నా తోడబుట్టినాదాన్ని కాపాడుకోలేని అసమర్థుణ్ని. తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోలేని అల్పుడ్ని.
నిజమేనమ్మా! నువ్వు రాసినట్టే అమ్మా నాన్నా వుంటే కట్నం ఇవ్వాల్సివస్తుందనే కాపీనంతో తాడూ బొంగరం లేని యీ రాక్షడికి నిన్ను కట్టబెట్టెవారా? నీకు ఈ దుర్గతి పట్టనిచ్చేవారా?
నేను స్వార్థపరుడ్ని.
నా పెళ్ళాం పిల్లల క్షేమం చూసుకొన్న నీచుడ్ని.
"ఇది ఏ స్టేషనండీ?" ఎదురు బర్తుమీద కూర్చున్నా మూసలయన సత్యనారాయణ ప్రశ్నించాడు.
సత్యనారాయణ ఊహాదృశ్యం చెదిరిపోయింది. పీడకలనుంచి బయటపడినట్టు అనిపించింది.
సత్యనారాయణ ముఖం పక్కకు తిప్పుకొని కళ్ళు తుడుచుకున్నాడు. వాచీలో టైం చూసుకున్నాడు.
మరో గంటన్నరకు బండి నాంపల్లి స్టేషను చేరుతుంది. ఇంటికి చేరడానికి మరో అర్థగంట అయినా పడుతుంది.
మరో రెండు గంటలలో తనేం చూడబోతున్నాడో?
అరవై మైళ్ళ వేగంతో పోతున్న రైలు వానపాములా పాకుతూ పోతున్నట్టుగా అన్పిస్తూంది సత్యనారాయణకు.
మాటిమాటికి టైం చూసుకుంటూ ఆశా నిరాశల మధ్య వూగిసలాడుతూ కూర్చున్నాడు సత్యనారయణ రైలులో.
ఇంకో గంట!
ఓ భగవంతుడా! నా చెల్లెల్ని రక్షించు!
అరగంట! అమ్మా చెల్లమ్మా! నేను వస్తున్నానమ్మా~
గడియారం ముల్లు తిరుగుతూంది.
బండి శరవేగంతో దూసుకు పోతూంది.
ఇరవై నిముషాలు.
ఇవ్వాళ దీపావళి.
అందరిఇళ్ళూ ముగ్గులతో కళకళలాడుతూ ఉంటాయి
కాని తన చెల్లెలి ఇల్లు?
చీకటి కూపంగా మారి ఉంటుందా?
తన చెలులు ఏం చేస్తుందో?
పదిహేను నిముషాలు!
మృత్యువు వికటాట్టహాసం అతని చెవుల్లో గింగురుమంటూ వుంది.
పది నిముషాలు
మృత్యువు భీకరనృత్యం అతని హృదయాంత రాళాల్లో చెలరేగింది. గుండెలమీద కదంతోక్కుతూ వుంది.
ఐదు నిముషాలు
సత్యనారాయణ బుర్ర పనిచెయ్యడం ఆగిపోయింది. ఏదో హొరు, భీకర ధ్వనులు , బుర్రలో ఏదో తగలబడుతుంది.
రైలు ప్లాటుఫారం చేరుతూంది చిన్నగా.
అతని గుండె వేగం హెచ్చింది.
రైలు గమ్య స్థానంలో ఆగింది.
సత్యనారయణ రైలుదిగి నడకా, పరుగూగా స్టేషన్ బయటపడ్డాడు.
ఎదురుగావున్న ఆటో ఎక్కి కూర్చున్నాడు.
"ఎక్కడికిసార్!" వెళ్ళవలసిన చోటు చెప్పకుండా కూర్చున్నా సత్యనారాయణను ప్రశ్నించాడు ఆటో డ్రైవరు.
"ఆఁ"
"ఎక్కడికెళ్ళాలి?" ఆశ్చర్యంగా అడిగాడు.
