Previous Page Next Page 
మాయ జలతారు పేజి 25


                               11

    అద్దం ముందు కూర్చొని జడ అల్లుకుంది రజని. ముందు ఉన్న జడను వెనుకకు విసిరింది. అలంకరణ ప్రారంభించింది. కళ్ళకు సన్నని కాటుక రేఖ దిద్ది, వాటిని తూపులుగా మార్చింది. నొసట జ్యోతిలాంటి తిలకం దిద్దింది.
    అలంకరణ ఆమె అందానికి వన్నె తెచ్చింది. తన ప్రతిబింబాన్ని చూచి తానే మురిసిపోయింది. ముగ్ధలా ముద్రవేసి కూర్చుంది. తన అందాన్ని తానే తాగేయాలనుకుంది. అద్దంలోని ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకుంది.
    స్నానం చేసి భుజంమీద తువలుతో గదిలో అడుగుపెట్టిన రాజారావు అది చూచాడు "మరి మా గతి?" అన్నాడు.
    రజని ముఖం మీద ఎరుపు తరంగం ఎగిసి దిగిపోయింది. చిరునవ్వు నవ్వి "రజని" అన్నది.
    "అంటే రాత్రి అనా?"
    రజని బుగ్గల్లో సిగ్గులు నిండాయి. తాను అర్థం రావాలని అనలేదు. జవాబు చెప్పడానికి తడబడింది "చిలిపివారు అవుతున్నారండీ!" అన్నది.
    "అవుతున్నానా? చేస్తున్నావా?"
    అతనిలో ఉద్రేకం పరవళ్ళు తొక్కింది. అంత అందాన్ని చూస్తూ ఊరుకోలేకపోయాడు. అడుగు ముందుకు వేశాడు. ఇంతలో అర్థం చేసుకున్నాడు. అడుగు వెనక్కు వేసి కుర్చీలో కూలబడ్డాడు.
    కాశ్మీరం నుంచి కన్యాకుమారి అగ్రం వరకూ తిరిగి బెంగుళూరు వచ్చారు. అయినా, రంజనిలో ఏ మార్పూ కనిపించలేదు. తిరిగిన చోటనల్లా డాక్టర్లకు చూపించాడు. అంతా వంట్లో ఎలాంటి జబ్బు లేదన్నారు. వ్యాధి మనసునకు సంబంధించిందన్నారు. స్వతహాగా తగ్గాలన్నారు. రజని ప్రవర్తన చూస్తే నటన అనడానికి కూడా వీలులేకుండా వుంది. కొంత విసుగు కూడా కలిగింది. అయినా సహించాడు. ఏనాటికైనా రజని తనది అవుతుంది అనుకున్నాడు. రజని తనతో సిరులు తెచ్చింది. ఆమె అందంతోపాటు అవీ పెరుగుతున్నాయి.
    రజనీని చూచాడు. ఆమె పసివాడింది. అలాంటప్పుడు ఏం చేయాలో అతనికి తెలుసు.
    "రజనీ, కాశ్మీరంలో మంచు గుర్తుందా?"
    మంచు తివాచీ మీద పొడవైన చీనార్ వృక్షాలు, వాటి మధ్య నుంచి రాజారావు తాను నడవడం, ఒక్కోసారి పరిగెత్తడం గుర్తువచ్చాయి. రజని ముఖం కళకళలాడింది.
    "చీనార్ చెట్లలో పరిగెత్తాం. తెల్లని మంచు పచ్చని చెట్లు - ఎంత అందమైన చోటండీ!"
    "జైనుద్దీన్ తల్లి సమాధి గుర్తుందా?"
    "లేకేం? దోసిళ్ళలో పూలు పోశాం గదా ఆ సమాధి మీద!"
    కన్యాకుమారి అగ్రంలో సాయంసంధ్య సౌందర్యాన్ని గురించి పదాలు అందినంతవరకూ వర్ణించుకున్నారు.
    "కోతి" అన్నాడు రాజారావు.
    రజని తలతిప్పి చూసింది. సర్వర్ కాఫీ తెస్తున్నాడు. అచ్చం కోతిలాగే ఉన్నాడు.
    "కోతి కాఫీ తెస్తూంది" అని కిలకిలా నవ్వేసింది రజని.
    ట్రే అక్కడపెట్టి కోపంగా వెళ్ళిపోయాడు సర్వర్.
    "కోతి సారాయి తాగింది" అని నవ్వసాగాడు రాజారావు.
    తెరలు తెరలుగా వచ్చే నవ్వును ఆపుకుంటూ "నిప్పు అమ్మ నిప్పు తొక్కింది" అన్నది రజని.
    ఇద్దరూ విరగబడి నవ్వుతుండగా టెలిఫోను మ్రోగింది.
    "హలో! ఎక్కణ్ణుంచి? హైదరాబాదు నుంచా? ఏమి? పార్వతి ప్రసవ వేదనలో ఉందా? ప్రమాదం లేదుగదా? ఆఁ వెంటనే రావాలా? సరే కారు ఇక్కడే వదిలేసి ప్లేనులో వస్తా. ఆఁ ఆఁ ఉందనుకుంటా ప్లేను, ఒక గంటలో సరి జాగ్రత్త నేను వచ్చేస్తున్నా"
