Previous Page Next Page 
వేగు చుక్క పేజి 28


    మాటల కోసం తడుముకుంటూ, మధ్య మధ్య అతని ఛాతీని తన పెదిమలతో తడితడి చేసేస్తూ, చాంగ్ తనని పట్టుకోబోవడం, తను గుహల్లో తప్పిపోవడం, అంతా చెప్పింది అనూహ్య.

    మళ్ళీ కట్టెని అందుకున్నాడు అతను.

    ఇద్దరూ కలిసి బొరియాలో నుంచి బయటపడ్డారు.

    తోడేళ్ళ బొరియలోంచి బయటికివస్తున్నా అనూహ్యని చూడగానే నోరెళ్ళబెట్టింది స్వరూప.

    "నువ్వు ఇందులో ఎలా ఉన్నావ్? నువ్వు కూడా తోడేళ్ళతో ఫ్రెండ్ షిప్ చెయ్యబోయావా ఏమిటి? అంది నోరుజారి మాట్లాడేస్తూ.

    అర్థంకానట్లు  మొహంపెట్టింది అనూహ్య.

    "కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది మేడమ్" అని భుజాలు ఎగరేసి కొండ కిందికి దృష్టి సారించాడు సాగర్.

    ఇప్పుడు మరింత స్పష్టంగా  కనబడుతోంది తెల్లటి ఏనుగు ఆకారంలో ఉన్న ఆ కందకం, దాని చుట్టూకొలత కనీసం నాలుగు మైళ్ళన్నా ఉంటుంది!

    ఎవరు తవ్వి ఉంటారు దాన్ని, అంత చక్కగా  పోలికలు వచ్చేటట్లు?

    ఈ ద్వీపంలో ఉండే అనాగరిక జాతుల మనుషులా?

    వారికి ముందు ఉండిన ఆదిమానవులా?

    ఆధునికమైన పనిముట్లు లేకుండా ఎలా త్రవ్వి ఉంటారు దాన్ని? ఎలా సాధ్యం అసలు?

    ఆ మాటకువస్తే బ్రహ్మాండమైన ఈజిప్షియన్ పిరమిడ్లని వేల సంవత్సరాల క్రితం ఎలాకట్టగలిగారు? ఒక్కొక్కటీ ఒక్కొక్కగది అంత ఉన్న బండరాళ్ళను- క్రేన్లు లేవు ఆ రోజుల్లో- అంత ఎత్తుకి ఎలా తీసుకెళ్ళగలిగారు? కోసుగా ఉండే పిరమిడ్ శిఖరంపై, చివరి బండ రాయిని ఎవరు ఎక్కడ నిల్చుని అమర్చగలిగారు?

    స్టోన్ హెంజ్ లో రాళ్ళు చిత్రమైన ఆకృతుల్లో ఎవరు, ఎందుకు పేర్చారు?

    పెరూ ఎడారుల్లో నజ్కా ఇండియన్లు మైళ్ళ పొడవున గీసిన సరళరేఖలకూ, బొమ్మలకీ అర్ధమేమిటి?

    అమెరికాలోని ఓహైయో రాష్ట్రపు అడవుల్లో రెడ్ ఇండియన్లు సర్పాకృతిలో తయారుచేసిన బ్రహ్మాండమైన గుట్టలకి అంతరార్ధమేమిటి?

    మత చిహ్నాలా అవి? ఖగోళశాస్త్రాన్ని పఠించడానికి ప్రాచీనులు ఎన్నుకున్న పద్దతులా అవి?

    మరొకటా? మరొకటా?

    ఏమిటవి?

    అన్నీ తెలుసునని విర్రవీగే ఈ మనిషికి, ఇంకా, భూగోళంమీదే అంతుబట్టని వింతలూ, విడ్డూరాలు ఎన్ని వున్నాయ్.

    మరింత జాగ్రత్తగా పరికించాడు సాగర్.

