Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 25

                                      అయ్యగారి మొగ్గులో!
                                    అమ్మగారి సిగ్గులో!!


    సంస్కృతంలో మధురభక్తికి, శృంగారానురక్తికి గీత గోవిందం భగవద్గీత. మరి తెలుగులో అలాటిది, క్షేత్రయ్య మువ్వగోపాల పదాలే! ప్రేమ భక్తి ముక్తిరమ్యత! గోపికా కృష్ణుల వియోగ జలధిలో ముంచి తీసిన రసవద్గీతలు క్షేత్రయ్య పదాలు-కృష్ణ విరహం కన్నా రాధా విరహమే మధురంగా వుంటుందనేదే గీత గోవిందం ఢంకా బకాయించి చెబుతుంది. దాన్ని తెలుగు నోటితో చాటేవి క్షేత్రయ్య పదాలు.

    అమరుకంలాటి, గాలిబ్ గీతాల్లాటి, ఉమర్ ఖయాం రుబాయిల్లాటి ముక్తకాలు క్షేత్రయ్యపదాలు దేనికవేఒక శృంగార గాఢమయ గాధలు-దేనికది పాడి పరవశించ తగ్గది. దేనికదే ఒక శృంగార సర్వస్వం రసపీఠం.

    క్షేత్రయ్య పదాల్లో తలమానికంవంటి పదం చూడండి.

    మగువ తనకేళికా మందిరము వెడలెన్
    వగకాడ మా కంచివరద తెల్లవారెననుచు
    విడజారు గొజ్జంగి విరిదండ జడతోను
    కడు చిక్కపడి పెనగు కంట సరితోను
    నిడుద కన్నుల దేరు నిదుర మబ్బుతోను
    తొదరి పదయుగమున దడబడెదు నడతోను
    సొగసి సొగయని వలపు సొలపు జూపు తోను
    నగవగల ఘనసార వాసనలతోను
    జిగమించి కెమ్మోవి చిగురు కెంపులతోను
    సగము కూచముల విదియ చందురుల తోను
    తరితీపు సీయు సమసురతి బడలికతోను
    యిరుగడల కైదండలిచ్చు తరుణులతోను
    పరమాత్మ మువ్వగోపాల తెల్లవారెనునుచు
    మగువ తనకేళికా మందిరము వెడలెన్.

    పదసాహిత్యంలో యింతకంటే మంచిపదం వెదికినా మనకు కనిపించదేమో! పద పదంలో అనుభవ శృంగారాన్ని భావభవజనక పోషకంగా భవ వినాశకంగా పలికించి చివరికి మువ్వ గోపాలుని ముద్దు పేరుతో ముక్తాయింపైన పదం కదూ!

    కంచి వరదరాజస్వామి వారి కేళమందిరంనుంచి మీనాక్షీ అమ్మవారు తెలతెలవారే వేళలో శృంగారాంచిత చిహ్నాలతో సుప్రభాత సేవకంటే ముందుగా చెలులతో కలిసి చెలువం మీరేలా వచ్చే సొగసులన్నీ కళ్ళారా చూసిన కవి క్షేత్రజ్ఞ కల్పనా నల్పశిల్పశిఖరం ఇది!

    తొలిజాము గడిచాక మలిజాము వేళలో పవళింపు సేవ అయ్యాక చెలులు దించి వెళితే స్వామివారే తలుపుతీసి తలపుల సామ్రాజ్యంలోకి వలపుల దేవేరిని ఆహ్వానించారు.

    ఆ మీదట అయ్యవారికీ, అమ్మవారికీ ఏకాంతంలో ఏకశయ్యా భోగం అమరించి మలిజాము, నడిజాము అయింది. సుప్రభాత సేవకు భక్తగణం వచ్చి అమ్మనూ అయ్యనూ చూస్తే అమ్మగారికెంత సిగ్గు! అందుకే చెలుల ఎచ్చరికతో తెల్లారిపోతుందని చెప్పి బయటికి వచ్చింది మగువ.

