"అమ్మాయిగారు! మిమ్మల్ని వాళ్ళంతా కలిసి మోసం చేస్తున్నారు మీరు మీ ఇంటికెళ్ళిండి పోని! ఆ ఒక్కమాట చెబితే అచ్చమ్మని తాను అందలం యెక్కించేది. అంతులేని కానుకలు, కోరినంత డబ్బు తిరిగి చూడకుండా ఇచ్చేసేది. నాలుగు ఐస్ ఫ్రూట్స్ లు ఉచితంగా వస్తాయంటే నరకటానికి కూడా వెనుకాడని మనుషులు.
బీదవారంతా మంచివారని ఈ పుస్తకాల్లో ఎందుకు రాస్తారు? సినిమాల్లో చూపిచ్చేదయితే మరీ ఆభూతకల్పనలు ధనవంతులకి డబ్బు సంపాదించడమే లక్ష్యమని, లక్ష రూపాయల కోసం లక్షమంది ప్రాణాలను కూడా అవలీలగా తీస్తారని...బీదవారుమాత్రం నీతికి, నిజాయితీకి ప్రాణం ఇస్తారని, అవసరమయితే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడతారని...అదని...ఇదనీ...చూపిస్తారు.
అంతా ఎంగిలికూడు మయం. శుచి, శుభ్రతనేవి అణుమాత్రం కూడా కానరావ్. సినిమాల్లో రెండర్దాల మాటలు కూడా తాత్కాలికంగా, తమాషాగా వుంటాయ్. ఇక్కడ వీరు ఉపయోగించేది పచ్చిబూతులు. వల్గర్ లాంగ్వేజి సినిమా హీరోలాంటివాడు. పేదల పేటలో ఒక్కడూ వుండడు. ఒకసారి అచ్చమ్మే చెప్పింది. "ఐదు రూపాయలు ఇస్తాననేసరికి ఫలానా పార్టీకే ఓటు వేద్దామనుకున్నారట. కాని ఎగస్ పార్టీవారు పదిహేడు రూపాయలు ఇచ్చేసరికి అటు వాడిదగ్గరా ఐదు రూపాయలు తీసుకొని ఇటు వీడి దగ్గరా పదిహేను రూపాయలు తీసుకొని ఇష్టమొచ్చినవారికి ఇష్టమొచ్చినట్టు ఓటేసి వచ్చారట ఎవరెట్టాఛస్తే మాకేంటి?" అంటూ అచ్చమ్మ ఒకటే నవ్వు.
వీళ్ళ బ్రతుకులు ఇవి. వాళ్ళలో వాళ్ళు చచ్చేట్టు పోట్లాడుకుంటుంటారు. కాస్త డబ్బున్న వాడిని పడగొట్టడానికి మాత్రం అంతా పిడికిళ్ళు బిగించి ఏకతాటిమీద కదులుతారు. వాళ్ళ ధర్మం అది...వాళ్ళ నీతి అది... ఛీ..."
పద్మిని ప్రియదర్శిని ఆలోచనలు చెదరగొడుతూ వాకిలి తలుపు చప్పుడయింది.
పద్మిని ప్రియదర్శిని ఆలోచనలు చెదరగొడుతూ వాకిలి తలుపు చప్పుడయింది.
పద్మిని లేచివెళ్ళి తలుపు తీసింది.
శంకర్రావు ఇంటిలోకి వస్తూనే "ఏంటమ్మా! ఒంటరిగా వున్నావా! ఇదెక్కడికి వెళ్ళింది?" అనడిగాడు.
"వెనకింటివారు యెందుకో కబురు చేశారు. ఆంటీ ఇప్పుడే వస్తానని వెళ్ళింది. ఏమీ తోచక పత్రికలు తిరగేస్తూ కూర్చున్నాను" నవ్వుతూ సమాధానం చెప్పింది పద్మిని.
శంకర్రావుని, పార్వతమ్మని అంకుల్, ఆంటీ అని పిలవసాగింది పద్మిని. వాళ్ళిద్దరూ పద్మిని ప్రియదర్శినిని ఒక్కోసారి "పద్మిని" అని ఒక్కోసారి "అమ్మాయి" అని ఆప్యాయంగా పిలవసాగారు.
చెప్పులు మూల విడిచి బాత్రూమ్ లోకెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కుని వచ్చి పడక్కుర్చీలో మేను వాలుస్తూ "నీకు పుస్తకాలు చదివే అలవాటుంటే ఇంటినిండా ఏదో ఒకటి చదువుకోడానికి పుస్తకాలున్నాయ్ కావాలంటే అద్దె పుస్తకాల షాపులో ఏవైనా నవలలు తెచ్చిపెడతాను కాలక్షేపంగా వుంటుంది. చదువుతావా అమ్మాయీ!" శంకర్రావు అడిగాడు.
వద్దు అంకుల్ చదవాలన్నంత ఇంట్రస్ట్ నాకంతగా లేదు. ఏదో మరీ తోచనప్పుడు చదువుతూ వుంటాను. ఐనా మీరు, ఆంటీ పక్కన వుండగా నాకు వేరే పుస్తకాలతో పనేముంది?" నవ్వుతూ చెప్పింది పద్మిని.
