిఉండకపోయినా, అనూహ్యని రక్షించడం కుదిరేది కాదు ఎంత కాకతాళీయం!
ఒక్కసారిగా తల విదిలించాడు అతను.
తను అప్పుడే అనూహ్యను రక్షించడం పూర్తయిపోయినట్లు ఆలోచిస్తున్నాడేమిటి? అనూహ్య ఇంకా ప్రమాదంలోనే ఉంది.
ఆమెని ఈ పద్మవ్యూహం లాంటి గుహల్లో నుంచీ బయటికి తీసుకురావాలి.
కానీ ఎలా?
తను ముందూ వెనకా చూసుకోకుండా ఈ గుహల్లోకి వెళ్ళిపోతే అనూహ్యని రక్షించడం మాట అలా ఉంచి, తను కూడా ఇరుక్కుపోవచ్చు.
తను దారి తప్పకుండా, అనూహ్యని బయటకు తెచ్చే మార్గం ఏమిటి?
వెంటనే ఏదో స్ఫురించినట్లు గుహద్వారం వైపు చూశాడు సాగర్?
అక్కడంతా సన్నటి, తెల్లటి మట్టి.
అది లైమ్ స్టోన్ అయి ఉంటుంది.
ప్రాణాలు లేచి వచ్చినట్లయింది అతనికి.
"అనూహ్య! నువ్వు ఒక్క అంగుళం కూడా అక్కడి నుంచి కదలకు! నేను సాధ్యమైనంత త్వరలో అక్కడికి చేరుకుంటాను, భయపడిపోకు!" అని కేక వేసి, సింగ్ చెయ్యి అందుకుని, జాగ్రత్తగా బొరియలోకి ఎక్కడం మొదలెట్టాడు సాగర్.
పైకి వచ్చ్చాక, సింగుని అక్కడే కూర్చుని ఆయాసం తీర్చుకోమని చెప్పి, ఎండుపుల్లలూ , ఆకులూ ఏరడానికి వెళ్ళాడు.
స్వరూప ఇంకా ఆ షాక్ లో నుంచీ తేరుకోలేదు. మాటలుడిగిపోయిన దానిలా చూస్తూ ఉండిపోయింది.
ఎండుకొమ్మలు, ఎండుటాకులూ పోగుచేసి ఒకచోట కుప్పగా పోశాడు సాగర్ రెండు ఎండుకొమ్మలని అతివేగంగా ఒకడానికి ఒకటి రాపాడించడం మొదలెట్టాడు.
క్షణం విరామం లేకుండా మెషిన్ లాగా, కదులుతున్నాయి అతని చేతులు. మొహానికి చెమటలు పట్టాయి. భుజాలు పీక్కుపోవడం మొదలెట్టాయి.
అయినా అతను ఆపలేదు. ఆపదలో ఉన్నా అనూహ్య మొహం అతని కంటిముందు కనబడుతూ అతని వంటికి శతకోటి వాట్ల శక్తిని ఇస్తోంది.
దాదాపు ఇరవై నిమిషాల తరువాత అతని ప్రయత్నం ఫలించింది.
రాపిడికి వేడిమి పుట్టి, నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. ఎండుటాకులు అంటుకున్నాయి.
మంట ప్రజ్వరిల్లింది.
పెద్ద కట్టెని ఒకదానిని అందుకుని మంటలో పెట్టాడు సాగర్. అది అంటుకున్న తర్వాత దానిని పట్టుకుని మళ్ళీ బొరియలోకి దిగాడు. షర్టుని పైకిలాగి, తెల్లటి మట్టిని అందులో పోసుకున్నాడు.
చేతిలో మండుతున్న కట్టె కాగడాలా దారి చూపుతుండగా, ఆ తెల్లటి మట్టిని గుర్తుకోసం చారికలా నేలమీద పోస్తూ ముందుకి సాగాడు.
కొంతదూరం పోయాక మట్టి అయిపోయింది.
ఆ చారికను అనుసరించి సులభంగా తిరిగి వెనక్కి వచ్చేశాడు సాగర్. మరికొంత మట్టి తీసుకుని, మళ్ళీ ముందుకి వెళ్ళిపోయాడు.
ఈసారి మరింత ధైర్యంగా!
ఆ మట్టి చారిక చెరిగిపోకుండా ఉన్నంతకుండా సేపూ తను దారి తప్పనని అతనికి నమ్మకం కలిగింది పైగా, వెదికిన గుహే మళ్ళీ మళ్ళీ వెదుకుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకునే ప్రసక్తి ఉండదు.
ప్రతి రెండు నిమిషాలకీ ఒకసారి "సాగర్" అని ఎలుగెత్తి పిలుస్తోంది అనూహ్య కలవరిస్తున్నట్లు.