    ఏనుగు రూపంలో వున్న తెల్లటి కందకమే కాదు. సాలీడు రూపంలో బ్రహ్మాండమైన మట్టి గోడ లాంటి కట్టడం కూడా మరొకటి వుంది.

    అది కూడా కిందనుంచి కనబడదు ఇంత ఎత్తుమీదనుంచీ చూస్తేనే దాని ఆకారం అర్ధమవుతుంది.

    మొత్తానికి ఈ ద్వీపంలో తనకు అంతుబట్టని మిస్టరీ ఏదో వున్నదన్న నమ్మకం బలపడింది అతనికి.

    ఆ బొమ్మలూ, వాటిని గుర్తుపట్టడానికి నోట్ చేసి పెట్టుకున్నాడు సాగర్.

    అందరూ మెల్లిగా కొండదిగి, తిరిగి గుహ మొదట్లోకి వచ్చారు.   

    అక్కడ గోడకి అనుకుని నిలబడివున్నాడు చాంగ్. నాలుక బయట పెట్టి విపరీతంగా రొప్పుతున్నాడు.

    వాళ్ళని చూడగానే, "దాహం! దాహం!" అన్నట్లు సైగా చేశాడు.

    అతన్ని శపించేలా చూసింది అనూహ్య.

    అతి కష్టంమీద తనని తను కంట్రోల్ చేసుకున్నాడు సాగర్. వెళ్ళి, పెద్ద ఆకు ఒకటి తెంపి, దానితో దొప్పలాగా చేసి. మడుగులోని నీరు పట్టుకొచ్చి ఇచ్చాడు.

    ఆ నీళ్ళని ఆత్రంగా  కిందామీదా పోసుకుంటూ, గటగట త్రాగేశాడు చాంగ్. ఎడమచేతిని వెనక్కి తిప్పి పెదిమలు తుడుచుకుంటూ, ప్రయత్న పూర్వకంగా అన్నాడు__

    "దాహమేసి మంచినీళ్ళు అడుగుదామని లేస్తుంటే ఈ అమ్మాయి బెదిరిపోయింది. పాపం!"

    అతని మాటలు ఎవరూ నమ్మినట్లు కనబడలేదు. విషపు పురుగుని చూసినట్లు చూశారు అతన్ని.

    అంతలో కలకలం వినబడింది.

    ప్రొఫెసర్ ఆనందరావూ, ఫకర్, ఇబూకా, ఉరాంగ్ ఉటాన్ అందరూ కలసి ఊరేగింపులా తిరిగి వస్తున్నారు.

    అందరూ ఒక చోట చేరిన తర్వాత కూల్ గా  చెప్పాడు సాగర్.

    "నిధి రహస్యం తెలిసిపోయింది."

    ఆ నాలుగు చిన్న పదాలూ అక్కడ వున్న మనుషులందరిలో చెప్పలేనంత ప్రభావాన్ని చూపించాయి.

    అది వినగానే ఆశ్చర్యంతో కొయ్యబారిపోయారందరూ. తర్వాత సంతోషం ఆపుకోలేక ఏడవటం మొదలెట్టాడు ప్రొఫెసర్ ఫకర్ ఇబూకాను గట్టిగా వాటేసుకుని గిర్రున తిప్పేశాడు. సింగ్ నోరుతెరిచి చూస్తున్నాడు స్వరూప వెంటనే సాగర్  సరసన వచ్చి నిలుచుంది, అనూహ్యని జబర్దస్తీగా కొంచెం పక్కకి తోసేస్తూ.

    హీరోని చూసినట్లు సాగర్ ని చూస్తోంది అనూహ్య. సంతోషంగా.

    "కేప్టెన్! నాకు కొంచెం చెయ్యి ఊత ఇవ్వు! సామిరంగ! పాతరతవ్వేసుకొచ్చేద్దాం!" అన్నాడు చాంగ్. అతని మొహంలో ఆశా పిశాచం అర్థనగ్నంగా నాట్యం చేస్తోంది.

