"నేనే వాసంతీ? నీ శ్యామ్ ని ఇప్పుడె కరెంటు పోయింది" అన్నాడు శ్యాంసుందర్ వాసంతి భుజాలమీద చేతులేసి.
నిద్రలో మర్చిపోయిన కోపం వాసంతికి మళ్ళీవచ్చింది. మవునంగా మునిపంటితో పెదవి నొక్కిపట్టి మూతిబిగించుకునుండిపోయింది?
"వాసూ! నా స్వీట్..." వాసంతిని మధ్యమధ్య అలాగే పిలుస్తుంటాడు శ్యాంసుందర్.
"ఊ" కూడా కొట్టలేదు వాసంతి.
"ఏమిటోయ్? అలకా నిద్రమత్తా?" వాసంతిని దగ్గరకు లాక్కుంటు అడిగాడు శ్యాంసుందర్.
తను ప్రస్తుతం ఏస్థితిలో వుందో వాసంతి చెప్పలేదుగాని శ్యాంసుందర్ చేతులు కోపంతో నెట్టివేసింది. శ్యాంసుందర్ మరింత గట్టిగా వాసంతిని పట్టుకుని మరింత గట్టిగా దగ్గరకు లాక్కున్నాడు. విసురుగా లేచిపోబోయింది వాసంతి. అవకాశం యివ్వలేదు శ్యాంసుందర్.
"ఓ...అర్ధమయింది. అమ్మాయిగారు అబ్బాయిగారి మీద అలిగారా! నిజమే వాసవదత్త పాత్ర నాదని ముందుగా చెప్పలేదు. ముందుగా చెపితే త్రిల్ ఏముందోయ్! వాసవదత్తగా నేనెలా వున్నాను! నీ అంత అందంగా లేనా! చెప్పు వాసంతి! ప్లీజ్. ఊపిరాడకుండా యిన్ని స్వీట్ కిస్ ళు ఇచ్చినా అలకే?"
శ్యాంసుందర్ మాటలు చేతలు చూస్తుంటే అరికాలి మంట నెత్తికెక్కింది. "మగాడు ఆడవేషం వేసుకున్నట్లు నేనేం లేను. ఆడంగిరేకులా ఆ తిప్పుకోటం కొజ్జాముఖం. గొప్ప ఘనకార్యం చేసినట్లు మాటలు. ఛీ... ఛీ... తలుచుకుంటేనే కంపరం పుడుతుంది" అనుకుంది వాసంతి. "నన్ను వదులు" అంది పైకి ఎప్పటిలా శ్యామ్ అని పిలువలేదు.
"ఎందుకు వదలాలమ్మా! చీకట్లో చిందులాట బాగుండలేదా? నాకు భలే బాగుంది" వాసంతి చెవిలో గుసగుసలాడాడు శ్యాంసుందర్.
"నాకు వళ్ళు తలకాయ అన్ని నెప్పులుగా వున్నాయి. వదిలేయమంటే వదిలేయాలి."
"అన్ని నెప్పులు తీర్చ నీ పతి నీ చెంతవుండగా వదిలేయమనటం ఏ ధర్మమమ్మా వాసంతీ!"
"ఛీ... నాముందు అలా ఆడకంఠం మార్చి మాట్లాడకండి" విసుక్కుంది వాసంతి.
శ్యాంసుందర్ వళ్ళు పైతెలీని ఆనందంతో మునిగివున్నాడు. వాసవదత్త పాత్రలో జీవించావని ప్రతివాళ్ళు అభినందించటం శ్యాంసుందర్ మీద ప్రత్యేక అభిమానం గల అమ్మాయిలు నాటకం అయింతరువాత అతనిచుట్టూ మూగి చనువుగా మాట్లాడటం. ఆ చనువు సూటూ బూటులో వున్నప్పుడు చూడటానికి వీలులేదు కాబట్టి ఇప్పుడే చూపటం, అబ్బాయిలయితే శ్యాంసుందర్ తమ లెక్చరర్ అని కాసేపు మర్చిపోయి వాసవదత్తా నా స్పీచ్ డార్లింగ్! ఐ లవ్ యూ వాసవదత్తా!" అంటూ గోలచేయటం. అందులో ఓ కొంటె కుర్రాడయితే ధైర్యంచేసి ముద్దుకూడా పెట్టుకోటం. పెళ్ళయింతరువాత వాసంతి మొదటిసారిగా తన్ని వాసవదత్త వేషంలో చూడటం. ఇవన్ని కల్సి శ్యాంసుందర్ కి చాలా చాలా ఆనందం కలిగింది. తన ఆనందంలో వాసంతిది అలకగానే తలిచాడు.
"ఏమ్మా. మాట్లాడితే కొంపమునిగిపోతుందా? దీనికి శిక్ష వదిలేయటమా?" మరోసారి ఆడకంఠంతో అన్నాడు శ్యాంసుందర్.
"వదలమన్నాను. ఏమిటా మోటుతనం?"
ఒహో, మరిచితిని, మరిచితిని ఇప్పుడు నేను ఆడుదానిని కదా, మోటుతనము సేయరాదు. సున్నితముగాను, లావణ్యముగను, ప్రవర్తించవలెను కదా! అటులనే, పోనీ ఓ పనిచేసిన...నేను ఆడుదానిని, నీవు మగవాడివి కారాదటమ్మా వాసంతీ!"
"ఛీ......సిగ్గులేక పోతేసరి, నీవు మగవాడివికాదు శ్యామ్!"
