Previous Page Next Page 
ఆమె నవ్వింది పేజి 25

    తల్లీ కూతుళ్ళు ఏమైపోయారో! తను వారిపట్ల ఎంత నిర్దయగా, దారుణంగా ప్రవర్తించాడు! అందుకు తాను తగిన శిక్షే అనుభవిస్తున్నాడు.

    శేషయ్య రాత్రిళ్ళు తన సెల్లులో పడుకొని ఆలోచిస్తూ కుమిలి కుమిలి ఏడ్చేవాడు.

    కాలం గడిచే కొద్దీ ఖైదీల అభిమానాన్ని పొందగలిగాడు శేషయ్య. తోటివాళ్ళపట్ల శేషయ్య ఎంతో ఆదరణా, వాత్సల్యం చూపించగలుగుతున్నాడు. సత్ప్రవర్తనకు శేషయ్య అధికారుల మన్ననలను కూడా పొందగలిగాడు. వయసు ముదిరి కాయకష్టం చెయ్యలేని స్థితిలోవున్నా శేషయ్యకు బండచాకిరీ తప్పింది. ఖైదీలకు వంట చెయ్యడానికి నియమించుకున్నారు. శేషయ్యకు ముందు ముందు కొంచెం కష్టంగా వున్నా, వంట పరిశుభ్రంగా, రుచికరంగా చేసేవాడు ఖైదీలు ప్రశంసాపరంపరలు శేషయ్యమీద కురిపించసాగారు. తనూ వాళ్ళతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చెయ్యసాగాడు.

    కాలం గడుస్తున్న కొద్దీ జైలునుంచి ఎప్పుడు బయట పడదామా అన్న ఆరాటం ఎక్కువయింది.

    తన పెళ్ళాం, బిడ్డ ఏమైపోయారో? ఇంకా ప్రాణాలతో వున్నారో లేదో? వున్నా తిండి దొరక్క ఎంత బాధపడుతున్నారో?

    రోజు రోజుకు శేషయ్య హృదయం ఆవేదనతో దహించుకుపోతుంది.

    ఏ క్షణాన ఈ జైలు గోడలుదాటి తను బయటపడ్తాడో? తన భార్యాబిడ్డల్ని ఎప్పుడు చూడగలుగుతాడో?

    శేషయ్య ఆరోజుకోసం ఎదురుతెన్నులు కాస్తున్నాడు.

                                                                      *    *    *

    ఆరోజు రానే వచ్చింది.

    శేషయ్య విడుదలయ్యాడు.

    శేషయ్య మిత్రులు గేటుదాకా వచ్చి వీడ్కోలు ఇచ్చారు.

    నేరుగా స్టేషన్ కు వచ్చి రైల్లో ఇంటికి ప్రయాణమైనాడు శేషయ్య. శేషయ్య ఎక్కినా రైలు కాలాన్నీ, దూరాన్నీ చీల్చుకొని వేగంగా, శరవేగంగా ప్రయాణం చేసింది.

    తెల తెలవారుతుండగా శేషయ్య దిగాల్సిన స్టేషన్ కు బండి వచ్చి ఆగింది.

    శేషయ్య రైలు దిగాడు.

    అక్కడనుంచి తన ఊరు ఇదు మైళ్ళలో వుంది. నడిచివెళ్తే అన్నం వేళకు వెళ్ళగలడు. బస్ ఎక్కితే ఓ అర్ధ గంటలో దింపుతుంది.

    రైలుదిగి శేషయ్య అంతా పరికించి చూశాడు. స్టేషన్ అంతా మారిపోయి వుంది. స్టేషన్ వెడల్పూ పొడవూ కూడా పెంచారు. స్టేషన్ పక్కనే రెండు కొట్లుకూడా వెలిశాయి. స్టేషన్ కు వంద గజాల దూరంలో, రోడ్డుపక్కగా ఓ హోటల్ కూడా వెలిసింది.

    ఇంతలో ఎంత మార్పూ?

    రోడ్డుపక్క చెట్లూ చేమలూ కూడా మారిపోయినట్టు అనిపించింది శేషయ్యకు.

    తను ఊరు వదిలి వెళ్ళిపోయేప్పుడు, ఇక్కడ ఒక్క బీడీ కొట్టుకూడా లేదు. స్టేషనూ ఎంతో చిన్నదిగా వుండేది. మూడు సంవత్సరాలు కాదు తను ముప్పై సంవత్సరాలు అజ్ఞాతవాసాన్ని అనుభవించినట్టుంది శేషయ్యకు.

    స్టేషన్ దాటి బయటకువచ్చి ఒక్క నిముషం తటపటాయించాడు శేషయ్య. నడిచి వెళదామా, బస్సుమీద వెళ్దామా అని, జేబులోని చిల్లర చూసుకున్నాడు.

    ఎనభై పైసలుంది. బస్ లో వెళితే అరవై పైసలు కావాలి. బస్ లో వెళితే కాఫీకి సరిపోవు. వళ్ళు నీరసంగా వుంది. రాత్రంతా నిద్ర లేకపోవడంతో తల బద్దలుకొట్టుకు పోతోంది. కాఫీ తాగితే కొంత సర్దుకుంటుంది. పైగా ఆకలిగా కూడా వుంది. ఏదైనా తిని, కాఫీ తాగి వెళ్తే మంచిది.

    వెధవ బస్ ఎందుకు? డబ్బులు దండుగ? చల్లబాటివేళ మెల్లగా నడిచివెళ్తే ఎంత పని?

    శేషయ్య హోటల్ లోకి వెళ్ళి కూర్చున్నాడు. అది చాలా చిన్న హోటల్. నాలుగు బల్లలువేసి వున్నాయి. ఒక పక్కగా చిన్న టేబులూ, కుర్చీవేసి వున్నాయి. తడికకు సినిమా పోస్టర్లు అంటించి వున్నాయి.

    కుర్చీలో కూర్చుని డబ్బు లెక్కచూసుకుంటున్న పాతికేళ్ళ యువకుడు లేచివచ్చి "ఏం ఇవ్వమంటారూ? వేడి వేడి ఇడ్లీ వుంది! ఇవ్వమంటారా?" అని అడిగాడు.

    "ఊఁ " అని తల ఊపాడు శేషయ్య.

    అప్పటికి ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతున్నారు. శేషయ్య ఇడ్లీ తినేసరికి వాళ్ళు కాఫీ ముగించుకొని బయటికి వెళ్ళిపోయారు.

    బస్ వచ్చి హోటల్ కు అంత దూరంలో ఆగింది.

    'వేడి వేడి పెసరట్టు వుంది ఇవ్వమంటారా?'

    "అల్లపచ్చడి వుందా?" అన్నాడు శేషయ్య.

 Previous Page Next Page