"ఆహా! మిమ్మల్ని కన్నతల్లి- మీ రక్తం పంచుకుపుట్టే చెల్లెలు అందరూ ఆడవాళ్ళే అని మరువకండి. అణిచి మణిచి వుంచితే ఆడదే కాదు నోరులేని సాధు జంతువైనా తిరగబడ్తుంది, ప్రేమతో విషం తాగించగలరు..."
"స్టాపిట్; ఈ నీతులు నా దగ్గిర వల్లించరు." కసిరారు.
"సరే. మీరు ఎందుకిలా తయారయ్యారు. అందుకేమన్నా కారణం వుందా లేదా యిది మీ స్వభావమా?" సూటిగా అడిగాను.
"ఆ ప్రశ్నకి జవాబు నీ కనవసరం." అన్నారు నానించి చూపులు తప్పించి.
"సరే...నా విషయం గురించి మాట్లాడుతాను. తెలియక మోసపోయి మీ కిచ్చి పెళ్ళిచేశారు మా నాన్నగారు. కాని యిప్పుడు తెలిశాక నేనింక మీతో కాపురం చేస్తాననా మీ ఉద్దేశ్యం...." ఆవేశంగా అడిగాను.
"చెయ్యకు" నిర్వికారంగా తాగుతూ అన్నారు.
"సరే, రేపే నేను ఇక్కడనించి వెళ్ళి పోతాను. తరువాత మళ్ళీ కోర్టులో కలుసుకుందాం" బింకంగా అన్నాను.
"నేను డై వోర్సు ఇయ్యకపోతే ... ఇవ్వడానికి ఇష్టపడకపోతే" .... అన్నారు సూటిగా చూసి.
ఆ ప్రశ్నకి జవాబు నాకు తెలియదు. అవును ఆయన డైవోర్సు ఈయడానికి ఇష్టపడకపోతే ఏం చెయ్యాలి?
"మీరు తాగుబోతని, వ్యభిచారని కోర్టులో నిరూపించితే కోర్టు వారే డైవోర్సు" ఆ రూల్సు వగైరాలు తెలియక పోయినా డబాయించినట్లన్నాను.
ఆయన కళ్ళు తాగడంవల్లో, కోపంతోనో ఎర్రబడ్డాయి. "ఆహా - ఎలా నిరూపిస్తావు ?" హేళనగా అన్నారు.
నిజమే ఎలా నిరూపిస్తాను?
జవాబుకి నేను తడుము కోడం చూసి వ్యంగ్యంగా నవ్వారు. ఆ నవ్వుకి ఉక్రోషం వచ్చింది.
"ఛీ -మీరింత నీచులు, హీనులు అనుకోలేదు .... మీ లాంటి వారితో కాపురం కంటే చావడం నయం. చావనైనా చస్తాను కాని మీతో కాపురం చెయ్యను .... కోర్టులో విడాకులు దొరకక పోవచ్చు గాని, మీతో బలవంతంగా కాపురం ఎన్ని కోర్టులు కలిసినా చేయించ లేవు నాచేత. అది గుర్తుంచుకోండి. నేను రేపు ఉదయం ఫ్లయిట్ లో వెళ్ళిపోతాను. నాకీ పెళ్ళే కాలేదనుకుంటాను ... నిన్న రాత్రి జరిగింది ఏదో పొరపాటని, ఇక ముందు అలా ప్రవర్తించని చెప్తారని మీ వెంట వచ్చాను. తాళి కట్టించుకున్న పాపానికి మీరు ఇకపై సజావుగా ప్రవర్తిస్తారేమో నన్న ఆశతో వచ్చాను. కాని అది వట్టిమాట అని తెలుసుకున్నాను. ఇంక పిచ్చి భ్రమతో ఇక్కడ ఉండేంత తెలివితక్కువ దానిని కాను" ... కటువుగా అన్నాను.
నా మాటలన్నీ ఆయనకి కోపం తెప్పిస్తాయని తెలుసు. కాని ఆడింది ఆటగా పాడింది పాటగా ముద్దుగా పెరిగిన నేను ఆయన తిరస్కారం, హేళన భరించ లేక పోయాను. నా జీవితం ఇలాంటి వాడివల్ల నాశనం అయిందన్న దుఃఖం కసిగా మారింది. నేను కన్న కలలన్నీ ఈ విధంగా మారే సరికి ఎదురు చూడని ఈ పరిణామానికి నా మనసు విపరీతంగా దెబ్బతింది. ముందు సంగతి ఏమిటన్న ఆలోచనకి కూడా వ్యవధి లేనంతగా ఉక్కిరి బిక్కిరి చేసింది రాత్రి సంఘటన. వెంటనే ప్రయాణం!-నా జీవితం కంటే ఎక్కువా నాన్నగారి పరువు ప్రతిష్ఠ. తమ ముద్దుల కూతురు జీవితం ఇలా అయిందంటే వాళ్ళు మాత్రం సహిస్తారా? లోకం కోసం తమ కూతుర్ని తాగుబోతు, వ్యభిచారి చేతిలో వదులుతారా? అసలు నిన్ననే చెప్పవలసిందేమో! ఇక్కడికి రావడంలో తొందరపడ్డానా -పొరపాటు చేశానేమో - ఏమయితే అవనీ - తరువాత సంగతి తరువాత ముందు నాన్న గారితో చెప్పి ఆ తరువాత ఆలోచించవచ్చు - నిశ్చయించు కున్నాను. నా నిశ్చయం నా మొహం మీదే కన్పించినట్లుంది.
"అయితే వెడ్తున్నావన్న మాట" అన్నారు నిశితంగా చూస్తూ.
"ఇందాకే చెప్పాను ఆ మాట. మీలాంటి భర్తని నేనే కాదు ఏ ఆడదీ అంగీకరించదు. గతిలేక ఎవరన్నా భరించవచ్చు. కాని నా కా కర్మలేదు" నిబ్బరంగా అన్నాను.
"నేను వెళ్ళనీయకపోతే" కటువుగా అడిగారు.
ఆ తీవ్రతకి ఒక్క క్షణం గుండె కొట్టుకోలేదు. వెంటనే లేని ధైర్యం తెచ్చుకుని "నన్నాపడం మీ తరం కాదు" అన్నాను ఆవేశంగా.
అంతే ఆయన ఒక్క ఉదుటున నా చెంప ఛెళ్ళుమని పించారు. "నీకెంత అహంకారం - నా తరం కాదూ ... ఇప్పుడే చూపిస్తా నా తరం అవునో కాదో" అన్నారు.
ఆ కొట్టిన దెబ్బకి కళ్ళ ముందు మెరుపులు మెరిసి కళ్ళు చీకట్లు కమ్మాయి. దెబ్బ అన్నది ఏమిటో తెలియకుండా పెరిగిన నన్ను ఆ దెబ్బ స్థాణువుని చేసింది. ఏం జరిగిందీ తెలుసుకునే లోపలే ఆయన చేతిలో గిలగిల లాడుతున్నాను.
"నీ పొగరు ఇలాగాని అణగదు. మీ ఆడవాళ్ళ నిలాగే అణిచి పెట్టాలి. హాఁ - నీకు నా సంగతి పూర్తిగా తెలియదు కాబోలు. నా కెదురు చెప్పి బతకగలనను కుంటున్నావా. నేను నీ మొగుడ్ని అని మరిచిపోకు. నిన్ను అంత సుళువుగా వదులుతా ననుకుంటున్నావా నీ కిదే శిక్ష."