Previous Page Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 25

    పార్వతి మాటలు విన్న వాసంతి ఆ తర్వాత వాళ్ళేమనుకుంటున్నారో వినటం మానేసింది. కనుగుడ్లు పెద్దవిచేసి అయోమయం ఆశ్చర్యం ఏకకాలంలో ఆవరించగా అలా వాసవదత్త పాత్రలో నటిస్తున్న శ్యాంసుందర్ ని చూస్తూ వుండిపోయింది.
    "ఒక మొగవాడు అందమైన స్త్రీపాత్ర వేయటమా? అది మరొకరు మరొకరుగాక సాక్షాత్తు తన భర్త కావటమా? నిజమే వాళ్ళనుకుంటున్నట్లుగా శ్యామ్ చాలా బాగున్నాడు." ఇలా ఆలోచించిన వాసంతి కొద్దిసేపుమాత్రమే ఆనందించగలిగింది. ఆ తర్వాత స్టేజిమీద వాసవదత్త రూపం మర్చిపోయి తనభర్త శ్యామ్ ని వూహించుకుంది. ఒక మగవాడు మగవాడుగానేవుండి ఆడదానిలా కులకటం, నడవటం సిగ్గుతో ముడుచుకుపోవటం, విరహం, విషాదం అభినయిస్తే ఎలా అసహ్యంగా వుంటుందో అలా శ్యామ్ వున్నట్లు అనిపించింది వాసంతికి.
    ఒక పురుషుడు స్త్రీ వేషం వేసి మెప్పించటం సామాన్యమైన విషయం కాదు. ఒక స్త్రీ పురుషుడి వేషం వేసి మెప్పించటం చాలా తేలిక. పురుషులలో సున్నితత్వం లాలిత్యం వున్నా అది ఎవరికో ఏమూలో వుంటుంది. ప్రకృతి తీరునుబట్టి పురుషుని ఆకృతి గంభీర్యంగా కఠినంగా మొరటుగా వుంటుంది. అలాంటి పురుషుడు తాను స్త్రీ పాత్ర ధరించినప్పుడు చూసేవాళ్ళు పాత్రలోవున్న పురుషుడిని మరచిపోయి నటిస్తున్న స్త్రీ పాత్రను మెచ్చుకున్నా లేక ఆ నటుడు ప్రేక్షకులను మెప్పించగలిగినా అతని జన్మధన్యమే. శ్యాంసుందర్ ని వాసవదత్త రూపంలో చూసి అందరూ వాహ్వాహ్వ అంటుంటే వాసంతికి మాత్రం శ్యాంసుందర్ ఎలిఫెంట్ ప్యాంటు పూల బుష్ షర్టుతో ఓసారి వైట్ పాంటులో ముదురు నీలం ఫుల్ హాండ్స్ షర్టు టక్ చేసి ఆడదానిలా అభినయిస్తున్నట్లు వుంది.
    వాసంతి కుర్చీలో కూర్చుండలేకపోతున్నది. తాను కూర్చున్న కుర్చీలో ముళ్ళున్నట్లు శరీరంమీద తేళ్ళు, జెర్రులు ప్రాకుతున్నట్లు నానా బాధ పడిపోతున్నది. "ఇదేం వేషం ఆడంగివేషం. చక్కగా హీరోలాగా వేయక బుగ్గన చేయిచేర్చుకుని ఆ కులుకులేమిటి, ఛీ ఛీ...ఆడంగిరేకిలా ఆ వేషం ఎవరన్నాచూసినా నవ్విపోతారు. బుద్ధిలేనివాళ్ళు మెచ్చుకోవాల్సిందే, ఏం విరహవేదన ఏం త్యాగం ఛాఛా...వాసవదత్త వేషంకాబట్టి సరిపోయింది అదే ఏ సీతో సావిత్రో పాత్రో వేస్తే. "నాధా! నీ పాదములే నాకు స్వర్గము మోక్షము నీపాదముల చెంత కాస్తచోటు యివ్వు" అని "ఏమగాడి పాదాలు పట్టుకుని పాకులాడేవాడేమో! ఆడాళ్ళే కరువయినట్లు శ్యామ్ ఆడంగివేషమా!
    వాసంతి అదేపనిగా ఆలోచించి తలనొప్పి తెచ్చుకుంది. మధ్యలో లేచిపోతే బాగుండదని ఎవరో బలవంతానా బంధించి కూర్చోపెట్టినట్లు కుర్చీలో కూర్చుండిపోయింది.
    నాటకం అయిపోయింది. మిమిక్రీ అయిపోయింది. విచిత్రవేషధారణళు. నాట్యం అన్ని అయిపోయి తెరదించేశారు. శ్యాంసుందర్ యింటికి వచ్చేటప్పటికి ఆలశ్యం కావచ్చునని ముగ్గురు ముందుగా యింటికి వచ్చేశారు.
    వాసంతి ఎప్పటిలా వుషారుగా లేదని శ్రీదేవమ్మ గుర్తించింది. మరోసారి "అలా ఉన్నావేం?" అని అడిగింది. "ఏంలేదు తలనొప్పి." అంది వాసంతి.