"అమీర్ పెట!" యాంత్రికంగా అన్నాడు.
15
ఆటో స్పీడుగా పోతూంది. సరోజ ఇల్లు దగ్గరౌతున్నది.
సత్యం గుండె వేగం హెచ్చింది.
అదిగో! ఆ మలుపు తిరిగితే తన చెల్లెలు కన్పిస్తుంది.
ఆ ఇల్లంతా దుఃఖంతో నిండివుంటుదా? ఈ దీపావళి రోజు ఈ పట్నంలో వున్న చీకటంతా ఆ ఇంట్లోనేవున్నదా?
"దుఃఖం ! దిగులూ! భయం!
సత్యనారయణ ఎదలో తుఫాను వీచివీచి కొడుతూంది. మెదడులో పోటూ, గుండెలో బరువు.
ఇంకో క్షణంలో తనేం చూడబోతున్నాడు?
అదిగో అదే ఇల్లు!
ఇంటి ముందు జనం లేరే!
గందరగోళంగా లేదే? వాకిట్లో ఏమిటిది?
మామిడి తోరణమా?
సత్యనారాయణ గుండెల నిండుగా గాలి పీల్చుకున్నాడు.
ప్రాణాలు కుదుట పడ్డాయి.
ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు.
అమ్మయ్య! ఏం కాలేదు! ఇంకా ఏంకాలేదు.
తన చెల్లెలు ప్రాణాలతోనే వుంది, తన కోసమే ఎదురుచూస్తూ వుంది! గుమ్మానికి మామిడి తోరణం కూడా కట్టింది.
"దిగండి సార్!" ఇంకా ఆటోలోనే కూర్చునివున్న సత్యనారాయణను వింతగాచూస్తూ అన్నాడు ఆటో డ్రైవరు.
సత్యనారాయణ ఆటోదిగి డబ్బులిచ్చి వెనక్కు తిరిగాడు.
ఆటో శబ్దంవిని సరోజ గబగబా బయటికి వచ్చింది.
అన్నను చూడగానే సరోజ ముఖం వికసించింది.
కళ్ళు మిలమిలలాడాయి.
"రా, అన్నయ్యా! రా! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు మా అన్నయ్య నా ఇంటికి వచ్చాడు!" సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అన్నది సరోజ.
సత్యనారాయణ సరోజను కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ వుండిపోయాడు.
సరోజ తలంటి పోసుకొని కొత్తచీర కట్టుకొనివుంది. ఆమె ముఖం ఎలాంటి విచారంలేదు.
ఉత్సాహంగా వుంది! ఆనందంగా ఉంది. కొంచెం వళ్ళు చేసింది.
"అలాగే నిలబడిపోయా వేం అన్నయ్యా! రా! లోపలకు! ఏమండోయ్! ఏం చేస్తున్నారూ? ఎవరోచ్చారో చూడండి" అంటూ భర్తను కేకలు పెడ్తున్న సరోజను ఆశ్చర్యంగా చూశాడు సత్యనారాయణ.
"నువ్వటోయ్! ఏ బండి కొచ్చావ్? ముందుగా రాస్తే స్టేషన్ కు వచ్చే వాణ్నిగా!" అన్నాడు హరికృష్ణ స్నేహ పూర్వకంగా.
ఇది నిజమా? కలా? భ్రమా! మతిభ్రమణమా?
తనేం చూస్తున్నాడు? సరోజా, హరీ ఎంత ఉత్సాహంగా ఉన్నారు!
ఎన్నో కొండలభారం తన గుండెమీదనుంచి దించినట్టుకాగా తేలికపడిన మనసుతో పక్కపక్కనే నిల్చున్న సరోజనూ, హరినీచూస్తూ నిల్చున్నాడు సత్యనారాయణ.
"ఏమిటోయ్! అలా ఆశ్చర్యంగా చూస్తున్నావేం? మీ చెల్లెలు కొత్తగా కన్పిస్తుందా?" నవ్వుతూ అన్నాడు హరికృష్ణ.
