ఎలాగూ రాజేశ్వరి కూడా స్కూలుకి వెళ్తుంది ఆ టైములో. రంగా ఒక నర్సుగాని, ఆయాగాని, ట్రైనింగు అయిన వారు ఎవరన్నా కావాలి. ఇంజక్షన్ ఇవ్వడానికి, నాకు కాస్త అసిస్ట్ చేయడానికి కనీసం ఒకరన్నా వుండాలి. అలా ఎవరన్నా యిక్కడ దొరుకుతారా."
"ఇక్కడెవరు దొరుకుతారు మామయ్యా - ఓసారి పక్కవూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేసేవారిలో ఎవరన్నా వుంటే చూడమని చెప్పనా, లేదంటే పేపర్లో వేయిస్తేనో..."
"ఈ పల్లెటూరు అంటే ఎవరన్నా వస్తారో రారో!"
"ఎవరో ఒకరు ఉద్యోగాలు లేక బాధపడేవాళ్ళుంటారు. ఏదో ఒకటి కొన్నాళ్ళన్నా చేసి చూద్దాం. ఖాళీగా వుండేకంటే అనుకుని వస్తారులే.
"అయితే రాజేశ్వరి అన్నకి హైదరాబాదు ఈనాడు డెక్కన్ క్రానికల్లో ప్రకటనలు యివ్వమని ఫోను చేసి చెపుతాను ఈ రోజే.. ఆస్పత్రి బాగు చేయించడం, ఫర్నిచర్ వగైరా సిద్ధమయ్యేలోగా ఎవరన్నా వస్తే తీసుకోవచ్చు."
కేశవరావు, రంగా విజయవాడ బయలుదేరుతుంటే తన స్కూలుకి కావాల్సిన ఫర్నిచర్, పిల్లలకి యూనిఫారమ్స్, కొన్ని పుస్తకాలు కొన్ని చార్ట్స్ అవి కొనుక్కోవాలని రాజేశ్వరి బయలుదేరింది.
ఆస్పత్రికి, స్కూలుకి కావాల్సిన ఫర్నిచర్ ఆర్డర్ చేసి ముందు ఆస్పత్రి ఫర్నిచర్ పదిరోజులలోగా కావాలని, స్కూలుది కాస్త ఆలస్యం అయినా ఫరవాలేదని ఆర్డరు చేశారు. రాజేశ్వరికి రకరకాల సైజుల్లో యూనిఫారాలు కొంది.
స్కూలులో రాజేశ్వరి తెచ్చిన రకరకాల రంగు రంగుల చార్ట్స్, బొమ్మలు, ఆట సామాను చూసి పిల్లలు సంబరపడిపోయారు. వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూసిన రాజేశ్వరికి పెట్టిన ఖర్చుకి ప్రతిఫలం దొరికిందనిపించింది.
కొత్త యూనిఫారాలు తొడుక్కుని, శుభ్రంగా తలలు దువ్వుకుని, పళ్ళు తోముకుని స్నానం చేసి రావాలని, స్నానం చెయ్యని పిల్లలని క్లాసులోకి రానీయనని రాజేశ్వరి భయపెట్టింది. వారానికో రోజు ఆదివారం తలస్నానం చెయ్యాలని, గోళ్ళు వారానికి ఓ రోజు కత్తిరించుకోవాలని, ఎవరి వంటికన్నా కురుపులు అవి ఉంటే మందు వేసుకుని బాగుచేసుకోవాలని... ప్రతి సోమవారం పిల్లలంతా రాగానే గోళ్ళు, పళ్ళు, జుత్తు అవి చూపాలని అలా శుభ్రంగా లేనివాళ్ళని ఆ క్లాసులో నిలబెడతానని వార్నింగ్ ఇచ్చింది.
