'తెలియకపోతే తెలియజెప్పరాదా!'
'చెపుతా! చెపుతా! చెప్పాలనే కదా వచ్చాను!'
'ఏమిటమ్మా విచిత్రం! చూడాలని వచ్చానంటావు. చెప్పాలనీ వచ్చానంటావు. ఆశ్రమానికి విచ్చేసిన అతిథి అభ్యాగతులకు స్వాగత సత్కారాది సేవలు చేసి ఆపై ప్రసన్నవేళలో రాకకు పరమార్ధమేమో తెలుసుకోవడం మా ఆచారం. అందుకే ఎందుకొచ్చావమ్మా అని అడగలేదు' అంది అహల్య పెదవులు విచ్చీ విచ్చకుండా నవ్వుతూ.
మళ్ళీ ఆ నవ్వులకు ముగ్ధురాలయింది ఆ యువతి.
'అమరేంద్రుడన్నది అక్షరాశః నిజం' మళ్ళీ అంది ఆమె. 'నిజంగా జగదేక సుందరివి నువ్వు!' ఆ మాటలకు మాటలు కలుపుతూ అంది. అంతటితో ఆగకుండా మళ్ళీ అంది. 'దేవతలూ, మునులూ ఈ అందం కోసం పరుగుపందెంలో పాల్గొన్నారంటే పాల్గొనరూ! పాల్గొనకుండా ఎలా ఉండగలరు?'
అహల్య నవ్వుతూ అంది 'ఏమమ్మా! పనిగట్టుకుని నన్ను సాగనంపడానికే వచ్చావా!'
'ఆడది మెచ్చిందే అందం. ఔను, నిన్ను చూసి కళ్ళున్నందుకు సార్ధకం చేసుకుని, నీతో మాట్లాడి జన్మ ధన్యం చేసుకుని, నీ మైత్రి సంపాదించి పుట్టుక సార్ధకం చేసుకోవాలని వచ్చాను!'
అలా ఎదుట నిలుచుని ముఖాన్నే పొగడుతూ ఉంటే అహల్యకెలాగో ఉంది. ఆమె ఆత్మీయత నిండిన మాటలు ఆనందాన్ని కలిగిస్తూనే ఉన్నా- వినడం వీనుల విందుగానే ఉన్నా- ఏదో ఇబ్బందికరంగా ఉంది.
'నీకిది వింతగా అనిపించిందా?'
'ఏం కాదమ్మా! ఆ దివిలో జన్మించిన అందరి నోటా ఇదే మాట! ఆ దివి నుండి భువికి దిగివచ్చేశాక చూడవచ్చిన ప్రతివారి నోటా ఇదే మాట. వినీ వినీ...'
'విసుగ్గా ఉందా?'
'విసుగెందుకూ?' తెల్లబోయినట్లు ప్రశ్నించింది అహల్య.
'వినగా వినగా విసుగు, తినగా తినగా విసుగు. ఇది లోక సహజం కదా!'
'ఏమో! నాకయితే విసుగనిపించటం లేదు.'
'బ్రతికించావు. నాలోని ఆశను బ్రతికించావు. చాలు చాలు. అందం గురించి అందరూ అన్నమాటే అంటూ నన్ను విసిగించకు. వేరే ఏదైనా మాట్లాడు. లేదా త్వరగా సెలవు తీసుకో అంటావేమోనని చాలా భయపడ్డాను.'
'ఎందుకంటాను! వచ్చిన అతిథిని గౌరవించడం మా ధర్మం. నచ్చినా నచ్చకపోయినా అతిథిని మన్నించాలి. 'అతిథి దేవోభవా అని కదా ఆర్యోక్తి!'
'నేనూ నిజంగా దేవజాతినేలే!' అంది మెల్లగా.
'అంటే.. అంటే....'
'నేను మానవ జాతి స్త్రీనీ కాదు. ఈ భూలోకపు వాసినీ కాదు'
'మరి యక్ష కన్యవా?'
'యక్షిణి అనుకుంటున్నావా? ఎందుకు?'
'అందగత్తెలందరూ యక్షులో- గంధర్వులో- కిన్నెరలో- దేవతలో- అయి ఉండాలి కదా! అందుకని అలా అడిగాను'
'ఆ కోవలో ఆఖరి కోవ నాది. మాది అమరావతి' అంది.
'స్వర్గలోక వాసివా? స్వర్గం నుంచి....'
'పనిగట్టుకుని నిన్ను చూడాలని వచ్చాను'
'నిజమా?' నవ్వుతూ అడిగింది.
'నిజం గాక నిజంకాని మాట నా నోట వస్తుందా ఆహల్యా!'
'అమృతం తాగే నోట అనృతం ఎలా వస్తుందిలే! ఇంతకూ నీపేరు చెప్పనే లేదు'
ఇంద్ర సఖి!' చప్పున అంది. 'ఇంద్రాణి ఆంతరంగిక సఖిని. శచీదేవి మనస్సు తెలుసుకుంటూ. శచీ నాధుడి ఆంతర్యం ఎరుగుతూ వారి కనుసన్నలలో నేను మెలుగుతూ ఉంటాను. అదే నా విధి. ఇంద్ర ఇంద్రాణుల సన్నిధిని నేను నర్తించడమే నా కర్తవ్యం.'
'ఇంద్ర సఖి...'
ఆ మాటలు వినగానే ఉలికిపడింది అహల్య. అయినా క్షణంపాటు మళ్ళీ మనస్సు నిశ్చలమైంది.
'నిన్ను చూడాలనే వచ్చాను అహల్యా!' తొలిసారి పేరుపెట్టి పిలిచింది ఇంద్రసఖి.
ఆ మాటలు ఎంతో ఆనందాన్ని కలిగించాయామెకు. 'సఖీ!' అని ప్రీతితో పిలిచింది అహల్య. 'నేను నిన్నలా పిలుస్తాను. ఔను అలాగే పిలవాలనిపిస్తున్నది. సఖీ! ఎంత మధురమయిన పేరు! పూర్తి పేరుతో పిలిచేకన్నా ఇలాగే పిలుస్తా!' అంది.
'సఖీ! ఇంద్రసఖి!' తనలో అనుకున్నట్టుగా అంది. తర్వాత అహల్యను చూస్తూ అంది. 'ఎంత బాగుంది నీ పిలుపు! యుగయుగాల నుండీ చేస్తున్న చెలిమి కలిమి బలిమి లాగ ఉన్నదమ్మా చెలీ! నీ నుంచే ఆత్మీయత, అనురాగం, ఆప్యాయత ముప్పేటలుగా పుట్టుకొచ్చాయా అన్నంత కమనీయంగా ఉంది నీ పిలుపు.'
అహల్య నవ్వింది.
'నీ నవ్వులోనూ ఎంత నాజూకు! ఎంత నవ్యత! అహల్యా! పదేపదే నిన్ను చూడాలని ఉంది. మనసైనప్పుడల్లా మహేంద్రుని సన్నిధి నుంచి నీ పెన్నిధికి వచ్చేయనా! ఎంత! తృటిసేపు! అక్కడ అనుకుంటే ఇక్కడ దిగేస్తాను. మా వేగం మనోజవం కదా!'