Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 24

                                                        లలన పాదం పారిజాతమైంది

    భామనే! సత్యభామనే! భామరో! పదియారు వేలా కోమలూలందరి లోనా పేరెన్నికగన్న సుందర సుకుమారి సత్యభామ. అలనాడు శ్రీకృష్ణుల వారికి ప్రియ పత్నిగానే కాక ఈనాటికి అఖిల జనావళికి ఆరాధ్యనాయిక సత్యభామ. అందానికి, అందానికి తగ్గ ఠీవికి, ఠీవికి మించి అహంకార పూరిత గర్వానికి ప్రతీకగా 'సత్యభామ'నే పేర్కొంటారు జనం.

    ఆ సత్యాకృష్ణుల సయ్యాటల వయ్యారాలు. రాగాల సరాగాలు అందమైన, మధురమైన కవితలో ఇంతకంటే చక్కగా చిక్కగా ఇంకెవ్వరూ చెప్పలేరనే రీతిలో చెప్పిన కావ్యం పారిజాతాపహరణం.

    ఒకరోజున నారదులవారు దివినుండి భువికి దిగివస్తూ వూరికే రాక పారిజాత ప్రసూనాన్ని తెచ్చాడు. తెచ్చిన పువ్వు ఎవ్వరికో ఇవ్వక నల్లనయ్యకే ఇచ్చి-ఆపై ఊరుకోక అక్కడే నిలబడ్డాడు.

    ఆవూపు తీసుకొని రుక్మిణిని చూసినా అయ్యగారి మనస్సులో సాత్రాజతే మెదిలింది. దాంతో కథ అడ్డం తిరుగుతూ ఉంటే కలహాశనుడు తెలిసిపెట్టిన చిచ్చు రేగుతుందే అనుకొని అక్కడనుండి ఇంకెవ్వరికో పంపడం భావ్యం కాదనుకొని రుక్మిణికే ఇచ్చాడు. ఆమెదాన్ని జడలో తురుముకుంది. వెంటే చక్కదనానికొక చక్కదనం, యవ్వనానికొక వింత యవ్వనం వచ్చేశాయావిడకి. ఆ మీదట నారదుడు భట్రాజులా ఆపూవు మహిమ పొగిడి, ఇన్నిదినాలు సవతులందరిలో సత్యభామ కనుసన్నుల్లో వశంవదుడై శ్రీకృష్ణుడు నడుచుకుంటాడని విన్నాను కానీ ఇది అబద్ధం. నువ్వంటేనే ఆయనకి గౌరవం. అయినా చక్కనిదాన్నని, ఎలజవ్వనినని-అందరిలో పేరున్న దానినని-భర్త తనకు అనురక్తుడనీ- గర్వించే సత్యభామ ఈ సంగతి విన్నవాళ్ళు కన్నవాళ్ళు చెబితే నిలువునా కరిగి పోతుంది అని చిన్న గుగ్గిలం విసిరి వెళ్ళాడు.

    ఇంకేముంది! కొంపలంటుకున్నాయి.

    మిగతా ఆరుగురు ఏదోవిధంగా సరిపెట్టుకున్నా-మానవతి సౌందర్యవతి, మహనీయ సౌభాగ్యవతి-సత్యమాత్రం సరిపెట్టుకోలేదు. చెలికత్తె వచ్చి సన్నాయి నొక్కులు నొక్కగానే ఆజ్యంపడ్డ అగ్ని భగ్గుమన్నట్టు, దెబ్బతిన్న నాగుబాము బుస్సుమన్నట్టు "ఏమేమీ! నారదుడు అలా అన్నాడా?" అని "చెవివొగ్గి విన్నాడా ఆయన? ఇంకేం జరిగిందో చెప్పు" అని నిగ్గదీసింది.

    అంతా వింది ఆపై కలికాలం ఒక్కరీతిగా పూసలలో దారంలా మదిలో మెదిలే మగవాళ్ళు లభించడం పూర్వజన్మ సుకృతం అనుకుంది. తనతో ఎలా - మెలిగేవాడో తలపోసింది. మగడు ప్రాణ సమానుడు అతడే దైవం - దిక్కు - అలాంటి మగడు దారి తప్పితే కుల స్త్రీలకు ఇంకేంగతి అంది! ధనమిచ్చి పుచ్చుకుంటే ఓర్వవచ్చుకాని మొగడు వరస్త్రీలకి మనసిచ్చి పుచ్చుకుంటే ఎలా బతికేది అని వాపోయింది. వెంటనే కట్టిన చీర విడిచి మాసిన చీర కట్టుకొని లోపలింట్లో మంచం పట్టీ కర్చుకొని లోలోపల కుములుతూ పడుకుంది.

