"కేబిల్ లో మాట్లాడతారా?" ఫక్కున నవ్విందామె.
"అబ్బ సంతోషించాలే తెలివికి ఓవర్సీస్ కాల్లో మాటాడేరు. నీ విషయం చెపితే తక్షణం మీ ఊళ్ళో వున్న పొలం, ఇల్లు, పశువులు అన్నీ అమ్మేసెయ్యమన్నారు."
అతనో క్షణం ఆగేడు రియాక్షన్ కోసం.
కళ్ళింతలు చేసుకుని చిత్రంగా చూసింది సత్య.
"నేను కరణం.. మునసబులకి ట్రంక్ కాల్ చేసి అంతా అమ్మెయ్యమన్నారు. ఆయన అమ్మేసి ఇరవై రెండువేల కేష్ కి డ్రాఫ్టు పంపేరు ఇదిగో! ఇది తీసుకుని ఈ స్టాంపుపై సంతకం చెయ్" ఒక్కక్షణం అతనికేసి వింతగా చూసింది. తర్వాత ఆ ఆ కళ్ళలో ఆశ్చర్యం స్థానంలో ఆరాధన చోటు చేసుకుంది.
ఆమెకి నోట మాట రాలేదు.
"నేను వేరే వ్యక్తుల్నీ కాంట్రాక్ట్ చేశాను. సరైన ధరే అన్నారు. మరి నువ్వు చెప్పాలి"
"సతీష్?"
తన మనోభావాలు ప్రస్పుటీకరించేట్టుగా పిలిచింది.
ఆ కంఠంలో ధ్వని చేస్తోన్న కృతజ్ఞతా భావాలు వెల్లువలై తనని ముంచెత్తు తున్నట్టుగా భావించుకున్నాడు సతీష్.
కిటికీగుండా చల్లగా గాలి వస్తోంది.
"సతీష్ నువ్వెవరు? నే నెవరు?"
నేను పుట్టి పెరిగిన రోజునుంచీ నిన్నెరగను.
ఆ రోజు నా జీవితంలో చాలా చెడ్డరోజు. అవమానాన్ని పొందేను. సాటివ్యక్తి ప్రాణం తీసేను. ఆ సంఘటన కారణంగా మా అమ్మమ్మకి దూరమయ్యేను. ఆమె నాకు శాశ్వతంగా దూరమైపోయింది.
కానీ! సతీష్.
అది ఒక రకంగా చాలా మంచిరోజు కూడా! భగవంతుడు ఆపదోద్ధారకుడు అంటారు. నిజంగా ఆపదలో వున్న నన్ను రక్షించటానికే నిన్నా సమయంలో పంపేడు.
నిజంగా నువ్వే ఆ సమయంలో రాకపోతే నా బ్రతుకేమయ్యేది?
అరెస్టు--జైలు-శిక్ష, అవమానం....
అయితే ఏ పూర్వజన్మ పుణ్యంతోనో నిన్ను చూడగలిగేను.
నిన్ను చూసిన ఆ క్షణం ఎంత గొప్పది.
ఆ బంగారు క్షణాన్ని నా మనసులో పదిలంగా దాచుకుంటాను.... నిజంగా నువ్వెంత మంచివాడివి"
ఏదో ధోరణిలో ఎటో చూస్తూ తన మనోభావాల్ని వెలిబుచ్చింది సత్య.
అంతసేపూ ఆమె కళ్ళవెంట నీరు అవిరళధారగా మెరుస్తూనే వుంది.
చెప్పటం ఆగేకకూడా చెంపలపై కారే ధార ఆగలేదు.
"సత్యా!"
మృదువుగా అతి ప్రియంగా పిలిచిన ఆ పిలుపుకి భావనా లోకాల్లోంచి బయట పడింది ఆమె.
"ఏడుస్తున్నావేం? నేనేం చెప్పాను...."
అతని మాటలు పూర్తికాకముందే "సతీష్.... ఇవి కన్నీళ్ళు కావు. సంతోషంతో కారుతున్న భాష్పాలు. కృతజ్ఞతగా నా మనస్సు చేస్తున్న అర్చన" అంది.
నవ్వేడు సతీష్. "ఫరవాలేదు! కవిత్వంలో పడ్డావు" అన్నాడు.
"కవిత్వం కాదు సతీష్! యిది నిజంగా మనస్సులోవున్న వూహు! యదార్ధం" అంది ఆవేశంగా.
"సరే! థాంక్స్! నా మాట యింకోటి వింటావా"
"సతీష్! నువ్వీ రోజు ఏం చెప్పిన వింటాను. ఏట్లో దూకమన్నా దూకుతాను. రోట్లో తల దూర్చమన్నా దూరుస్తాను. ఆ రెండూ నీవు చెప్పవు. ఇంకేం భయం?"
"నువ్వు సంగీతం నేర్చుకో! నాకెందుకో నువ్వు బాగా పాడగలవనీ, యిస్ట్రుమెంట్ కూడా బాగా నేర్చుకోగలవని అనిపిస్తోంది."
క్షణకాలం బదులు చెప్పలేదామె.
"నీకిష్టం లేకపోతే చెప్పు, మానేస్తాను."
"ఊహుఁ నాకిష్టమే" అంది తల వంచుకొని.
"సరే! ఈ రోజు ఫోన్ చేస్తాను. రేపటినుంచి ఇన్ స్ట్రక్టర్ని ఇక్కడికే రమ్మంటాను."
"వూఁ"
"అయితే పైకి వెళదాం పద! పైన ఓ రూంలో మా అయ్యగారి సంగీతం గది వుంది. ఆయన అక్కడ వయోలిన్ సాధన చేస్తూవుంటారు అన్నట్టు నీవు యింతదాకా మేడ భాగం చూళ్ళేదు కదూ! వెళదామా? చూద్దువుగాని"
"సతీష్!"
"వూఁ!" ఏమిటన్నటుగా మూలిగేడు.
"మీ అయ్యగారికి లేని గుణాలు లేవా? హౌ నైన్ ఏ జంటిల్ మన్!"
"సత్యా! నీ పేరు సత్యకాక పిచ్చెమ్మ అని పెట్టాల్సింది మీవాళ్ళు మా అయ్యగారంటే ఏమనుకున్నావ్? ఇంత ఆస్థి పెంచేడు. ఇన్ని సంస్థల్ని నైస్ గా మేనేజ్ చేస్తున్నాడు. ఎం.ఏ. చదివేడు. ఐ.ఏ.యస్. కూడా పాసయ్యేడు. కానీ ఉద్యోగం చేయటం ఇష్టంలేక వదిలేశాడు.... పరిచయం చేసుకోతగ్గ వ్యక్తి ఆయన."
సత్య నవ్వింది....
"మీ ఇద్దరికీ పరిచయం చేస్తానులే!"
"చేస్తావ్ చేస్తావ్! ఆయనెప్పుడొస్తాడో ఏమో అయినా నేనింకా ఎన్నాళ్లుండాలి యిక్కడ? నాదంటూ ఓ ప్రత్యేకత ఉండేట్టుగా చూసుకోవాలికదా! మంచివాడని ఎన్నాళ్ళని అతని సొమ్ము తింటూ వుంటాను?"
ఒక్క క్షణం మాట్లాడళ్ళేదతను.