Previous Page Next Page 
శరతల్పం పేజి 25

 

    "ఇన్నావా సేటూ? ఇంకేమన్నా చెప్పెడి దున్నదా?" మైసయ్య రామక్రిష్ణయ్యను అడిగాడు.
    "ఇంకేం చెప్పెడి దున్నది?" అన్నాడు చేతులు తెలవేసి రామక్రిష్టయ్య ----- అతనికి తన కూతురు గుర్తుకు వచ్చింది.
    "రాయేలే కూకున్నావు . పిల్లపోలె మల్ల నా నగలు పోతయా? ధర్మం చెప్పు ధర్మరాజా! అంటే దూడ బర్రె నాదే నన్నాడట" బుచ్చమ్మ రామక్రిష్టయ్య మీద విరుచుకుపడ్డది.
    "ఆవు. అది నిజమే. నగలు బుచ్చమ్మకే రావలె గద" రామక్రిష్ణయ్య అనలేక అనలేక అన్నాడు. తన కూతురు నగలు తానె దాచి దొంగాలేత్తుకు పోయారని చెప్పాడు.
    "నాలానికేముండి ! నగలు నీ కెందుకురా తెచ్చియ్యి గురువా?" అన్నాడు మైసయ్య.
    గురువయ్య మాట్లాడకుండ లేచి వెళ్ళాడు.
    పిచ్చమ్మ మొత్తం నగలు వలచి గురువయ్య దోసిట్లో పోసింది. గురువయ్య తెచ్చి మైసయ్య దోసిట్లో పోశాడు. మైసయ్య రామక్రిష్టయ్య ముందు కుప్ప పోశాడు. బుచ్చమ్మ నగలు లెక్కపెట్టి కొంగున మూట కట్టుకొని "మల్ల నా పెండ్లి కర్చు!" అడిగింది.
    దాన్ని గురించీ వాగ్వాదాలు జరిగాయి. మైసయ్య బుచ్చమ్మ చూపిన ఆశకు లోంగాడు. రామక్రిష్టయ్యకూ కొంత ఆశ పెట్టింది. అందరూ కలిసి బుచ్చమ్మ తన కొడుకు పెళ్ళికి పెట్టిన కర్చు అణా పైసల్తో గురువయ్య నెత్తికి చుట్టారు.
    గురువయ్య మాట్లల్లేదు.
    కులం తప్పు కింద కొంత వేశారు. గురువయ్య మాట్లాడలేదు.
    గురువయ్య పొలం రామక్రిష్టయ్య రాయించుకున్నాడు.
    గురువయ్య అంగుష్ఠం వేశాడు.
    గురువయ్య వట్టి కూలిగా మారిపోయాడు.
    ఇంటికి వస్త పిచ్చమ్మడిగింది "అన్ని పోగొట్టుకున్నవట గద నా కోసం."
    "పిచ్చీ నువ్వు పోలేదు గద, అదే చాలు" అన్నాడు.
    అతని కళ్ళు వెలిగాయి ---ఆమె కళ్ళలో వెలుగులు చిమ్మాయి.
    "కొత్త చీర కట్టుకో. అయ్యగారింటికి పోయి దండం పెట్టి వద్దం" అన్నాడు గురువయ్య.
    కొత్త చీరతో కొత్త పెళ్ళి కూతురులా తయారైంది పిచ్చమ్మ. ముందు గురువయ్య నడవగా అయ్యవారింటికి చేరారు.
    నారాయణస్వామి వ్యాస పీఠం ముందు - వసారా అరుగు మీద కూర్చొని నాంచారమ్మకు పురాణం చెపుతున్నారు.
    "రమ్మంటారా అయ్యగారూ!' అనే గురువయ్య మాటలు విని తలెత్తి చూచారు.
    గురువయ్య పిచ్చమ్మ కనిపించారు. కళ్ళద్దాలు తీసి ఒకసారి ఇద్దర్ని చూచారు. "రా గురువయ్య౧ ఈ ఇల్లు నువ్వు కట్టిందేనయా! అడగాల్న రావటానికి" అని లేచి నుంచున్నారు. నాంచారమ్మ కూడా లేచింది. ఇద్దరూ అరుగు చివరన వచ్చి నుంచున్నారు.
    "ఇగో పిచ్చిని తెచ్చిన!" అని వారితో చెప్పి "పిచ్చి! దండం పెట్టు - వీంద్లే మనకు దేవుండ్లు" అన్నాడు.
    పిచ్చమ్మ, గురువయ్యా నేలనంటి దండాలు పెట్టారు.
    "పుత్రపౌత్రాభివ్రుద్దిరస్తు" అని దీవిస్తున్న నారాయణస్వామి గొంతు బొంగురువోయింది.
    నాంచారమ్మకు పిచ్చమ్మలో లచ్చమ్మ కనిపించింది. "ఇగ వస్తామండీ" అని పిచ్చమ్మ చేయి పట్టుకొని బయల్దేరాడు గురువయ్య.
    ఏదో గుర్తు వచ్చినట్లు "గురువయ్య! కాస్త అగు" అని లోపలికి పోయింది నాంచారమ్మ.
    గురువయ్యా పిచ్చమ్మా నుంచుండిపోయారు.
    నారాయణస్వామి గుమ్మం వేపు చూస్తూ ఉండిపోయాడు.
    నాంచారమ్మ ఒక రవిక పీటీ, తమలపాకులూ, వక్కలు తెచ్చి పిచ్చమ్మ దోసిట్లో వేసి "గుమ్మాడి పండు వంటి కొడుకును కను" అని దీవించింది. పిచ్చమ్మ మళ్ళీ దండం పెట్టింది.
    ఇంటికి పోతుంటే గురువయ్యకు చిటికిన పాము పడగ కళ్ళలో ఆడింది. ఆ రాత్రి సారా దుకాణానికి వెళ్ళి బాగా తాగేశాడు గురువయ్య. ఇంటికి వచ్చి లచ్చమ్మను తలచుకొని , పిచ్చమ్మ మీద పడి భోరున ఏడ్చేశాడు.
    ఆనాటి నుంచి గురువయ్య తాటివనానికి వెళ్ళడం మానేశాడు. సారాయికి అలవాటు పడ్డాడు.
    తాగి ఏ అర్ధరాత్రికో ఇల్లు చేరేవాడు--- పిచ్చమ్మది మూన్నాళ్ళ మురిపమే అయింది . తాగి వచ్చిన గురువయ్య లచ్చమ్మను తలచుకొని పిచ్చమ్మను తోలి రోజులలో తిట్టడం, తరువాత చచ్చేట్లు కొట్టడం సాగింది. పిచ్చమ్మ వల్లనే తాను సర్వనాశనమైననుకునేవాడు గురువయ్య. లచ్చమ్మ చావుకూ, పుట్టిన పాప పోవడానికి పిచ్చమ్మే కారణం అని ఆమెను రాచి రంపాన పెట్టేవాడు. పిచ్చమ్మను నరకయాతన అయింది. ఆమె ఇల్లు విడిచి కదిలేది కాదు. నాంచారమ్మకు పిచ్చమ్మతో అట్టే అనుబంధం ఏర్పడలేదు. గురువయ్య కూడా నారాయణస్వామి ఇంటికి  ఎప్పుడో గాని వెళ్ళటం లేదు.

 Previous Page Next Page