"నీకు కోపంవచ్చినట్లు తెలుస్తూనేవుంది వాసంతీ! కనీసం మాట్లాడు నాతప్పేమిటో చెప్పు. కారణం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది." అన్నాడు శ్యాంసుందర్.
"చూడలేక చస్తున్నాను. ముందా కొజ్జావేషం తీసేస్తే నా ప్రాణం సగం తేరుకుంటుంది." ఏ కోశాన మృదుత్వం లేకుండ కఠినంగా అంది వాసంతి.
"నీకెలా యిష్టమయితే అలాగేవాసంతీ!" చిన్నబోయిన ముఖంతో అని శ్యాంసుందర్ అవతలి కెళ్ళిపోయాడు.
చక చక దుస్తులు మార్చుకుని సిగ్గుతీసి వంకెన తగిలించి ధరించిన రోల్డ్ గోల్డ్ ఆభరణాలు బాక్స్ లో పెట్టి లుంగీకట్టుకుని షర్ట్ వేసుకుని వచ్చాడు శ్యాంసుందర్. మేకప్ తీసేసినా అంతక్రితం వేషం వేసిన ఛాయలు ముఖాన తొలగక ముఖం బోసిగా వుంది. వాసంతి దగ్గరగా వచ్చి "అమ్మాయిగారూ! మీ మీట తుచ తప్పక ఆచరణలో పెట్టాను. భుజంమీద చేయి వేయవచ్చాండి!" ప్రేమ పూజారిలా అడిగాడు.
"నన్ను ముట్టుకోవద్దు" గట్టిగా చెప్పేసింది వాసంతి.
"ఏంటి వాసంతీ! ఊరకే నన్ను బాధపెట్టి విసిగిస్తున్నావు, నేను చేసిన తప్పేమిటి?"
"బీరువాలో ఆల్బం, దానిలో ఆ రహస్య ప్రియురాళ్ళు సుందరీమణులు దానికర్ధం ఏమిటి?"
"ఫక్కున నవ్వాడు శ్యాంసుందర్" సరి సరి. రహస్య పరిశోధన చేసి ఆల్బం చూశావన్నమాట. వాళ్ళంతా మగవాళ్ళు. నాలాగానే ఆడపాత్రలు ధరించినవాళ్ళు. రాధామనోహర్ అంటే మనోహర్ రాధవేషంలో వుండగా తీసిన ఫోటో, సీతా శ్రీనివాస్ అంటే సీత పాత్రలో వున్న శ్రీనివాస్. మిగిలిన అందరూ అంతే సిగరెట్ తాగుతూ కన్నుగీటుతున్న ఆంగ్లవనితను నేనే. ఇవి చూశా కోపగించుకుంది?"
"ఆల్బం అలా అనే నమ్ముతున్నాను. మాత్రీకుడి ప్రాణంలా అంత రహస్యంగా దాయాలా?"
"నిజంగా దాచనక్కరలేదు. ఓ రోజురాత్రి అదీ ఎప్పుడు మన తొలిరోజులలో నాటకంలో ఆడవేషాలు సంగతి ఎత్తాను. నా మాటవిని నీవేమన్నావో గుర్తుందా! మగాళ్ళు ఆడవేషం వేస్తే కొజ్జాల్లా వుంటారు. ఆ మాట వింటానికే నాకు పరమ అసహ్యం అన్నావు. అప్పుడు నా సంగతి చెప్పలేదు. ఎన్నోవిధాల ఎన్నో వుదాహరణలు చూపిస్తూ ఎన్నో చెప్పాను. అసలా ప్రసంగమే నీ ముందు ఎత్తవద్దన్నావు. మాటలతో లాభంలేదని అమ్మతో ముందుగా చెప్పివుంచి ఆల్బం దాచి సమయం వచ్చినప్పుడు స్టేజిమీద నా స్త్రీ పాత్ర చూపించి ఆపై నీలోవున్న ఆ ఏవగింపు పోగొడదామనుకున్నాను. ఈరోజు నాటకంలోనే వాసవదత్త వేషం వేయటం నీవు చూడటం జరిగింది. దీనిలో నాతప్పు ఏముంది వాసంతీ?"
వాసంతి ఏమి అనలేదు. శ్యాంసుందర్ మనసుకి కష్టంగా తోచింది.
"మా అమ్మకి ఆడపిల్ల అంటే ఎంతో యిష్టం. ఆడపిల్ల పుట్టలేదు. నా చిన్నప్పుడు నాకు జుట్టుపెంచి రోజు జారెడు జడ వేసేదిట. గౌను, పరికిణి జాకిటువేసి నాలో ఆడపిల్లని చూసుకుంది. ఫామిలీ ఫోటో ఆల్బంలో నా చిన్నప్పటివేషం ఆడపిల్లలా తీయించిన ఫోటోలున్నాయి. అవి నీవు చూశావుగాని మా చుట్టాల తాలూకా అమ్మాయిననుకున్నావు. నిజం చెప్పాలంటే ఆడపిల్ల అంటే నాకెంతో ఇష్టం, గౌరవం. అందుకే..." శ్యాంసుందర్ తన్మయత్వంతో కామా పులిష్టాపులు లేకుండా చెప్పుకుపోతున్నాడు.