గుహలు ప్రతిధ్వనిస్తూ ఉండటం వల్ల ఆమె కంఠధ్వని ఎటునుంచి వస్తోందో కనుక్కోవడం కష్టంగానే ఉంది సాగర్ కి.
రెండు మూడు గుహలు వెదికాక, మళ్ళీ మళ్ళీ తిరిగి వెనక్కి రావలసి వస్తోంది మట్టికోసం.
సెకెండ్లు నిమిషాలుగా మారుతున్నాయి. నిమిషాలు గంటలుగా మారుతున్నాయి.
దాదాపు రెండుగంటల సేపు వెదికాడు సాగర్.
క్రమక్రమంగా అనూహ్య గొంతు నీరసించి పోతోంది. అతను చెవులప్పగించి వింటేగానీ ఆమె పిలిపు వినబడటం లేదు.
మరో పది నిమిషాలు గడిచాయి.
ఉన్నట్లుండి ఏదో గుర్తు వచ్చినట్లు ఉలిక్కిపడ్డాడు సాగర్.
ఈ పది నిమిషాల్లో ఒక్కసారి కూడా అనూహ్య గొంతు వినబడలేదు.
గొంతు తడారిపోయినట్లు అనిపించింది సాగర్ కి.
"అనూహ్య!" అన్నాడు గొంతు పెకలించుకుని "అనూహ్య! అనూహ్య! అనూహ్య!"
` సమాధానంగా గుహలు ప్రతిధ్వనించాయి గానీ అనూహ్య పలకలేదు.
కొత్త గుహలో ప్రవేశించాడు. అతను అతనికంటే ముందే ప్రవేశించింది. అతని చేతిలో మండుతున్న కట్టె తాలూకు కాంతి.
పసుపుపచ్చటి వెలుగుతో నిండిపోయింది గుహ.
అక్కడ ఉంది అనూహ్య!
గోడకి అనుకుని, నిశ్చేష్టురాలాయి తన పాదాలవైపు చూసుకుంటోంది.
సాగర్ కూడా చూశాడు.
పెద్ద తాళం కప్ప సైజులో ఉన్న మండ్రగబ్బ ఆమె పాదం మీద ఎక్కి ఉంది.
ఆమె కదిల్తే చాలు, అది కుట్టవచ్చు గొలుసులాగా ఉన్న తోకని ఎత్తి ఉంచింది అది. దాని చివర్న చిన్నసైజు బల్బులా ఉన్న కొండి.
శబ్దం చెయ్యకుండా, నీడలా ఆమెని సమీపించాడు సాగర్. వంగి, ఒడుపుగా, ఆ తేలుకొండిని పట్టుకుని గుజ్జు గుజ్జయిపోయింది అది.
వెంటనే వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టింది అనూహ్య.
అతన్ని రెండు చేతులతో చిన్నపిల్లలా చుట్టేసింది అతని షర్టు ఆమె కన్నీళ్ళతో తడిసిపోతోంది.
ఆమెని ఒంటి చేత్తోనే బలంగా హత్తుకున్నాడు సాగర్. ఆ బిగువుకి తన పక్కటెమూకలు విరిగిపోతాయేమో అన్నంత బాధ కలిగింది అనూహ్యకి.
కానీ ఆ బాధలోనే చెప్పలేని సుఖాన్ని అనుభవిస్తూ, అతనికి మరింత దగ్గరగా జరిగింది.
చాలా సేపటి దాకా అలా గాఢ పరిష్వంగంలోనే ఉండిపోయారు వాళ్ళిద్దరూ.
తర్వాత, కట్టెని కింద పెట్టేసి, రెండు చేతులతో ఆమె మొహాన్ని దూరంగా జరిపి, ఆమె కళ్ళలోకి అదేకంగా, అర్ద్రంగా చూశాడు సాగర్. ఆమె కళ్ళలోనుంచి ఇందాకటిలాగా ధారగా కారడంలేదు కన్నీళ్ళు ఇప్పుడు. దుఃఖం తాలూకు ఉధృతం తగ్గింది. కానీ, అందమైన ఆమె ముక్కు పక్కగా జారి, ఎర్రటి పెదిమలపై ఉన్న పుట్టుమచ్చ దగ్గర ఆగింది.
ఒక్కసారిగా చెప్పలేనంత అభిమానం ముంచుకొచ్చింది సాగర్ కి. తలముందుకు వంచి, పెదిమలతో ఆమె కన్నీటిని తుడిచాడు.
"ఐ లవ్ యూ. " అంది అనూహ్య గుసగుసగా.
"ఐ టూ." అన్నాడు సాగర్ చిన్నగా నవ్వుతూ.