Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 25

    శ్రీకర్ సమాధానం ఇవ్వలేదు.
    "మరి ఇప్పుడేమిటి చేయడం!"
    "నేను నా వ్యక్తిత్వాన్ని ఋజువుపరుచుకోవాలి. నేను తనకి అమ్ముడు పోలేదనీ, నేనూ స్వతంత్రంగా హాయిగా బ్రతగ్గలమని ఋజువు చేసుకోవాలి."
    "ఎలా చేసుకుంటావు?"
    "ఉద్యోగంలో చేరాను. నేనిక్కడికి వచ్చిన మరుసటిరోజే అదృష్టం షేక్ మల్ షా చంద్ కంపెనీలో ఓ క్లర్క్ పోస్టు ఖాళీగా వుండింది. వెళ్ళి ఎప్రోచ్ కాగానే ఇచ్చారు."
    "ఉద్యోగంలో చేరావా?" ఆశ్చర్యంగా అడిగారాయన.
    "ఆఁ మీతో చెప్పనందుకు మన్నించండి."
    "ఊఁ మన్నింపులూ మన్ననలూ ఎందుకులే! మరి ఇంకేం చేయాలని నీ ఉద్దేశ్యం?"
    వినయంగా తలవంచుకున్నాడు శ్రీకర్.
    "జ్యోతికి జాబు రాస్తావా?"
    తలెత్తి "ఎందుకు" అని అడిగాడు.
    ఆ ప్రశ్నకి తెల్లబోయాడు విశ్వనాథం. "ఏమిటోయ్? మతిపోయిందా నీకు. అత్తారింటికి వెళ్ళకపోయినా జ్యోతినయినా ఇక్కడికి తెచ్చుకోవా?" అని అడిగాడు ఆశ్చర్యంగా.
    "జ్యోతి వస్తుందన్న నమ్మకంలేదు నాన్నగారూ! ఆమె మహా పెంకె! పట్టుదల ఎక్కువ!"
    "నీకుమాత్రం! నీవేం తక్కువ చేశావు? పోట్లాడావు. వచ్చావు, స్వతంత్రంగా బ్రతకాలనుకున్నావు. ఉద్యోగం సంపాదించుకున్నావు సరే! కానీ కన్న తలిదండ్రులం మేం వున్నాంగా! ఒక్క మాటైనా చెప్పావా? మీ తరం కుర్రాళ్ళే అంత! మీకు ఆప్యాయతలూ, అనురాగాలూ బొత్తిగా తక్కువైపోయాయి. వయసుపొంగు ఎలా ఆడిస్తే అలా ఆడతారు అంతే."
    తలొంచుకున్నాడు శ్రీకర్.
    "సరేలే! నేవెళ్ళి కనుక్కొని వస్తానీరోజే! తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళటం అంటూ వుండదుగా?"
    శ్రీకర్ ముఖంలో కండరాలు బిగుసుకున్నాయి. "ఈ జన్మలో ఆ అనుభవం ఒక్కసారే చాలునాన్నా! తిరిగి వెళ్ళటం అనేది కల్ల!"
    అతనంత తీవ్రంగా అనేసరికి "పోన్లే జ్యోతినే ఇక్కడికి పంపించే ఏర్పాటు చేయిస్తా" అన్నాడు.
    "జ్యోతి రాదేమో నాన్నా!"
    "జ్యోతి రాదు-నువ్వెళ్ళవు...ఇదెలాగోయ్! మరీ చిత్రంగా మాట్లాడతావు? విడివిడిగా బ్రతకటానికా పెళ్ళి చేసుకుంది? వీల్లేనప్పుడు కొన్నిటితో రాజీపడాలి అంతే! నీకెందుకు నువ్వుండు. ఈరోజే నేవెళ్ళివస్తా." మళ్ళీ వారందాకా తీరదు నాకు. రేపు మా ఆఫీసుకి సెలవే!"
    "మాకూ సెలవే!" 
    "ఇంకేం కొంచెం ఇంటిపట్టునేవుండి కాలక్షేపంచెయ్. ఇదిగో ఓయ్! నేనలా ఊరెళ్ళి వస్తాను!" అన్నాడు క్షణంలో తయారై భార్యని కేకేస్తూ. అన్నపూర్ణ బయటికి వచ్చింది.
    "రాత్రికి రాలేనేమో!" రేపు ఉదయానికో, భోజనానికో వస్తా. వచ్చాక వివరాలు చెపుతాను!"
    "ఎంతివ్వాలి?" అంది బొడ్డునవున్న డబ్బు తీస్తూ.
    "ఓ ఇరవై యివ్వు చాలు."
    "దూర ప్రయాణమే అన్నమాట!" డబ్బు అందిస్తూ అంది నవ్వుతూ.
                                      26
    మధ్యాహ్నం అయ్యేసరికల్లా ఆ ఊళ్ళో దిగాడు విశ్వనాథం. దాదాపు రెండుగంటలు కావస్తోంది. ఎండ నిప్పులు చెరుగుతోంది.