    అప్పుడొచ్చాడు అయ్యగారు చూస్తే వాతావరణం మారిపోయింది. అంతటా నీరవం కొంప మునిగింది. పువ్విచ్చిన విషయం ఎవరో చెవిన వేశారు అనుకొంటూ లోపలికి వెళ్ళారు. ఆపై ఎన్నెన్నో నయగారాలు పలికాడు. ఎందుకు ఆభరణాలు ధరించలేదు! మంచి గాగరా ఎందుకు తొడగలేదు. ఏమిటి ఈ మౌనం? ఏల చూడవు? మాటాడవు? మెరమెచ్చుల కోసం ఇతర వనితలతో ఏ తీరున్నో మెలిగినా-పాయని అనురక్తి నీమీదే కదా! భామా! నువ్విలా ముద్దివ్విక ముఖం చూపక-లేవకుంటే నేనెలా తాళగలను - అంటూ ఆ జగన్నాటక సూత్రధారి ఆమె 'మృదుపల్లవ కోమల పదద్వయికి' ఆర్మిలి మొక్కుమొక్కాడు.

    జల జాతాసన వాసవాది సురపూజాభాజ నంబై తన
    ర్చులతాంతాయుధుకన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునన్
    దొలగం ద్రోచె లతాంగి అట్లయగు నాధుల్నేరముల్ సేయ పే
    రలుకం చెందిన యట్టి కాంతాలుచిత వ్యాపారముల్ నేర్తురే.

    అది బ్రహ్మ ఇంద్ర, వరుణాది దేవతలు పూజ్యా భావంతో నమస్కరించే శిరస్సు కుసుమశరుడి కన్న తండ్రి శిరస్సు - దాన్ని ఆమె ఎడమకాలితో తొలగ తోసింది. అవును అంతే కదా! మగడు తప్పు చేస్తే కోపంతో భగ్గున మండే కుల స్త్రీలు ఇంకేం చేస్తారు. అది ఉచితమో, అనుచితమో ఆలోచించే అవకాశం ఎక్కడిది?

    తన్నినా తిన్న్గగానే తన్నిందని ఆ నల్లనయ్య ఆమెపాదం సోకగానే ఒళ్ళంతా పులకరింతలు అయి మదన రాజ్యం లభించినట్టు పొంగి అంటారు." నన్ను నీ పాదదాసుని కోపంతో అలిగిన ఆవేశంతో నువ్వు తిన్నగా తన్నినా అదినాకు మన్ననే! కానీ నా తలతాకిఅందమైన చివురాకు సదృశ్యమైన నీ పద పల్లవం నొచ్చిందేమో అని బాధగా ఉంది. సరేలే! ఇకనైనా కోపం పోయిందా! అన్నాడు నవ్వుతూ.

    సత్యభామ అధరం అదరగా-కళ్ళు ఎరుపెక్కగా 'ఈ నయగారాలు' ఈ ప్రియోక్తులు- ఈ మొగమిచ్చ కాలు చాల్లే! నిన్నే నమ్ముకున్నందుకు మంచి మేలే జరిగింది. అవి ముక్క చీవాట్లు పెట్టి బుడి బుడి ఏడ్పులు ఏడ్చింది! ఎలా? పంకజ శ్రీ సఖమైన మోము పయి చేల చేరంగిడిబాల పల్లవ గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాక లీ ధ్వనిన్ - చక్కనమ్మ చిక్కినా అందంగానే వుందన్నట్లు సత్యభామ ఏడుపు కోకిల కూసినట్టుందట!

    ఆమె అలా ఏడిస్తే ఆయన ఆమెని కౌగిట్లోకి తీసుకొని బుజ్జగించి చెక్కిలిమీద జారే కన్నీరు తుడిచి నెయ్యము తియ్యముగా అన్నాడు. పువ్విచ్చానని ఇంత రాద్ధాంతము చేశావు. నీ శుద్ధాంతంలో ఆ పారిజాతాన్నే తెచ్చి చలువ వెదజల్లు చెంగల్వ కొలన సరస కర్పూర కదిళికా తరుల నడుమ - పెరటి చెట్టుగా నాటిస్తా అని వాటేసుకుని అన్నాడు.

    ఇంకేముందీ కధ కంచికి ---

    ఈ కధను నంది తిమ్మన ఆడుతూ పాడుతూ చెప్పాడు. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అరణవు కవిగా అమ్మవారి వెంట వచ్చిన తిమ్మన పని గట్టుకొని ఈ కధ ప్రబంధీకరించడానికి ఓ పసందైన కధ చెబుతారు.

    అది నిజమో కాదో అని అనుమాన పడే వారికి ఈ తొలి పద్యం అనుమాన నివృత్తి చేస్తుంది.

    సరస పుట్కల తీర్చు తరి శార్ణ సుదర్శన నంద కాబ్జ సం
    భరణ గుణాప్తి న్నెడుముపై కటిపై జడపై గళంబుపై
    హరి నలుగేలు పైకొని సుఖంబుగ నిచ్చలు నోలనాడు ఇం
    దిర కృప చూచు గాత నరదేవ శిఖామణి కృష్ణరాయనిన్

    కృష్ణదేవరాయ వర్ణన కృష్ణవర్ణనకు అభిన్నంగా చేసిన తిమ్మన పకడ్బందీగా ప్రయోజనాన్ని ఆశించే ఈ రచన చేసి ఉంటారు.

    అటూ ఇటూ ప్రయోజనాన్ని ఆశించాడు. కాబట్టే ఆంధ్ర ప్రబంధాల్లో పరమ సుకుమార మైందని ప్రజలంతా వేనోళ్ళా నుతించారు....
   
                                                                              ----*----

 Previous Page Next Page