ఒకటి రెండుసార్లు ఇద్దరు ముగ్గురు పిల్లలని అలా నిలబెట్టింది, భయం వుండాలని. గోళ్లు కత్తిరించుకోకుండా వచ్చిన పిల్లలకి తానే గోళ్ళు కత్తిరించి గోళ్ళల్లో వుండే మట్టి క్రిములు నోట్లోకి వెళ్ళి ఏవిధంగా హాని చేస్తాయో, కడుపులో పురుగులు, నులిపానులు ఎలా వస్తాయో బోర్డు మీద బొమ్మలు గీసి చూపితే పిల్లలు భయంగా చూసారు.
హరిజనవాడలోని పిల్లలకి శుభ్రత నేర్పడానికి రాజేశ్వరికి చాలా సమయమే పట్టినా రెండు నెలల్లోగా తనక్కావాల్సిన మార్పు పిల్లల్లో వచ్చినందుకు సంతోషంతోపాటు గర్వమూ కలిగింది.
పిల్లలదేం వుంది ఎటు వంచితే అటు వన్గుథారు౧ తల్లి తండ్రి చెపితే వినని పిల్లలు కూడా స్కూలులో టీచర్లు అందులో రాజేశ్వరి లాంటి టీచరు చెపితే తప్పక వింటారు అని అర్థం అయింది.
* * *
"అత్తయ్యా... యివాళ చేపల చెరువు దగ్గిరకి వెడదామా! పొలాలు అవి చూడాలనుకున్నావు గదా. యివాళ చౌదరిగారి చెరువులో చేపల వలలు వేస్తున్నారు."
"ఆ... ఆ... వెడదాం... చూద్దాం-పదండి వెడదాం-" రాజేశ్వరి ఉత్సాహంగా అంది.
"దానికేముంది పద వెడదాం..." ఆయన ఐదు నిమిషాలలో తయారై కారు తీశారు. పొలాలు, చేపల చెరువు దగ్గిరకి చేరేసరికి ఆ ప్రాంతం ఎప్పుడూ చూడని రాజేశ్వరి ఆ గ్రీనరీ చూసి చిన్నపిల్లలాగే సంబరపడిపోయింది. చౌదరిగారి చేపల చెరువు దగ్గిర కారు దిగేసరికి అక్కడ కుర్చీ వేసుకుని, 'పట్టుబాటు'(చేపలు వలవేసే పట్ట) పర్యవేక్షిస్తున్న చౌదరి లేచినుంచుని కేశవరావు, రాజేశ్వరికి స్వాగతం పలికాడు. "రండి రండి! చేపలు పట్టడం చూడడానికి వచ్చారా" ఒరే నారిగా నాలుగు కుర్చీలు పట్టుకురా. అలాగే మంచి కొబ్బరి బోండాలు నాలుగు కొట్టించు" అక్కడంతా మనుషుల సందడి! చెరువులో పాతికముప్పైమంది కూలీలు వలవేసి వడ్డుకు వలను లాగుతున్నారు. వలలో చిక్కిన చేపలు ఎగిరి పడుతున్నాయి ప్రాణభీతితో. ఒక టన్ను, రెండు టన్నులు ఉన్న చేపల వలని కష్టం మీద వడ్డుకి లాగుతున్నారు.
"అన్ని చేపలే- ఒకేసారి వలలో యిన్ని చేపలు పడతాయా" రాజేశ్వరి సంభ్రమంగా అంది.
"ఇది రెండోసారి వేసింది. ఉదయం పదిగంటలకి మొదటిసారి వలవేసినప్పుడు దీనికి రెండింతలు పడ్డాయి. ఆ లోడ్ లారీ వెళ్ళిపోయింది గంట క్రితమే."
"క్రిందటిసారి మా రంగా ఈ చేపల చెరువుల వ్యవహారం అంతా చెప్పాడు. ఇలా మెయిన్ రోడ్డుకి దూరంగా, ఈ పల్లె ప్రాంతాలలో ఇంత బిజినెస్ జరుగుతుందంటే ఎవరూ నమ్మలేరు."