    ఆ టెలిఫోను రాజారావులో పెద్ద మార్పును తెచ్చింది. ముందెన్నడూ పార్వతి విషయంలో అంత ఆతురత కనబర్చలేదు.
    "రజనీ! పార్వతికి బావుండలేదు. నేను అర్జంటుగా వెళ్ళాలి. తల్లి కాబోతూంది. ప్లేనుకు వెళ్తా. కార్లో వస్తావా?"
    మూతి ముడుచుకుంది రజని. తలవంచుకుంది. తానూ వస్తానంది. విసుక్కున్నాడు రాజారావు. పార్వతి! గుండె దడదడ లాడింది. "సరే, తయారుకా" అన్నాడు. తన బట్టలు సర్దుకున్నాడు. తన పెట్టెతో తయారైంది రజని. గబగబా సాగిపోయాడు. వెనుక నడిచింది రజని. కారులోను, ప్లేనులోనూ ఇద్దరూ మాట్లాడలేదు.
    బేగంపేటలో ప్లేను దిగి ఇంటికి వచ్చేశారు ఇద్దరూ. రజనీకి ఆ ఇల్లు కొత్తేమీ కాదు. అయినా, ఆ ఇంట్లో కొత్తదనం కనిపించింది. ముడుచుకున్న మొగ్గలా ఉండిన ఇల్లు అమాంతంగా పొద్దుతిరుగుడు పూవులా వికసించింది. కారు దిగి మెట్లెక్కడంలోనే హుషారు కనిపించింది రాజారావులో. పయ్యెద సవరించుకొని వెనుక నడిచింది రజని. ఇద్దరూ మేడ మెట్లెక్కారు - ఒకరు వేగంగా, ఒకరు మెల్లగా రాజారావు చరచరా వెళ్ళిపోయాడు. రజని తన గదిదాకా వచ్చి ఆగిపోయింది. అతడు వెనక్కు తిరిగి వస్తాడనుకుంది. నుంచుంది. రాజారావు మలుపు తిరిగేదాకా చూసింది. బూట్ల చప్పుడు వినిపించనంతసేపు బొమ్మలా నుంచుంది? గిర్రున తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది. కనీసం చెప్పులైనా విప్పకుండా మంచంమీద వాలిపోయింది. రాజారావులో వచ్చిన పరివర్తన ఆమెకు ఆశ్చర్యాన్ని కాక దుఃఖాన్ని కలిగించింది. దుఃఖం పొంగింది. దాన్ని అణచుకుంది. ఏవేవో ఆలోచనలు ఆవిడ మెదడులో ముసిరాయి.
    "తానెవరు? ఎక్కణ్ణుంచి వచ్చింది? ఇక్కడికి ఎందుకు వచ్చింది? రాజారావు ఎవరు? తనకూ అతనికీ ఉన్న బాంధవ్యం ఏమిటి?"
    ఇలాంటి ఆలోచనలు ఆమెకు పూర్వం రాలేదని కాదు కాని, రాజారావు అనురాగం వాటిని తలెత్తనివ్వలేదు. ఈరోజు పిడుగుపడిం దావిడమీద. రాజారావు తనను విస్మరిస్తున్నాడు. తనను వదలి వెళ్ళిపోయాడు. తాను లేకుండా క్షణం ఉండలేనివాడు హుషారుగా సాగిపోయాడు. అలా ఎందుకైనాడతను? తన గతేమి? ఎందుకుండాలి తానిక్కడ? ఎక్కడికి వెళ్ళాలి తాను? ఎవరున్నారు తనకు? నారాయణరావుగారిని తలచుకుంది. అతడు పార్వతికి తండ్రి. తనకు తండ్రి లేడు. తల్లీ లేదా? వారు తనను గురించి పట్టించుకోరా? తానంటే ఆసక్తిలేని రాజారావుతో తనకేం పని?
    ఆలోచనలలో మునిగి, నౌకరు గదిలో ప్రవేశించింది కూడా గమనించలేదు. నౌకరు చూచాడు. కన్నీటిధారలు కనిపించాయి. వళ్లు జల్లుమన్నది. ఆవిడ దుఃఖించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు అతనికి.
    "దొర రమ్మన్నడు" అన్నాడు మెల్లగా చేతులు కట్టుకొని నుంచొని.
    లేచి కూర్చుంది "ఎందుకొచ్చావ్" అడిగింది.
    "దొర రమ్మన్నడు"
    "వస్తా నడువ్"
    "బిర్న రమ్మన్నడు"
    "వస్తానన్నాగా నడువ్" - గద్దించినట్లు మాట్లాడింది. తలవంచుకొని వెళ్లిపోయాడు.
    రాజారావు పిలుస్తే తానెందుకు వెళ్ళాలి? అదీకాక మనిషిని పంపిస్తాడా! తాను రాగూడదూ? వెళ్ళరాదని నిశ్చయించుకుంది. వెయ్యి విధాల ఆలోచించింది. తుదకు వంటరితనం భరించలేక వెళ్ళడానికే నిశ్చయించుకుంది. బాత్ రూముకు వెళ్ళింది.

