"మన్ మోహన్ సింగ్ బాబులా ఫోజెట్టక, డ్రామా బయట పడిపోతుంది. డబ్బులివ్వు హోటల్ కి వెళ్ళి వస్తాను" అంటూ ఆనందం చీరా, జాకెట్ విప్పేసి, ఫ్యాంటు, షర్ట్ వేసుకున్నాడు విసురుగా.
* * * *
ఉదయం బాగా తెల్లవారిపోయింది. తలుపు చప్పుడు కావటంతో ఆంజనేయులికి మొదట మెలకువ వచ్చింది. అప్పటికే ఆనందం లేచి ముగ్గుల కార్యక్రమం మొదలెట్టి ఉండవచ్చని ఊహించుకున్న ఆంజనేయులు గుండెల్లో రాయి పడింది. ఆనందం ఆ గదిలోనే ఓ మూల గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.
తలుపు తడుతున్నదెవరు?
"అమ్మా... తరణీ" అంటూ భువనేశ్వరీదేవి కంఠం వినిపించటంతో షాక్ తిని ఆనందాన్ని ఎగిరి తన్నాడు ఆంజనేయులు కోపంగా.
టక్ మని లేచిపోయాడు ఆనందం. విషయం అర్థం చేసుకున్నాడు.
"ఆ కౌరవులు మీ ఇంటి ఇలవేల్పులెలా అయ్యారో అర్దరాత్రి వరకూ చెప్పి చచ్చావ్... చూడు... ఇప్పుడెలా గొచ్చిందో?"
"తర్వాత సాధిద్దువుగాని... ముందు లోన గదిలోకెళ్ళిపోయి... ముసుగుతన్ను... వెళ్ళూ..." ఆనందాన్ని లోన గదిలోకి తోసేసి తలుపు తీశాడు ఆంజనేయులు.
"రండి... ఆంటీ... రాత్రి... బా...హాగా..." ఆవలించబోయాడు గానీ ప్రాక్టీసు లేకపోవడం వల్ల అది కుదరలేదు...
"రోజూ ముగ్గురు పెడుతూ కనబడిన అమ్మాయి ఇవాళ కన్పించకపోయేసరికి... ఆరోగ్యం ఎలా ఉందోనని..." అంటూ లోపలకు అడుగేసిందావిడ.
"తరణి పడుకుంది ఆంటీ... ఇంకా లేవలేదు... కళ్ళు నొప్పులుగా ఉన్నాయట..."
"మన ఫామిలీ డాక్టర్ ఉన్నాడు... కబురు చేస్తాలే... అమ్మాయి లేవగానే చెప్పు... నేనొస్తాను... పూజకు టైమయింది..." ఆవిడ బయటికెళ్ళి పోగానే తలుపేసేసాడు ఆంజనేయులు.
"కొత్త కేరక్టర్ ఎంటరౌతోంది... ఎలాగరా..." తలపట్టుక్కూచున్నాడు ఆంజనేయులు.
"ఆ డాక్టర్ ఎంటరైతే ఎలాగరా మరి..." వీళ్ళిలా ఆలోచనలో ఉండగా భువనేశ్వరీదేవి పనివాడితో ఫామిలీ డాక్టర్ కి కబురు పెట్టేసింది.
భార్య డాక్టర్ కి కబురు పెట్టడం విన్న భుజంగరావు వీళ్ళనెలా రక్షించాలో తెలీక, కొట్టుమిట్టాడుతున్నాడు. కాలుగాలిన పిల్లిలా తోటలో తిరుగుతున్నాడు.
అప్పటికి సమయం ఎనిమిదిన్నరైంది.
అదే సమయంలో ఓ అమ్మాయి ఎంటరైంది. గూర్ఖాని ఏదో అడిగి అవుట్ హౌస్ వేపు వెళ్ళింది.
"ఆంజనేయులు గారూ... ఆంజనేయులు గారూ..." అమ్మాయి పిలుపు వినబడ్డంతో ఎగిరి గంతేశాడు ఆనందం.
"ఒరేయ్... కలకోకిల స్వరం రా..."
"కలకోకిల స్వరంగాదూ... పాడూగాదూ... మనింటికొచ్చే అమ్మాయెవర్రా..." అని గసురుతూ తన పేరు పెట్టి పిలుస్తున్న ఆ గొంతుని గుర్తు పట్టి టక్కున తలుపు తీశాడు.