        రాత్రి చెలుల సింగారించిన విరజాజిదండ జడనుండి విడజారి వేలాడ్తూ వాడిపోయివుంది. నిట్టూర్పులవగల సెగలలో వాడి పోయిందట అది! కంటసరి సరయిన వేడుకవల్ల చిక్కుబడి పోయిందట రేయల్లా నిద్దరమాలి పొద్దు గడిపినందువల్ల నిద్దుర మబ్బు నిడుద కన్నుల మీదేవుందట! చెలిమికత్తెల ఎదుటయినా సరే అయ్యవారి మందిరం నుంచి అమ్మగారు రావాలంటే సిగ్గేకదా! అందుకే అడుగులు తడబడ్తున్నాయట. ఇక ఆమె వాలు చూపులు ఎలా వున్నాయి. వలపు సొగసీ సొగయడంతో వలపు సొంపులు చూపుతున్నాయట! రేయి మేల్కొని జాము జాముకూ మధ్య మధ్య సేవించిన కస్తూరి నోరువిప్పీ విప్పక నవ్వే నవ్వుల్లోనే వగవగలు చిమ్ముతోందట. కెమ్మోవి తాంబూల రాగంతో జిగిమించింది. ఆ మెరుపులో దంతక్షతాలవల్ల పెదాలు చివురు కెంపుల్లా శోభిస్తున్నాయట. నఖక్షతాలు అరచంద మామలా వున్నాయి--- అవి కంచుకం సరిగా లేక, జారడంవల్ల కనిపిస్తున్నాయి. వళ్ళంతా తరితేపులతో అలసిపోయింది. వరదరాజస్వామి వారితో నలివిన సమశృంగారంలో ఆమెగారు వడలి ఒడలిక చెందితే యిరుగడలా చెలులుకై దండలిచ్చి తడబడే అడుగులను బడల్ని సోలనున్న స్థితిలో నడిపిస్తున్నారట-తెల్లవారెనని పరమాత్ముడ్ని ఎచ్చరించి ఆమె బయటికి వచ్చేశాక, బహుశా అయ్యవారు మేలుకొలుపు అయ్యేదాకా సొలసి నిద్రిస్తారేమో!

    ఇంతి చక్కగా బొమ్మకట్టేలా పద రచన చేశాడు. క్షేత్రయ్య ప్రతిదానికి యింతింత కధ రసవత్తరంగా పలుకుతుంది---

    ఆయన పలుకుబళ్ళు కూడా అద్భుతంగా వుంటాయి. అనుకూలుడైనట్టి మగవాడు కలిగితే అంతకన్నను సంభ్రమున్నదా అంటాడు ఓచోట! ఇన్నాళ్ళు వలె కాదమ్మా మువ్వ గోపాలుడెన్ని నేర్చినాడమ్మా అని ఆశ్చర్యపోయినా, ఎంత చక్కనివాడే నాసామి అని కితాబిచ్చినా? ఒక్కసారికే యిలాగైతే ఓహోహో యిదేమిటి అని ఎగతాళి చేసినా కలికిరో యింకొకసారి అని ఆశపడినా, వలచేది యొకరి కోసమా అని నిర్వేదించినా, ముచ్చట దీరదు మువ్వ గోపాలా అని వేడినా, రమ్మనవే! సముఖాన రాయభారము లేలే అని నిలదీసినా, రామ! రామ! ఈ  మేనితో నిక వాని మోము చూడవలెనా, మొదటి పొందే చాలు అని నిరసించినా సరసి జాక్షి జన్మము సఫలమాయెను అని రసించినా సామాన్యము గాదే వాని పొందూ అని తృప్తించినా చినదాని మనసు లోతులు కచ్చిగా నిక్కచ్చిగా చెప్పకల్గటం క్షేత్రయ్యకే చెల్లింది.

    గంపెడు మధుర పదా(ర్దా)ల్లో ఒకే ఒక పదా(ర్ద)మే ఇంత తీపి అయితే అన్నీ ఆస్వాదిస్తే!

    జనులకు విమల విందు... అయితే ఆయనే అన్నట్టు పాయవు హొంతకారి కావలె వాని పద పద్య రచన సేయవలె, వాని ముద్దు కవిత చదువు నేరవలె, అవగలయందు గాయకురాలు కావలె!


                                                       ---*---

 Previous Page Next Page