హా...హతవిధీ, పూర్వజన్మంబున నేనే పాపంబుచేసితి, నాతో కొన్నినెలలు కాపురము ఈ హంసతూలికాతల్పముపై సల్పిన నా ప్రియసతి ఈనాడు "నీవు మగవాడివికాదా!" అని ప్రశ్నవేసినది. ఈ మాట నా కర్ణములకు కఠినముగా వినిపించినది. ఇప్పుడు నేనేమి సేతును! నేను మగవాడిని అవునోకాదో నా పత్నికి ఏ విధముగా తెలియజేయగలను! ఆ...వుపాయంబు కానవచ్చె. ఇదో ప్రియసఖీ వాసంతీ! నేను నిర్దోషినని మగవాడినని ఇప్పుడే నీ సమక్షమున ఈ తల్పము సాక్షిగా నిరూపించుకుంటాను. ఆజ్ఞ యిచ్చినచో నా......"
కరెంటు వచ్చినట్లుంది. గదిలో లైటు గదంతా వెలుగు విరజిమ్ముతూ వెలిగింది.
శ్యాంసుందర్ కౌగిలిలోవున్న వాసంతి శ్యాంసుందర్ ని చూస్తూనే పెద్దగా ఛీత్కారముచేసి విదిలించి కొట్టి మంచంమీద నుంచి లేచిపోయింది.
వాసంతివైపు కొంటెగా చూస్తున్న శ్యాంసుందర్ వాసంతికి ఎందుకంత కోపం తనమీద వచ్చిందో తెలియక తెల్లబోయాడు. చీకట్లో వుండటంవల్ల అంతా అలక అనుకున్నాడు. ఇప్పుడు వెలుగులో వాసంతి మొహం చూడటం వల్ల వాసంతి ముఖంలో ఎంత అసహ్యము ఎంత కోపము చోటుచేసుకున్నాయో స్పష్టంగా కానవచ్చింది.
శ్యాంసుందర్ మంచంమీద నుంచి లేచివెళ్ళి కిటికీవద్ద నుంచుని బైటికి చూస్తున్న వాసంతి భుజాలమీద మృదువుగా చేతులువేసి "కోపం వచ్చిందా వాసంతీ! దేనికి, నేనేం చేశాను!" అన్నాడు.
"ఇంకేంచేయాలి, చేసిందిచాలు. ఓసారి అద్దంలో ముఖంచూసుకుంటే సరి తెలుస్తుంది." విసురుగా అంది వాసంతి.
"ఒహో! ఆడవేషంలో వున్నానని కోపమా! లేక వేశానని కోపమా?" తన్ని తానే చూసుకుంటూ అన్నాడు శ్యాంసుందర్.
వాసంతి పెదవి కదలలేదు.
తన్ని స్టేజీమీద మాత్రమే వాసంతి చూసింది. దగ్గరగా చూస్తే సంతోషిస్తుందని వేళాకోళం చేస్తూ అల్లరిపట్టిస్తుంది. అందరి అభినందనలకన్నా తనకి కావాల్సింది వాసంతి అభినందన. వాసవదత్త వేషంలో దగ్గరగా వెళితే వాసంతి మైమరచిపోయి తన్ని మనసారా అభినందించి ఏదేదో చేస్తుందని ఏమేమో వూహించుకుని వేషం మార్చకుండ అలాగే వచ్చేశాడు శ్యాంసుందర్. గదిలోకి రాంగానే కరెంట్ పోవటం, చీకట్లో తన చిలిపి తనపు పనులు వాసంతికి సంతోషం కలిగిస్తాయని అనుకున్నానుగాని ఇలా కథ అడ్డం తిరుగుతుందనుకోలేదు.
రౌడీరాణుల్లావున్న ఆడపిల్లల ఫోటోలుగల ఆల్బం చూసి, శ్యాంసుందర్ ఆల్బంని రహస్యంగా దాచినందుకు కోపగించుకుని అక్కసుతో వున్న వాసంతి అదేరోజు భర్తని వాసవదత్తగా ఆడదాని వేషంలో స్టేజిమీద చూసి మరింత మండిపడింది. ఎవరో వకరిమీద పైకి ఆ మంటని వెడలగక్కినట్లయితే అంతగా బాధవుండేదికాదు. అగ్నిమీద ఆజ్యంపోసినట్లు శ్యాంసుందర్ వేషం మార్చుకోకుండా వాసవదత్తగా వచ్చాడు. వచ్చినవాడు అలాగేవుండక ఆడరూపంతో ఆడదైన వాసంతితో భర్తగా ప్రవర్తించాడు. ఆ సమయంలో శ్యాంసుందర్ ముఖాన మేకప్ చెదిరివుంది. దానివల్ల మగాడు ఆడవేషం వేసినట్లు బాగా తెలిసిపోతున్నది. ఇతర దేశాలలో ఇరువురు స్త్రీలు పరస్పర అంగీకారంతో ఒకేగదిలో భార్యాభర్తల్లా కాపురం పెడతారుట. ఈ మాట వినటానికి ఏ పుస్తకంలోనయినా చదివినా ఎంత ఎంత వింతగా విడ్డూరంగా అసహ్యంగా తోస్తుందో అలాగే అనిపించింది వాసంతికి శ్యాంసుందర్ ని చూడగానే, శ్యాంసుందర్ చేతులు భుజంమీద పడంగానే గొంగళి పురుగు పాకినట్లయింది. మరోసారి ఆచేతులను విసిరికొట్టింది.