Previous Page Next Page 
అహల్య పేజి 24


    గౌతములు అహల్యను అభినందించారు.


    భర్త మాటలు గుర్తుకొచ్చాయి ఆమెకు. 'అహల్యా! సాటి ముని పత్నులలో 'సమానానాం ఉత్తమం' అనే పేరు ప్రతిష్టలను పొందావు. పూజలు నిర్వహించడంలో, వ్రతాలు చేయడంలో, నోములు నోచడంలో నువ్వు నీకంటే పెద్ద వారి మెప్పును కూడా పొందావు. ఇదంతా....'


    'ఆ దేవి గాయత్రీ అమ్మవారి కరుణా కటాక్షం' అంది.


    'నీ వినయం నీ ప్రజ్ఞకు వన్నె తెస్తున్నది.'


    భర్త మాటలు గుర్తొచ్చి మరోసారి నవ్వింది అహల్య.


    'నవ్వమ్మా నవ్వు! నీ నవ్వులన్నీ నవరత్నాలై ఆ బుట్టలో రాలి అది నిండితే ఆర్ధిగా వచ్చిన నా దోసిలి నిండా కొన్ని రత్నాలు రాలితే నా జన్మ ధన్యమైందనుకుంటాను'


    పూజకు పూలు సేకరిస్తూ, మనసులో మగని స్మరిస్తూ పరవశిస్తున్న అహల్య ఆ కొత్త ధోరణి, ఆ కొత్త పిలుపు, ముఖ్యంగా ఆ కొత్త కంఠం విని ఉలిక్కిపడింది. ఉలికిపాటుతో చప్పున అటు చూసింది.


    అక్కడ సురలోక సౌందర్యం నిండుగా దండిగా ప్రతిబింబించే ఓ యువతి చూడగానే స్నేహం వరదల్లే ప్రవహించేటట్లు చేయగల చిరునవ్వు, ప్రసన్న వదనం, మంచితనం, మూర్తీభవించినట్లుండే చూపులు. ఎన్నడూ చూడలేదామెని. పరిసర ఆశ్రమాలలో ఉండే మునికన్నెలూ, ముని పత్నులూ ఆశ్రమానికి వచ్చి వెళ్ళడంతో వారంతా పరిచయమే. కానీ ఈమెనెన్నడూ చూడలేదు.


    అసలీ రూపమే కొత్తగా ఉంది. మునికన్నెలకూ, ఋషి పత్నులకూ భిన్నంగా ఉంది! జానపదురాలు కాదు. నగర వాసినీ కాదు. ఏ రాజాంతఃపురంలోనో అసూర్యంపశ్యగా మెలిగే సుందరి కావచ్చునేమో! లేక గరుడ, గంధర్వాది, యక్ష జాతి వనితయేమో! ఎవరైతేనేం సుప్రసన్న వదన- సురుచిరముఖి- సుందరి.


    'ఏమిటమ్మా ఆ ఆశ్చర్యం? ఎవరని చూస్తున్నావా నన్ను? నన్ను నువ్వెప్పుడూ చూడలేదులే! అందరిలో కొందరే అందగత్తెలు. ఆ కొందరిలో ఇంకొందరే సుందరీమణులు. సుందరీమణుల్లో సుందరీమణిగా సురలోకంలో సృష్టించబడి నరలోకంలో నివసిస్తున్నావని తెలిసి చూడటానికి వచ్చాను' అందా యువతి.


    అహల్య చప్పున తేరుకుంది.


    'ఎవరైతేనేం! ఎక్కడి నుండి విచ్చేస్తేనేం! మా ఆశ్రమానికి విచ్చేశావ్! నీకు అతిథి మర్యాదలు జరపడం మా ధర్మం! రా! లోపలికి వెళదాం! అర్ఘ్యపాద్యాదులతో అర్పించి ఆపై సుఖాసీనురాలిని చేసి మా కందమూలాది పదార్థాలో- మా కందఫలాలో- ఏవో నీకు ఆరగింపు చేస్తాం!' అంది అహల్య నవ్వుతూ.