    చెయ్యెత్తి అందరినీ వారించాడు సాగర్.

    "ఇప్పుడు కాదు తెల్లవారేక బయల్దేరుదాం!"

    అందరి మొహాల్లో నిరాశ కనబడింది.

    తలో మూలా చేరి నిద్రపోవడానికి ప్రయత్నించారు.

    కానీ, ఆ రాత్రి ఎగ్జయిట్ మెంటుతో ఎవరికీ నిద్రపట్టలేదు.


                                   *    *    *

    వెయ్యి యుగాలు గడిచినట్ల అనిపించిన తర్వాత తెల్లారింది.

    ఉత్సాహంగా లేచి కూర్చున్నారు అందరూ.

    దట్టంగా  మంచు కురుస్తోంది చలి వణికించేస్తోంది.

    అయినా వాళ్ళెవరినీ  ఆ చలి  వణికించేస్తోంది.

    అయినా వాళ్ళెవరినీ  ఆ చలి ఏం చెయ్యలేకపోయింది.

    వాళ్ళ మనస్సులో మెదులుతోంది ఒకే భావం.

    కొద్ది గంటల తర్వాత, అపారమైన నిధిని చేరుకోబోతున్నారు. తాము తరతరాల  బాటు రెండు చేతులా ఖర్చుపెట్టినా  తరగనంత ధసం.
   
    అందరిలోని మనసులోనూ భావాలు బయట పెట్టకుండా, నిర్వికారంగా వున్నది సాగర్ ఒక్కడే.

    అతను ముందు దారి తీస్తూంటే , పరసగా వెనకనే అతన్ని అనుసరించి వస్తున్నారు మిగిలినవాళ్ళు.
   
    మధ్య మధ్యలో ఉత్సాహం ఆపుకోలేక ముందుకు ఉరకలేస్తూ వెళ్ళిపోతున్నాడు ప్రొఫెసర్  ఆనందరావు.

    అంతలోనే సాగర్  చూపుల్లోని హెచ్చరిక గమనించి, కొంచెం కంట్రోలులోకి వచ్చి ప్యాంటు జేబుల్లో చేతులు దోపేసుకుని పాదాలకింద స్ర్పింగులు వున్నట్లు హుషారుగా నడుస్తున్నాడు.

    కొంచెం దూరం పోయాక అడవి బాగా చిక్కబడింది దట్టంగా సూర్యరశ్మి కూడా చొరబడలేనంత దగ్గరగా, బ్రహ్మాండమైన ఆకుపచ్చ గొడుగుల్లా ఉన్నాయి వృక్షాలు. కింద నేల అంతా బురదగా ఉంది. అడుగు వేస్తే ఆరడుగు లోతున కూరుకుపోతున్నాయి పాదాలు.

    కాళ్ళు ఎత్తెత్తి వేస్తూ నడవాల్సి వస్తోంది.

    ఎందుకో తలతిప్పి చూశాడు సాగర్. కుడివైపు కొండల బారువుంది.

    దానిమీద నుంచీ వేగంగా దొర్లుతూ వస్తోంది ఒక చిన్న బండ.

    దాని వెంటనే మరొకటి, మరొకటి.

    "తప్పుకోండి తప్పుకోండి" అని అరిచాడు సాగర్.

    అందరూ దూరంగా పరిగెత్తారు.

    రాళ్ళు పడడం ఆగింది.

    తిరిగి కొండమీదికి దృష్టి సారించాడు సాగర్.

    అక్కడ అప్పటిదాకా నిలబడివున్న వింత ఆకారం ఒకటి, చటుక్కున బండలచాటుకి తప్పుకుంది.

    ఊపిరి బిగపట్టి చూస్తున్నారు అందరూ.

    "మీరిక్కడే ఉండండి! అదేమిటో నేను చూసి వస్తాను" అంటూ కదలబోయాడు సాగర్.

