[ఈ పై కథ ఊహాజనితం కావచ్చు. యదార్ధం అనటానికి దాఖలాలు లేవు. చాలామంది బామ్మగార్లు ఈ కథ చెపుతుంటారు. ఈ కథలో నిజానిజాలు దేముడి కెరుక. వినసొంపుగా మాత్రం వుంటుంది...
-రచయిత్రి]
ఒకానొక నాడు స్త్రీని దేవతగా ఆరాధించేవారు. గౌరవించేవారు. మాతృస్వామిక వ్యవస్థ అంటూ ఎన్నో హక్కులు స్త్రీలకి వుండేవి.
"మీరు సుకుమారులు. మీకు రెస్ట్ అవసరం. అన్ని పనులు మేము చేస్తుంటాము కదా? మీరు ఇంటి పట్టున వుండి హాయిగా పిల్లలని కనండి." అంటూ మెత్తగా నచ్చజెప్పి, స్త్రీలని ఇంటి పట్టున వుంచారు పురుషులు.
దాంతో స్త్రీలు ఇంటిని, పిల్లలని అంటిపెట్టుకుని వుంటే పురుషులు బైట తిరుగుతూ పురుషాధిక్యతని పెంచుకున్నారు.
స్త్రీలకి ఉన్నా కష్టాలు చాలక ఈ పురుషాధిక్యతతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయ్.
ఎన్నికల్లో నుంచుంటే ఒకసారి ఓడినా మరోసారి గెలవొచ్చు. తెలివికి తోడు అదృష్టం కూడ ఉంటే ఢిల్లీ సింహాసనాన్ని కూడా చేజిక్కించుకోవచ్చు. ఇదలా కాదే. స్త్రీలంతా బానిసత్వానికి అలవాటు పడిపోయారు. కొందరు స్త్రీలు బంధాలు తెంచుకుని స్వేచ్చా జీవులుగా బయటికి వచ్చినా, ఈ పురుషాధిక్యత ప్రపంచం వాళ్ళకి గౌరవం ఇవ్వక పోగా స్త్రీలని బాధించే విధంగా కొన్ని పాడు ఆచారాలను ఏర్పరచారు దాంతో స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ఉన్నా వాళ్ళ పని కిందచేయిగానే ఉందిగాని పై చేయిగ లేకపోయింది.
అసలు లోపమెక్కడుందో కొందరు స్త్రీలు గుర్తించారు. ఆ గుర్తించిన స్త్రీలు మరి కొందరు స్త్రీలని ముఖ్యంగా పురుషద్వేషిణిలను ఎన్నుకొని....వాళ్ళంతా ఒక సంఘంగా ఏర్పడి చాటుగ బయల్దేరి అన్ని లోకాలకి తిరిగి తమ కోర్కెలని అందరు దేముళ్ళకి విన్నవించి...వాళ్ళెవరూ తమ కోర్కెలను మన్నించకపోవటంతో చివరికి భోళా శంకరుడి దగ్గరికెళ్ళి వరాలు పొంది వచ్చారు.
ఆ వరాల వల్లనే భూ లోకంలో క్రొత్త సృష్టి ప్రారంభమైంది.
ఇది కలియుగానంతం వరకూ ఇలానే సాగుతుందో, మధ్యలోనే మళ్ళీ మార్పులు చేర్పులు వస్తాయో ప్రస్తుతానికి మాత్రం ఎవరికీ తెలీదు.
ఆఖరికి ఆ భగవంతుడికి కూడా.
ఆడవాళ్ళు కంటూంటేనే రోజు రోజుకి జనాభా ఎక్కువయి పోతోంది.
ఇంకా మగవాళ్ళు కూడా కనటం మొదలుపెడితే ఆకాశంలో నక్షత్రాలనయినా లెక్కపెట్టవచ్చునేమో కాని భారతదేశంలో పెరిగి పోతున్న జనాభా లెక్కలని వెలికి తీయటం మాత్రం కంప్యూటర్ కాదు కదా ఆ బ్రహ్మతరం కూడా కాదేమో.
ప్రభుత్వం రక రకాల పధకాలు ప్రవేశపెట్టింది. అసలు పిల్లల్ని కనకపోతే ఉద్యోగం చేసేవాళ్ళకి రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామని, ఒక్కర్ని కంటే ఒక్క ఇంక్రిమెంట్ ఇస్తామని.... ఒక్కళ్ళకి ఇద్దర్ని కంటే బోనస్ ఇవ్వమని... జీతంలో కూడ కొంత కట్ చేస్తామని....ఇలాంటివన్నీ ప్రవేశపెట్టారు.
ప్రభుత్వం గోల ప్రభుత్వంది. ప్రజల గోడు ప్రజలది. జనాభా పెరిగిపోతూనే వుంది.
