Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 26

    అతన్ని పూర్తిగా చెప్పనివ్వకుండానే అంది. "ఈ పురాణాలు వద్దు. నీ కొడుకు నాతో తెగతెంపులు చేసుకుని వెళ్ళాడు. అంతగా బుద్ధి వచ్చివుంటే యీ రాయబారాలు అక్కరలేదు. ఇంటికి శుభ్రంగా రమ్మను. తన స్థానం తనకుంది. అంతేగానీ అతను ఆశించినట్టు కోరినట్టు నేను మాత్రం రాను!"
    దట్సాల్! యికనే వస్తా?" వెళ్ళిపోయాడు గోవర్ధనం ఇంకేం అనటానికీ తావివ్వకుండా జ్యోతికూడా ఓ చూపు విసిరి వెళ్ళిపోయింది...ఇది వంగేకొమ్మ కాదు!" అనుకుని నిరాశా నిస్పృహలతో తిరుగు ముఖంపట్టాడు విశ్వనాథం.
                                      27
    కాలం వేగంగా ముందుకు కదలిపోతోంది. శ్రీకర్ నీలవేణి మధ్య సాన్నిహిత్యం బాగానే పెరిగింది. చాలా ఫ్రీగా మాట్లాడుకునేందుకు అలవాటు పడ్డారు. ఓ రోజు వారి మాటల మధ్య పెళ్ళి మీద చర్చ జరిగింది.
    "మీరు ఎన్నయినా చెప్పండి. నీలవేణిగారూ! ఫ్రీ వివాహాలు సక్సెస్ కావాలంటే భార్యా భర్తలు ఇద్దరిలోనూ విచక్షణాజ్ఞానము, అవగాహన కావాలి. అప్పుడు తప్పకుండా వాళ్ళ దాంపత్యజీవితం నందనవనమవుతుంది. మనసులు కలవాలి. ఒకర్ని ఒకరు అర్ధం చేసుకుని, గౌరవాభిమానాలు పెంచుకుంటే అలాంటి దాంపత్యం యెన్నటికీ విడిపోదు_" 
    మీరు చెప్పింది యధార్ధమే! ప్రేమ వివాహాలు విఫలమయ్యాయనుకోండి అనుకోని పరిస్థితులవలన వాళ్ళు విడిపోయారనుకోండి. అప్పుడు వాళ్ళమీద ఈ సంఘం సానుభూతి చూపించదు. పైగా హేళన చేస్తుంది. అదే పెద్దలు చేసిన పెళ్ళి విఘ్నమయిందనుకోండి, బంధుమిత్రులతో పాటు సంఘం కూడా అండనిలుస్తుంది" అని ఊపిరి పీల్చుకున్నది నీలవేణి.
    "అయితే మీరేమంటారు? ప్రేమ వివాహాలు అనవసరమంటారా?"
    "అనవసరమని నేను అనడంలేదు. ప్రేమ అనేది మంచుతెరలాంటిది, అందులో ఈ వయసులో ఏర్పడే ప్రేమ క్షణికమే! అది ఎప్పుడయినా కరిగిపోవచ్చు, చెదిరిపోవచ్చు!"
    శ్రీకర్ మాట్లాడలేదు, ఆమె మాటలు రుచించకపోయినా, అందులో యాదార్ధమున్నదనిపిస్తుంది.
    "అంటే నిజమయిన ప్రేమ లేదంటారా?" శ్రీకర్ ప్రశ్న.
    "వుంటుంది. అది నిజమైన ప్రేమ అవునా, కాదా అని తేల్చుకోకుండానే వివాహానికి దారితీస్తే చాలా చిక్కులు వస్తాయి. అదే మా బావ వున్నాడు. చిన్నప్పుడు నుండి మేము కలసి మెలసి తిరిగాం. ఒకరంటే ఒకరికి ఇష్టమున్నా ఇద్దరికీ ఒక్కక్షణం పడదు..." అని నవ్వింది నీలవేణి.
    అవును. నాకు జ్యోతిమీద ప్రేమ ఏర్పడింది. ఆమెను మనస్పూర్తిగా ప్రేమించాననుకున్నాను. ఇప్పటికీ ప్రేమిస్తూనే వున్నాడు. ఆమె మీద ప్రేమ. అభిమానం యింకా చావలేదు. కాకపోతే ఆమె మొండితనానికి కోపం వస్తుంది. భర్తను, జీవితాన్ని తృణప్రాయంగా తీసుకోగలదామె.
    అందుకే ఇద్దరికీ నడుమ సంఘర్షణ!
    ఇన్నాళ్ళు ఈ సంఘర్షణలో ఎవరు గెలిచినట్లు? ఆమె గెలిచిందా, లేక తను గెలిచాడా? ఒక విధంగా ఆమే గెలిచింది. తను ఓడిపోయాడు. మొదట్లో ఆమె చూపిన ప్రేమాభిమానాలకు కరిగిపోయి లొంగిపోయాడు. అందుకే ఆమెకు అంత లోకువయ్యాను.   
