గోనె సంచి మూతి బిగించి కట్టేశాడు.
"వస్తా మాస్టర్జీ"
"నా సంగతి కనిపెట్టి వుండు"
"అయ్యబాబోయ్! ఎంత మాట! నువ్వు నన్ను మర్చిపోకు. నేను నిన్ను మర్చిపోను. అదే మన యండర్ స్టాండింగు. సరేనా?" అన్నాడు దాసు.
బయట రిక్షా నిలబడి వుంది. రిక్షా అతని సాయంతో బస్తాని సాయంపట్టి, రిక్షాలో కాళ్ళు పెట్టుకునే చోట కుదేశారు.
రిక్షా కదిలింది. యమ బాధ కలిగింది రాజాకి.
బస్తాని రిక్షాలో సరిగా వుంచలేదు వాళ్ళు. సగం రిక్షాలో వుంది. సగం కిందికి జారుతున్నట్లు వుంది. రాజా తల రిక్షా టైరుకి తగులుతోంది.
పైగా, రాజా వున్న బస్తా మీద కాళ్లు పెట్టుకుని కూర్చున్నాడు దాసు.
కాసేపయ్యాక, శక్తి కూడదీసుకుని అడిగాడు రాజా.
"ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ నన్ను?"
"అమ్మనీయమ్మ! నిన్నెక్కడికి తీసుకెళ్ళాలో నాకు తెల్దా? నోరు ముయ్యహే!"
తిరుగుతున్న టైరు తలకి తగులుతూ వుంటే, తలని కొబ్బరి తురిమే పీటకి వేసి రాస్తున్నట్లు అనిపిస్తోంది రాజాకి.
గబగబా ఆలోచిస్తున్నాడు రాజా.
ఎక్కడికి తీసుకెళ్తున్నాడు తనని?
ఏం చేస్తాడు?
ఏవో వెధవ పనులే చేయిస్తాడు.
వెధవ పనుల్లో కూడా రెండు రకాలు వుంటాయి.
దర్జాగా చేసే వెధవ పనులు!
డ్రైనేజీ గుంటలో చేపలు పట్టే లెవెలు వెధవ పనులు.
తను మొదటిరకంవి చేస్తాడు. ఈయన రెండో రకం.
ఆ పిచ్చిపిచ్చి పనులన్నీ తనచేత చేయిస్తాడు కాబోలు!
అయినా ఈయనకీ ఆ మాస్టారికీ ఎట్లా కుదిరింది లంకె!
అరె ఉస్కీ...భలే చాలూగాడే ఆ మాస్టారు!
అందర్ సే బడే దాలిమ్...బాహర్ సే బడే భోలే....
ఒప్ఫో! బహుత్ ఘాయల్ కీ ఆద్మి!
చుప్పారుస్తుం! తీస్ మార్ ఖాన్!
మొత్తానికి భలే మోసపోయాడు టైగర్ కృష్ణాజీ.
అయ్యో పాపం! అయ్యయ్యో పాపం!
బిచారా! ఉల్లూ బన్ గయా!
తన దారిన తనని బతకనివ్వక ఆ బడిపంతులు దగ్గర చేర్చాడు.
అయ్యగారికి తిక్క తిన్నగా కుదిరింది ఇప్పుడు.
ఇలా ఆలోచిస్తున్నంతసేపూ రాజా వేళ్ళు గోనె సంచిని గీకుతూనే వున్నాయి.
అతని ఎడం చేతి గోళ్ళలో ఇమిడి వున్నాయి పదునుగా వున్న కొత్త బ్లేడు ముక్కలు. అతను అనుక్షణం అలర్టుగా వుంటాడు.
రిక్షా ఆగేసరికి గోనె సంచికి సుమారైన కంత పడింది.
దాసూ, రిక్షా అతనూ కలిసి రిక్షాలో నుంచి గోనె సంచిని దింపబోతుండగా - ఊహాతీతంగా అందులో నుంచి అతి వేగంగా బయటికి వచ్చేశాడు రాజా! ఠపాఠపా ఇద్దరి నెత్తినా రెండు చరుపులు చరిచి, మరుక్షణంలో మాయమైపోయాడు.
అరగంట తర్వాత అతను ఒక పాసింజరు రైల్లో ఒక మూల నక్కి కూర్చున్నాడు.
మాస్టారు అంత నమ్మకద్రోహం చేసినందుకు రాజా ఆశ్చర్యపడలేదు. తడి గుడ్డలతో గొంతులు కోసే మనుషుల మధ్య పెరిగినవాడు అతను. ఈ ప్రపంచంలో ప్రతివాడూ ఒక కేటుగాడని చెపితే అతను అసలు ఆశ్చర్యపోడు.
కానీ ఫలాన మనిషి నిజంగా మంచివాడని ఎవరయినా నమ్మించబోతే నమ్మడు అతను. నవ్వుతాడు.
అందుకే రాజా ఆనందరావు కపటాన్ని గురించి పట్టించుకోలేదు.
పైగా....
"ఇదీ ఒకందుకు మంచిదే" అనుకున్నాడు.
ఆ చప్పిడి మెతుకుల జైల్లో నుంచి బయటపడ్డానికి మంచి కారణం దొరికింది తనకి.
టైగర్ కృష్ణాజీ గనక మళ్ళీ కలిసి అడిగితే తను ధైర్యంగా చెప్పవచ్చు.
తన తప్పు కాదని....
పైగా....
ఆయన్నే అదరగొట్టొచ్చు.
తనని అక్కడ నుంచి ఆయనే తప్పించేశాడని!
తను కిలాడీ నా కొడుకు కాబట్టి సరిపోయింది గానీ...లేకపోతేనా అమ్మో!
ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడు రాజా.
టిక్కెట్ కలెక్టరు వస్తున్నట్లున్నాడు.
తను పారిపోయి వచ్చే తొందరలో టిక్కెట్టు కొనలేదు.
అంటే ప్రతిసారీ టిక్కెట్టు కొనడం తనకి అలవాటని కాదూ...అయినా కూడా...
టిక్కెట్ కలెక్టర్ దగ్గరి కొచ్చేస్తున్నాడు.
అయినా భయపడలేదు రాజా. ప్రతి మనిషికీ, ప్రతి దానికీ రేటుంటుంది. ఎవర్నయినా, ఏదో ఒక రేటుకి కొనెయ్యవచ్చు. అదీ అతని ఫిలాసఫీ!