Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 25

    ఇలాంటి దిక్కుమాలిన ప్రకటనలు ఇరవై నిమిషాల సేపు బుర్ర తినేసేలా వచ్చింతర్వాత 'మారు__తారు' నాటకం ప్రసారమైంది. ఆ నాటిక చూస్తున్న వాళ్ళకి ఆ పాత్రలు ఎక్కడ్నించి ఎక్కడి కొచ్చాయో చస్తే అర్ధంకాలేదు. మధ్యలోనే టక్కున నాటిక ఆగిపోయింది. మెల్లకన్ను పళ్ళసుందరి తెరమీద కొచ్చింది. "క్షమించాలి పై వారం ప్రసారం చేయాల్సిన భాగం పొరపాటున ఈ వారం ప్రసారం చేయటం జరిగింది. ప్రేక్షకుల అసౌకర్యానికి చింతిస్తున్నాం. పైవారం నుంచి యధాతధంగ మళ్ళీ మొదట్నుంచి ఈ నాటిక ప్రసారం జరుగుతుంది. తారుమారు మళ్ళీ క్షమించాలి. మారు__తారు నాటిక ఇక్కడితో నిలిపేస్తున్నాం." అంటూ టక్కున మాయమైపోయింది.
   
    ఈ తఫా తెరమీద పుట్టగొడుగుల్లా వో యాభైమంది ఆడమగ ప్రత్యక్షమయ్యారు "దేశం ముందుకు సాగాలి. మనమంతా ముందుకు పడిపోవాలి." అంటూ గ్రూప్ సాంగ్ అందుకొన్నారు. దేశం ముందుకు పోవటం అంటే ఏమిటో వాళ్ళెందుకు పడిపోవాలో ఆపాట మొత్తం విన్నా చస్తే అర్ధంకాదు ఆ సాహిత్యం అంత దౌర్భాగ్యంగ ఉంది. బహుశ టి.వి వాళ్ళకి అర్ధం అయి వుంటుంది. యాభైమంది యాభై రకాల ముఖాలేసుకుని ఒకే పాటని లాగి పీకి పాడి వినే వాళ్ళ బుర్రలో బూజుని వదలగొట్టి మరీ మాయమయ్యారు. వార్తలొచ్చే సమయంఇంకా కానందువల్ల మళ్ళీ తెరమీదకి వివిధ ప్రకటనల వాళ్ళు తైక్ మంటు ఎక్కారు.
   
    ఇది ప్రభుత్వం వారి ప్రకటన "అబ్బా యొక్కడు చాలండి. అవరోధ్ నే వాడండి. అవరోధ్ ని మించింది ఈ ప్రపంచంలో మరోటి లేదు." అంటూ వో తండ్రీ కొడుకుల్ని చూపించాడు.
   
    అది చూస్తున్న రాజ్ బాబు "అవరోధ్ అంటే ఏంటి నాన్నా?" అని అడిగాడు.
   
    "అంటే...అంటే..." నాన్చుతూ ఆగిపోయాడు రంగబాబు.
   
    "ఇహిహి...నీకేం తెలీదు అవరోధ్ అంటే అదో పెద్ద బూర అన్నమాట" చిన్నారి ఇకిలిస్తూ చెప్పింది.
   
    "టి.వి. చూసి పిల్లలు చెడిపోతున్నారు. చూపించే కార్యక్రమాలు అరగంట. దిక్కుమాలిన ప్రకటనలు గంటన్నర" విసుక్కొంది మాణిక్యాంబ.
   
    పెళ్ళాం మాటలేవీ వినిపించుకోలేదు రంగబాబు. "ఏంటో ! నడుంనెప్పిగా వుంది. చచ్చిపోతున్నాననుకో." చేత్తో నడుం సవరదీసుకుంటూ అన్నాడు.
   
    భర్తవేపు జాలిగా చూసింది మాణిక్యాంబ. "మీకు తొమ్మిదో నెలొచ్చి అప్పుడే మూడ్రోజులయింది. నడుం నెప్పి రాదా ఏంటి? ఆ లుంగీనెందుకు అలా పొట్టమీదికి బిగించి కట్టుకొంటారు? కాస్త వదులుగా కట్టుకుంటే మీ సొమ్మేం పోయింది. అయినా నాకు తెలీక అడుగుతాను మనకి ఒక మగపిల్లవాడు చాలడా ఏంటి? తగుదునమ్మా అంటూ మళ్ళీ మరొ మగ నలుసుని కనటానికి తయారయ్యారు!" అంటూ కోప్పడింది.
   
    "ఒక బిడ్డ బిడ్డ కాదంటారే మాణిక్యం! ఒకళ్ళకిద్దరుంటే రామలక్ష్మణుల్లా ఉంటారు."
   
