అదీ క్షణాల్లో?
సత్యనారాయణ బయటకు నడిచాడు.
మనసు మనసులో లేదు!
ఉసిగా నడుస్తున్నాడు. ఎర్రరాళ్ళ గాజులు!
ఎర్రరాళ్ళ గాజులు!
సత్యనారాయణ బుర్రలో ఒకే ఆలోచన! దెయ్యం పట్టినట్టు నడుస్తున్నాడు.
పద్మకు కొన్నప్పుడు వెయ్యికే వచ్చాయి. ఏడేళ్ళలో బంగారం ఖరీదు ఎంత పెరిగిపోయింది.
నాలుగింతలు పెరిగింది.
అన్నిటి ధరలూ మండిపోతున్నాయి!
ఇప్పుడు తనేం చెయ్యాలి?
చెల్లెలుకి గాజులు ఇవ్వాలి.
సరోజకు ఆ గాజులు ఇవ్వగలిగితే!
ఎంత ఆనందింస్తుంది?
ఆ హరికృష్ణగాడు చూస్తుండగా రేపే ఆ గాజులు చెల్ణి చేతికి తను ఇస్తే?
నిజంగా సరోజ తన జీవితంలోకి కొత్తవెలుగు ప్రవేశించినట్టు పొంగిపోదూ? అంత వేలుగునూ, ఆనందాన్ని ఆ సమయంలో తను దాని జీవితంలోకి ప్రవేశపెట్టగలిగితే అది పునర్జన్మ ఎత్తదూ? కానీ ఎలో?
నాలుగు వేలు ఎక్కడ్నుంచి తేవాలి?
రెక్కలు విప్పుకొని ఆలోచనలు పక్షుల్లా అతని మెదడులో విహరించసాగాయి.
అతను ఇంటికి చేరేసరికి పిల్లలు నిద్రపోతున్నారు.
పద్మ వారవాకిలిగా వేసివున్న తలుపును ఆనుకొని ముడుచుకొని కూర్చుంది.
భర్త ఇంటికి వచ్చి, తనమీద చెయ్యి చేసుకున్నందుకు బాధపడుతూ అనునయిస్తాడనుకుంటూ కూర్చుంది పద్మ.
భర్త మాట్లాడకుండా, తనకేసి చూడకుండా లోపలకు వెళ్ళిపోవడం, పద్మ హృదయంలో శూలం దిగబడినట్టు బాధపడింది.
నిరాశా, కసీ మనసుని కాల్చి వేస్తున్నాయ్. అవమానం తిరస్కారం శరీరాన్ని దహిస్తున్నాయ్.
గదిలోకి వెళ్ళి ముసుగు బిగించి ఏదేదో ఆలోచిస్తూ పడుకుంది పద్మ.
మెల్లగా ఇంట్లోనుంచి గదిలోకివెళుతున్న సత్యనారాయణ కాళ్ళకు ఏదో తగిలి వంగిచూశాడు.
తాళం చెవుల గుత్తితను మధ్యాహ్నం విసిరికొట్టిన చోటునే పడివున్నాయ్.
సత్యనారాయణ చేతిలోకి తాళంచెవులు తీసుకొని ఓ క్షణం ఆలోచించాడు.
గదిలోకి వెళ్ళి పద్మ ట్రంకుపెట్టె తెరిచి నగలను బయటకు తీశాడు.
నగల పెట్టెమూత తీశాడు. ఎర్రరాళ్ళ గాజుల కాంతి సత్యనారాయణ కళ్ళలో ప్రతిబింబించింది.
గాజులు చేతిలోకి తీసుకున్నాడు.
తను చేస్తుంది మంచిపనేనా? తన భార్య గాజులు! చెప్పకుండా తీసుకెళ్ళి చెల్లికిస్తే అది మాత్రం బాధపడదూ?
ఏం? ఎందుకు బాధపడాలి? తను చేయించినవేగా? తను చేయించిన గాజులు తన చెల్లెలికి యిస్తేనేం? మళ్ళీ డబ్బు చేతికివచ్చినప్పుడు పద్మకు చేయిస్తాడు. ఇప్పుడు దానికి యీ గాజులు లేకపోతే ఏం? అసలు ఎప్పుడో గాని ఈ గాజులు వేసుకోదు.
ఈ గాజులు తీసుకెళ్ళి చెల్లెలికిస్తే ఎంత పొంగీపోతుంది? దానికి కొత్త జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది.
గాజులు కర్చిపులో చుట్టి జాగ్రత్తగా ఫాంటుజేబులో పెట్టుకున్నాడు సత్యనారాయణ.