                           * * * *

    పార్వతి మగబిడ్డను కన్నదని రాజారావుకు విమానాశ్రయంలోనే తెలిసింది. హృదయం గంతులు వేసింది. పాపను చూడాలనే ఉబలాటంతోపాటు పార్వతిని చూడాలనే ఆతురత ఎక్కువైంది. కారులో ఎక్కాడనేగాని అతని మనసంతా పార్వతిమీదా పాపమీదనే ఉంది. కారు చీమలా నడుస్తున్నట్లనిపించింది. అతని మనోఫలకంమీద పార్వతి, పసిబిడ్డ - తన బిడ్డ - మసలారు అతనికి తన బిడ్డను గురించి అనేక ఊహలొచ్చాయి. బిడ్డకు పెట్టాల్సిన పేరు, వేయాల్సిన దుస్తులు, నియమించాల్సిన నర్సు, చదివించాల్సిన స్కూలు - ఇంకెన్నెన్నో.
    కారు పోర్టికోలో ఆగగా చివాలున దిగి చరచరా మెట్లెక్కాడు వాస్తవానికి తన వెంట రజని ఉందనే విషయం మరచిపోయాడు. వేగంగా నడచి పార్వతి గదిలో ప్రవేశించాడు. అతన్ని చూడగానే బట్ట కాళ్ళనిండా కప్పుకొని పయ్యెద సవరించుకొంటూ, మంచంలో లేచి కూర్చుంది. పార్వతి రాజారావు మంచం ప్రక్కన కూర్చోబోయి, పక్కనున్న ఊయల చూచి తొంగి చూచాడు. పల్చని గుడ్డ పొట్టమీద కప్పి ఉన్న బాబు కనిపించాడు. తన గుండెలోని ఒక ముక్క ఊయలలో ఉన్నట్లనిపించింది. పాప నిద్రపోతున్నాడు. గుండ్రని ముఖం, కళ్ళు పార్వతివి, ముక్కు తనది. సృష్టి విచిత్రం అయింది అనుకున్నాడు. నర్సు పాపను తీసి అందించింది. ముద్దులు కురిపించాడు. కుర్చీలో కూర్చుంటూ "పార్వతీ, నువ్వెంత మంచిదానివి!" అన్నాడు.

 Previous Page Next Page