Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 25

    ఊరికెందుకూ? అని మనం అడిగాము. దాంట్లో తప్పేముంది? భద్రకాళిలా చూసేసింది."

    " నిజమేరా అబ్బూ! కాని యీవాళ పుట్టటం వల్లనో ఏమో జయచిత్ర పాలుకారుతూ వుంది" అన్నాడు వ్యాకర్ణ.

    " నీళ్ళు కారుతూ లేదూ?" అక్కసు వెళ్ళగక్కుతూ అన్నాడు అబ్బులు.

    " ఉహు! మళ్ళీ మాట్లాడితే తేనెలూరుతూ పనసతొనలా వుంది."

    " మంచిది. వెంటనే బహుమతి యిచ్చేసిరా!"

    " మనమేది కొనలేదుగా ఏం బహుమతి యిస్తాం?"

    " మానని అని నన్నీడ్వకు. పనసతొనక్కి, పంచదార చిలక్కి ఏం బహుమతి యిస్తారో ఆ మాతం తెలియదా? వంటరిగా వెళ్ళి కాస్త పొగిడి ఓ స్వీట్ కిస్ కుడి బుగ్గమిద యివ్వు."

    " వెంటనే నాకూ యిస్తుంది."

    " ఏమిటీ?"

    " దవడ రాలేట్టు లెంపకాయ."

    " ఆ మాత్రం గ్రహింపు వుంది కదా? నీకు తెలుసో తెలియదో గాని ఆ పిల్ల కనపడంగానే నీ కళ్ళు, నీ రెప్పలు నీలుక్కుపోయి అలా నిలబడిపోతున్నాయి. నాలుక్కాలాలు బ్రతకాలనిలేదురా?"

    " ఉందిరా! ఆ దేంటో నా కళ్లు నా వాళ్లు నా అధీనంలో వుండటం లేదురా అబ్బూ!" బోలెడు దిగిలుపడిపోతూ చెప్పాడు వ్యాకర్ణ.

    " చ్చా... చ్చా... చ్చా..." అంటూ విచారం వ్యక్తం చేశాడు అబ్బులు.

    ఆ తర్వాత వాళ్ళిద్దరూ అంతటితో ప్రసంగం చాలించి స్నానం వగైరాలు కానిచ్చి జయచిత్రకు ప్రజంటేషన్ తేవటానికి బజారున పడ్డారు.

    బజారంతా చెడ తిరిగి షాపులన్నీ గాలించి ఏం కొనాలో తెలియక ఏదీ నచ్చక పుస్తకాల షాపులో దూరారు.

    అందమైన కళలు ప్రేమలు అంతకన్నా అందమైన యువతీ యువకులు వుండే నవలలు అరజడను ఏరారు.

    సులోచనారాణి, కౌసల్యాదేవి ప్రేమ నవలలు ఏరి అందంగా ప్యాక్ చేయించి ఇంటిదారి పట్టారు అబ్బులు వ్యాకర్ణను.

    " ఎండుకండీ! నా కోసం యింత ఖర్చు పెట్టారు. యిడెం బాగుండలా నాకు" అని ముద్దు ముద్దుగా ఆ పై పుస్తకాలు అందుకుని..." "ధాంక్స్" అంది జయచిత్ర.

    జయచిత్ర పుస్తకాల పురుగని తెల్సుకున్న వ్యాకర్ణ అబ్బులు పొంగి పొయ్యారు.

    ఏ కళనుందో జయచిత్ర ఆ పూట కాసేపు మాటలు చెప్పింది.

    ఆ కాసేపూ వీళ్ళూ జోక్స్ కురిపించి నవ్వించారు. అట్లా జరిగిపోయింది జయచిత్ర పుట్టినరోజు.

    ఆ రోజు బామ్మగారు వూరెళ్ళిపోయింది.

    వెళ్ళేముందు జయచిత్రకు వంద జాగ్రత్తలు చెప్పి, అద్దెకున్న వాళ్ళకి అయిదొందలు జాగ్రత్తలు చెప్పి, అబ్బులు, వ్యాకర్ణకి అదనంగా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది.

    ఆ రాత్రి ఏడుగంటలప్పుడు వ్యాకర్ణ, అబ్బులు జయచిత్ర వద్దకు వచ్చారు.

    " మికు తోచదేమోనని కాసేపు కబుర్లు చెప్పి పోదామని వచ్చాము" అన్నారు. ముందే జాగ్రత్తపడి.

    జయచిత్ర కుర్చీలు తెచ్చి వరండాలో వేసి " కూర్చోండని" చెప్పింది.

    " మి బామ్మగారు ఊరెళ్ళేముందు మి కేంకావాలో చూడమని మరీ మరీ చెప్పె ళ్ళారు" అన్నాడు వ్యాకర్ణ.

    " ఆహా" అని వురుకుంది జయచిత్ర.

    " రేపటికి కూరలు కావాలా?" అన్నాడు వ్యాకర్ణ.

    "ఉన్నాయండి" అంది జయచిత్ర.

    " పాలు కావాలి?"

    " పాలవాడు వస్తాడండి." 
 

 Previous Page Next Page