Previous Page Next Page 
రాగవాహిని పేజి 24

    "ఆల్ రైట్ ఒకవారం సెలవుపెట్టి వెళ్ళండి. తిరిగి డ్యూటీలో జాయిన్ అవుదురుగాని"

    షడాననం వెళ్ళిపోయాడు.

    అప్పుడు పిలిపించినాడు మేనేజర్ని.

    బలరాం వచ్చాడు.

    "ఏంటయ్యా యిది? మీ ఇద్దరిపై నమ్మకం వుంచి నేనంతా వదిలేస్తే మీరిలాగా చేసేది!" కేకలేశాడు సతీష్.

    "బాబుగారు! ఆ శేషఫణి, చంద్రబాబూ ఇద్దరూ కాలాంతకులు. యెప్పుడూ గొడవలే! అవి మా వరకు రానివ్వరు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. రాహు కేతువుల పీడ వదిలింది" అన్నాడు బలరాం.

    "ఊఁ జాగ్రత్తగా వుండండి. ఈ ఫేక్టరీలు సంస్థలు బాగా నడవాలంటే కార్మికుల తోడ్పాడు వుండాలి. వాళ్ళులేంది మనం లేం. మీకేం జీతాలొస్తున్నాయిగా. ఇక వాళ్ళ కూలీలు పెంచితే నష్టమేమిటి! నాకు కొంత ఆదాయం తగ్గుతుంది. అంతేకదా? పోనీ వాళ్ళనీ తలా కొంత తిననీయండి. రేపు పండక్కి అందరికీ పదిహేను రోజుల బోనస్ ప్రకటించండి."

    బలరాం ముఖం వికసించింది. "చిత్తం! చిత్తం!" అన్నాడు.

    తృప్తిగా వెళ్ళిపోయేడు సతీష్.

                                                                *        *        *

    బ్రతికే వాళ్ళని చూస్తే బ్రతకలేని వాళ్ళకి మంట! కన్నెర్ర ఆశక్తుడికి కోపం అధికం.

    ఎవరో కార్యాన్ని సాధిస్తే ఆ కార్యాన్ని అజమాయిషీ చేస్తూ లాభం పొందాలని చూసేవాళ్లే ఎక్కువ. తమకై తాము నిర్మించుకోలేని దాన్ని ఇతరులు తయారుచేస్తే దానిపై అసూయ.

    గొంగడిలో తింటూ వెంట్రుకలు లెక్క పెట్టేరన్న సామెతగా అందులో దాన్నే విమర్శించటం చాలామందికి సామాన్య లక్షణం.

    సతీష్ లాటివాళ్ళు తమకై తాము స్వర్గాన్నినిర్మించుకోగలరు. ఆ స్వర్గ సుఖాల్ని తాము అనుభవిస్తూ ఇతర్లకీ కొంత సంతోషంగా పంచి ఇవ్వగలరు.

    అయితే శేషఫణిలాటి వాళ్ళు ఎక్కడయినా ఉంటారు. వాళ్ళు సోమరిపోతులు. కార్య సాధకులు కారు. పెద్ద పెద్ద సంస్థలతో ఇలాటి శేషఫణిలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.

    చిన్న ఫర్మ్ లోనైతే యజమానే స్వయంగా అజమాయిషీ చేయగలడు. కానీ కాంప్లెక్సు లాంటి సంస్థలతో-- ముఖ్యంగా సతీష్ లాంటి వ్యక్తికి ఎన్నెన్నో సంస్థలు. అతి చిన్న వయస్సులోనే అద్భుతమైన చాకచక్యంతో నడుపుతోన్న అతనికి తన క్రింది ఉద్యోగం పర్యవేక్షణపై ఆధారపడక తప్పదు.

    పనిలోంచి తీసేశాక శేషఫణికి కోరలు మొలిచాయి.

    అతను సతీష్ ను సాధించాలనుకున్నాడు.

    అతను స్లో పాయిజన్ లాంటి వాడు. అందుకే అతను వేసే కాటు వెంటనే విషం ఎక్కించదు. మెల్లిమెల్లిగా నరనరాన వ్యాపిస్తుంది.

    సతీష్ తనని డిస్మిస్ చేసిన రోజునే తన గేంగ్ ని కలిసేడు.

                                          *        *        *

    "సత్యా!"

    కిటికీ వారగా నించొని కాంపౌండ్ లోని పూలని తదేకంగా చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయిన సత్య సతీష్ పిలుపుకి ఉలికిపడింది.

    "అబ్బ! ఎంత భయం వేసింది? అంది విప్పారిన కళ్ళతో అతన్ని చూసి."

    "భయమెందుకు?"

    "ఏదో ఆలోచిస్తూవుంటే హఠాత్తుగా అలా పిలిస్తే భయంవెయ్యదా"

    "మరెలా పిలవాలి?"

    "మెల్లిగా సవ్వడి చేయాలి. తిరిగి చూస్తే అప్పుడు పిలవాలి" అంది నవ్వుతూ.

    సవ్వడి కాకుండా నవ్వేడతను.

    "నిజంగా నవ్వుతున్నప్పుడు అతడెంత అందంగా ఉంటాడు! మామూలుగా మల్లెపూవులా ఉండే ఇతని అందం నవ్వుతున్నప్పుడు మంచిగంధంలా ఉంటుంది.... ఇతన్ని చూస్తూ ఆరాధిస్తూ కాలం గడపొచ్చు."

    ఆ ఆలోచనకి తనకి తనే ఉలికిపడింది సత్య.

    "పూర్వం రాజులు నిద్రపోతూ వుంటే ఎంత అత్యవసరమైన రాచకార్యం వచ్చినా వెళ్ళి లేపకూడదట. అక్కడికి వెళ్ళిన మంత్రో, సైన్యాధికారో, సైనికుడో అక్కడుండే బంగారు పళ్ళేన్ని మెల్లిగా జార విడువాలిట. అది నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అది మ్రోగి రాజు మేలుకొని ఎవరది అని అడుగుతే "క్షమించాలి. మీకు మెళుకువైంది. అకస్మాత్తుగా చేయిజారింది మీ నిద్రాభంగమైంది" అనాలిట.

    తర్వాత అతనేమిటని అడిగితే పెద్ద విషయంలేదు. ఏదో సామాన్యమైన ప్రసక్తి అంతే. మీరేం ఆదుర్దా పడవలసిన పనిలేదు. ఇదీ సంగతి అంటూ విషయం విన్నవించాలట.

    కృత్రిమమైన దర్పంతో అధికారంతో సాగే రాజులకి అది చెల్లింది. నువ్వూ అలా అంటే నవ్వొచ్చింది" అన్నాడు సతీష్.

    సత్య నవ్వలేదు ఆ మాటలకి.

    సున్నితమైన అతని ఎత్తిపొడుపుని గుర్తించింది.

    తను ఓ కుర్చీలో కూర్చుంటూ "నువ్వూ అలా కూర్చో" ఓ విషయం చెబుతాను" అన్నాడు.

    ఆమె మంచంమీద కూర్చుంది.

    ఆమె బరువుకి ఆ ఫోంబెడ్ కొద్దిగా అణిగింది. అది చూడగానే అతనికి వాల్మీకి శ్లోకభావం గుర్తుకొచ్చింది. సీతాదేవి గరికమీద కూర్చుని లేవగానే ఆ గరిక తిరిగి యధాతధంగా ఉండేదట. అంత సౌకుమార్యవతి ఆమె.

    "ఏమిటి?" అడిగింది సత్య.

    "మొన్న మా అయ్యగారు కేబిల్ లో మాట్లాడేరు."

 Previous Page Next Page