"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు అన్నయ్యకు నామీద దయకలిగిందో!" ఇంట్లోకి దారితీస్తూ అన్నది సరోజ.
"ఏం దారితప్పి వచ్చినట్టున్నావే? ఇంట్లో అంతా కులాసాయేన?" అన్నాడు హరికృష్ణ.
"అన్నయ్యా! తలంటుకో ! ఇవ్వాళ సంవత్సరాది"
"అబ్బే ఎందుకమ్మా! బాబు ఏడీ?" పూర్తిగా తేరుకోకుండానే అడిగాడు సత్యనారాయణ.
"ఇప్పుడే పక్కింటికి వెళ్ళాడు. ఆమెకు పిల్లలులేరు. మాన్ బాబు అంటే పడి చచ్చిపోతుంది."
"అమ్మాయ్! నీ ఒంట్లో ఎలాగుంటుందమ్మా? కులాసాగా...."
"ఏం కులాసాలే!" అంటూ చెప్పబోయి భర్త ముఖంలోకి చూసి ఆగిపోయింది సరోజ.
సత్యనారాయణకు చెల్లెల్ని ఎన్నో అడిగి తెలుసుకొవాలని వుంది. హరికృష్ణ వుండడంవల్ల ఏమి అడగలేక పోయాడు.
కాఫీ తీసుకో అన్నయ్యా!"
"మీ అన్నయ్యకేనా? నాకులేదా" హరి అడిగాడు.
ఇప్పుడేగా తాగారు? కొంచెం ఆగాక ఇస్తాలే!" అన్నది సరోజ.
సత్యనారాయణ కాఫీ తాగి కప్పు బల్లమీద పెట్టారు. మనసు చాల తేలికగా వుంది.
ఇవిగో నమ్మ! అంటూ ప్యాంటు జేబులో నుండి గాజులు చుట్టివున్న కర్చీపు బయటికి తీశాడు.
"ఏమిటన్నయ్యా?" ఆత్రంగా ముందుకు వచ్చింది సరోజ.
"మీ అన్నయ్య కర్చీపులో అటుకులు తెచ్చినట్టు వున్నాడు." నవ్వుతూ అన్నాడు హరికృష్ణ.
సత్యనారాయణ చేతిలోనుంచి అందుకుంటూ "రాళ్ళగాజులు. మా అన్నయ్య తెచ్చాడు" చిన్నపిల్లలా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది సరోజ.
సత్యనారాయణ హరి ముఖంలోకి చూశాడు.
తను ఆశించిన భావాలు అతని ముఖంలో కన్పించలేదు.
ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అన్నాచెల్లెళ్ళను మార్చి మార్చి హరికృష్ణ. మరుక్షణంలో అతని ముఖం గాభీరంగా మారిపోయింది.
"ఇప్పుడెందుకోయ్ అవి?" అన్నాడు హరికృష్ణ.
సరోజ గాజులు అటూ యిటూ తిప్పి చూసి "యివి కోటగా కొన్నవా?" ఆశ్చర్యంగా అడిగింది.
"కాదమ్మా! మీ వదిన గాజులు!"
"వదిన యిచ్చిందా?" ఇనుమడించిన ఆశ్చర్యంతో అడిగింది సరోజ.
"అదేమిటోయ్! చెల్లమ్మ గాజులు తెచ్చావా? నేకు మతిపోయిందా ఏమిటి?" మందలించాడు హరి.
"పద్మే యిచ్చింది. సరోజకు యీ గాజులంటే చాలా యిష్టం! కొంతకాలం పెట్టుకోమని యివ్వండి. అంటూ యిచ్చింది!" సత్యనారాయణ నంగి నంగిగా అన్నాడు.
హరి ముభావంగా ఊరుకున్నాడు.
దీర్ఘంగా ఆలోచిస్తూ వుండిపోయాడు.
అతని ముఖంలో ప్రసన్నత లేదు.