    వెంటనే అతని భుజం చుట్టూ  చేతులేసింది అనూహ్య. ఆమె కళ్ళలో భయం, ప్రార్థన.

    'ఫర్వాలేదు' అన్నట్లు చిరునవ్వు నవ్వి, కొండ ఎక్కడం మొదలెట్టాడు సాగర్.

    కొద్ది నిమిషాల తర్వాత శిఖరం చేరుకుని, అదృశ్యమైపోయాడు.

    గుబగుబలాడుతున్న గుండెలతో అతని  రాకకోసం ఎదురు చూస్తున్నారు అందరూ. అనూహ్య కళ్ళువర్షించబోయే మేఘల్లా వున్నాయి.

    సరిగ్గా అరగంట తర్వాత, కొండశిఖరంమీద కనబడ్డాడు సాగర్. పది నిముషాల్లో లాఘవంగా, కొండదిగి వచ్చాడు.

    అతని మొహంలో చెప్పలేనంత విస్మయం కనబడుతోంది. ఏదో మహత్తర సత్యాన్ని కనుగొన్నవాడిలా ఉన్నాడు అతను.

    "కనబండిదా? ఏమిటది? జంతువా? మనిషా?" అన్నారు అందరూ కోరస్ లాగా.

    "ఏమీలేదు" అని ముక్తసరిగా చెప్పి, ముందుకు నడవడం మొదలెట్టాడు సాగర్.

    తను చూసింది ఏమిటో అతను ఎవరికి చెప్పదలుచుకోలేదని గ్రహించారు అందరూ అయినా చేసేది ఏమీ లేక అతనితోబాటు నడిచారు. కానీ అందరి మనసుల్లో ఒకే రకం టెన్షను.

    అతను చూసినది ఏమిటి? ఎందుకు తమతో చెప్పడంలేదు?

    చాలా దూరం నడిచిన తర్వాత ఆ తెల్లటి కందకం లాంటి దాని చేరుకున్నారు వాళ్ళు.

    అది సరిగ్గా ఏనుగు  బొమ్మ కుంభస్థలం దగ్గర ఉంది.

    అంటే.............

    ఇక్కడే..... ఇక్కడే...... ఉన్నది అపారమైన పెన్నిధి.

    ప్రొఫెసర్, ఇబూకా, ఫకర్ ఉరకలు వేసే ఉత్సాహంతో కేకలు వేస్తూ ముందుకు పరిగెత్తారు.

    ఇంక వాళ్ళని అదుపు చెయ్యడం సాగర్ కి చేతకాలేదు. నవ్వుతూ చూస్తున్నాడు అతడు. అతని ప్రక్కనే నడుస్తూంది అనూహ్య.

    చాంగ్ తన బాధను మర్చిపోయి చులాగ్గా ముందుకు పరిగెత్తి, అందరినీ దాటేసేడు.

    మరి నాలుగు అడుగులువేసి హఠాత్తుగా ఆగిపోయాడు అతను.

    అక్కడ కనబడుతున్నది చూడగానే, అతని మొహాన కత్తి వేటుకి నెత్తురుచుక్క లేకుండా పోయింది.


                                                                     16

    నిధి కోసం రెండు నిలువుల లోతున త్రవ్వే అవసరం లేకుండా, రెడీమేడ్ గా పెద్దగుంట త్రవ్వేసి ఉంది అక్కడ!

    అక్కడున్న డబ్బు పాతరని చిరకాలం క్రితమే ఎవరో త్రవ్వేసుకు పోయినట్లు ఆ గుంటలో పిచ్చి మొక్కలు గజిబిజిగా పెరిగి ఉన్నాయి.

    వంట్లోని రక్తం బక్కెట్లతో తోడేసినట్లు నిస్సత్తువ ఆవహించింది అందరినీ. తెల్ల కాయితాల్లా పాలిపోయాయి మొహాలు. గుండె ఉండవలసిన చోట గుంట పడిపోయినట్లు శూన్యమైపోయాయి మనసులు.

 Previous Page Next Page