చాలా మంది సుందర సుకుమారిని అభినందించారు...పేరడిగారు...ఎక్కడుండేది అడిగారు...మొత్తానికి తలో ప్రశ్న వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు.
"మేం నలుగురం పెద్ద పెద్ద పట్టణాలలో... ఇతరదేశాల్లోను చాలా పోటీల్లో పాల్గొంటుంటాం. మాకిది అలవాటే. అసిస్టెంట్ కమీషనర్ గారి మేనకోడలే సుందర సుకుమారి. శెలవుల్లో ఇక్కడికి రమ్మంటే అంకుల్ వాళ్ళింటికి వచ్చాం" అంటూ చిన్న అబద్ధం ఆడింది వందనాదేవి.
వందనాదేవి అబద్ధం ఆడింది అంటే తగిన కారణం ఉంటేనే ఆడుతుంది. ఆ సంగతి తెలిసిన ముగ్గురూ మౌనంగా ఉండిపోయారు.
"చాలాసేపైంది అంకుల్ కోప్పడతారు. మనకోసం పోలీస్ జవాన్ లని పంపించినా పంపిస్తారు. పదవెళదాం ఇప్పటికే ఆలశ్యమైంది" అంటూ రెండు ఆటోలను పిలిచింది.
ఇద్దరిద్దరు చెరో ఆటోలో ఎక్కారు. అక్కడున్న వాళ్ళ కళ్ళల్లో దుమ్ము కొడుతూ ఆటోలు ముందుకు దూకాయ్.
హోటల్ కి వచ్చిం తర్వాత...
రూమ్ లోకి వెళ్ళగానే...
సుందర సుకుమారిని దులిపిపారేసింది వందనాదేవి.
"సారీ వందనా! ఇంకెప్పుడూ నీ అనుమతి లేకుండా ఏమీ చెయ్యను. అక్కడున్నంతసేపూ సరదాగానే వుంది. ఏమిటో! బజారు మనుషులలాగా లేకి పనులు చేసినట్టనిపించింది" సుందర సుకుమారి తలవొంచుకొని నెమ్మదిగా చెప్పింది.
"ఇదే ఇతర దేశంలో అయితే ఆడ, మగ స్వేచ్చగా పాల్గొంటారు. ఎవరూ వేలెత్తి చూపించరు. అదృష్టం బావుంటే గిన్నీస్ బుక్ లోకి కూడా ఎక్కవచ్చు. మనదేశంలో కాబట్టి...ఇదంతా మనకి కొత్త కాబట్టి కాస్త సిగ్గుపడుతున్నాం. సాహసయాత్ర చేద్దామని బయలుదేరాం మనం... "ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళటం తప్పు" అన్నారు పెద్దలు...అది తప్పుకాదని నమ్మించి...ఒప్పించి ఇక్కడిదాకా వచ్చాం...ఆత్రం కొద్దీ పోటీలో పాల్గొంది...ఇదీ ఒక సాహసమే అనుకో! సుందరి గెల్చి మన పరువు నిలబెట్టింది కదా! కోప్పడింది చాలుగాని ఇంక దాన్ని వదిలేయ్. ఇప్పటికే తిన్న పళ్ళు దానికి ఎక్కువై వుంటాయ్. ఇంక నీ చివాట్లు కూడా తింటే సుందరి పొట్ట ఉబ్బి పగలటం ఖాయం" అంటూ ఇటు రాణి అటు ప్రమద సుందరి వైపే మాట్లాడారు.
"సుందరి పోటీలో గెలవడం నాకూ బాగానే వుంది. కానీ నా ఆలోచనలు మీకు తెలీదు. ఇలాంటివే ఒక్కొక్కసారి ప్రమాదానికి దారి తీస్తాయ్. అదీ నా భయం" అంది వందన.
"చివాట్లు పెడితే పెట్టనీవే తల్లీ! ఇంకా నా పొట్ట సగం ఖాళీగానే వుంది. నిజంగా ఆ నేరేడు పళ్ళున్నాయే అమృతపు గుళికల్లాగా వున్నాయి. అంతంతేసి పళ్ళు మనవైపు అమ్మురావు. వెళ్తూవెళ్తూ ఓ పెద్ద బుట్టెడు కొనుక్కెళ్ళాలి" అంది సుందర సుకుమారి.
సుందరి మాటలకి ముగ్గురూ ఫక్కున నవ్వారు.
సుందరి తృప్తిగా పళ్ళు తింటమేకాదు...పదివేలరూపాయిల్ని కూడా సంపాదించింది. ఇదంతా చూడ్డానికి బ్రహ్మాండంగా వుంది.
కానీ...
ఎప్పుడయితే సుందర సుకుమారి ఈ పోటీలో గెల్చి పదివేల రూపాయిలు సంపాదించిందో అప్పుడే ఓ విషవలయం వీళ్ళచుట్టూ వల పన్నిందని ఎవరికీ ఊహా మాత్రం ఆలోచన కూడా రాలేదు.
ఆ సాయంత్రం జరిగిందే పదే పదే చెప్పుకొంటూ ఆ రాత్రికి హాయిగా నిద్రపోయారు నలుగురూ.
11
సాయంత్రం ఆరుగంటలు కావొస్తోంది.
నలుగురూ కబ్బన్ పార్క్ లో తిరిగి...తిరిగి అలిసిపోయి ఓ పెద్ద చెట్టు కింద కూర్చున్నారు.
కాళ్ళు బారజాపుకొని "ఇక్కడ్నించి కదలబుద్ధి కావడంలేదే వందనా!" అంది రాణి.
"నాకయితే ఇక్కడే పడి నిద్రపోదామని ఉంది" ప్రమద చెప్పింది.
"వీళ్ళిద్దరికీ ఇలా ఉందట. నీకెలా వుందమ్మా సుందర సుకుమారి" వందనాదేవి అడిగింది.
"తిరిగి తిరిగి బాగా అలిసిపోయామేమో...కాస్త కాళ్ళు పీక్కుపోతున్నాయ్. సరదాగా నడిచి వెళ్ళి చూస్తే బాగుంటుందని అన్నిచోట్లకి నడిచివెళ్ళి...ఆఖరికి ఈ కబ్బన్ పార్క్ కి వచ్చా...
"నే అడిగిందానికీ...నీవు చెప్పేదానికీ పొంతన ఉందా?" వందన అడిగింది.
"పొంతన వుంది కాబట్టే చెబుతున్నాను. పార్క్ అంటే మన ఊళ్ళో పార్క్ లాంటిదో, మరికాస్త పెద్దదో అనుకొన్నాం! మొత్తం పార్క్ అరగంటో...గంటో తిరిగితే సరిపోతుంది అనుకొన్నాం" బెంగుళూరులో కబ్బన్ పార్క్ చాలా పెద్దది...తప్పక చూడదగ్గది" అని మాత్రమే విన్నాం. కాని ఈ పార్క్ చిన్న గ్రామం అంత ఉంటుందని...ఈ పార్క్ మొత్తం తిరిగి చూడటానికి ఓ రోజల్లా పడుతుందని ఎవరూ అనుకోలేదు. కొన్ని కొన్ని అనుభవంగాని తెలియవ్!"
"నిజమే" అంది వందన.