అందుకోగలవా? నన్ను ప్రేమించగలవా?
శ్రీకర్ బుర్రలో నీలవేణి గురించి తలపులు అదేపనిగా సాగిపోతున్నాయి. నీలవేణి తనను ప్రేమిస్తుందని భావించాడు. రేపు ఆమె ఎదురుగా అడిగేయాలని నిశ్చయించుకున్నాడు శ్రీకర్.
మరుదినం నీలవేణి ఎదురుపడింది. అతన్ని చూసి నవ్వింది. అదే ఆమె ప్రత్యేకత.
"నీతో మాట్లాడాలి నీలవేణీ" ఏకవచనం సంబోధించాడు శ్రీకర్. నీలవేణి కళ్ళు చిత్రంగా త్రిప్పి "రోజూ మాట్లాడుతూనే వున్నారుగదా! ఇవ్వాళ కొత్తగా మాట్లాడేదేముంది?" అని మరోసారి మల్లెపూవులా నవ్వింది.
"ఉత్తమాటలుగాదు. కాస్త సీరియస్ గా తీసుకో!"
"ఏమిటంత సీరియస్?"
"ఇప్పుడుగాదు. సాయంత్రం ఆఫీసు అయ్యాక అలా పార్కుకి వెళదాం."
"ఏదన్నా రహస్యమా?" కొంటెగా అన్నది నీలవేణి.
"అవును రహస్యమే గదా
! మనం ప్రేమించుకున్నట్టు ఎవరికీ తెలియదు. కనీసం మన యిద్దరికన్నా తెలీదు సరిగ్గా - అది తేల్చుకోడానికే రమ్మంటున్నాను" అని అనాలనుకున్నాడు. కానీ ఆ మాటలన్నీ గొంతులోనే మిగిలిపోయాయి.
"అలాగే తప్పకుండా వస్తాను."
"ప్రామిస్!" చేయి ముందుకు చాచాడు శ్రీకర్.
"నా మాటలమీద నమ్మకం లేదా?"
"ఉంది అయినా నా తృప్తికోసం.
"ఆల్ రైట్. తప్పకుండా వస్తాను ప్రామిస్" అని నవ్వుతూ అతని చేతిలో చేయి వేసింది. ఆమె స్పర్శకు అతని వళ్ళు జలదరించింది. సుతిమెత్తని ఆ హస్తాన్ని అలాగే అందుకుని ముద్దాడాలన్న కోరికను బలవంతాన అణుచుకున్నాడు శ్రీకర్.
ఏమైనా సరే నా మనసులోని విషయాన్ని నీలవేణికి తెలియజెప్పాలి. ఆమె అంగీకరిస్తే పెళ్ళి చేసుకుని హాయిగా వుండవచ్చు, జ్యోతికి విడాకులు పడేసేది! అప్పుడుగానీ ఆమెకు బుద్ధిరాదు. అవును అలా చేస్తేగానీ ఆమె అహం, పొగరు దిగదు. అంతవరకు ఆమె కళ్ళకు కమ్మిన పొరలు దిగవు. భార్య గుర్తుకురాగా పళ్ళు కొరికాడు కసిగా.
సాయంత్రం ఆఫీసునుంచి పార్కుకి బయలుదేరారు శ్రీకర్, నీలవేణి. ఇద్దరూ రోడ్డుమీద ప్రక్క ప్రక్కగా నడుస్తున్నారు. అలా ఆమె ప్రక్కన నడుస్తుంటే ఏదో గర్వంగా ఆనందంగా వుంది శ్రీకర్ కి. ఎవరి పెదవులు కదలటం లేదు. ఇన్నాళ్ళ పరిచయంలో ఆమెతో ఫ్రీగా, ఫ్రాంక్ గా ఎన్నో విషయాలు మాట్లాడిన శ్రీకర్, ఈ విషయం ఆమెతో ఎలా చెప్పాలా అని ఆలోచించసాగాడు.
పార్కులో మూలగా వారు మామూలుగా కూర్చునే స్థలంలో కూర్చున్నారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కరిగిపోయాయి.
"నాకిదేం నచ్చలేదు" నిశ్శబ్దాన్ని చీల్చుకుని పలికింది నీలవేణి గొంతుక.
"ఏమిటది!" ఆశ్చర్యంగా అతని కనుబొమలు ముడిపడ్డాయి.
ఆమె నవ్వి "నీ మౌనం_ఏదో మాట్లాడాలని తీసుకువచ్చి అరగంటనుంచి బోర్ తినిపిస్తున్నావు" అని అన్నది.
"నాకు మాట్లాడాలని...ఏదో చెప్పాలని వున్నది. కానీ గొంతు సహకరించడం లేదు" ఎటో చూస్తూ అన్నాడు శ్రీకర్. అతనివేపు చిత్రంగా చూసింది నీలవేణి.
