Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 25

    "ఆ మాట చాలండీ! నాకు వెయ్యి ఏనుగుల బలం' అంది పార్వతమ్మ.

    భార్య మనసు ఎక్కడ నొచ్చుకుంటుందోనని ఎన్నోసార్లు ఆమె మాటకి వంతపాడేవాడు శంకర్రావు కొన్నిసార్లు దెబ్బతింటంకూడా జరిగింది. అప్పుడు పార్వతమ్మ "నా వల్లనే ఇదంతా జరిగింది కదండీ!" అని బేలగా అంటూంటే.

    "ఫరవాలేదులేవోయ్! ఏదో ఒక అనుభవం లేకపోతే జీవితంలో పాఠం యెలా నేర్చుకుంటాము?" నవ్వుతూ అనేవాడు శంకర్రావు.

    పద్మిని ప్రియదర్శిని మంచిదో చెడ్డదో? ఇదో రకం మోసమో? శంకర్రావుకి తెలియదు. ఒంటరిగా వున్న ఆ అమ్మాయి నిజంగానే జ్వరంతో చాలా బాధపడుతున్నది. పార్వతమ్మ చూడబోతే ఆ అమ్మాయిని పూర్తిగా నమ్మి వుంది. దీనిలోని నిజానిజాలు తరువాత చూసుకోవచ్చు. ఒంటరి ఆడపిల్లని ఆపదలో ఆడుకోవటం ధర్మమనుకున్నాడు శంకర్రావు. అంతేకాదు ఆ పిల్లమీద ఒక కన్నేసి వుంచాలని కూడా అనుకున్నాడు. ఎవరెలాంటివాళ్ళో  తెలీదుకదా!

    కాని, ఈ వారం రోజుల్లో ఎందుకో తెలీదు. ఆ అమ్మాయి దగ్గరయినట్టుగా అనిపించింది శంకర్రావుకి.

    పద్మిని ప్రియదర్శిని పత్యం తిన్న తర్వాత ఆ ఇంటికి ఆ ఇంటి పరిసరాలని తీరుబడిగా గమనించింది.

    శంకర్రావింట్లో కావలసిన వస్తువులు అన్నీ వున్నాయ్. కాని అన్ని వస్తువులు పరిమితిగ వుండి తీర్చిదిద్దినట్టు ఎక్కడివక్కడ వున్నాయ్.

    కొందరనవసరంగా అక్కర్లేకపోయినా పాతసామానులను పారేయకుండా వుంచటం, కొత్తసామాన్లని కొనివుంచటం చేస్తూంటారు. అలాంటిదేమీ లేకుండా ఆ ఇంట్లో సామాన్లు ముచ్చటగా ముఖ్యమైనవి మాత్రమే ఉన్నాయ్!

    ఆ పూట శంకర్రావు బయటికి వెళ్లాడు. వెనకింటి వాళ్ళు కబురుచేస్తే పార్వతమ్మ వాళ్ళింటికి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ చెప్పి వెళ్ళింది.

    "పత్యం తిన్న తర్వాత నిద్రపోతే జ్వరం తిరగబెడుతుంది. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అంతవరకు ఏదైనా పుస్తకాలు చదువుకుంటూ వుండు. వారపత్రికలు. మాసపత్రికలు ఏవో కొన్ని నవలలు అలమరకింద అరలో వున్నాయ్ తీసుకో. తలుపులోపల గడియవేసుకో! నిద్రమాత్రంపోకే" ఒకటికి రెండుసార్లు హెచ్చరించి పార్వతమ్మ వెళ్ళింది.

    జ్వరం తగ్గిందన్నమాటేగాని నీరసం వదలలేదు పద్మినికి. అది మామూలు నీరసంకాదు. అంతులేని నిస్సత్తువు, చెప్పరానంత నీరసం!

    పార్వతమ్మ వెళ్ళిపోయింతర్వాత పద్మిని వారపత్రికలయితే తీసుకుందిగాని చదవబుద్ధికాలేదు. కనీసం తిరగెయ్యటానికి కూడా శక్తి లేకపోయింది. జ్వరంతగ్గి పూర్తి తెలివి వచ్చింతర్వాత మాటిమాటికి తల్లీతండ్రీ గుర్తుకొస్తున్నారు. ఇంట్లో మాట్లాడుతూ పార్వతమ్మ, శంకర్రావు పక్కపక్కనే వుండటం, ఆ యింటికి ఎవరో ఒకరు యెప్పుడూ వచ్చిపోవటం దీనివల్ల పద్మిని మనసుని ఒకేదానిమీద కేంద్రీకరించలేకపోయింది.

    ఇప్పుడు ఇంటిమొత్తంమీద పద్మిని ప్రియదర్శిని ఒక్కతే వుంది. ఆలోచనలతో హృదయం బరువెక్కి మనసు బావురుమనేలా వుంది.

    కాస్త జ్వరంవస్తే చాలు తనకి మమ్మీ ఇల్లు పీకి పందిరివేసినంత పనిచేసేది. డాడీ అయితే ఒక్క ఫోన్ కాల్ తో యమర్జంటుగా పెద్ద డాక్టర్ ని పిలిపించేవారు. డాక్టరుగారు ధర్మామీటర్ పెట్టి చూసి "జ్వరం తొంభైతొమ్మిది. అబ్బో చాలా జాగ్రత్త తీసుకోవాలి" అంటూ ఆటలు పట్టించేవారు.