    కానీ, జ్యోతి ఏదో ఒక రోజున తీరిగ్గా బాధపడేరోజు తప్పక వస్తుంది. ఆ రోజు వచ్చి తీరాలి. అది తన స్వార్ధం?"
    "ఏమిటంత దీర్ఘాలోచనలో పడ్డారు?" నీలవేణి ప్రశ్నతో శ్రేకర్ ఆలోచనలు తెగాయి.
    "ఏం లేదు ఏదో గుర్తుకు వచ్చింది" బరువుగా నిట్టూరుస్తూ అన్నాడు శ్రీకర్.
    "మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుందో తెలుసా?" అని ఆగి అతని ముఖంలోకి చూసి నవ్వింది నీలవేణి.
    కొన్ని క్షణాలు శ్రీకర్ హృదయం లయ తప్పింది.
    "ఏమనిపిస్తుంది?" ఆశగా చూసాడు.
    చెప్పమంటారా?" అదే నీలవేణి పెదవులపై చిందులేస్తుంది.
    "ఊ...చెప్పు..."  యెందుకో అతని యెదలో ఆరాటం!
    "జాలేస్తుంది__" అని కిసుక్కున నవ్వేసింది నీలవేణి.
    శ్రీకర్ నితుత్సాహపడిపోయాడు. ఆమె ఊరిస్తుంటే ఏదో చెబుతుందని ఆశపడ్డాడు. ఆమె నిన్ను చూసి జాలేస్తుంది. అనేసరికి కించిత్ బాధకూడా కలిగింది.
    "పోనీలెండి...కనీసం మీ హృదయంలో జాలి అయినా వున్నది" బరువుగా అన్నాడు శ్రీకర్.
    "ఏదో తమాషాకన్నాను. బాధపడుతున్నారా?" నొచ్చుకున్నది నీలవేణి.
    "లేదు. నా బ్రతుకే ఇతరులకు తమాషా అయింది."
    "ఏమిటి మీ మాటలు-మీకేమండి లక్షణంగా వున్నారు. దయచేసి ఇంకెప్పుడూ మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి-" చిన్నగా మందలింపుగా అన్నది నీలవేణి.
    శ్రీకర్ నవ్వాడు. ఆ నవ్వులో నిండుదనంలేదు. అతని హృదయం దేనికోసమో ఆరాటపడుతోంది. అతనికేం కావాలి?"
    ప్రేమ కావాలి! అనురాగం పంచిపెట్టే చల్లని ప్రేయసి కావాలి. ఆమె ఎదమీద సేద తీరాలని అతని తపన! కానీ! అలాంటి రాగవల్లరి ఎవరు? జ్యోతి కాదు...నీలవేణి!
    అవును నీలవేణి...అతను కోరుకునే సుగుణాలన్నీ ఆమెలో వున్నాయి. అందుకే అంతర్లీనంగా ఆమెను ఆరాధించసాగాడు. ఆమె నవ్వితే పొంగిపోతాడు. ఆమె సమక్షంలో గాయపడిన హృదయాన్ని సేద తీర్చుకుంటాడు.
    రోజు రోజుకీ ఆమెమీద అభిమానం పెరుగుతుందేగానీ తరగడంలేదు.
    తనకు పెళ్ళయిందని తెలిస్తే నీలవేణి దూరమవుతుందేమోనని అతని బాధ.
                                        28
    సమయం అర్దరాత్రి దాటింది. శ్రీకర్ కంటిమీద నిద్రలేదు. మనస్సు మెదడు వెర్రి మొర్రి ఆలోచనలతో అలసిపోయాయి. ఏదో తపనగా, ఆరాటంగా వున్నది. స్థిమితం లేకుండా వున్నది. భవిష్యత్తును తలచుకుంటే గుండెల్లో ఏదో గుబులు రేగుతుంది.
    ఆకాశంలో నక్షత్ర కన్యలు తళతళా మెరుస్తున్నాయి.
    శ్రీకర్ వాటిని తదేక దృష్టితో చూస్తున్నాడు ఏదో అన్వేషిస్తున్నాడు. అతను కోరుకున్నట్లుగా ఊహాపధంలో నీలవేణి నిలిచి నవ్వుతున్నట్లు గోచరిస్తుంది.
    ఆమె నవ్వుని చూసి పొంగిపోయాడు. అలాంటి చిరునవ్వు కోసమే అతను తపించిపోతున్నాడు.
    "నీలవేణీ! ఎందుకు నన్నిలా కవ్విస్తున్నావు? అందీ అందనట్లు అంచుకుచేరి మురిపించి, మరిపించి చేజారిపోతున్నావ్! నా కెందుకీ శిక్ష? నిన్ను ప్రేమిస్తున్నాను నీలవేణీ! నా ప్రేమను పొందే అర్హత జ్యోతికి లేదు. పొంగులెత్తే గుండెల్లోని రాగసుధల్ని తూలనాడింది జ్యోతి! నా హృదయ అమృత భాండాన్ని తిరిగి మీకు అందివ్వదలచుకున్నాను.      

 Previous Page Next Page