"రండి." అన్నారు వాళ్ళిద్దరు మర్యాదగా లోపలికి ఆహ్వానిస్తూ.
ఒకరి వెనుక ఒకరు బైలు దేరారు లోపలికి.
వాళ్ళ ప్రాణానికి యింకా సస్పెన్సే. అక్కడ వేలాడగట్టిన చీరలు వగైరాలు లేవు మరి. తినబోతూ రుచులడగటం దేనికని ఊరుకున్నారు.
"రండి! రండి! అరుంధతిగారు వచ్చారే. మీరు వచ్చారా లేదా అని చూస్తున్నాను. జానకిగారూ! సుబ్బాయమ్మగారు వస్తారో రారో అని హడలి చచ్చాను. హమ్మయ్య వచ్చారు కదా! ఇప్పుడు నా ప్రాణం హాయిగా వుంది. కామాక్షమ్మగారూ! మీరు పెద్దవారు ముందు యిటు రండి." ఇలా దీక్ష అందరి పేర్లు గుర్తు పెట్టుకుని పేరు పేరున ఆహ్వానించింది. పలకరించి లోపలికి పంపించింది.
జయంతిని శారదని శైలజని అలాంటి యువతరం అమ్మాయిలను కూడా తమాషా మాటలతో పలకరించింది. "నేను సూత్రధారిని. మీరు పాత్రధారులు. మీరు నాకు ముఖ్యం. మీలాంటి ముందు చూపున్న ఉత్సాహవంతులైన అమ్మాయిలు ముందుకు రావాలి." ఇలాంటి మాటలతో ఆకట్టుకుంది దీక్ష.
హాలులో ప్రవేశించే ముందు ద్వారం దగ్గర పొడుగాటి బల్ల. ఆ బల్లమీద నాలుగు పళ్ళాలు వున్నాయి. బల్ల కవతల పళ్ళాల ముందు నలుగురు అమ్మాయిలు చిరునవ్వుతో కళకళలాడే ముఖాలతో నిలబడి వున్నారు.
ఓ పళ్ళెంలో అటు కుంకం ఇటు వీబూధి. మరో పళ్ళెంలో గులాబీపూలు, తతిమ్మా రెండు పళ్ళాలలో స్వీట్ ప్యాకెట్స్ కారం మిక్చరు ప్యాకెట్స్ వున్నాయి.
లోపలికి వెళుతున్న ఆడవాళ్ళకి పళ్ళెం ఎత్తి చూపిస్తూ "తీసుకోండి" అంది ఓ అమ్మాయి. కుంకం వద్దని ఏ స్త్రీ అనదు కాబట్టి ప్రతివాళ్ళూ కుంకం తీసుకుని బొట్టు పెట్టుకున్నారు. వీబూధి నుదుట పెట్టుకునే వాళ్ళు వీబూధి తీసుకున్నారు.
రెండో అమ్మాయి ప్రతి ఒక్కరికీ గులాబీ పూవు యిచ్చింది.
మూడో అమ్మాయి స్వీట్ ప్యాకెట్ యిచ్చింది.
నాలుగో అమ్మాయి కారంబూంది ప్యాకెట్ యిచ్చింది.
మరో యిద్దరు అమ్మాయిలు వచ్చి వాళ్ళని కుర్చీల దాకా తీసుకువెళ్ళి వాళ్ళందరిని వరసగా వున్న కుర్చీలలో వరసక్రమంలో కూర్చోపెట్టారు.
వాళ్ళ ఎదురుగా స్టేజీ వుంది. మైకు వుంది. అంతకుమించి ఏమీ లేవు. ఏం జరగబోతున్నదో తెలిపే చిన్న ఆధారం కూడా లేదు.
వాతావరణంలో కారు మబ్బులు లేవు. ప్రమాద సూచనలు లేవు.
కళకళలాడుతూ మర్యాదగా పలకరించే ఆడపిల్లలు. ఓ అమ్మాయి కయితే తెలుగు వచ్చినట్లు లేదు. "ప్లీజ్, కమ్ హియర్ మేడమ్!" అంటూ తీసుకెళ్ళి కుర్చీలలో కూర్చోబెట్టింది.
అక్కడికి ఊరూకోక ఓ యిల్లాలు. "తెలుగు రాదా అమ్మాయి!" అంది.
వచ్చిన వాళ్ళకి అమ్మాయిలు నచ్చారు. వాళ్ళ మర్యాదలు నచ్చాయి.
అరగంట అయింది.
ఏ కొద్దిమందో తప్ప దాదాపు అందరూ వచ్చినట్లే. ఎవరైనా వస్తే లోపలికి తీసుకురావటానికి ఓ అమ్మాయి బైట నుంచుంది. మరొక అమ్మాయి గుమ్మంలో పళ్ళాల దగ్గర వుండి పోయింది. మిగతా అందరూ హాలుకి ఆనుకుని వున్న వక్కరూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు.
దీక్ష ఒక్కతీ స్టేజీ ఎక్కి మైకు దగ్గరకు వచ్చింది.
అందంగా పొందికైన దుస్తులతో ఆకర్షణీయంగా వున్న దీక్ష అందరి చూపులు నిలిచాయి.