శ్రీనివాసరావు తన అవుట్ హౌస్ లో అయిదు నిమిషాల నుంచి పచార్లు చేస్తున్నాడు. ఆయన మనసు అల్లకల్లోలంగా వుంటే తప్ప ఆయన అలా పచార్లు చేయడు. ఆయన ముఖం ఎర్రగా టమేటో పండులా ఎర్రబారింది. ఆయన కళ్ళు ఆందోళనను కప్పుకుని చూస్తున్నాయి. ఆయన ఛాతీ కల్లోలిత సముద్రపు అలల్లా ఎగసెగసి పడుతోంది. ఆయన కాళ్ళు ఒక్క దగ్గర నిలబడడం లేదు.
వ్యాపారంలో పదిలక్షల నష్టం ఒక్కసారి వచ్చినా ఆయనలా క్రుంగిపోడు. ముందు తెలియజేయకుండా ఆదాయపు పన్నువారు దాడి చేసినా అంతగా ఆందోళన చెందడు. తనకు తెలియకుండా డైరెక్టర్లు మీటింగ్ పెట్టేసి ఛైర్మన్ పదవి నుంచి దించేసినా ఆయన అంతగా కలత చెందడు.
ఇప్పుడు వచ్చిన కష్టం ఆయనెప్పుడో ఊహించిందే. అందుకే ఆ మాత్రమయినా తట్టుకోగలిగాడు.
అంతలో తలుపు చప్పుడయింది.
ఆయనే స్వయంగా వెళ్ళి తలుపు తీశాడు. ఆయన సెక్రటరీ విజయ నవ్వుతూ లోపలకు వచ్చింది.
"ఏమిటింత ఆలస్యం?" ఆయన గద్దించాడు.
"కుర్రాళ్ళు డ్రయివర్లుగా వున్న ఆటోలే కనిపించాయి. ముసలి డ్రయివర్ కనపడేవరకూ ఆగి వస్తున్నాను. కుర్రవాడు డ్రయివర్ గా వున్న ఆటోలో వస్తే నా పాతివ్రత్యం పాడయిపోదూ" అంది రాగయుక్తంగా.
"ఛట్! నువ్వెక్కడున్నావో తెలుసుకుని మాట్లాడు" ఆయన ముఖం మరింత ఎర్రబారింది.
తన తప్పేమిటో తెలుసొచ్చింది విజయకి. "సారీ! మీ ముందు కూడా అలాగే మాట్లాడినందుకు. నా పాతివ్రత్యం బయట వాళ్ళకేగానీ మీకు కాదుగా. మీకు ఉంపుడుకత్తెగా వున్నందువల్లే బయట నా పాతివ్రత్యం పాడవకుండా కాపాడుకొస్తున్నాను. ఇలా నటించమని మీరేకదా చెప్పింది."
"చెప్పానుగానీ, నీలా ఓవర్ యాక్షన్ చేయమనలేదే! కాస్తంత హుందాగా ప్రవర్తించమన్నాను. అంతేగానీ నీలా నేను పతివ్రతను బాబూ అంటూ బజార్ల వెంబడి పరిగెత్తమనలేదే?"
ఆయనకు బాగా కోపం వచ్చిందని గ్రహించిందామె. ఆయన విషయం చాలా సన్నిహితంగా తెలిసింది గనుక రెట్టించలేదు. మౌనంగా తల వంచుకుంది.
"అలా కూర్చో! ఈ బ్రహ్మానందం యింకా తగలడలేదు?" అసహనంగా అన్నాడు శ్రీనివాసరావు.
"వచ్చేస్తాడు" అని సోఫాలో కూర్చుంది ఆమె.
అది సావిత్రి ప్యాలెస్ ఆవరణలోనే వున్న ఔట్ హౌస్. అందులో నౌఖర్లు ఎవరూ వుండరు. తన అనుమతి లేకుండా ఎవర్నీ అందులోకి అడుగుపెట్టనివ్వడు శ్రీనివాసరావు. ఆయన పర్సనల్ విషయాలన్నీ ఆ ఔట్ హౌస్ లోనే చూసుకుంటాడు. విజయతో ఆయన శృంగార లీలలన్నీ కూడా అక్కడే జరుగుతాయి. శ్రీనివాసరావు అనుమతి లేకుండా ఆయన కూతురు రజనీ కూడా అందులోకి వెళ్ళదు. ఆమెకు వెళ్ళే అవసరం కూడా ఇంతవరకూ రాలేదు.
నాన్న వ్యాపార లావాదేవీలు అందులో చూసుకుంటాడని మాత్రమే ఆమెకు తెలుసు.
హడావుడిగా ఆ కాంపౌండ్ లోకి ప్రవేశించిన బ్రహ్మానందం గూర్ఖా సెల్యూట్ ను పట్టించుకోకుండా ఔట్ హౌవుస్ వేపు వెళ్లాడు.
అతను లోపలకు వెళ్ళేసరికి శ్రీనివాసరావు పచార్లు చేస్తూనే వున్నాడు. అతన్ని చూసి "పది నిమిషాలు ఆలస్యం" అన్నాడు శ్రీనివాసరావు కోపంగా.
"నిన్నటి రిపోర్టు తయారుచేసేసరికి ఆలస్యమైంది సార్" నొచ్చుకున్నట్టు చెప్పి ఆయన కెదురుగ్గా వినయంగా నిలబడ్డాడు బ్రహ్మానందం.
"నిన్న ఏం జరిగింది" గంభీరంగా ప్రశ్నించాడు ఆయన.
