Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 25


    అమానుషంగా మొదటి రోజుని మించి పశువులా ప్రవర్తిస్తుంటే ప్రతిఘటించే శక్తి కూడా లేక పోయింది.
    ఎలాగో ఒక్క నిమిషం ఊపిరిపీల్చుకునే వీలు దొరకగానే "ఛీ -పశువా, రాక్షసుడా నన్ను వదులు. లేకపోతే అరుస్తాను. నలుగురిని పిలుస్తాను. పోలీసు రిపోర్టు ఇస్తాను" ఎగిసి పడుతున్న గుండెలతో అరిచాను ...
    "అరు నిన్ను రక్షించే వాడెవడో చూస్తాను" నోరు గట్టిగా దవడ ఎముకలు విరుగుతాయేమో నన్నంత బలంగా నొక్కారు.
    బాధతో గిలగిలలాడాను. ఆ రాక్షసక్రతువు పూర్తి అయ్యాక -లేచి
    "వళ్ళు దగ్గిర పెట్టుకు మసులుకో. నన్ను రెచ్చగొడితే ఇదే జరుగుతుందని గుర్తుంచుకో" వగరుస్తూ అన్నారు.
    ఆ క్షణంలో నా చేతిలో ఆయుధం ఏదన్నా ఉంటే ఆయనని హత్య చేసివుండే దానిని... కళ్ళల్లో నిప్పులు కురిపిత్శూ వగరుస్తూ అలా పక్క మీదే పడుకున్నాను.
    ఆయన బాత్ రూముకి వెళ్ళగానే - ఆ క్షణంలోనే అక్కడనించి వెళ్ళి పోవాలన్న ఆవేశంలో చటుక్కున లేచి చిరిగిన జాకెట్టు మార్చుకున్నాను. నలిగిన చీర విప్పి మరోటి కట్టుకొని పైన వున్న నాలుగు వస్తువులు పెట్టిలో కూరి చక చక గుమ్మం వైపు అడుగులు వేశాను.
    అదే నిమిషంలో బాత్ రూం లోంచి ఆయన రానే వచ్చారు. ఒక్క నిమిషం ముందు అయితే ఆ గది దాటగలిగేదాన్ని.
    నాచేతిలో పెట్టివంక చూసి జరగబోయేది గ్రహించారు.
    చటుక్కున ముందుకు వెళ్ళి తలుపు తీస్తున్న నన్ను ఒక్క అంగలో సమీపించి పక్కకి బలంగా నెట్టి తలుపు లాక్ చేసి తాళం వేశారు. వికటంగా నవ్వారు. "ఇంకా నీకు బుద్ధి రాలేదన్న మాట" అంటూ విసురుగా నాచేతిలో పెట్టె లాగారు.
    "వదలండి నన్ను. వదలండి" పిచ్చిగా అరిచాను. "తలుపు తీయండి - ఈ నరకంలో ఒక్క క్షణం వుండను. నన్ను వదలండి" పెట్టె గుంజుకోబోయాను.
    ఆయన నా మాటలు లక్ష్య పెట్టనట్టు పెట్టె టేబిల్ మీద పడేశారు. నా చేతిలో హాండ్ బాగ్ లాక్కున్నారు. దాన్లో తాళంతీసి పెట్టె తీశారు. చీరలు అన్ని విసిరి దాన్లో ఉన్న డబ్బు-నా బంగారు వస్తువులు - బ్యాగులో పర్సు అన్నీ తీసి రూములో ఉన్న గాడ్రెజ్ బీరువాలో పడేసి లాక్ చేశారు.
    ఆ తాళం, తలుపు తాళం లాల్చీ జేబులో వేసుకుని నా వైపు చూడ కుండానే నిర్లక్ష్యంగా వెళ్ళి పడుకున్నారు.
    నిస్సహాయంగా నిలబడి చూడడం మినహా ఏం చెయ్యలేక పోయాను. నన్ను అక్కడ బందీ చేశారని గ్రహించగానే ఏడుపు వచ్చింది. సోఫాలో కూలబడి ... ఏ నాడు కంట తడి బెట్టని నేను వెక్కి వెక్కి హృదయ విదారకంగా ఏడిచాను. అక్కడ లేని అమ్మానాన్నలని ఉద్దేశించి రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను.
    ఆ వూర్లో ఉన్న పది రోజులు బందిఖానాలోనే గడిపాను. ఆయన ఎప్పుడూ రూము లోనే ఉండే వారు. ఎప్పుడన్నా పైకి వెళ్ళినా రూము తాళం వేసుకు వెళ్ళేవారు. అక్కడనించి వెళ్ళే మార్గం లేదని స్పష్ట పడింది. ఆయన రూములోంచి వెళ్ళిన కాసేపటిలో తలుపులు బాది ఏ బాయ్ నో పిలిచి తాళం తెమ్మని పారిపోతే అన్న ఆలోచన వచ్చింది. కాని ... అలా చేస్తే హోటలులో అంతా ఏమనుకుంటారు? మేనేజరుకి ఏం చెప్పాలి? ఏం అనుకుంటే నాకేం, నేనెవరో ఇక్కడ ఎవరికీ తెలీదు. ఎవరేం అనుకున్నా ముందీ బందిఖానా నించి బయట పడాలి. ఓ రోజు తెగించి ఆయన బయటికి వెళ్ళాక కిటికీ లోంచి బాయ్ ని పిలిచి సాధ్యమైనంత సహజంగా -
    "బాయ్ -మా వారు నేనిందాక బాత్ రూములో వున్నానని పైన తాళం వేసి వెళ్ళారు. మీ స్పేర్ తాళం తీసుకువచ్చి తలుపు తీయి. ఆయనెప్పటికి వస్తారో ఏమిటో" అన్నాను.
    "తాళం లేదండి. రెండు తాళాలు వారే తీసుకున్నారు" అన్నాడు. ఆయన ముందు జాగ్రత్తకి, ఆ తెలివికి తెల్లపోయాను.
    మరో రోజు ఇంకో ఆలోచన వచ్చింది. "నాన్నకి టెలిగ్రాం ఇస్తే-" అనిపించి వెంటనే కాగితం మీద తక్షణం వచ్చి కలుసుకో వల్సింది అని ఎడ్రసు ఇచ్చి టెలిగ్రాం రాశాను. టెలిగ్రాం ఇవ్వడానికి కూడా రూపాయి డబ్బులు లేక పోయాయి.
    బాయ్ ని పిలిచి నాచేతి వాచి ఇచ్చి ఎలాగైనా టెలిగ్రాం పంపమని బతిమిలాడాను.
    బాయ్ నా వైపు భయంగా, అనుమానంగా చూసి వద్దండీ - మేనేజర్ మీరేం చెప్పినా చెయ్యవద్దని, మీ దగ్గిర ఏం తీసుకోవద్దని అన్నారు" అంటూ నేను పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు.
    హతాశురాలి నయ్యాను. ఆయన అన్ని విధాల పకడ్బందీగానే నన్ను బందీ చేశారని తెలిసింది. సరే - ఎన్నాళ్ళిక్కడ ఉంచుతారు. ఊరు వెళ్ళాక ఎన్నాళ్ళని బంది ఖానాలో పెడ్తారు చూద్దాం అనుకున్నాను.
    "ఏమిటీ అమానుషత్వం! ఆయనింత క్ర్రూరంగా ఎందుకు తయారయ్యారు?" శారద ఆశ్చర్యం పట్టలేక మధ్యలో అడిగింది.
    విజయ అదోలా నవ్వింది.

 Previous Page Next Page