    "రామలక్ష్మణులేం ఖర్మ? భరత, శత్రుఘ్నలని ఆ తర్వాత లవకుశల్ని కూడా కనండి. ఒక పక్క ప్రభుత్వం లబ్బున గోల పెడుతున్నది "పిల్లల్ని తక్కువకంటే ప్రమోషన్ లు ఇస్తామని." జనాభా పెరుపుదలకి చూస్తున్నారు గాని ప్రమోషన్ ల కోసం చూడ్డం రాదాయే. మీ మగాళ్ళ బుద్ది ఇలా ఏడ్చింది. మా ఆడవాళ్ళని చూడండి. తెలివిగా ఒకళ్ళనే కని పేరుకుంటున్నాం." అంటూ మాణిక్యాంబ లెక్చర్ మొదలు పెట్టింది.
   
    దాంతో భార్యా భర్తల మధ్య మాటా మాటా పెరిగింది. వాదించు కుంటూ, దెప్పి పొడుచుకుంటూ మాటలతో ఈటులు విసురుకొంటున్నారు. టి.వి లో వార్తలు మొదలయ్యాయి. గందరగోళం వార్తలు గజిబిజి పోట్లాట. పిల్లలిద్దరు ఆ గదిలోంచి చల్లగా బయటికి జారుకున్నారు.
   
    టి.వి. దోవ టి.వి.!దే భార్యాభర్తల దోవ భార్యాభర్తలదే. ఆ ఇంట్లో ఏవీ నోరు మూసుకోవు.
   
    రోజూ ఉండే భాగోతమే ఇది.
   
                                                                        *    *    *    *
   
    సృష్టి మొదట్లో...
   
    మగ ఆడ మనుషులని సృష్టించి పిల్లలని కనే పని ఎవరికి ఇవ్వాలని భగవంతుడు ఆలోచిస్తూ కూర్చున్నాడుట.
   
    బిడ్డలని కనాలంటే ముందుగా దానికి తగ్గ యంత్ర సామగ్రి మగవాడిలోనో, ఆడదానిలోనో ప్రవేశపెట్టాలి. ఆ పని ఏదో జాగ్రత్తగా చూసి చెయ్యాలి.
   
    ఎందుకంటే__
   
    నవమాసాలు మోసి బిడ్డని కనటం, వాళ్ళని లాలించి పాలించి పెంచి పెద్ద చేయటం అన్నది బోలెడు శ్రమతో కూడిన పని ఓర్పు నేర్పుకి తోడు బోలెడు సహనం వుండాలి. బిడ్డమీద ఉత్త మమకారమే కాదు. అవసరం అయితే ప్రాణం ఇచ్చేట్టు వుండాలి.
   
    బిడ్డమీద ప్రేమానురాగాలు ఒక్కటే చాలవు. అంతకు క్రితం చాలా జరగాల్సి వుంది. ముందు పరీక్షలో నెగ్గిన వాళ్ళకి ఈ వరం ఇస్తే సరిపోతుంది.
   
    స్త్రీ పురుషులకి భగవంతుడు ముందుగా ఒక పరీక్ష పెట్టి చూడాలనుకున్నాడు. పిల్లలు పుట్టాలంటే గర్భసంచి, అండాశయం వగైరాలు వుండాలి. అవి వుంటే ప్రతినెలా మెన్సెస్ తప్పకుండా రావాలి.
   
    ఆ మూడు రోజులు రుతుస్రావంతో అసహ్యంగా అనీజీగా వుంటుంది. రుతుస్రావంని ఎవరైతే గుట్టుగా దాయగలరో వాళ్ళకి పిల్లలు పుట్టేటట్లు చేస్తే సరి....అలా అనుకున్న భగవంతుడు స్త్రీ పురుషులిరువురికి ఒకేసారి మెన్సెస్ అయేలా చేసి చాటుగా పరీక్షిస్తూ వుండిపోయాడట.
   
    శరీరంలో కొత్త మార్పులు వచ్చి మెన్సెస్ అయి కూర్చునేసరికి మగాళ్ళు కంగారు పడిపోయారు. అటూ ఇటూ పరుగు లెత్తుతూ వళ్ళంతా నానా గలీజు చేసుకున్నారుట. ఆడవాళ్ళు అలా కాదు. వెంటనే పొదలు చాటుకి, చెట్లచాటుకి వెళ్ళి గుట్టుగా అక్కడే కూర్చుండిపోయి, తగిన జాగ్రత్తలు వహించారుట.
   
    అది చూసిన భగవంతుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సృష్టికార్యంలో పాలు పంచుకోటానికి స్త్రీ పురుషులు ఇరువురును...మాతృత్వం మాత్రం స్త్రీకి అప్పగించాడుట. అంతే అప్పటినుంచి అన్ని అవస్తలు ఆడదానికి ఏర్పడ్డాయి.
   
    ముందు జాగ్రత్త వహించటం, గుట్టుగా వుండటం ఆడదాని పాలిట శాపం అయింది. శాపం అంటే బాధపడతారని మాతృత్వం ఆడదానికి వరం అన్నారు. అది వరం కావచ్చు, శాపం కావచ్చు. అది వేరే సంగతి. అప్పటినుంచి పిల్లలని కనే డ్యూటీ స్త్రీ సొత్తుగా మారింది.

 Previous Page Next Page