ఆ తరువాత__
పద్మినీతో మామూలు కబుర్లు వేసుకున్నాడు శంకర్రావు కొద్దిసేపు వాళ్ళమధ్య ఏవేవో మామూలు మాటలు జరిగాయి.
ఆ మామూలు సంభాషణతోనే శంకర్రావు ఒకటి గమనించాడు. "ఈ అమ్మాయి కష్టాలలోంచి, బీదరికంలోంచి వచ్చినట్టులేదే!" అని...
మల్లెపూవుని చెట్టుకి ఉంచినా...తలలో పెట్టుకున్నా దేవుడి కాళ్ళదగ్గర పడేసినా...నేలమీద పడేసి అల్లంతదూరాన ఉంచినా దాని సుకుమారం కానవస్తూనే వుంటుంది. దాని సహజ సువాసన వెదజల్లుతూనే ఉంటుంది.
పద్మిని ప్రియదర్శినీ అంతే.
14
ఆ ఇంట్లో!
గోడలకి నాలుగయిదు పాతకాలం నాటి ఫోటోలు తగిలించి ఉన్నాయ్. శంకర్రావు, పార్వతమ్మ కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటోలుగాక వెంకట్రామ అండ్ కో వారి అంకెల క్యాలెండరు, లక్ష్మీదేవి ఫొటో ఉన్న బట్టల షాపువాళ్ళ రంగురంగుల బొమ్మ క్యాలెండరు తప్ప మరేమీ గోడలకి లేవు.
ముచ్చటయిన ఆ కుటుంబంలో వారిద్దరే ఉన్నారు. సాధారణంగా పిల్లలుంటే వారి దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా ఏదో ఒక మాటల సందర్భంలో వారి ఊసెత్తకుండా ఏ తల్లీ తండ్రీ ఉండరు. ఈ ఇంటిలో అలాంటిదేమీ లేదు.
శంకర్రావు, పార్వతమ్మకి పిల్లల్లేరా?
శంకర్రావుకి, పార్వతమ్మకి పిల్లలుండి ఏవో సంసారములో కలతలవల్ల మీరు వాళ్ళకి, వారు వీళ్ళకి పూర్తి దూరంగా ఉన్నారా?
నిజం ఏది? అన్నది పద్మిని ప్రియదర్శినికి అర్ధంకాలేదు. వాళ్ళ సంభాషణలో యెక్కడా పిల్లల ఊసు ఎత్తటం లేదు. పద్మిని ప్రియదర్శిని ధైర్యంచేసి వాళ్ళనా విషయమూ అడగలేదు. కాని తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం మెండుగానే వుంది. అలా అని ధైర్యం చేసి అడగలేదు. కొన్ని విషయాలు అడగకూడదు. ఆ వివేకం పద్మినికి బాగానే వుంది.
పార్వతమ్మకి శంకర్రావుకి ఆ చుట్టుపట్ల మంచి పేరు వుంది.
అందరి తలలో నాలుకలావుండే పార్వతమ్మని దేనికో దానికి ఎవరో వకరు పిలుచుకెళుతుంటారు. ఎప్పుడైనా ఎవరయినావచ్చి కాసేపు కూర్చుని మాట్లాడి వెళుతుంటారు.
తోడుకోసం ఆ ఇంట్లో రెండు గదులు అద్దెకి ఇచ్చారు. అద్దెకి వచ్చింది భార్యాభర్త వక మరిది. ఈ ఇంటికొచ్చిన వేళావిశేషం ఆమె కడుపుతో వుంది. పెళ్ళయిన పదేళ్ళకి కడుపు వచ్చిందిట. పురిటికి పుట్టింటికి వెళ్ళింది. ప్రస్తుతం అన్న తమ్ముడు మాత్రం వున్నారు. సాధారణంగా పగలు ఇద్దరూ వుండరు. అన్న ఉద్యోగానికి తమ్ముడు కాలేజీకి వెళుతుంటారు. వంట వాళ్ళే చేసుకుంటారు. ఇద్దరూ బుద్ధిమంతులే!
చుట్టుపట్ల కొన్ని ఇళ్ళల్లోని మగవాళ్ళ చూపులు పద్మిని ప్రియదర్శినికి నచ్చలేదు. ఆహారం కళ్ళముందు వున్నట్లు అప్పటికి అన్నంతిని ఆరురోజులయినట్లు ఆవురావురుమంటూ ఎప్పుడుతిందామా అన్న ఆత్రుతతో పద్మినిని చూపులతో తినేస్తూ వుంటారు.
ఆ ఇంటికి ఉదయం సాయంత్రం పనిమనిషి వచ్చిపోతుంటుంది. వచ్చిందగ్గర నుంచి పనితోపాటు తన సంసారంలోని కష్టసుఖాలు చెప్పుకుంటూ ఆ నోరు అలా వాగుతూనే వుంటుంది.
పద్మిని ప్రియదర్శిని గురించి అందరికీ ముందే చెప్పారు ఆ దంపతులు. పార్వతమ్మకి వేలువిడిచిన చెల్లెలి కూతురు పద్మిని. తోడుగ వుంటుందని ఊరునుంచివస్తూ తీసుకొచ్చారు!