"అవును డాక్టర్ గారూ - ఇదివరకు ఏదో ఏడాదికి రెండు పంటలు, కొబ్బరికాయలు అమ్ముకుని వచ్చిందే దక్కుడు అని తృప్తిపడేవాళ్ళం. ఈ నాగార్జునసాగర్ డామ్ ధర్మమా అని ఈ ఏరియాలన్నింటికి నీటి కరువు లేదు. ఈ పల్లపు భూములన్నీ యిలా చేపల చెరువులుగా మారాక యిదో పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది.
"చేపలు కలకత్తా వెళ్ళేవరకు పాడయిపోవూ- ఎంత లేదన్నా రెండు రోజులు పట్టదూ" రాజేశ్వరి సందేహంగా అంది.
"అందుకేగా మరి ఐస్ వేసి ప్యాక్ చేసింది" ఉప్పు గుట్టలా వున్న ఐస్ చూపించి అన్నాడు. "ఇదిగో ఈ ప్లాస్టిక్ క్రేట్ లో చేపలు వేసి ఐస్ ప్యాక్ చేసి పంపుతాం."
"మరి ఈ చేపల ధర ఇంతకి అమ్మాలని ఎవరు నిర్ణయిస్తారు. ధర ఎప్పుడూ ఒకేలా వుంటుందా" కేశవరావు సందేహం.
"సప్లయ్ బట్టి డిమాండ్. డిమాండును బట్టి ధర కాదాండి. ఏ వస్తువుకైనా ఒకటే సూత్రం డాక్టర్ గారూ. ఎక్కువ లారీలు, ఎక్కువ చేపలు వెళితే ధర తగ్గుతుంది. సప్లయ్ తక్కువున్నప్పుడు ఏజంట్లు ధర ఎక్కువ పలుకుతారు. మనవాళ్ళు అక్కడికి చేరాక పరిస్థితి చూసి లారీ పాట పాడతారు. అక్కడ మనకు లోకల్ ఏజంట్లుంటారు. వాళ్ళు చెప్పిన ధరకి వప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మన లోడ్ దిగదు. అలా ఒకటి రెండు రోజులకంటే వుండవు గదా చేపలు! అంచేత మన అదృష్టం బాగుంటే అనుకున్నదానికన్నా ధర ఎక్కువ పలుకుతుంది. చౌదరిగారు వివరిస్తున్నంతసేపూ రాజేశ్వరి చూపులు వల లాగుతున్నవారిమీదే వుంది. కుర్చీలోంచి లేచి గట్టు దగ్గిరకి వెళ్ళి నుంచుని చూడసాగింది. కేశవరావుగారూ కుతూహలంగా లేచి గట్టు వైపు నడిచారు.
వల లాగడం పూర్తయింది. కూలీలు అవన్నీ ఒక్కొక్క బస్తాను ఎత్తి ఓ సిమెంటు చప్టా మీద చేపలు పడేస్తుంటే అక్కడ కాటా పెట్టుకుని సైజువారీగా చేపలు ఏరి తూనిక్రేట్స్ లో పడేస్తున్నారు కొందరు. పెట్టెలో వేసిన చేపలమీద ఐస్ పోసి లారీలకెక్కిస్తున్నారు కొందరు.
"ఇంత పెద్ద చేపలు అవుతాయా ఈ చెరువుల్లో" రాజేశ్వరి ఒక్కొక్కటి రెండు మూడు కేజీల బరువున్న చేపలు చూసి ఆశ్చర్యంగా అంది.
"పెట్టే తిండిని బట్టి బలుస్తాయి మరి - వీటి దానాకే ఎకరానికి నలభైవేలు పైన అవుతుంది మరి" చౌదరి అన్నారు.
"మరి ఈ చెరువుల్లో నీరు అవి మారుస్తుంటారా..." పక్కన ఉన్న నీరు తోడే పంపు చూస్తూ అడిగారు కేశవరావు.