పద్మకు ఒకసారి చెబితే? లాభంలేదు- అది యివ్వదు.
14
రైలులో కూర్చున్న సత్యనారాయణకు చెల్లెలు గురించిన ఆలోచనలు తప్ప మరో ఆలోచనే లేకుండా పోయింది.
ఇంకా కొన్నిగంటల్లో తను తన చెల్లెలి దగ్గర వుంటాడు.
అకస్మాత్తుగా వచ్చిన తననుచూసి ఎంత ఉప్పొంగిపోతుంది?
తనుతెచ్చిన రాళ్ళగాజులు వేసుకొని మొగుడిముందు ఎంత గర్వంగా తిరుగుతుందో కళ్ళారా చూడాలి.
"నీకుతోడు రాళ్ళగాజులు కావాలా అని ఏదీ యిప్పుడు ఆనండి!" అన్నట్టు భర్తముఖంలోకి చూడదూ!
తను చెల్లెలిదగరకు పోతున్నాడు...కాని సరోజ.... తన చెల్లెలు బ్రతికేవుందా?
ఈపాటికి...
సత్యనారాయణ వెన్నెముకలో ఏదో జరజరా పాకినట్టు అయింది.
సరోజ రాసిన ఉత్తరం జేబులోనుంచి తీసి మళ్ళీ చదువుకోసాగాడు.
తను యింటికి చేరేసరికే అది యీ లోకాన్ని విడిచిపెట్టి వుంటుందేమో?
అది యింకా బ్రతికే వున్నదనే ఆశ క్షణక్షణం తనలో నశించిపోతుంది. ఎందుకని? ఇన్ ట్యూషన్ నేమో!
తను బండి దిగివెళ్ళి ఎలాంటి దృశ్యాన్ని చూస్తాడో!
హే భగవాన్! రక్షించు!
సరోజ ప్రాణాలను కాపాడు! మరికొన్ని గంటలు కాపాడు! చాలు!
సత్యనారాయణ కళ్ళు మూసుకొని బెర్తుమీద వెనక్కువాలి కూర్చున్నాడు.
తను గేటు తెరుచుకుని లోపల అడుగు పెడ్తుండగానే....ఇంటిలోనుంచి ఘోల్లున ఏడుపు వినిపిస్తే? వళ్ళుఝల్లుమంది.
తన ముద్దుల చెల్లెలి నేలమీద పడివుంటుందా!
పిల్లవాడు తల్లిమీదపడి గుక్కబట్టి ఏడుస్తూ వుంటాడా?
ఆ రాస్కెల్ ఏంచేస్తూ వుంటాడు?
దొంగఏడ్పులు ఏడుస్తూ వుంటాడేమో?
లేక-ఆ నరరూప రాక్షసుడు...దూరంగా తల వంచుకొని బాధపడుతున్నట్టు నటిస్తూ కూర్చుండేమో! చుట్టూ జనంచేరి వాడిని ఊరడిస్తూ వుంటారు.
"ఎంత ఘోరం? అమ్మా సరోజా! తల్లీ, నేను వచ్చానమ్మా! నీ అన్నయ్యను వచ్చానమ్మా! ఒక్కసారి కళ్ళు తెరిచి నీ అన్నయ్యను చూడమ్మా! నావైపు చూడవూ? నాతో మాట్లాడవూ?
ణా చేతులారా నిన్ను చంపుకున్నానే తల్లీ! డబ్బు ఖర్చు లేకుండా దొరికాడు కదా అని వాడిచేతిలో నిన్ను పెట్టి అన్యాయం చేశానమ్మా! నామీద కోపమా చెల్లీ! ఏదీ, ఒక్కసారి నో రారా 'అన్నయ్యా' అని పిలవ్వూ?
నన్ను క్షమించు తల్లీ!
హే భగవాన్! ఈ పాపికి ఏ శిక్ష విధిస్తావ్?
ఒక కసాయివాడి చేతుల్లో ణా చెల్లెల్ని పెట్టి నిలువునా ప్రాణాలు తీసిన పాపిని! అమ్మా! నీ కిచ్చిన మాటను నిలుపుకోలేని పాపిని!
ఎన్నిసార్లు నువ్వు నెత్తిన నోరుపెట్టుకొని నీ గోడు చెప్పుకున్నా నా చెవులకు ఎక్కలేదు గదమ్మా చెల్లీ!
ఎంత పాపిష్టివాడిని! నా పాపానికి నిష్కృతి లేదు-