    "ఇది శ్రావణమా? సమ్మరా? ఏం మారిపోయింది కాలం! అనుకుని బస్టాండుకి దగ్గరలోనేవున్న ఏ.సి. రెస్టారెంటులో దిగాడు.
    తృప్తికరంగా భోజనంచేసి బయటికి వచ్చేసరికి మూడు కావస్తోంది. కిళ్ళీ వూసి, సోడానీళ్ళు తాగి రిక్షా ఎక్కాడు.
    ఆయన మనస్సు అంతా వియ్యంకుడిమీదా, కోడలిమీదా వుంది. ఆ ఇద్దరూ పెంకిఘటాలే! వాళ్ళని ఒప్పించటం ఎలాగా అని ఆలోచిస్తూ వున్నాడు. రిక్షా ఆ బంగళా ముందు ఆగింది. గేటు తీసుకుని లోపలికి నడిచాడు విశ్వనాథం.
    లాన్ దాటి వరండాదాటి హాల్లోకి వచ్చేవరకూ ఎవరూ ఎదురు కాలేదు విశ్వనాధానికి. హాల్లోకి వస్తుండగానే జ్యోతి నాన్నగారు గోవర్ధనం ఎదురయ్యాడు.
    "నమస్కారం బావగారూ!"
    ఆయన ముఖం గంభీరంగా పెట్టి తలూపాడు విశ్వనాథం మనస్సు చివుక్కుమంది. అయినా చేసేదేమీ లేదు.
    "బయటికి వెళుతున్నారా?" విశ్వనాథమే అడిగాడు.
    దానికి బదులుగా తలవూపాడు అంతే!
    "కొంచెం ఆగండి! మీతో మాట్లాడాలి చాలా అవసరం!"
    "నాతోనా! నాకు ఇప్పుడు ఎంగేజ్ మెంట్ వుంది. నాలుగు గంటలకి లయన్స్ క్లబ్ లో మీటింగు వుంది. ఎవరో డాన్సర్ కి సన్మానం చేస్తున్నాం!" అన్నాడు చేతినున్న వాచీ చూసుకుంటూ.
    అయినా మీరు కొంచెం శ్రమ తీసుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం!
    "ఏమిటది?"
    "అంతవరకూ ఆయన నుంచునే వున్నాడు. కూర్చోమనిగానీ, యెలా వున్నారనిగానీ, శ్రీకర్ గురించికానీ ఏమీ అడగలేదు. ఆ బిహేవియర్, ఆ ధనగర్వం విశ్వనాధానికి వెగటు అనిపించింది.
    అంతలో జ్యోతి వచ్చింది. తండ్రిని చూసి "డాడీ! నాకో వెయ్యిరూపాయలు కావాలి. మేం లేడీ జేసిస్ అంతా కలిసి ఓ పూర్ బాయిస్ హాస్టల్ విద్యార్ధులకి బుక్స్, డ్రెస్ యిప్పిస్తున్నాం!" అంది. అంతే కానీ విశ్వనాధాన్ని పలకరించలేదు. అతనిపై చూపు పారేసి ఓ క్షణంలో ముఖం తిప్పుకుంది.
    కూతుర్కి వెయ్యిరూపాయలు ఇచ్చాడాయన.
    "థాంక్యూ డాడీ! థాంక్యూ!" సంబరంగా అంది జ్యోతి.
    ఆ తండ్రీకూతుళ్ళ ప్రవర్తన విశ్వనాదానికి నచ్చలేదు.
    "జ్యోతీ."
    "వాట్ డాడీ!"
    "ఎవరొచ్చారో చూశావమ్మా!"
    "ఎవరు నాన్నా!"
    "మీ మామయ్యమ్మా! మీ ఆయనను కన్నతండ్రిగారు!" ఎద్దేవగా అన్నాడు.
    "ఓ!" అంది జ్యోతి యింకేం అనలేదు.
    చూడండి విశ్వనాథం నేను చాలా బిజీ! జ్యోతీ అంతే! మీరేదయినా చెప్పదలచుకుంటే పదినిమిషాల్లో ముగించండి అంతే! నాకట్టే టైంలేదు. అదయినా యింటికి వచ్చిన వాళ్ళని గౌరవించటం మా వంశాచారం కాబట్టి!"
    "గౌరవమా! వాళ్ళకెందుకు డాడీ! ఆ తండ్రీ కొడుకులకి వున్న ఆత్మగౌరవం చాలదూ?" హేళనగా అంది.
    "వాళ్ళకేం బేబీ! ఏమయినా చాలు."
    వాళ్ళ మాటలే సగం తనొచ్చిన పని సగం అయ్యేట్టు చేశాయి అనుకున్నాడు. ఇలాంటి జనారణ్య సంచార మృగాలతో ఏం లాభం అనుకున్నాడు. "చూడండి. గోవర్ధనం...పెళ్ళి అనేది చాలా అపూర్వమైన ఘటన, ప్రేమా అంతే. ఎంతో పవిత్రమైనది. ఆస్తీ అంతస్తుదానికి అడ్డంకావు. ఆవేశాలతో విడివడ్డా, ఆలోచనలతో కలుసుకోవటం మంచిది..."

 Previous Page Next Page