    "మా పప్పీ వుత్త మొండి. దానికి నూటనాలుగు జ్వరం వచ్చినా పట్టించుకోదు. ధర్మామీటరు మరోసారి పెట్టి చూడండి ,ఫీవర్ ఎక్కువగానే వుండి వుంటుంది. ధర్మామీటరులో సరీగా ఎక్కలేదేమో?" మమ్మీ ఆదుర్దా చెందుతూ అనేది.

    "జ్వరం కాకపోతే మరోటి. రాత్రి నుంచి తలనొప్పి తగ్గలేదంటున్నది. సరీగ భోజనం కూడా చేయలేదు. ఏమన్నా పరీక్షలు చేస్తే మంచిదేమో?" డాక్టరుగారితో అనేవారు డాడీ!

    డాక్టరుగారికి ఇంట్లో బాగా చనువుంది. సొంత అంకుల్ లాగ మెలిగేవారు. మమ్మీడాడీల గాభరా చూసి ఆయన వకటే నవ్వు!

    "మీ పప్పీమీద మీ ప్రేమకాదు కానీ జ్వరం నూరుదాటితే నా డాక్టరు డిగ్రీ కాన్సిల్ చేసేట్టున్నారు" అంటూ నవ్వేవారు డాక్టర్ గారు!

    చిన్నపాటి నలతలు తప్ప తనకెప్పుడూ పెద్దగా జ్వరం కూడా రాలేదు. ఎక్కువ చదవటం, ఎక్కువ సినిమాలు చూడటంవల్ల మధ్య మధ్య తలనొప్పి వస్తూవుండేది అంతే!

    తనకింత జ్వరం వచ్చిందని...ఇలా ఒంటరిగా ప్రయాణం చేసిందని...ఇన్నివిధాల బాధలకి గురి అయిందని మమ్మీ, డాడీలకి తెలిస్తే వాళ్ళ హృదయం వేయి ముక్కలవుతుంది.

    ఒక్కక్షణం తనని చూడకుండా వుండలేని మమ్మీ డాడీ ఇన్నాళ్ళ యెలా ఉండగలిగారు! తను మాత్రం? మమ్మీ డాడీలని చూడకుండా ఒకరోజు కూడా ఉండగలిగేది కాదు. అలాంటిది ఇన్నిరోజులు యెలా ఉండగలిగింది? వాళ్ళకి తెలీకుండా తను యిన్ని బాధలు పడింది. తనకు తెలీకుండా వాళ్ళు కూడా...

    పద్మిని ప్రియదర్శిని ఇంక ఆపై ఆలోచించలేదు. గతమంతా సినిమారీళ్ళులాగ కళ్ళముందు వేగంగా కదిలిపోయాయి. చెప్పలేని బాధ, పట్టరాని దుఃఖం ఏకకాలంలో కలిగాయి. కరువుతీరా ఏడుస్తూ కూర్చుంది.

    "బిజినెస్ లోని లాభనష్టాలు, కష్టసుఖాలు తనకి తెలియవ్! తెలీనంతమాత్రాన తనేమీ కానిపని చేయలేదు. పేదవాళ్ళ కష్టం గుర్తించమని ఈ వక్కసారికి వాళ్ళడిగిన డబ్బు యిచ్చి వాళ్ళ కోర్కెలు తీర్చమని తను వాళ్ళ తరపున డాడీని అడిగింది. ఇదేమీ పెద్దకోరిక కాదు. ఈ వక్కసారికి డాడీకి తనమాట విన్నట్టయితే తనకింత కష్టం వచ్చేది కాదుకదా!

    పోనీ

    తనయినా వాళ్ళ విషయాలు పట్టించుకోకపోతే ఇంత కష్టం వచ్చివుండేది కాదు కదా! ప్యాలెస్ లాంటి భవనం వుండి, ఇంటినిండా బోలెడుమంది నౌకర్లుండి, చేతికింద అరడజను కార్లు వుండి అమితంగా ప్రేమించే మమ్మీ డాడీలుండి... ఈ నిమిషాన్ని ఎవరూ లేక, ఏదీ లేక యెందుకీ కష్టం? ఎవరికోసం? ఎవరికోసం? 

    ఇదంతా వాళ్ళవల్ల జరిగింది. తను ఎవరికోసమైతే పోరాడి ఇల్లువిడిచి వచ్చిందో ఆ మనుషులు మనుషులు కాదు. విశ్వాసఘాతకులు. నరరూపరాక్షసులు! తన్ని మర్యాదగా చూసినట్టే చూసి నాలుగు రోజుల్లోనే తనమీద అధికారం చెలాయించాలని చూశారు. వాళ్ళవాళ్ళల్లో వకడికిచ్చి పెళ్ళిచేసి ఏకంగా కోటలో పాగావేద్దామని ప్లాను వేశారు. అచ్చెమ్మకి తన్ను ఎన్ని కొనిపెట్టింది, ఎంత ఖరీదైన ఐస్ క్రీమ్ ఇప్పించింది! అచ్చెమ్మకి అసలు కృతజ్ఞతే లేదు. ఎవడో గన్నయ్యగాడు పదివేల రూపాయలు ఇస్తాననేసరికి అమ్మాయిలను అమ్మేవాళ్ళతో చేతులు కలిపింది.   

 Previous Page Next Page