"సత్యా! అలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు. నీ ఖర్చెంత? నువ్వు ఎన్నాళ్ళుగా అడిగే ప్రశ్నేలేదు. ఆయనొచ్చేదాకా ఆగు. పైగా ఆయనతో మాటాడి నీ సొమ్ముని ఏదైనా ఆయన సంస్థలో భాగం పెట్టిస్తాను. ఆ తర్వాత యీ సంకోచం అక్కరలేదు. నీ సొమ్ము నువ్వు తింటూ వున్నావనే భావం వుంటుంది."
"సరే స్టాంపులు యివ్వు సంతకం చేస్తాను." అని స్టాంపు అందుకొని సంతకాలు చేసింది.
"ఇక పైకి వెళదామా?" అడిగేడు సతీష్.
"పద!"
సతీష్ దారి తీశాడు.
మేడ మెట్లెక్కిపై కారిడార్ లోకి అడుగుపెట్టగానే పడమటినుంచి చల్లగాలి వీచింది. ఇద్దరికీ స్వాగతం చెపుతున్నట్టుగా తోట చూసినప్పుడు కానీ, ద్రాక్షతోట చూసినప్పుడు కానీ, ఇంటిచుట్టూ పెరటిగా వేసిన గార్డెన్ చూసినప్పుడు కానీ కలుగని స్పందన ఆ కారిడార్ లో అడుగుపెట్టగానే వీచిన గాలి కలిగించింది.
మొదటి రూం చూసి "ఇది పడగ్గది. ఆఖర్న చూద్దాం" అని కదిలి రెండవ గది వద్దకు వచ్చి "ఇది ఆయన రీడింగ్ రూం! మంచి లైబ్రరీ వుంది. ఇవిగో తాళాలు! ఎప్పుడవసరం అనిపించినా వచ్చి గడుపు. ఇక్కడికి వస్తే చదవక్కరలేదు. చూస్తూ కూర్చున్నా కాలం గడిచిపోతుంది" అన్నాడు తలుపు తీస్తూ.
తాళలందుకుంది సత్య.
గదిలో అడుగు పెట్టాడు సతీష్.
వెంట ప్రవేశించిన సత్య కళ్ళింతలు చేసికొని ఆగిపోయి "మైగాడ్ వాట్ వండర్ ఫుల్ లైబ్రరీ!" అంది.
నిజమే!
ఆ గది చూసినవారికి ఎవరికయినా అలాగే అనిపిస్తుంది. బయట వేపుకున్న ఆ గోడలోమాత్రం కిటికీ వుంది. ఆ కిటికీకి యిరువైపులా అల్మేరాలున్నాయి. మిగతా రెండు గోడలనిండా అల్మేరా గోళ్ళున్నాయి. వాకిలికి అటూ ఇటూ అల్మేరాలూ నిలువెత్తున్నాయి!
అన్నిటినిండా పుస్తకాలున్నాయ్.
ఒక్కో అల్మెరాని అటు చూస్తూ గదంతా తిరిగింది. ఒకవైపు ఇంగ్లీషు పుస్తకాలు. మరోవైపు తెలుగు పుస్తకాలు కిటికీ తలుపున్న గోడల అల్మెరాల్లో కూడా తెలుగు పుస్తకాలే!
"అబ్బో!" అనుకుంది సత్య.
గదినిండా కాశ్మీర్ తివాచీ. అందంగా వుంది. ఎర్రటి తివాచీ రస హృదయుని మనో మందిరంలా రాగరంజితంగా వుంది.
గదిమధ్య చిన్న టీపాయ్! దాని కటూ యిటూ రెండు ఫ్రెం కుర్చీలు.
సతీష్ కెదురుగా కూర్చుంది సత్య!
"యూ ఆర్ లక్కీ! యువర్ మాస్టర్ ఈజీ గ్రేట్!" అంది.
"సత్యా నువ్వేం చదివేవు?"
"టెన్త్!"
"టెన్త్! మరి యింత మంచి ఇంగ్లీషెలా వచ్చు. కాన్వెంటులో చదివేరా?"
"ఊహుఁ! తెలుగు బాగా రావాలంటే గురుకులాల్లో కాన్వెంట్ లో ఇంగ్లీషు అని ఎక్కడయినా సిద్ధాంతం వుందా? మా రంగయ్య మేష్టారుగారు మాకు ఫస్ట్ ఫాం నుంచే ఇంగ్లీషు మీడియం పెట్టేరు. మంచి ఇంగ్లీషు నేర్పేరు. ఆ మాటకొస్తే మా వూరిలో రెండో క్లాసునుంచి ఇంగ్లీషు, మూడో క్లాసునుంచి సంస్కృతం చెపుతారు తెలుసా?" అంది ఆవేశంగా.
"థాంక్స్!" ఎందుకో అన్నాడు సతీష్.
"సతీష్! నేను రోజూవచ్చి యీ బుక్స్ అన్నీ చదివేస్తాను."
"గుడ్! మరి వెళదామా?"
సతీష్ వెంట నడిచింది.
"ఇదే ఆయన డ్రాయింగ్ రూం."
తలుపు తీస్తూ అన్నాడు సతీష్.
గదిలో అడుగుపెడుతూ విభ్రాంతమై నిలుచుంది సత్య.
సతీష్! ఊరికే డబ్బుకంటే చాలదు. దానికి తగిన విలువ సంతరించుకోవాలి. డబ్బుని ఇలా సద్వినియోగపరిస్తేనే అందం చందం!
అతనేం అనలేదు. చిన్నగా నవ్వుకున్నాడు తనలో తనే.
ఆ గదంతా నీలి కార్పెట్ తో అందంగా స్వచ్చమైనవి నీలాకాశంలా మెరుస్తోంది. గోడలకి నీలి ఏషియన్ పెయింటింగ్ "తను నీలి సముద్రంలో లేదుకదా! ఇదే సముద్రమైతే తను క్షీరసాగర కన్యకా? లేక పద్మపత్రనా?" అనుకొంది.
ఆ గదిలో ఓ మూల సితార! మరోప్రక్క వయోలిన్.
గోడలకి అందమైన పెయింటింగ్స్! ప్రఖ్యాత చిత్రకారులవి, రవివర్మని, బాపిరాజుని, బాపూని.
ఎంతటి కళా హృదయం!
పైకే అనేసింది.
పకపక నవ్వేడు సతీష్.
"చూడగా చూడగా నువ్వూ ఆయన ఆరాధనలో పడిపోయేట్టుగా వున్నావ్?"
ఆ మాట నంతగా పట్టించుకోని సత్య అతన్నోమారు.
"నువ్వూ సామాన్యుడివి కావు మంచి ఆర్టిస్టిక్ హృదయం వుంది. అందుకే ఆయనకి నచ్చేవు" అనుకుంది సత్య.
సతీష్ వెనుదిరిగేడు.
మొదటి గదికి వచ్చేరు.
ఆ మాట నంతగా పట్టించుకోని సత్య "అతన్నోమారు చూస్తే బావుండును" అంది తనే అనుకుంటున్నట్టుగా.