    శ్రీదేవమ్మ నమ్మలేదు. కొడుకు కోడలు ఏదోవిషయంలో పోట్లాడుకుని వుంటారు. కొత్తజంట వాళ్ళే సర్దుకుపోతారు. విషయం ఏమిటని బలవంతం చేయటం బాగుండదు అనుకుంది.
    తలనొప్పి మనసు సరీగ లేని వాసంతి ఇంటికి రాంగానె ఖరీదైన చీరని వదిలి వేరే చీర ధరించక అలాగే మంచంమీద పరుండిపోయింది.
                                          20
    బైట తలుపు విని లేవటానికయినా తనగది తలుపులు లోపల బిడాయించుకోలేదు వాసంతి సరీగా వంటిగంటం బావుకి శ్యాంసుందర్ వచ్చాడు. తల్లితో రెండుముక్కలు మాట్లాడి తన గదిలోకి వచ్చి తలుపులువేసుకున్నాడు, వాసంతి మంచి నిద్రలో వుంది.
    వాసంతి నాటకంనుంచి యింటికొచ్చింతర్వాత ఏవేవో వూహించుకుని పూర్తిగా మనసు పాడుచేసుకుంది. పుట్టి బుద్ధి ఎరిగింతర్వాత ఎప్పుడూ కళ్ళనీళ్ళు పెట్టుకోనిది ఈరోజు కనరానిది, వినరానిది, ఏదో జరిగిపోయినట్లు తలచి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఎక్కడ ప్రేమవుంటుందో అక్కడ ఈర్ష్య, అసూయలుంటాయన్నట్లు శ్యాంసుందర్ మీద వాసంతికి ఎంత గాఢమైన ప్రేమ వుందో ఇప్పుడు అంతకు రెట్టింపు కోపము, కసి ఏర్పడ్డాయి.
    ఆలోచించి ఆలోచించి యింక ఆలోచించటాని కేమీ మిగలక విసుగుతో అటూ ఇటూ కొద్ది నిద్రలోకి జారుకుంది వాసంతి. అప్పుడొచ్చాడు శ్యాంసుందర్, తన ఫోటో ఆల్బం వాసంతి చూసిందని ఎరగడు. తను వాసవదత్త వేషం ఎన్నోసార్లు వేశాడు. అప్పుడువేరు వాసంతి మొదటిసారిగా తన్ని తనకిష్టమైన పాత్ర వాసవదత్త వేషంలో చూడటంలేదు. తను వేషంలో వున్నప్పుడు వాసంతి మొదట గుర్తుపట్టి వుండదు, కనీసం తను ఆడవేషం వేయగలడని వూహించివుండదు. తన్ని గుర్తుపట్టంగానే ఆశ్చర్యపోయి ఆనందించి వుంటుంది. తన్ని ప్రేమగా వాసంతి అభినందిస్తున్న తీరు వూహించుకున్నాడు శ్యాంసుందర్. చప్పుడు చేయకుండా నడచివచ్చి మంచంమీద వాసంతి పక్కనే కూర్చున్నాడు.
    వాసంతి గాఢనిద్రలో వుండటం చూసి శ్యాంసుందర్ నిరాశచెందాడు. తన రాకకోసం వాసంతి ఎదురుతెన్నులు చూస్తూ వుంటుందనుకున్నాడు. వాసంతికి అటోచెయ్యి యిటో చెయ్యి వేసి ప్రపంచంలో వున్న ప్రేమంతా తన కళ్ళల్లో నింపుకుని వాసంతి ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు.
    వాసంతి మంచంమీద వెల్లికింతలా పడుకునివుంది, దిండుమీద అటుయిటు దొర్లటంవల్ల తల కొద్దిగా రేగివుంది. శరీరంమీద చీర యధారీతిలో లేదు. కుడిమోకాలుదాకా చీర చెదిరిపోయి తెల్లని ఛాయతో కాలు కనబడుతున్నది. పమిట జారి చేతిమీద వుంది. నాటకాని కెళ్ళేటప్పుడు కట్టుకున్న ఖరీదైన పాలమీగడలాంటి ఫారెన్ నై లెక్స్ చీర, వైట్ రూబీ జాకిట్టు జడనిండుగా విచ్చిన మల్లెలమాల చెవలకి చేతులకి మెడల్లోను ముత్యాలతో తయారయిన మ్యాచింగ్ నగలపెట్టు వీటితో వాసంతి దివినుంచి భువికి శాపవశాత్తు విసిరివేయబడ్డ దేవతలా కనిపించింది శ్యాంసుందర్ కళ్ళకి. వాసంతి నుదుటిమీద మృదువుగా చుంబించడానికి ముందుకు వంగాడు శ్యాంసుందర్. సరీగ అప్పుడే కరెంట్ పోయి గదంతా చీకటి అయింది.
    వాసంతికి చటుక్కున మెలుకువ వచ్చింది. కారణం కరెంటు పోంగానే తిరుగుతున్న ఫ్యాను ఆగిపోవటం, రెండోది ముఖాన తగులుతున్న వేడి శ్యాసయొక్కగాలి నుదుటిమీద ఎవరో ముద్దుపెట్టుకున్నట్లు అయి భయంతో లేవబోయింది. మీద మనిషి వంగివున్నట్లు తన పక్కనే కూర్చునివున్నట్లు గ్రహించి "ఎవరిది?" అంది స్వరంతో.

 Previous Page Next Page