    అహల్య నవ్వుని చూసి ఆమె నివ్వెరపోయింది. ఏమా చిరు దరహాసం! సమస్త లోకాలనూ శాసించగల ఠీవీ, దర్పం- సర్వ జనులనూ మైత్రితో బంధించగలిగిన ఆత్మీయత- అనురాగం అందులో ఉన్నాయి.


    బహుశః ఈ నవ్వుని చూసే- యీ సుందర దరహాస వదనాన్ని చూసే- మా సురనాధుడు ఈమె ప్రేమలో పడిపోయాడు. అఖిల లోకాధిపత్యం యీ అతివ చిరునవ్వు ముందెంత అనుకునే ఈమెపై మక్కువ పెంచుకున్నాడనటం నిక్కువం. అహల్య నవ్వుల విలువలు నిర్ణయించడంలో నిమగ్నమయింది ఆమె.


    'ఏమిటమ్మా! అలా చూస్తున్నావ్!' అడిగింది అహల్య.


    చప్పున ఆ మైకం నుంచి తేరుకుందా యువతి.


    'నిన్నే చూస్తున్నాను' అంది.


    'నన్నా!'


    'అవును నిన్నే! అమరలోకంలో జరిగిన అల్లరి- ఆపై అందరి మన్ననలూ అందుకునే మహేంద్రుడి ఆలోచన. అటుపై బ్రహ్మ లోక ప్రయాణం. అక్కడ సృష్టికర్త అయిన వ్యాఖ్యానం. ఆపై నిన్ను సృష్టించడం.


    అంతా విని ఆగలేక నిన్ను చూద్దామని- చూసి తరిద్దామని- జన్మ సార్ధకం చేసుకుందామని- వచ్చాను. విన్న మాటలో పూచిక పుల్లంత కూడా అబద్ధం లేదు. అతిశయోక్తి లేదు. అమరేంద్రుడన్న మాట అక్షరాల నిజం'


    'ఎవరో ఏదో అంటారు. ఇంకేదో చెపుతారు. అయినా ఆ పుట్టువుకయినా ఏదో ఒక హేతువు ఉంటుంది. కారణం లేనిదే కార్యం ఉండదు కదా ఎక్కడా?' అంది అహల్య మళ్ళీ నవ్వుతూ.


    మళ్ళీ పువ్వులు విరిసినట్లయింది.


    ఆమె అహల్య మాటలు విని ఆశ్చర్యపోయింది. ఆ నెమ్మదితనానికి, ఆ గాంభీర్యానికి అద్భుత పడింది.


    'అమరేంద్రుడన్న మాట అక్షరశః నిజం' మళ్ళీ తనలో అనుకున్నట్లుగా అంది.


    'నన్ను పొగడడానికే వచ్చి ఉంటే ఆ పని తీరిగ్గా ఓపిగ్గా చేయవచ్చు. ముందు మా ఆశ్రమ మర్యాద మేరకు మేము నిన్ను గౌరవించాలి! పద' అంది ఆత్మీయంగా అహల్య.


    'ఏమీ తొందరలేదు లేవమ్మా అహల్యా! నీకైనా ఆ పూవులు కోసి పూజకు అమర్చడమే కదా ఇప్పటి పని! అయినా పూవులు పూజకే తప్ప మరోరకంగా ఉపయోగించడం తెలియదా నీకు. అహ! మీకు మీకంటే మీ ఆశ్రమ వాసులకు?'


    'అదేమిటీ? పూవులకు రెండే కదా ఉత్తమ స్థానాలు! సిగలో అలంకరించుకోవడం! పూజలో ఉపయోగించడం. మరింకేం ఉంటుందీ?' అడిగింది అహల్య.


    పకపక నవ్వింది ఆ యువతి.


    'అంతేనమ్మా! అంతే! ఆశ్రమ వాసులకు తెలిసేదంతే!'

 Previous Page Next Page