ఈ కొత్త సృష్టివల్ల వ్యాపారస్థులు బాగుపడ్డారు. ఆడవాళ్ళు కేర్ ఫ్రీలు ఉపయోగించినట్టు మగవాళ్ళు మెన్సస్ టైమ్ లో ఉపయోగించటానికి కొత్తరకం లంగోటాలు, డ్రాయర్లు తయారయ్యాయ్. పిల్లలు పుట్టకుండా స్త్రీలు వాడేట్టు పురుషులు వాడటానికి కొన్ని మందులూ తయారయ్యాయ్. ఆఫీసుల్లో ప్రసూతి శెలవులు పురుషులకీ ఇచ్చారు. ప్రసూతికి ఆడ నర్శింగ్హోమ్ లు, మగ నర్శింగ్ హోమ్ లు వేరు వేరుగా కట్టించారు.
సృష్టి ఎప్పుడైతే తారుమారయ్యిందో ఇంటింటా కథలు కూడా తారుమారయ్యాయ్.
ఏ ఇల్లు చూసిన ఏమున్నది గర్వ కారణం.
స్త్రీ పురుష లిరువురు ఎడాపెడా కనటమేకదా.
ఓ మహాత్మా? ఓ మహర్షి?
అని పాడుకోవడమే చివరికి మిగిలింది.
* * * *
పట్టణాల్లో ఆచారాలు మారాయ్ గాని ఇంకా మారుమూల పల్లెటూళ్ళలో ఆచారాలు మారలేదు.
గ్రామ ప్రెసిడెంట్ పుల్లారావ్ గారబ్బాయ్ అన్నారావ్ పదకొండేళ్ళకే పెద్ద మనిషై కూర్చున్నాడు.
పుల్లారావ్ ఇంట ఆచారాలెక్కువ. ఏ చిన్న విధయమైనా యధావిధిగా జరగాల్సిందే.
ఆడపిల్ల సవర్తాడితే ఎలా కూర్చోబెడతారో ఆ విధంగా అరబస్తా వడ్లు కింద గుమ్మరించి దాని మీద పచ్చటి ఆకులు పరచి అన్నారావ్ ను తీస్కెళ్ళి దాని మీద కూర్చోబెట్టారు. పులగంలో బెల్లం వేసుకోని తినాలని ఒక కండీషను. అది చాలక వాడి కిష్టంలేని తీసి పిండి వంటలన్నీ పెట్టారు పేరంటం.... చిమ్మిరి తొక్కడం...అన్నీ యధావిధిగా జరిగాయ్. ప్రెసిడెంటుగారింటిలో పేరంటమంటే మాటలా! ఊరు ఊరు కదలి వచ్చింది.
"నేనిక్కడ కూర్చోను. గోళీకాయ లాడుకోవడానికి వెళతాను" అంటూ కూర్చున్నచోటనే చిందులు తొక్కాడు అన్నారావ్.
"తప్పు నాయనా! అలా అనకూడదు. ఇప్పుడు నీవు ఇదివరకు లాగా పిల్లవాడివి కాదు. పెద్దవాడివయ్యావ్. కాస్త గుంభనంగా ఉండటం నేర్చుకోవాలి" అంటూ తండ్రి నచ్చజెప్పాడు.
ఈ పాడు గోల ఏమిటో అన్నారావ్ కి బొత్తిగా అర్ధం కాలేదు. చాలామంది ఆడపిల్లలు తరతరాల నుంచి యుగ యుగాల నుండు పడుతున్న బాధే ఇది. 'తల నొప్పి తనదాక వస్తేగాని తెలియ'దంటారు పెద్దలు. కాని ఈ విషయంలో పురుషుల మనస్తత్వం ఏమీ మారలేదు.
"పాపం ఆడవాళ్ళు అంట్లు, ముట్లు, కడుపులు ఇన్ని రకాలుగా బాధలు పడ్డారు కాబోలు. ఇప్పుడివన్నీ మనం అనుభవిస్తుంటే వాళ్ళు పడ్డ బాధలు అర్ధమౌతున్నాయ్" అలా అనుకోవాల్సిందిపోయి తమ కొచ్చినవే బాధలన్నట్టు పురుషులంతా మెలగసాగారు. దాంతో ఆడవాళ్ళకి పురుషుల మీదజాలి లేకుండా పోయింది.
"మా చావు మేము చస్తాం. మీ చావు మీరు చావండి" అన్నట్టు నిర్లిప్తంగా ఉండిపోయారు.
అన్నారావ్ సవర్త పేరంటం రోజు పెళ్ళి మాటలు వచ్చాయ్.
"ఈడేరటం అయిపోయింది. ఇంకా ఎన్నాళ్ళింట్లో ఉంచుకుంటారు తొందరగ మంచి సంబంధం చూసి పెళ్ళిచేయండి అన్నగారు!" మునసబు గారు, ప్రెసిడెంటుగారితో అన్నాడు.