ఆ మాటతో తన జేబులోంచి డైరీలాంటిది తీశాడు బ్రహ్మానందం. అందులో ఒక పేజీ చూసి చదవడం ప్రారంభించాడు.
"నిన్న విధిలేని పరిస్థితిలో రజని, సరళ, విమలతో కలిసి సిటీ బస్సు ఎక్కింది. నలుగురు యువకులు ఆమెను రాసుకున్నారు. అందులో ఒకడు రజనమ్మ భుజంమీద చిటికిన వేలుతో పొడిచాడు కూడా. దాంతో అమ్మాయిగారు వెనక్కి తిరిగి అతన్ని గుడ్లురిమి చూసింది. అతను తోక ముడిచాడు. బస్సు దిగేటప్పుడు అమ్మాయిగారిని చూసి కండక్టర్ చొంగ కార్చుకున్నాడు. అయితే దీనిని అమ్మాయిగారు గమనించలేదు..."
"స్టాపిట్! ప్రోగ్రెస్ రిపోర్టులా చదవకు. ముందు ఆ నరేష్ గాడి విషయం చెప్పు" అరిచాడు శ్రీనివాసరావు.
"ఎస్ సర్!" అంటూ మరో డైరీ లాంటిది జేబులోంచి తీశాడు బ్రహ్మానందం. దాన్ని చూస్తూ చదివాడు.
"నిన్న చాలా పెద్ద విషయమే జరిగింది. రోజూ నరేష్ రాసిన వుత్తరాల్ని పోస్టుమ్యాన్ తెచ్చిచ్చేవాడు. అయితే నిన్న పోస్టుమ్యాన్ తను పడ్డ బాధకు ప్రతీకారంగా నరేష్ చేత వుత్తరాలను బట్వాడా చేయించాడు. అందులో భాగంగా నరేష్ తను రాసిన ఉత్తరాన్ని స్వయంగా రజనమ్మకు అందించాడు..."
"దానికి రజనీ ఏమన్నది? ఆమెలో ఏమయినా మార్పులు కలిగాయా?"
"ప్రమాదమైన మార్పులు ఏమీ కలుగలేదు సార్! అయితే తన కోసం రోజంతా ఉత్తరాలను బట్వాడా చేశాడని తెలియడంతో హృదయంలో ఎక్కడో అతనంటే యిష్టం ప్రారంభమయింది సార్ అమ్మాయిగారికి" మెల్లగా చెప్పాడు బ్రహ్మానందం.
ఇక వినలేనట్టు చెవులకు చేతులడ్డం పెట్టుకున్నాడు శ్రీనివాసరావు.
"మరిప్పుడు నరేష్ కొత్త ఎత్తుగడ ఏమిటి?" విజయ అడిగింది.
"ఇంతవరకు అతనేమీ ఆలోచించినట్టు లేదండీ. గుట్టుగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతని వాలకం చూస్తుంటే మంచి పట్టుదల వున్న మనిషి లాగున్నాడు. మనమిక జాగ్రత్తగా వుండాలి సార్" చెప్పాడు బ్రహ్మానందం.
"ఇంతకీ అతనెక్కడ చేస్తున్నాడు ఉద్యోగం?" శ్రీనివాసరావు అడిగాడు.
"స్మిత ఎక్స్ పోర్టింగ్ కంపెనీ లో సార్!"
"ఆఁ అవును కదా! అక్కడ ఉద్యోగం చేయడం మనకు ఉపయోగపడవచ్చు. ఇంతకీ అతనికి అక్కడ ఉద్యోగం ఎలా వచ్చింది?" కనుబొమలు ఎగురవేస్తూ ప్రశ్నించాడు శ్రీనివాసరావు.
"స్మితగారే పట్టుబట్టి మారుతీరావుగారితో చెప్పి ఇప్పించారండి."
"అతనివల్ల ఆమెకు ఉపయోగమేమిటి?"
"తెలియదు సార్!" బ్రహ్మానందం తల వంచుకుని చెప్పాడు.
దాంతో మరింత కోపం వచ్చింది ఆయనకు. "తెలియదంటావేమిటి? నీ ఉద్యోగం అదే అయితే. నరేష్ కి సంబంధించిన విషయాలు తెలియదంటూ చెప్పడానికి సిగ్గుగా లేదూ. అందరూ కూతుళ్ళకు బాడీగార్డులు పెట్టుకుంటారు అయితే నేను మాత్రం నిన్ను నా కూతురికి సోల్ గార్డుగా నియమించాను. నా కూతురు ప్రేమలో పడకూడదు. నేను చెప్పినవాడి చేతనే నా కూతురు తాళి కట్టించుకోవాలి. దాన్ని ఆ రొంపిలోకి దిగకుండా చూడాలి. అందుకోసమే నిన్ను పెట్టుకున్నాను. కోట్లకు వారసురాలయిన నా కూతుర్ని ప్రేమ పేరు చెప్పి వలలో వేసుకునేందుకు చాలామంది ట్రై చేస్తారని తెలుసు. అలాంటి వాళ్ళెవరయినా వుంటే నాకు చెప్పమని నిన్ను ఈ ఉద్యోగంలో నియమించింది. బస్సులో నా కూతుర్ని ఎంతమంది రాసుకున్నారో కాదు నాక్కావల్సింది. ఆ నరేష్ గాడు ఇంకేమయినా చేయడానికి ప్లాన్ వేశాడా లేదా అన్నదే నాకు ముఖ్యం అండర్ స్టాండ్! ఇకనుంచి వేయి కళ్ళతో వాడ్ని, రజనీని కనిపెట్టు."