"నీ మాటలు ఇవ్వాళ కొత్తగా ధ్వనిస్తున్నాయ్. ఏమిటో త్వరగా కానీయ్" అని తొందరించింది నీలవేణి వాచీ చూసుకుంటూ.
"ఆమె అడుగుతోంది చెప్పవోయ్" అని అతని అంతరాత్మ.
"ఎలా? ఎలా చెప్పాలి? తీరా చెప్పాక ఆమె కాదంటే?" అతని సంశయం.
"ఇంతటి పిరికివాడిని అసలెందుకు ప్రేమించావ్? పిరికి వాళ్ళకు ప్రేమించే అధికారం, అర్హతలేదు. ఈ విషయం చెప్పడానికి ఎందుకింత మధనపడుతున్నావ్? మనసు విప్పి ఆమెముందు తరుచు. ఇలా మౌనంతో కాలయాపన చేస్తే ఆమె ఏమనుకుంటుంది?" అని అంతరాత్మ తొందరించింది.
శ్రీకర్ దృడంగా నిశ్చయించుకున్నాడు.
ధైర్యాన్ని అరువు తెచ్చుకున్నాడు.
అతనివంకే రెప్పవాల్చకుండా చూస్తోంది నీలవేణి.
శ్రీకర్ పెదవి విప్పాడు.
"నీలవేణీ!" సన్నగా వణికిందతని కంఠం.
ఆమె నవ్వి "చెప్పు" అన్నది అదోలా చూస్తూ.
"నిన్ను ప్రేమిస్తున్నాను నీలవేణీ! నా ప్రేమను స్వీకరించగలవా? తిరిగి నా జీవితంలో వెన్నెల వసంతం కురిపించగలవా? జ్యోతి చేసిన ఈ గుండె గాయాన్ని మాన్చి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించగలవా? మాట్లాడు నీలా! ఐ లవ్ యూ...నేను కోరుకునే బంగారు లోకంలో స్త్రీ రాణివి నీవే! నీలాంటి ప్రియబాంధవి కోసమే నేను ఇన్నాళ్ళు అన్వేషించాను.
నీ చల్లని సహచర్యంలో నా జీవితం సాగిపోతుందని ఎన్నో ఆశలు పేర్చుకున్నాను.
నన్ను కరుణించి ప్రేమభిక్ష పెట్టమని వేడుకుంటున్నాను."
అబ్బ! ఎన్ని మాటలు? ఏం ప్రయోజనం పెదవులు కదులుతున్నాయేగానీ స్వరం బయటకు పలకలేదు. ఆ మాటలన్నీ గొంతులోనూ, గుండెలోనూ మిగిలిపోయాయి.
అతని అవస్తను గమనించి బిగ్గరగా నవ్వింది నీలవేణి.
అతను బాధగా, ఆర్తిగా చూశాడు.
"లే ఇంటికి వెళదాం. తీరిగ్గా ఆలోచించుకుని రేపు మాట్లాడు. నాకు పనుంది. అక్కడ మా బావ వెయిట్ చేస్తుంటాడు..." అని నవ్వుతూ లేచింది నీలవేణి.
ఆమె వెళ్ళిపోతుంటే అమితంగా బాధపడ్డాడు శ్రీకర్. మనసు విప్పి చెప్పలేకపోయినందుకు తనను తాను తిట్టుకున్నాడు.
ఈ ఆడవాళ్ళంతా దయలేనివాళ్ళు. ప్రేమించిన పురుషుని మనసును అర్ధం చేసుకోలేరు. అర్ధమైనా కానట్టు నటిస్తారు. నీలకు తన మనసు తెలియదా? ఈరోజు కొత్తగా చెప్పడమేమిటి? ఆమెను చూసిన తొలిక్షణం నుండీ ప్రేమిస్తున్నాను. ఆ సంగతి ఆమెకు తెలిసినా తన నోటి ద్వారా వినాలనేమో ఆ బెట్టు?" అని అనుకున్నాడు భారంగా.
29
మరో పదిరోజులు గడిచిపోయాయి. రోజూ నీలవేణిని కలుస్తున్నాడు. మాట్లాడుతున్నాడు కానీ, ఆమెతో తన ప్రేమ విషయం చెప్పలేకపోతున్నాడు. అది అతని బలహీనతకావచ్చు. లేదా చెప్పాక ఆమె నిర్ణయం తనకు వ్యతిరేకంగా వుంటే - చివరకు తను బాధపడాల్సి వస్తుందని భయపడయినా కావచ్చు.
మనిషి తను అనుకున్నట్లుగా జరిగితే ఇక దేవుడితో పనేముంది? అందుకే భగవంతుడు తన ఉనికిని, అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు ఏవేవో చేస్తూ వుంటాడు.