"అలానే సర్!"
"స్మితకు, నరేష్ కు మధ్య ఏమయినా భాగోతం జరుగుతూ వుందేమో కూపీలాగు! ముందు ముందు మనకు ఉపయోగపడవచ్చు."
"ఎస్ సర్!" అతను తలూపాడు.
"మనమ్మాయి వైపునుంచి ఏమయినా ప్రోత్సాహం వుందా?" మళ్ళీ అడిగాడాయన అనుమానంగా.
రజని నరేష్ కి చేరువైపోయిందేమోనన్న భయం ఆయనచేత అదే ప్రశ్న వేయిస్తోంది.
"లేదు సార్! అతనంటే ఎక్కడో యిష్టం కలిగింది సార్! తనకు తనే 'ఐ లవ్ యూ' అనే స్థాయికి రాలేదు సార్ యింకా."
"అయితే ఫరవాలేదు."
"మొదటి నుంచీ ఈ విషయం మీకు తెలుసుగదా! ఇన్నిరోజులు ఎందుకు ఉపేక్షించారు? ఆ రోజు బ్రహ్మానందం ఫోన్ చేసినప్పుడు రజనమ్మకు ఎవరో లైన్ వేశారన్న అనుమానం వచ్చింది" అంది విజయ.
ఆ మాటలకు చిర్రెత్తుకొచ్చింది శ్రీనివాసరావుకి. "ఆ నోరుముయ్! అది నోరా, పాయిఖానానా! లైన్ వేయడమేమిటి? పచ్చి బజారు దాని మాటలు" అన్నాడు ఆయన ఆమెవైపు చురచురా చూస్తూ.
"అలా తిట్టకండి. నా పాతివ్రత్యం పాడయిపోదూ అలాంటి మాటలు వింటే" అలవాటు ప్రకారం అంది.
"ఆ మాటే అనద్దు. నీ పాతివ్రత్యం అదిగో ఆ పట్టి మంచానికి బాగా తెలుసు. నోరుముయ్" కసురుకున్నాడాయన.
"మరిప్పుడేమిటి చేయడం? రజనమ్మను పిలిచి వాడితో స్నేహం మానుకోమని చెప్పకూడదూ?" అంది సోఫాలోంచి లేస్తూ విజయ.
"అలా చేస్తే మనం దాని స్వేచ్ఛకు అడ్డొస్తున్నామని అది భావిస్తుంది. నా కూతురి విషయం నాకు బాగా తెలుసు. దానికి వ్యతిరేకంగా మనం ఏమయినా చెబితే అది రెచ్చిపోయి మరీ చేస్తుంది. అందుకే మనం ఫీల్డులో లేకుండానే ఏదయినా చేయాలి. కానీ ఆ అనాధ వెధవను రజని ప్రేమించే ప్రమాదం రాదనుకుంటాను."
"అవును సార్! ఆ ప్రమాదం రాదు" వంత పాడాడు బ్రహ్మానందం.
ఆ మాటలకు ఊరట చెందాడు శ్రీనివాసరావు.
అయితే ఆ ప్రమాదం అతి తొందరగా ముంచుకొస్తూ వుందని వాళ్లు ఊహించలేకపోయారు.
* * * * *
నరేష్ తన సీట్లో కూర్చున్నాడు. కాసేపు సేద తీర్చుకోవడానికన్నట్టు కుర్చీ వెనక్కు వాలి తిరిగి యధాప్రకారం కూర్చున్నాడు. అప్పటికి అతను ఉద్యోగంలో చేరి ఇరవై రోజులైంది. ఇప్పుడిప్పుడే పని అలవాటవుతోంది. మొదట్లో ఆ లెక్కలన్నీ అర్థం కాలేదు. కూడికలూ, తీసివేతలూ ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు ప్రొసీజర్ తెలియడంతో ఇంట్రస్టింగ్ గానే ఉంది.
ఆరోజు డిస్పోజ్ చేయాల్సిన ఫైల్ ను చూస్తుంటే మారుతీరావు నుంచి కబురొచ్చింది. వెంటనే స్ప్రింగు డోర్ తెరుచుకుని ఆయన గదిలోకి వెళ్ళాడు.
అంతవరకు పేపరు చదువుతున్న మారుతీరావు అతన్ని చూసి పేపర్ మడిచి పక్కనపెట్టాడు.
"గుడ్ మార్నింగు సార్."
"వెరీగుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్."
నరేష్ ఆయన కెదురుగ్గా కూర్చున్నాడు.
"అలవాటయ్యిందా వర్క్" అడిగాడాయన.
"ఎస్ సర్. బిజినెస్ లావాదేవీలు కూడా తెలుసుకునే కొద్దీ స్త్రీ హృదయంలా అంతుబట్టకుండా ఆకర్షిస్తున్నాయి సార్" అన్నాడు. అతడు ఆ మాట అన్నాక అలా అని వుండకూడదేమోనని నాలిక కరుచుకున్నాడు.
"అవును స్త్రీ అయినా, బిజినెస్ అయినా మనచేతిలో ఉన్నప్పుడే మనమాట వింటాయి. మనం చేయి విడిచామా మనల్ని ముంచేస్తాయి" నవ్వుతూ అన్నాడాయన.
ఆయన తన మాటలను సీరియస్ గా తీసుకోనందుకు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు నరేష్.
"ఏం సార్ పిలిపించారు?"
"ఏం లేదయ్యా! చిన్నపని. మన కంపెనీ మాన్యువల్ రిపోర్టు కావాలి. ఆడిటింగ్ కు ఇవ్వాలి. రిపోర్టు తయారుచేయడంలో విల్సన్ సహాయం తీసుకో. రిపోర్టు ఎలా ఉండాలో మేనేజర్ చెబుతాడు. వారం రోజుల్లో రిపోర్టు ఇవ్వాలి."
"ఎస్ సార్."
"ఇక నువ్వు వెళ్ళచ్చు" అని ఏదో గుర్తుకొచ్చిన వాడిలా "అవునూ నువు బాగా తగ్గిపోయావ్. ఏమిటి కథ? ఆరోగ్యం బావుందా?" అని అడిగాడు మారుతీరావు.
"ఆరోగ్యం బాగానే ఉంది సార్."
"మరి లవ్ లో ఏమైనా పడ్డావా?"
లవ్ లో పడ్డావా ఏమిటి? కుడితిలో పడ్డావా అని అడిగినట్టు. ఈయనతో చాలా కష్టం అని మనసులో అనుకుంటూ "అదేం లేదు సార్" అన్నాడు అతను.
"బుకాయించకు. నీ వయసులో వున్న మగవాడు తగ్గిపోయాడంటే ఖచ్చితంగా అది ప్రేమ జబ్బేనన్న మాట. ఆడది ఎప్పుడూ బయటపడదు. అదే మగాడైతే ప్రేమలో పడ్డ మరుక్షణం దానిని వూరంతా ఠాం ఠాంవేసి, ఆ పిల్ల మీద బెంగపెట్టేసుకుని తగ్గిపోతాడు. అయితే స్త్రీ అంత తెలివి తక్కువది కాదు. తూచి తూచి అడుగువేస్తుంది. పులిలా వున్న మగాడు పిల్లిలా అయిపోయాక ఏదో తన మంచి తనంతో కనికరించినట్టు దగ్గరకు చేరదీస్తుంది. ఇంకొందరున్నారు. తన మీద ఆశలు పెంచుకుని చివరకు నిరాశతో మగాడు ఉరేసుకు ఛస్తే తన అందంమీద తనే గౌరవం పెంచుకుంటుంది ఆడది. ఇదంతా తెలియని చవట మగవాడు."