ఎదురుగా మేరీ!
"రండ్రండి... మీ కోసమే ఎదురు చూస్తున్నాం..." ఏదో అనాలని అన్నాడు.
"నా కోసం ఎదురు చూస్తున్నారా??" లోపలకొచ్చి బోసిగా వున్న గదిని, రాగానే భువనేశ్వరికి ఎదురుగా కనబడాలని దండెమ్మీదుంచిన కొత్త చీరను చూసింది.
"బ్రహ్మచారినన్నారు... మీ గదిలో చీర కనిపిస్తోందేవిటి?" లోన గదిలోకి తొంగి చూసింది మేరీ అనుమానంగా.
"పెద్దావిడతోనే ఛస్తుంటే, ఇప్పుడు మీరొకరూ..." అని విసుక్కుని "ఒకానొక ఆపద నుంచి రక్షించుకోవడం కోసం... చీరలూ అవన్నీ ఇక్కడున్నాయన్నమాట... వచ్చేరుగదా... కూర్చోండి"
అంటూ 'దబ్'న తలుపేసేశాడు. లోన గడియపెడుతున్న ఆంజనేయులు వేపు అనుమానంగా, ఆనందంగా చూసింది మేరీ.
"మేరీ లోనకు వెళ్ళిందగ్గర్నించీ, ఇటు వేపే పదే పదే చూస్తూ హమ్మనీ... అంజిగా దొరికావు..." అంటూ కారాలూ, మిరియాలూ నూరడం మొదలెట్టాడు భుజంగరావు తోటలో నించుని.
"తలుపేస్తున్నారంటే... నాతో ఏవైనా చెబుదావనా..." ముసి ముసిగా సిగ్గుపడుతూ అంది మేరీ.
"మీతోనా... ఇప్పుడా... ఇప్పుడే కాదు... ఎప్పుడూ ఛస్తే చెప్పను..." అని చికాగ్గా అరిచినట్టుగా అన్నాడు.
అదే సమయంలో మళ్ళీ తలుపు మోత.
"ఎవరు?"
"అయ్యో... పెద్దమ్మగారు డాక్టరుగార్ని పంపించారు..." ఉన్న గుండె దడాలుమని జారిపోయింది... చటుక్కున ఆంజనేయులు దృష్టి మేరీ మీద పడింది.
"మీరర్జంటుగా లోన గదిలో చాపమీద పడుకోవాలి..." అని మేరీ చేతిని పట్టుకుని లాక్కొని లోనకు తీసికెళ్ళి, అక్కడ చాపమీదున్న ఆనందాన్ని పక్కకు లాగేశాడు.
"ఏమిటండీ ఇదంతా...?" అయోమయంగా అడిగింది మేరీ.
"మా ప్రారబ్దం... ఒక్క పది నిమిషాలు... ప్లీజ్... ప్లీజ్..."
మరి మాట్లాడలేదు మేరీ.
మేరీ చాపమీద ఓ పక్కకు తిరిగి పడుకోగా, దండెం మీదున్న చీరను కప్పేసి, బయటికొచ్చి తలుపు తీశాడు ఆంజనేయులు.
చేతిలో స్టెతస్కోపుతో బక్కపలచని విగ్రహం కన్పించింది.
"ఇక్కడెవరికో వంట్లో నలతగా ఉందని భువనేశ్వరీదేవి గారు చెప్తే..."
"రండి డాక్టర్... పేషెంట్ లోన గదిలో వుంది... పెద్ద జబ్బేం కాదు... ఏదో"
మేరీని సీరియస్ గా టెస్ట్ చేసి "రోగలక్షణాలేవీ కన్పించలేదే" అన్నాడు డాక్టర్.
"ఒంట్లో నలత..."
"ఒంట్లో నలత అనే జబ్బు ఎక్కడా వున్నట్టు లేదయ్యా... ఎం మందివ్వమంటావో నువ్వే చెప్పు..."
"నేనా..."
"అవునయ్యా! ఫ్యామిలీ డాక్టర్ని... పిలవగానే ఎన్ని పనులున్నా రావాలి. ఇక్కడ ఎవరికీ ఏమీ వుండదు" విసుక్కున్నాడాయన.
"ఏమైనా సీరియస్ గా ఉంటే కబురు చేస్తాలేండి..." ఆయన వెళ్ళిపోయాడు.
ఆయన నేరుగా భువనేశ్వరి దగ్గరకెళ్ళి-