శ్యాంసుందర్ చెపుతున్నది వింటున్న వాసంతికి శ్యాంసుందర్ బృహన్నల వలెను, అతని ప్రవర్తన వాటాదార్లు ఆడంగిలాగానే వుంటే తాను కనిపెట్టలేని మూర్ఖురాలయినట్లు అనిపించింది.
శ్యాంసుందర్ చెప్పటం ముగించి ప్రేమగా వాసంతిని దగ్గరగా తీసుకోబోయాడు. మరోసారి విదిలించి కొట్టింది వాసంతి. "ఎన్నిసార్లు చెప్పాలి! ముట్టుకోవద్దంటే ముట్టుకోవటానికి సిగ్గువుండాలి. ఇద్దరాడవాళ్ళు కాపురం చేసినట్లు చేయటం నాకు పరమ అసహ్యం." అని విసురుగా పక్కగదిలోకి వెళ్ళి తలుపేసుకుంది.
అవాక్కయి అలా నిలిచిపోయాడు శ్యాంసుందర్. ఇప్పుడు వెళ్ళి తలుపుకొట్టినా తీయని కోపం మర్నాటికి తగ్గుతుందని తలచి ఆ ఉదయం నుంచీ వున్న ఆనందం హరించుకుపోగా వెళ్ళి పడుకున్నాడు.
ఆ మిగిలిన సగంరాత్రి ఇటు గదిలో శ్యాంసుందర్ అటుగదిలో వాసంతి నిద్రమాత్రం పోలేదు. మంచంమీద అటు ఇటు దొర్లుతు ఆలోచిస్తూనే వున్నారు.
21
వాసంతి వక్కతి మ్యాట్నీకి హిందీపిక్చర్ కి వెళ్ళింది.
ఆదిలక్ష్మమ్మ కబురు చేయటంవల్ల ఆ మధ్యాహ్నం రాధాకృష్ణ జానకి వచ్చారు.
వెంకట్రామయ్యగారు, రాధాకృష్ణ, జానకి హాలులో కూర్చున్నారు. కాఫీ కలుపుకుని తీసుకొచ్చింది ఆదిలక్ష్మమ్మ. నలుగురు కాఫీతాగుతూ కాసేపు మవునంగా తలోరకంగా ఆలోచిస్తూ కూర్చున్నారు.
"నువ్వంతగా భయపడవలసింది ఏమీ కనబడలేదు అక్కయ్యా!" కాఫీకప్పు కిందపెడుతూ అన్నాడు రాధాకృష్ణ.
"ఈ మాట అప్పటికి నాలుగొందలసార్లు చెప్పాను. అయినా మీ అక్కయ్య భయంపోలేదు. నిన్నుపిలిచింది యిందుకుటోయ్! ఏదో సలహా యిస్తావు సమస్యపరిష్కారం చేస్తావనికదా!" అన్నారు వెంకట్రామయ్యగారు.
"ఎనకటికెవరో బతకటానికి మార్గం కనిపించక ఓ తెలివికలవాడి దగ్గరకెళ్ళి "నాకేదయినా దారిచూపించి పుణ్యం కట్టుకో బాబూ!" అంటే ఆ తెలివికలవాడు తిన్నగా గోదావరికి దారిచూపించాడట. అలా వుంది మీ వరస. భయంలేదు. భయపడాల్సింది అసలేలేదు. ఫరవాలేదు. ఆపటం." మీ డాక్టర్లకి నాలుక చివర రెడీగా వుండేమాట. అవతల రోగి ప్రాణంపోతున్నా ఉన్నమాట చెప్పరు. ఎద్దేవాచేసింది జానకి.
"ఉన్నమాట చెపితే రోగిప్రాణం గంట తర్వాత పోయేది ఆ క్షణానే పోతుంది. రోగిచావకముందే రోగి తాలూకా బంధుమితృలు ఘొల్లు మంటారు. మా డాక్టర్లని డాక్టరు వృత్తిని ఎగతాళి చేయక." అన్నాడు రాధాకృష్ణ.
"వరేయ్ రాధాకృష్ణా! కబుర్లు తరవాత ముందీ విషయం చూడరా? మీకేం తెలుస్తుందిరా నా బాధ, కన్నతల్లి ప్రాణం అంటారు. నా ప్రాణం కొట్టుకులాడుతున్నది. ఎంతసేపు భయంలేదు భయంలేదు అని చెప్పటమేగాని ఇది ఆడపిల్ల జీవితం అని కాస్త ఆలోచించండిరా!" కళ్ళనీళ్ళు పెట్టుకుని అంది ఆదిలక్ష్మమ్మ.
"ఏమిటక్కయ్యా! నీ పిచ్చి, వాసంతి చిన్నపిల్లా మందలించటానికి. అయినా వాసంతి కామాత్రం తెలియదా! కొత్తకాపురంలో అప్పుడప్పుడు హాట్ హాట్ గ కలతలు రేగటం, భార్యాభర్త అలక ఆపై వాళ్ళే కలుసుకోటం మామూలు విషయం. ఏ విషయంలోనో అతనిమీద కోపం వచ్చివుంటుంది. వాసంతికి కాస్త తొందరపాటు ఎక్కువకాబట్టి పెట్టె పుచ్చుకువచ్చేసింది. నాలుగు రోజులుపోతే వాళ్ళే సర్దుకుంటారు."


